Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదునేడవయధ్యాయము - సమాదిస్థితివివరణము

జనకుఁడు చెప్పినది విని అష్టావక్రుఁడు మరల ఇట్లు అడిగెను. ''మహారాజా! వవ్యహారదశలయందును నిర్వికల్పములు చిదాత్మకములును అయిన సమాధిస్థితులు సూక్ష్మమములుగా నుండు నని చెప్పితివి. అవి ఏదశలయందు సంభవించునో స్పష్టముగా చెప్పుము.''

జనకుఁడు ఇట్లు చెప్పెను. ''ప్రియురాలిచేత మొదట గాఢముగా కౌఁగిలింపఁబడినప్పుడు పురుషుండు క్షణకాలము వెలుపల లోపల ఏ విషయమును ఎఱుంగక నిద్రను పొందక నిశ్చలత నొందును. అది సమాధియే. అలభ్య మనుకొన్నవస్తువు అనుకొనకుండ లభించినప్పుడు నిద్ర లేకయే క్షణకాలము మనస్సునకు నిశ్చలత కలుగుచున్నది. అదియు సమాధియే. నిర్బయుఁడై సంతోషముతో ఎక్కడికో పోవుచున్నవానికి ఆకస్మికముగా మృత్యువువలె వ్యాఘ్రమో కాలసర్పమో ఎదురైనచో క్షణకాలము మనస్సు నిశ్చలమగును. అది సమాధియే. ఆరోగ్యవంతుఁడు కుటుంబభరణదక్షుఁడు అత్యంత ప్రియుఁడును అయిన కుమారుఁడు మృతి నొందె నని విన్నప్పుడు తండ్రికి వెలుపల లోపల ఏదియు తోఁచక మనస్సు క్షణము నిశ్చల మగును. అదియును సమాధియే. అనఁగా మహాసుఖము మహాభయము మహాదుఃఖము ఆకస్మికముగా సంభవించినక్షణమునందు మనస్సు విమర్శను కోల్పోయి స్వరూపస్థితిని పొందును. ఇవి యన్నియు క్షణికములైన సమాధులు. ఇట్లే జాగ్రద్దశనుండి నిద్రలోనికి జాఱునపుడు, నిద్రలో స్వప్నము ఆరంభ మగునపుడు, స్వప్నము ముగిసి నిద్ర పైకివచ్చునప్పుడు, నిద్ర ముగిసి జాగ్రద్దశలోనికి వచ్చునప్పుడు క్షణకాలము మనస్సు దేనిని గ్రహింపక విమర్శరహితమై సమాధిస్థితి నొందును. దూరమునందున్న ఏదేని ఒకపదార్థమును ఏకాగ్రమగు బుద్ధితో చూచుచున్నప్పుడు మనస్సు దీర్ఘమై దేహమునందు దేహరూపముగా ఆపదార్థమునందు ఆపదార్థరూపముగా ప్రసరించును. దేహమునకు ఆపదార్థమునకు నడుమ పెద్దత్రాడువలె ప్రసరించియున్న మనస్సు ఏరూపమును పొందక నిర్వికల్పముగా నుండును. ఆవిధముగా కేవలమైన మనస్సును (Pure mind) చూచుచుందుము.

ఇంత ఎందుకు? ఒకమాట వినుము. ఈవ్యవహార మంతయు భిన్నములైన ఖండజ్ఞానముల (Pieces of knowledge) సముదాయముగా జరుగుచున్నది. చెట్టునందు ఒకఖండజ్ఞానము, పండునందు మఱియొక ఖండజ్ఞానము కలుగును. ఈఖండజ్ఞానము లన్నియు తరంగముల వంటివి. తరంగములకు లోపలనున్న అఖండమైన జలమువలె వివిధఖండజ్ఞానములకు ఆధారముగానున్న యేకరూపమైన జ్ఞానము వ్యవహారమునందు ఎవరికిని స్ఫురింపదు. ఈకారణముచేతనే క్షణక్షణమునకు మాఱుచున్న జ్ఞానప్రవాహము (Flow of knowledge) ఆత్మ అని కొందఱు, అట్టిజ్ఞానప్రవాహము ఆత్మకు ధర్మమైన బుద్ది యని మఱికొందరు ఆచార్యులు చెప్పుచున్నారు. ఆక్షణికజ్ఞానముల ప్రవాహములో ఒకక్షణికజ్ఞానమునకు మఱియొకక్షణికజ్ఞానమునకు మధ్యలో మనస్సునకు నిర్వికల్ప దశ ఉన్నది. కావున తెలిసికొనఁగలిగినవానికి వ్యవహరమునందు కూడ ప్రతిక్షణము సమాధి యున్నది. ఇతరులకు అది కుందేటికొమ్మువలె అసంభవముగానే తోఁచును.''

అది విని అష్టావక్రుఁడు మరల ఇట్లు అడిగెను. ''వ్యవహారము నందు ఉన్నవారికి కూడ సమాధి సంభవమైనచో సంసారము ఎట్లు జరుగచున్నది? సుషుప్తియందు జడమైన అవ్యక్తము భాసించుచుండుటవలన ఆదశయందు కృతార్థత లేదు. కాని యిప్పుడు మీరు చెప్పుచున్న నిర్వికల్పదశ సమాధియే కదా! అందు శుద్ధమైనచైతన్యమే భాసించుచుండును. ఆచైతన్యము సకలమైన యజ్ఞానమును నశింపఁజేయును. అట్టి నిర్వికల్పసమాధి కలిగినవానికి మరల సంసార మెట్లు సంభవించును.?''

జనకుఁడిట్లు చెప్పెను. ''ఈసంసారము అనాదిగా సుఖదుఃఖ ప్రవాహరూపమున మహాస్వప్నమువలె ఎల్లరచేతను అనుభవింపఁబడుచున్నది. దీనికి మూలమైన యజ్ఞానము జ్ఞానముచేతనే తొలఁగునని విద్వాంసులచేత నిశ్చయింపఁబడినది. సవికల్పజ్ఞానమే ఆయజ్ఞానమును తొలఁగించును. నిర్వికల్పజ్ఞానమువలన ఆయజ్ఞానము నశింపదు. నిర్వికల్పజ్ఞానము, చీఁకటికి వెలుఁగువలె, దేనికిని విరోధి కాదు. చిత్రవిచిత్రములైన బొమ్మలకు గోడ ఆధారముగా నున్నట్లు వికల్పజ్ఞానములకు అన్నింటికిని నిర్వికల్పజ్ఞానము ఆధారముగా నున్నది. ప్రతిబింబములు లేని యద్దమే కేవలమైన యద్దమైనట్లు, వికల్పములేని జ్ఞానమే కేవలజ్ఞానము. దానియందు ఎన్నివిధములైన వికల్పములు వస్తువుల వివిధత్వమునుబట్టి భాసించుచున్నను అది ఏవికల్పమును అడ్డగింపదు. అద్దము ఏప్రతిబింబమును అడ్డగింపదు కదా! సంసారమునకు మూలమైన యజ్ఞానము కూడ ఒకవికల్పజ్ఞానమే. ప్రతిబింబమును అద్దము అడ్డగింపలేనట్లు కేవలజ్ఞానము కూడ తనయందు ప్రతిబింబించుచున్న యీవికల్పజ్ఞానమును అనఁగా అజ్ఞానమును అడ్డగింపదు. కావుల కేవలజ్ఞానముచేత అజ్ఞానము తొలఁగదు.

సంసారమూలమైన యజ్ఞానము కార్యకారణరూపమున అనేక విధములుగా నున్నది. ఆత్మయందు పూర్ణత్వము తోఁచకుండుట కారణమైన యజ్ఞానము. విభాగములులేని యాత్మ పూర్ణమే అగును. అయినను కారణమైన యీయజ్ఞానము ఆత్మయందు పూర్ణత్వము తోఁచకుండఁజేసి, ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను'' అను తలంపును లింగిచుచు దేశము కాలము ఆకారము అనువిభాగములను పుట్టించుచున్నది. ఈయజ్ఞానవృక్షమున చిగురుటాకులవలె ''దేహము నేను'' అను భావము మొదలుగా సంసార మంతయు పెంపొందుచున్నది. మూలమైన యజ్ఞానము తొలఁగిననే తప్ప సంసారము తొలఁగదు. ''ఆత్మ పరిపూర్ణము'' అను విజ్ఞానముచేత తప్ప అజ్ఞానము తొలఁగదు. ఆపూర్ణాత్మయొక్క విజ్ఞానము పరోక్ష మని అపరోక్షమని రెండువిధములుగా నున్నది. గురుముఖముగా శాస్త్రములవలన కలుగుజ్ఞానము పరోక్షము. ఇది మోక్షమను పురుషార్థమునకు సాక్షాత్తుగా కారణము కాదు. గురువువలన శాస్త్రము ననుసరించి పొందిన జ్ఞానము ''ఇది నిజమే'' అను విశ్వాసమాత్రముగనే యుండును; అనుభవమునకు రాదు. అందువలన అది మోక్షరూపమైన ఫలమును కలిగింపదు. సమాధీయొక్క పరిపాకమువలన కలుగునట్టి విజ్ఞానమును అపరోక్షజ్ఞాన మందురు. అదియే కార్యమైన (effect) ప్రపంచమును కారణమైన యజ్ఞానమును (Cause) నశింపఁజేసి మోక్షఫలమును ఇచ్చును.

గురుముఖముగా శాస్త్రమువలన కలుగు పరోక్షజ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధివలన విజ్ఞానము కలుగును. అందువలన శాస్త్రజ్ఞానము లేనివారికి సమాధి కలిగినను దానివలన ప్రయోజనము లేదు. మాణిక్య మనఁగా ఎట్లుండునో తెలియనివాఁడు కోశాగారమునందు ఆమణిని చూచుచున్నను ''ఇది మాణిక్యము'' అని గ్రహింపఁజాలఁడు. మణినికూర్చి విని తెలిసికొన్న వాఁడు కూడ దానియందు దృష్టి యుంచి పరిశీలించినచో ''ఇది మాణిక్యము'' అని గ్రహింపఁగలఁడు. మణిజ్ఞానమునందు మఱియొకఁడు ఎంత నిపుణుఁడైనను దాని యందు దృష్టిని నిలుపకున్నచో అది మణి యని గ్రహింపఁజాలఁడు. కావున విజ్ఞానమునకు ఫలముగా లభించునట్టిదానిని మూఢుఁడు అజ్ఞానమువలన పోందఁజాలఁడు. పండితులు విజ్ఞానవంతులైనను దాని యందు దృష్టినుంచని కారణముచేత ఆఫలమును పొందఁజాలరు. శుక్రనక్షత్రమునుగూర్చి తెలియనివాఁడు ఆతారను ఎన్నిదినములుగా చూచుచున్నను ''ఇది శుక్రతార'' అనిగ్రహింపఁజాలఁడు. మఱియొకఁడు దానినిగూర్చి విని యున్నను దానియందు దృష్ఠి నుంచక పోయినచో దానిని గ్రహింపఁజాలఁడు. ఆశుక్రతార ఏదిక్కులో ఎచ్చట ఏయాకారణముతో నుండునో తెలిసికొన్నతరువాత శ్రద్ధతో ''నేను దీనిని తెలిసికోవలె'' అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవఁడు పరిశీలించునో అట్టి బుద్ధిశాలియే దానిని ''ఇది శుక్రతార'' అని గుర్తింపగలఁడు. కావున అజ్ఞానముచేత మూఢులు, శ్రద్ధలేకపోవుటచే పండితులును సమాధిదశలను పొందుచుండియు ఆదశలలో ఆత్మను గుర్తింపలేకున్నారు. పెరటిలో నిధి యున్నను దానిని గుర్తింపలేక భిక్షాటనము చేయుచుండు దౌర్భాగ్యులవలె ఇట్టివారందఱును సమాధిస్థితులను కలిగియుండియు వానివలన ప్రయోజనమును పొందలేకున్నారు. ఈకారణముచేతనే శిశువులకు అజ్ఞానము తొలఁగకపోవుటవలన ఎల్లప్పుడు నిర్వికల్పస్థితి యున్నను వారికి దానివలన కలుగవలసిన ఫలము కలుగుట లేదు.

కాఁబట్టి ''ఆత్మఇట్టిది'' అని దానినిగుర్తింపఁజేయునట్టి శాస్త్రజ్ఞానమే. అనఁగా సవికల్పజ్ఞానమే, సంసారమునకు మూలమైన యజ్ఞానమును తొలఁగింపఁగలదు. ఎన్నోజన్మలయందు నిష్కామముగా చేసిన పుణ్యకర్మలచేత ఆత్మదేవత సంతుష్టురా లగును. ఆదేవత సంతుష్టురా లై నప్పుడే మోక్షమునందు కోరిక కలుగును. లేకున్నచో కోట్లకొలఁది కల్పములు జరుగుచున్నను మోక్షము కావలయు ననుకోరిక కలుగదు. కోట్లకొలఁది జస్మలయందు చేతనత్వముతో జన్మించుట దుర్లభము. అందును మనుష్యజన్మము ఇంకను దుర్లభము. మనుష్యులలో కూడ సూక్ష్మబుద్ధి కలవాఁడై జన్మించుట పరమదుర్లభము. నీవేగమనింపుము. సృష్టియందు స్థావరములలో నూఱవవంతు కూడ జంగమములు లేవు. జంగమములలో నూఱవవంతు కూడ మనుష్యులు లేరు. వారిలో కూడ మంచిని చెడును పుణ్యమును పాపమును గుర్తింపక పశువులతో సమానముగా నుండువారు కోట్లకొలఁదిగా నున్నారు. పాండిత్యగర్వముతో ఈలోకమునందు స్వర్గాదిలోకములందును భోగములను కోరుచు పైకి క్రిందికి రాకపోకలు చేయువారు కూడ కోట్లకొలదిఁగా నున్నారు. పండితులలో కొందఱు వివేకవంతులు తత్త్వమును గ్రహింపఁబూనుకొన్నను మలినసంస్కారములప్రాబల్యముచేత అద్వితీయమైనయాత్మను గ్రహింపఁజాలరు. పరమేశ్వరునియొక్క మాయచేత అంధులైనవారికి భాగ్యహీనులైనవారికి అద్వైతజ్ఞానము బుద్ధి కెక్కదు. బుద్ధిశక్తిచేత దానిని గ్రహింపఁగలిగినను కొందఱు దౌర్భాగ్యులు ''విషయాకారమును. పొందని కేవలచైతన్య మెట్లుండును? ఉన్నచో కుండ చట్టి మొదలగువానివలె ఏల గోచరము కాదు? కావున లేదు?'' అని యిట్టి కుతర్కములతో దానిని తిరస్కరించుచుందురు అహో! భగవంతురాలైన మాయయొక్క ప్రభావ మేమని చెప్పుదును; చేతికి దొరికిన చింతామణిని, ''ఇది మణి యగునో కాదో'' అని సంశయించుచు పారవేయినట్టివానివలె పండితులు కూడ ఆత్మను చూచుచుండియు మాయ చేత మోహితులై కుతర్కములు చేయుచు దానిని వదలి వేయుచున్నారు. పరదేవతయొక్క అనుగ్రహమును పొందినవారు మాత్రము మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరియైనతర్కముతో విచారించి అద్వితీయమైన పరమపదమును పొందుచున్నారు. ఆపదమును పొందుటకు క్రమమును చెప్పెదను వినుము.

అనేకజన్మలలో చేసిన పుణ్యములవలన పరదేవతయందు భక్తి కలుగును. భక్తితో పరమేశ్వరిని ఆరాధించి ఆమెయనుగ్రహమును పొందినప్పుడు భోగములయందు విరక్తి ఆత్మతత్త్వమునందు ఆసక్తియు కలుగను. వైరాగ్యముతో శ్రద్ధతో ''ఆత్మతత్త్వమునకు మించి పొందవలసినది ఏదియి లేదు, దానినే పొందవలె'' అని నిశ్చయించి సద్గురువు నాశ్రయించినచో ఆయన గావించు బోధవలన అద్వైతతత్త్వము తెలియును. ''అద్వితీయమైన యాత్మ యున్నది'' అని దృఢముగా తెలిసికొనుటయే పరోక్షజ్ఞానము. ఇట్లు తెలిసికొనుట శ్రవణము. తరువాత శాస్త్రసమ్మతమైన తర్కముతో దృష్టాంతములతో విచారించి సంశయములను తొలఁగించుకొనుట మననము. అట్లు మననముచేత నిశ్చయించుకొన్న యాత్మస్వరూపమును మనస్సునందు నిలుపుకొనుట ధ్యానము, మనస్సు చంచలమై ఆత్మస్వరూపము దానియందు నిలువకున్నచో తీవ్రముగ ప్రయత్నించి ప్రాణాయామాదిసాధనములను అవలంభించియైనను అత్యంతమైన ప్టటుదలతో అపరోక్షజ్ఞానము కలుగు వఱకు ధ్యానమును కొనసాగింపవలె. ఇదియే నిదిధ్యాసనము. ''శుద్ధమైన యాత్మస్వరూపముగా నామనస్సు చాలసేపునిలుచునుగాక'' అని సంకల్పించి ఆసంకల్పిమును మఱువకుండ సంస్కారరూపముగా మాటిమాటికి పైకితెచ్చుకొనుచు ఆత్మతత్త్వమును మనస్సునందు నిలు పుకొను ప్రయత్నము ధ్యానము. ధాన్యముయొక్క అభ్యాసమునందలి యతిశయముచేత, అనగా సంకల్పముయొక్క సంస్కారముయొక్క బలముచేత ఇష్టము వచ్చినంతసేపు మనస్సునందు ఆత్మస్వరూపమును నిలుపుకొనఁగలుగట సవికల్పసమాధి అందురు. ఈసమాధిని కొనసాగించుచున్నచో కొంతకాలమునకు సంకల్పసంస్కారములయొక్క ప్రేరణలేకయే మనస్సునందు ఇష్టము వచ్చినంతసేపు ఆత్మస్వరూపము నిలిచియుండును. దీనిని నిర్వికల్పసమాది యందురు. దీనియందు పరమపదమైన యాత్మస్వరూపము అపరోక్షణుగా (Directly) గోచరించును. ''ధ్యానముయొక్క పరిపక్వతయే నిర్వికల్పసమాది. అట్లు ఆత్మతత్త్వము గోచరించినతరువాత, సమాధిని వదలినమరుక్షణమున శాస్త్రమునందు చెప్పఁబడినయాత్మతత్త్వము సమాధియందు గోచరించినయాత్మస్వరూపము, రెండును ఒకటియే, ''శాస్త్రమునందు నిర్ణయింపఁబడినయాత్మయే నేను (సోహమ్‌)'' అని గుర్తింపవలెన. అట్లు గుర్తించుటను ప్రత్వయబిజ్ఞ యందురు. దానిచేత సంసారమునకు మూలమైన యజ్ఞానము సమస్తము నశించును. ఇందు సంశయము లేదు.

మనస్సునందు వికల్పములు పుట్టకుండుటయే నిర్వికల్పస్థితి. ఆత్మస్వరూపము తప్ప మఱిదేనిని మనస్సులోఁ జొరఁబడకుండునట్లు చేసినచో వికల్పములు పుట్టవు. మనస్సు వివిధపదార్థములయొక్క ఆకారములను పొందుచుండుట వికల్పస్థితి. అది దేనిని బాసింపక ఏక రూపమున నిలుచుట నిర్వికల్పస్థితి. గోడమీఁద బొమ్మలను తుడిచి వేసినచో అది శుద్ధమైనట్లే మనస్సులో విక్లపములు లేకుండఁజేసినచో అది స్వయముగా శుద్ధమై నిర్వికల్ప మగును. ఇదియే పరమ పావనమైన పదము. మాయయొక్క ప్రభావముచేత పండితులు కూడ ఈవిషయమునందు భ్రాంతి నొందుచున్నారు. ఈపరమపదమును పొందఁదగినవారు మూఁడువిధములుగా నున్నారు. గురువువలన శ్రవణము చేయుచున్నప్పుడే, ఆయన ఒక్కసారి బోధించినంతనే, మనన నిదిధ్యాసనముతో మఱుక్షణముననే ఆపదమును తెలిసికొనగలవారు ఉత్తములు. సాధనచేసి కొంతకాలమునకు తెలిసికొనఁగలవారు మధ్యములు. చిరకాలము సాధనచేసి తెలిసికొనువారు అధములు. ఉత్తములకు పరమపదమును పొందుటలో క్లేశ##మే యుండదు.

వెనుక ఒకప్పుడు వేసవిలో వెన్నెలరాత్రియందు మద్యమును సేవించి ఉద్యానవాటికాప్రాంగణమున రత్నములచే అలంకరింపఁబడిన శయనమునందు ప్రియురాలిచే కౌంగిలింపఁబడి యుంటిని. అప్పుడు ఆకాశమునందు పోవుచు సిద్ధపురుషులు అద్వితీయమైన యాత్మతత్త్వమును గూర్చి మధురముగా ప్రసింగిచుకొనుచుండిరి. ఆప్రసంగమును నేను వింటిని. వెంటనే నేను దానిని మననముచేసికొని ధ్యానించి నిర్వికల్పసమాధిని పొంది అర్ధముహూర్తము (ఒక్కగడియ

= 24 నిముషములు) పరమాపావనమైన యాత్మతత్త్వమును తెలిసికొని ఆసమాధి స్థితియందే పరమానందసాగరమున తేలియాడుచు కొంత సేపు ఉంటివి. పిదప బాహ్యస్మృతిని పొంది ఆలోచించితిని. ''అహో! ఇది అద్బుతముగా నున్నది; ఆనందామృతపూర్ణముగా నున్నది. చాల అపూర్వమైన స్థితిని (Most unusual state) పొందితిని. దీనియందు మరల ప్రవేశింతును. ఇంద్రపదవినుండి బ్రహ్మపదవి వఱకును లభించునట్టి సుఖ మేదియును ఈసుఖములోని రవ్వంతభాగమునకు కూడ సమానము కాదు. ఇప్పటివఱకును కాలము వ్యర్థముగా గడచినది. చింతామణులతో నిండిన నిధానము తమయింటిలోనే యుండఁగా దానిని తెలిసికొనలేక బిచ్చ మెత్తుకొనువారివలె లోకులు ఆత్మానందమును గుర్తింపలేక మహాశ్రమతో అల్పమైన బాహ్యసుఖమును పొందుచున్నారు. ఈబాహ్యసుఖముకొఱకు ప్రయత్నము చాలును. ఇంక అనంతముగా ఆనందము నొసంగునాత్మనే ఎల్లప్పుడు పొందుదును. నూఱినదానినే మరల నూఱుటవలె (పిష్టపేషణము) నిరుపయొగమైన యీవ్యవహారముతో నా కేమి పని? అవియే భోజనపదార్థములు అవియే పుష్పమాలలు శయనములు భూషణములు అన్నియు అవియే; వారేయవతులు; అవియే భోగములు. చద్దివంటకమువలె అవియే మరల మరల సేవింపఁబడుచున్నవి. ఒకరిని చూచి మఱియొకరు చేయుయుండుటవలన అందఱకును ఇది అలవాటైనది. అందువలననే నాకు ఏవగింపు కలుగుట లేదు.''

ఇట్లు నిశ్చయించుకొని నేను మరల అంతర్ణుఖుఁడ నగుటకు పూనుకొనుచుండగా మఱియొక ఆలోచన కలిగెను. ''అహో! ఏమి నా భ్రాంతి! సమాధియందు ఆనందపరిపూర్ణుఁడనై యుండిన నేనే ఇప్పుడు కూడ ఉన్నాను. ఆనందమే నాస్వరూపమై యుండఁగా నే నిప్పుడు క్రొత్తగా పొందవలసినది ఏమున్నది? నాయందు లేనిదానిని ఎప్పుడు గాని ఎచ్చట గాని ఏసాధనముచేత నైనను ఎట్లు పొందఁగలను? ఆనందము నాకు స్వరూపమే కాకున్నచో దానిని నేను ఏదో ప్రయత్నముచేసి క్రొత్తగా పొందవలసియే యున్నచో, పుట్టినది పొక తప్పదు అన్నట్లు, ఆయానందము సత్యముగా ఎట్లు నిలుచును? అది యునుగాక అనంతమైన చిదానందమే నారూపమైనప్పుడు దానియందు ఒకపని యెట్లుజరుగును? దేహము మనస్సు ఇంద్రియములు - అన్నియు స్వప్నములోని పదార్థములవలె అసత్యములే. అసత్యములైన సాధనములతో సత్యమైన క్రియ ఎట్లు సంభవించును? ''ఈ శరీరము మనస్సు ఇంద్రియములు నావి'' అని ప్రతిజీవియు తన శరీరాదికమును అభిమానించుచున్నాఁడు. కాని అఖిలజీవులయందున్న యాత్మను నేనే. కావున ఆశరీరములు మనస్సులు ఇంద్రియములు కూడ నావే. అట్టియొడల ఈశరీరమున ఒకమనస్సును నిరోధించుటవలన ఏమగ్గును? ఇక్కడ దీనిని నేను నిరోధించినను ఇతరజీవులలో ఉన్న మనస్సులు నిరోధింపఁబడుట లేదు కదా! మఱి అవి యన్నియు నామనస్సులే. చైతన్య రూపుఁడనై అఖిలజీవులలో వ్యాపించియున్న నాయందు విరుద్ధములైన మనస్సులు అనిరుద్ధములైన మనస్సులు అన్నియు భాసించుచునే యుండును. ఇంక ఈయొక్క మనస్సు నిరోధింపఁబడుటవలన లాభ##మేమున్నది? అట్లుగాక అందఱిమనస్సులు ఒక్కసారి నిరోధింపఁబడినను చైతన్య మాత్రుఁడ నైన నాకేమి విశేషము కలుగును? మహాకాశమును కూడ మించి అంతటను వ్యాపించి పూర్ణానందరూపుఁడనైయున్న నాయందు నిరోధము కాని సమాధి గాని ఎట్లు సంభవించును? ఆనందమే నేనై యుండఁగా నాకు శుభాశుభములు ఎక్కడివి? అందువలన కర్తవ్యము అకర్తవ్యము ఏదియును నాకు లేదు? సమాధి యున్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనను నాస్వరూపమునందు భేదమే లేదు. నేనెప్పుడును ఆనందపూర్ణుఁడనే. కాబట్టి ఈశరీరము ఇప్పటి వఱకు ఏపని చేయుచున్నదో ఆపనినే చేయుచుండును గాక! దానితో నాకేమి? అది ఏస్థితియందున్న నే నెప్పుడును నిరంజనుఁడనే పూర్ణుఁడనే ఆనందరూపుఁడనే.'' ఇట్లు ఏక్షణమునందును స్వరూప విస్మృతి లేక వ్యవహారమునం దుండియు స్వస్థత కలవాఁడనై ఆనంద పూర్ణుఁడనై యున్నాను.

ఇది ఉత్తమాధికారివిషయము, మధ్యమాధికారులు శ్రవణమనన నిదిధ్యాసములయొక్క క్రమములవలన నెమ్మదిగా జ్ఞానమును పొందుదురు. అధమాదికారులు పెక్కుజన్మలలో శ్రవణమననాదులను గావించి జ్ఞానఫలమును పొందుదురు. శాస్త్రజ్ఞానముతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్రజ్ఞానములేని సమాధిస్థితి నూఱుపర్యాయములు సంభవించినను ప్రయోజనములేదు, కావుననే జాగ్రద్దశ మొదలగువాని యందు క్షణికముగ సంభవించుచున్న సమాధులవలన ఫలముకలుగుట లేదు. ''ఇది సమాది స్థితి. ఇప్పుడు ఆనందఘనమైన నాస్వరూపము నం దున్నాను. ఉపనిషత్తులయందు నిర్దేశింపఁబడిన బ్రహ్మాత్మస్థితి యిదియే'' అన్న గుర్తింపు ఉన్నప్పుడే సమాధి - సఫలము అగును. దారిలో పోవుచున్నప్పుడు నిర్విశేషముగా ఎన్నోవస్తువులను చూచుచుందుము. అట్లే చూచుటవలన ఫల మేదియు కలుగుటలేదు. ఒకవస్తువును నామరూపములతో గుర్తించి ''ఇది మామిడిచెట్టు'' అని తెలిసి కొన్నప్పుడే తప్ప ఆమామిడిచెట్టును చూచుటవలన ఫలముకలుగుట లేదు. చెట్టుయొక్క పరిజ్ఞానములేనివాఁడు వనములో ప్రవేశించినచో వానికి చెట్లు అన్నియు నిర్విశేషముగా ఒకటిగానే కన్పించును. ఏచెట్టు యొక్క పరిజ్ఞానము ఎవనికి ఉండునో వాఁడు ఆచెట్టును మాత్రమే గుర్తించి దానియొక్క ఫలమును పొందఁగలడు. కావున నిర్విశేషమైన నిర్వికల్పజ్ఞానమాత్రముచేత అజ్ఞానము తొలఁగదు. ''ఇదియే ఆత్మస్వరూపము'' అను జాన మేర్పడదు. అద్దమువలెనే నిర్వికల్పమైనయాత్మ ఎప్పుడును భాసించుచునే యుండును. ప్రతిబింబములచేత ఆవరింపఁబడియున్నప్పుడు కూడ అది భాసించుచునే యున్నను భాసింపనట్లే యుండును. ప్రతిబింబములు తొలగినంతనే అద్దముక్రొత్తగా భాసించుచున్నట్లు ఎట్లు తొఁచునో అట్లే వికల్పజ్ఞానము లన్నియు తొలఁగినప్పుడు సదా భాసించుచున్నయాత్మ క్రొత్తగా భాసించుచున్నట్లుతోఁచును. వికల్పజ్ఞానములను తొలఁగించుటకు, అవి తొలగినతరువాత గోచరించునది ఆత్మయో యని గుర్తింపజేయుటకు శాస్త్రవిజ్ఞానము ఆవశ్యకము, వికల్పజ్ఞానములు తొలఁగుటయే ఆజ్ఞాననిర్మూలనము. ఇది సవికల్పమైన శాస్త్రవిజ్ఞానముచేతనే సంభవించును గాని నిర్వికల్పజ్ఞానముచేత సంభవింపదు. అద్దము ప్రతిబింబములను ఎట్లు నిరోధింపదో అట్లే నిర్వికల్పమైన యాత్మచైతన్యము కూడ అజ్ఞానము నిరోధింపదు.

ఈకారణముచేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాత మని మఱియొకప్పుడు అజ్ఞాత మని చెప్పఁబడుచున్నది. వికల్పజ్ఞానములచేత ఆవరింపఁబడినప్పుడు ఆత్మ అజ్ఞాత (Unknown) మని వికల్పములు తొలఁగినప్పుడు అదియే జ్ఞాతమని (Known) చెప్పఁబడుచున్నది. ఇది ఉత్తమమైన యాత్మవిజ్ఞానక్రమము, ఇప్పుడు నీవు విన్నదాని మరల విచారింపుము. పిమ్మట ఆత్మతత్త్వమును తెలిసికొనికృతార్ధుఁడవు కాఁగలవు.

ఇట్లు జనకునిచేత ఉపదేశింపఁబడిన యష్టావక్రుఁడు ఆయనచేత పూజితుఁడై సెలవుగైకొని తనయాశ్రమమునకు పోయి మననము నిధి ధ్యాసనము కావించి పరమపదమును తెలిసికొని సకలసందేహములను వీడి కొలఁది కాలముననే జీవన్ముక్తుఁ డయ్యెకు.

ఇది జ్ఞానఖండమున సమాధిస్థితివివరణ మన్నది సప్తదశాధ్యాయము.

బాలప్రియ

హేమచూడుఁడు మహేసేనుఁడును జీవన్ముక్తీని పొందినవిధానములను విన్నతరువాత పరశురాముఁడు తనయాశ్రమమునకు పోయి ఆవిషయములను మననము చేసికొనెను. విన్నంతనో కొన్ని విషయములు వెంటనే తెలియను; కొన్ని తెలియవు; కొన్ని కొంచెము తెలిసినట్లుండును. మననము చేయునప్పుడే ఏవిషయముల కొంచెమే తెలిసినవో, ఏవి అసలే తెలియలేదో స్పష్ట మగును. విన్నవెంటనే తెలిసినవి కూడ క్రొత్తగా మనస్సునకు గోచరించునే కాని నిశ్చితముగా మనస్సునకు పట్టవు, ''మిరియములు శ్లేష్మమును హరించును'' అని గురువు శిష్యునకు చెప్పినప్పుడు అది క్రొత్తగా వానిమనస్సులోనికి వచ్చును. కాని దానినిగూర్చి ఆలోచించునప్పుడు. ''వీనిని ఎప్పుడు ఎట్లు ఉపయోగింపవలె? పొడిచేసి దేనితో నైనా కలపవలయునా? కషాయము చేసి త్రాగవలయునా? ఎప్పుడు ఎంత మోతాదులో వాడవలె?'' అని పెక్కుసరందేహములు కలుగును. ఈసందేహములకు సమాధానములను గురువువలన పొందినతరువాత శిష్యుఁడు తనవిషయముననో ఇతరులవిషయముననో దాని నుపయోగించి చూచినతరువాత వానికి ఆ వస్తువుయొక్క పరిచయము జ్ఞాన మగును. ఆత్మజ్ఞానము కూడ ఇట్టిదే. ఉత్తమాధికారులైన జనకునివంటివారికి విన్నవెంటనే అది నిస్సందేహముగా గోచరించినను తక్కినవారు విన్నదానినిగూర్చి మననము చేయుచు గురువువలన సందేహములను దీర్చుకొనుచు ఆత్మస్వరూపమును నిస్సంశయముగా తెలిసికొనవలె. అందువలననే తర్కకుశలుఁడై వరుణపుత్రుని కూడ జయించిన యష్టావక్రునకు కూడ తాపసితుదకు ''ఒక్కసారి మాత్రమే వినుటచే ఇది నీకు చక్కఁగా తెలియకపోవచ్చును. నీసందేహములను ఈరాజు నడుగుము'' అని చెప్పిపోయెను. కావున ఎంత మేధాసంపన్నున కైనను మననము చేయక తప్పదు. అందువలననే భగవంతుఁడైన పరశురాముఁడు కూడ విన్న విషయములను మననము చేసికొని తిరిగివచ్చి, ''అయ్యా! నాకు ఇంత వఱకు తెలిసినది'' అని తాను తెలిసికొన్నవిషయములను గురువునకు చెప్పెను. తెలిసినవి అని యునుకొన్నవిషయములలో కూడ తాను దేనినైనను పొరపాటుగా గ్రహించియున్నచో వెంటనే గురువు దానిని సరిదిద్దఁగలఁడు. అనఁగా, ''నీవు గ్రహించినది యథార్థమే. ఇది యింతే'' అని గురువు ఆమోదించువఱకు ఎవఁడు తనబుద్ధిని గాని అనుభవమును గాని ప్రమాణముగా గ్రహింపరాదు.

తాపసియడిగిన ప్రశ్నకు సమాధానము తెలియలేదని తోఁచినం తనే అష్టావక్రుఁడు గర్వము వీడి వినయముతో, ''అమ్మా! నీవడిగిన ప్రశ్నకు నాకు సమాధానము తెలియదు. నేను నీకు శిష్యుఁడ నగుచున్నాను....అది ఎట్లు నిరూపింపఁబడినదో చెప్పుము'' అని ప్రార్థించెను. అంత మహాసభలో తాను ఒకస్త్రీకి ఓడిపోయితి నని గాని, ఆమెకు తాను శిష్యుఁడు కావలసివచ్చినది అని గాని అతఁడు అభిమానపడక వెంటనే ఆమెను ఆశ్రయించెను. ఆతనికి అప్పుడు అభిమానమువలన అవమానము కలిగెనను దుఃఖము, స్త్రీని గురువునుగా ఆశ్రయింపవలసివచ్చి నందులకు సంకోచముకలుగలేదని చెప్పఁజాలము. అయినను ఆత్మను గూర్చి నిస్సంశయముగా తెలిసికోవలయు నను తీవ్రమైన కోరికచేత అతఁడు సకలసంకోచములను త్రోసివేసి ఆమెను ప్రార్థింపఁగలిగెను. ఈశ్రద్ధను గమనించియే తాపసి జనకఁడును. ఆతనికి బోధించిరి. అతనికి ఆశ్రద్దయే లేకున్నచో ఓటమి కలిగినంతనే అవమానదుఃఖముతో సభనుండి నిష్ర్కమించియుండును. కాని ఆతనికి విద్యావిషయమునఁ గల శ్రద్ద అమోఘమైనది. ఆశ్రద్ధవలననే అతఁడు కృతార్థఁడు కాఁగలిగెను. ఈశ్రద్ధచేతనే పరశురాఁముడుకూడ, ఎవ్వరు ఏమనుకొందురో అను సంకోచము కొంచెము కూడ లేక, ఎన్ని పర్యాయములైనను గరువును ప్రశ్నించి తెలిసికొనుచునే యుండెను. కావున గురువును సేవించుచు శ్రవణము మననము నిదిధ్యాసనము కొనసాగించుచు ఆత్మజ్ఞానమును పొందవలసినదే కాని దీనికి ఇంకొకమార్గము లేదు. కువలునివలె పారాణికులవలన కుతూహలమాత్రముతో వినుటవలనఁగాని, అకడవులకు పోయి ప్రామాయమాదులతో నిర్వికల్పసమాధిని సాధించి తపస్సులు చేయుటవలనఁగాని ఆత్మజ్ఞానము కలుగ దనుట స్పష్టము. ఈశ్వరానుగ్రము కూడ మనకు కొంతవఱకే అనగా సద్గురువును చూపి ఆయనయందు శ్రద్ధ కలిగించువఱకే తోడ్పడును. ఆ పైన శ్రవణమనననిదిధ్యాసములు గురుసేనాపూర్వకమైన స్వయం కృషిచేతనే కొనసాగవలె. దత్తగురువు చెప్పిన మాటలలో ఇది స్పష్టమగుచున్నది. ''మనయందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే ఆరాధింపఁబడిన యీశ్వరుఁడు ప్రసన్నుఁడై మనకు చేయఁగలిగిన మహోపకారము. ఆయన చేయగలిగినది అంత వఱకే.'' విచారణముతప్ప ఆత్మజ్ఞానమునకు వేఱొకసాధనము లేదని జనకుఁడు స్పష్ట మొనర్చెను. ఆయన ''గురుముఖముగా శాస్త్రమువలన కలుగుపరోక్షజ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధివలన విజ్ఞానము కలుగును. అందువలన శాస్త్రజ్ఞానము లేనివారికి సమాధి కలిగినను దానివలన ప్రయోజనము లేదు....శాస్త్రమునందు చెప్పఁబడిన యాత్మతత్త్వము సమాధియందు గోచరించిన యాత్మస్వరూపము రెండును ఒకటియే. శాస్త్రమునందు నిర్ణయింపఁబడిన యాత్మయే నేను (సోహమ్‌) అని గుర్తింపవలె. అట్లు గుర్తించుటను ప్రత్యభిజ్ఞ యందురు. దానిచేత సంసారమునకు మూలమైన యజ్ఞానము సమస్తమునశించును'' అని చెప్పెను. అష్టావక్రుఁడ అడిగిన సందేహముల కన్నింటికి సమాధానములు చెప్పి ఆయన తుదకు, ''ఇప్పుడు నీవు విన్నదానిని మరల విచారింపుము. పిమ్మట ఆత్మతత్త్వమును తెలిసికొని కృతార్థుఁడవు కాఁగలవు'' అని చెప్పిపంపెను. కావున విచారము తప్ప ఆత్మజ్ఞానమును పొందుటకు వేఱొక మార్గములేదు. సమాధివలన ప్రత్యబిజ్ఞనొందుట కూడ విచారములో భాగమే.

తెత్తరీయోపనిషత్తునందు వరుణునిపుత్రుండైన భృగువు తండ్రి వలన ఉపదేశమును పొంది తపస్సుచేసి బ్రహ్మజ్ఞానమును పొందె నని చెప్పఁభడియున్నది. ఆభృగుమర్షియే ఇందు ప్రస్తావింపఁబడిన వరుణ పుత్రుఁడై యుండవచ్చును. అతఁడు తర్కనైపుణ్యముతో జనకుని సభలోని పండితుల నందఱను జయించి అష్టావక్రునిచేత తర్కమువలననే ఓడింపఁబడెను. అష్టావక్రుఁడు తాపసిచేత ఓడింపఁబడెను. యుద్ధమునందువలె జయాపజయములు తర్కమునందు కూడ ఎంత అస్థిరములో దీనివలన స్పష్ట మగుచున్నది. శాస్త్రవిషయమున కూడ కేవలము తర్కముచేత ప్రతిష్ఠింపఁబడు సిద్ధాంతములగతి యింతే వరుణ పుత్రుఁడు ఖండించువఱకు జనకునిసభలోనున్న పండితులు అనుకొనుచున్నవి సిద్ధాంతములే. వరుణపుత్రుఁడు ఖండించినంతనే అవి పూర్వ పక్షములై వరుణపుత్రుఁడు చెప్పునది సిద్దాంత మయ్యెను. అది కూడ అష్టావక్రునిచేత ఖండింపఁబడి పూర్వుపక్షమయ్యెను. కావున కేవలము తర్కముచేత నిలువఁబెట్టఁబడు సిద్ధాంత మేదియు సుప్రతిష్ఠితము కాదు. కేవలమైనతర్కము ఎప్పుడైనను ఎవనిచేత నైను ఖండింపవచ్చును కావు. ధర్మతత్త్వముల విషయమున కేవలమైన తర్కము ప్రమాణము కాదు; అపొరుషేయమైన వేదమే ప్రమాణము. అట్లే ఆత్మసాక్షాత్కారముయొక్క అనుభవమునందు కూడ ఏమహనీయుని యొక్క అనుభవమైనను ప్రమాణము కాదు. గురువువలన శాస్త్రము ననుసరించి ఆత్యస్వరూప మిది యని తెలిసికొని మనననిదిధ్యాసనములచేత ఆత్మస్వరూపము స్ఫురించినప్పుడు, ''ఇది శాస్త్రమునందు వర్ణింపఁబడిన యాత్మస్వరూపమే'' అని గుర్తించినప్పుడే అది యథార్థమైన సాక్షాత్కారమై హృదయగ్రంథి విచ్చిపోయి సకలసంశయములు తొలఁగి అజ్ఞానము నశించును. కావున తత్త్వజ్ఞానమును పొందుటలో తర్కము మననము చేసికొనుటకు సాధనమే కాని ప్రమాణము కాదు.

ఇందు తాపసియొక్క రాకపోకలు విచిత్రముగా నున్నవి. ఆమె ఎందుకు వచ్చినదో ఎందుకు వెంటనే వెళ్ళిపోయినదో సృష్టముగా లేదు. ఎందుకు వచ్చితి వని ఆమెను జనకుఁడు కూడ అడగలేదు; ఆమె చెప్పలేదు. ఆమె రాఁగానే సభ##వెలుపలనే పెద్దబ్రాహ్మణు లందఱును అష్టావక్రుఁడు గర్వముతో తమ్ము తిరస్కరించుటను చెప్పిరి. ఆమె సౌందర్యరాశియైన యువతి. అయినను కాషాయంబరములతో జడలతో దివ్యమైనతేజస్సుతో ప్రకాశించుచుండుటను చూచి వారు ఆమె యోగసిద్ధురా లని యూహించి ఆమెను ప్రార్థించియుందురు. ఆమె కూడ వారికి వెంటనే అభయ మొసంగెను. వరుణపుత్రుని జయింపఁగలిగిన యష్టావక్రుని తాను జయింపఁగల నని ఆమె ఎట్లు నిశ్చయించి వారికి అభయమొసంగెను? ఆబ్రాహ్మణు లందఱును పండితులు. అష్టావక్రునితండ్రియైన కహోలునితో సమానమైన వయస్సు కలవారైయుందురు. అట్టి పెద్దవారి నందఱను అషావక్రుఁడు తిరస్కరించుచున్నాఁడన్నచో అతనిని అమితమైన గర్వము ఆవేశించె నన్నమాట, అతఁడు ఆత్మజ్ఞజ్ఞానము కలవాఁడైనచో సాధారణముగా అట్టి యావేశమునకు లోఁబడఁడు. మఱి తంగణునిపుత్రుఁడు ఆత్మజ్ఞానము కలవాఁడై యుండియు క్రోధావేశమున యజ్ఞాశ్వమును బంధించెను కదా! తంగణుడఁ అది దైత్యకృత్య మనియే చెప్పినాఁడు. తత్త్వజ్ఞు లెవ్వరును ఎప్పుడును తప్పలు చేయ రని చెప్పఁజాలము. కావున బ్రహ్మజ్ఞానము కలవాని వర్తనము కూడ ధర్మమున ప్రమాణము కాదు. ఈకారణముచేతనే ధగవంతుఁడు కూడ ''ఇది చేయదగినది, ఇది చేయరానిది, అనునేర్పాటునందు నీకు శాస్త్రమే ప్రమాణము. కావున శాస్త్రవిధానమును తెలిసికొని ఆప్రకారముగా నీవు ఏకార్యము నైనను చేయవలసి యున్నది'' అని శాస్త్రమే ప్రమాణ మని యుద్ఘాటించెను. ''ఏవి మాయందు సుచరితములో వానినే నీవు అనుసరించవలెను. ఇతరములను అనుసరింపరాదు'' అని యాచార్యుని యుపదేశరూపమున వేదము కూడ విధించుచున్నది, ఆచార్యులవర్తనములందు ఏవి శాస్త్రవిహితములో వానినే శిష్యుఁడు అనుసరించవలె; శాస్త్రవిధికి భిన్నములైన యితరవర్తనములను అనుసరింపరాదు. కావున బ్రహ్మాజ్ఞానము కలవారు కూడ ప్రారబ్దవశమున తప్పులు చేయవచ్చును.

అట్లయినచో తప్పుచేయుచున్నంతమాత్రమున అష్టావక్రునకు ఆత్మజ్ఞానము లేదని తాపసి ఎట్లు తలంచియుండును? అతనిని ఆత్మజ్ఞానమున్నను లేకున్నను ఆమె అతనిని తత్త్వమునుగూర్చి ప్రశ్నించుట సమంజసమే. అతనికి ఆత్మజ్ఞాన మున్నచో ఆమె ఆత్మను గూర్చి ప్రశ్నించినంతనే అతఁడు స్వరూపమును స్మరించి తాను చేయుచున్నది తప్పని, తంగణునిపుత్రునివలె, గ్రహించి వెంటనే గర్వమును వీడి సాధుత్వమును పొందును. అతనికి ఆత్మజ్ఞానము లేకున్నచో అతఁడు ఓడింపఁబడి తనయజ్ఞానమును తెలిసికొని పశ్చాత్తాపమునొంది మంచి మార్గమునకు రావచ్చును. అంతేగాక తత్త్వమును తెలిసికోవలయునని ప్రార్థింపవచ్చును.

మఱి వరుణునిపుత్రుఁడే ఇట్లు ఆత్మనుగూర్చి ప్రశ్నించియుండవచ్చును కదా! కాని అతనిసందర్భము వేఱు. అతఁడు సబలో పండితుల నందఱను వాదమునకు పిలిచెను. అందఱు అన్నిశాస్త్రములలో పండితులై యుండరు. ఎవఁడు ఏశాస్త్రములో పండితుఁడ నని ప్రకటించుచున్నాఁడో వానిని ఆశాస్త్రమునందే జయించవలె. మఱియొక శాస్త్రమునందు ప్రశ్నించినచో, ''నాకు అది తెలియదు. నేను నేర్చిన శాస్త్రమునందు నన్ను జయింపుము'' అని ఎవఁడైనను ఎదుర్కొనును. అందువలన వరుణపుత్రుఁడు ఆపండితులను వారు నేర్చినశాస్తరములయందే తర్కనైపుణ్యముతో జయించెను. అష్టావక్రునితో వాదము కూడ అట్లే జరిగినది. అప్పటికి అతనియందు ఆత్మజ్ఞానము లేదని యూహించుటకు కూడ ఆవకాశ మేర్పడ లేదు. అప్పటికి అతఁడు తండ్రిని తక్కిన పండితులను దుస్థితినుండి తప్పించుటకే పూనుకొని యున్నాఁడు.. అది కేవలము ధార్మికమైన గొప్ప సంకల్పము. అప్పుడతఁడు ధర్మవీరుఁడుగా ఉన్నాఁడు. అట్టి ధర్మవీరునకు ఆత్మజ్ఞానముండదని ఆతఁడు ఊహించియుండఁడు. ఒకవేళ అతఁడు తత్త్వమునుగూర్చి ప్రశ్నించినచో అష్టావక్రుఁడు అప్పటిపరిస్థితిలో, ''అది నాకు తెలియదు. నేను నేర్వనిశాస్త్రమునందు నీవు ప్రశ్నింపరాదు, తర్కమునందు నీవు పండితుడనని పండితుల నందఱమ జయించితిని. ఆతర్కమునందే నేను నిన్ను జయించితిని. కావున నీవు ఓటమిని అంగీకరింపవలసినదే'' అని చెప్పంగలడు. అందువలన వరుణ పుత్రుఁడు తర్కములో ఓడినంతనే ఓటమిని అంగీకరించెను.

వరుణపుత్రుఁడు పండితుల నందఱను తెచ్చి అప్పగించినంతనే అష్టావక్రునకు గర్వ మావేశించెను అందువలన అప్పుడు అతఁడు తానే సర్వజ్ఞుఁడ నని తనకన్న మించినవాఁడు లేఁడని భావింపఁజొచ్చెను. ఆసమయములో తాపసి వచ్చి తత్త్వమునుగూర్చి ప్రశ్నించెను అతఁడు అప్పటికి గురుశుశ్రూష చేసి ఆత్మతత్త్వమును తెలిసికొ లేదు. వేదములను అధ్యయనము చేసినప్పుడు ఉపనిషత్తులను కూడ వల్లించియుండెను, ఆవేదాంతవాక్యములను తర్కశాస్త్రబలముతో తనకు తోఁచినట్లుగా అర్థము చేసికొనియుండెను. అందువలన అది తనకు అర్థమైనట్లే అనుకొనుచు, తాపసి ప్రశ్నించినంతనే, ''నాకు సర్వము తెలియును. నాకు తెలియనిది ఏదియు లేదు'' అని ప్రకటించెను. అందువలన వెంటనే ఆతాపసి ఆతఁడు వల్లించిన శాస్త్రవాక్యములను విమర్శించి అతనికి యథార్థముగా ఆత్మస్వరూపము తెలియ దని నిరూపించెను. అతఁడు గర్వమును వీడి తత్త్వమును బోధింపు మని ప్రార్థింపఁగా ఆమె సంగ్రహముగా ఉపదేశించి వెంటనే అతర్ధానము నొందెను.

ఆమెయొక్క రాకపోకలను పరిశీలించినచో ఆమె కేవలము అష్టావక్రునియొక్క గర్వమును తొలఁగించి అతనికి తత్త్వమును తెలిసికోవలయు నను శ్రద్ధ కలిగించుటకే వచ్చెనని స్పష్టము. ఇంద్రాదులగు గర్వముకలిగినప్పుడు త్రిపురాదేవి సాక్షాత్కరించి వారిగర్వమును హరించి వారు పశ్చాత్తప్తులైనతరువాత అనుగ్రహముతో తత్త్వమును ఉపదేశించినది. అట్లే ఇప్పుడు కూడ అష్టావక్రునియొక్క పూర్వపుణ్యము ఫలించి త్రిపురామహేశ్వరియే ఈతాపసిని పంపి అతనిగర్వమును హరించి తత్త్వజిజ్ఞాసను కలగించి అనుగ్రహించె నని తలంపవచ్చును.

ఈమె కాషాయంబరములు ధరించియున్నట్లు వర్ణింపఁబడినది. అంతమాత్రమున ఈమె సన్యాసిని అని ఆకాలమున స్త్రీలు సన్న్యసించుచుండి రని తలంపరాదు. సీతాదేవియు వాల్మీకియాశ్రమమున కాషాయ వస్త్రములు ధరించియుండె నని రామాయణములో చెప్పఁబడియున్నది. కాని ఆమె సన్న్యాసిని అని చప్పఁబడలేదు. కాషాయవస్త్రములు విరాగమునకు చిహ్నములు. విరాగముకలవారు ఎవరైనను వానిని ధరింపవచ్చును. సన్న్యాసము విశిష్టమైనవ్రతము. అన్నివ్రతములకు అందఱును అధికారులు కారు. వేదధర్మమున సన్న్యాసవ్రతము సర్వోత్కృష్టమైన ధర్మము. దానిని స్వీకరించినతరువాత ఆవ్రతనియమములను పాటింపలేక భ్రష్టత కలిగినచో మహాపాపము సంభవించును. దానిని ఆరూఢపతన మందురు. చెట్టును ఎక్కునప్పుడు చిట్టచివరికొమ్మపైకిపోయి పడినవానికి శరీరమే భగ్నమగును. వాఁడు మరల లేవలేఁడు. క్రిందికొమ్మలనుండి జాఱిపడినచో కొంచెము దెబ్బతగులును. వాఁడు చికిత్సవలన మరల కోలుకొనవచ్చును. శరీరము భగ్నమగుచో చికిత్సకే అవకాశము ఉండదు. అట్లే బ్రహ్మచర్యము మొదలగునాశ్రములలో పతనముసంభవించినచో ప్రాయశ్చితములతో బాగుపడవచ్చును. ధర్మవృక్షమునకు చిట్టచివరికొమ్మ సన్న్యాసవ్రతము. ఆకొమ్మను అందుకొన్నవాఁడు ఆరూఢుఁడు. ఆరోహణ మనఁగా ఎక్కుట. పైకి ఎక్కినవాఁడు ఆరూఢుఁడు. అంత పైకి ఎక్కి పడినవానికి సర్వనాశ##మే సంభవించును. అందువలన వేదధర్మమున సన్న్యాసవ్రతము బ్రాహ్మణులకు అందును పురుషులకే పరిమితమై యున్నది. క్షత్రియాదులకు స్త్రీకు సన్న్యాసాధికారము లేదు. కావుననే శ్రీరాముఁడు శ్రీకృష్ణుఁడు జనకుఁడు భీష్ముఁడు విదురుఁడు మొదలగువారు ఎవరును సన్న్యసింప లేదు, తంగణుఁడు కూడ కోట్లసంవత్సరములు తపస్సు చేయుచున్నను సన్న్యసింపలేదు. తంగణుని భార్య కుమారుఁడు కామక్రోధములకు వశులై వర్తించినా రన్నచో ఇతరులసంగతి చెప్పవలసినది యేమున్నది? సన్న్యాసుల కది పతనమే యగును. ఈకారణముచేతనే వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులు కూడ సన్య్యాసముజోలికి పోలేదు. మహర్షులందఱు వానప్రస్థులు కూడ కాదు, అనేకులు తపస్సులు చేయుచు గృహస్థులుగనే యుండిరి. వశిష్ఠవిశ్వామిత్రాదులు తపస్సులు చేయుచు సంతానమును పొందుచుండిరి. వానప్రస్థులు బ్రహ్మచర్యము నవలంబింపవలె. అందువలన వానప్రస్థమున సంతానము సంభవింపదు.

గృహస్థులైన మహర్షులకు పుత్రికలు కలిగినప్పుడు సాధారణముగా తగినవరులకిచ్చి వివాహము చేయుచుండిరి. ఆకన్యకల మనస్సు యొక్క శరీరములయొక్క దార్ధ్యమును అనుసరించి యోగవిద్యను కూడ నేర్పుచుండిరి. అట్టివారు కొందరు తపస్వినులుగానే కొనసాగుచుండిరి. మఱికొందఱు మహర్షులకు భార్యలై తపస్సులు చేయుచుండిరి అత్రిమహర్షి భార్య, దత్తగురువుయొక్క తల్లి, అనసూయాదేవి, మహా తపస్సు చేసె నని అత్రిమహర్షియే శ్రీరామునకు చెప్పెను. అట్టి తాపస స్త్రీలలో కొందఱు యోగసిద్ధులనే కాక ఆత్మజ్ఞానమును కూడ పొందియుందురు. అష్టావక్రుని జయించినయీతాపసి అట్టి సిద్ధురాలే. అమె. వారందఱు చూచుచుండఁగా గాలిచేత ప్రేరేపితమైన సన్ననిమేఘము వలె, క్షణములో అంతర్థానము నొందెననుట గమనింపఁదగియున్నది. అనఁగా ఆమె సంకల్పమాత్రముననే భౌతికమైన శరీరమును వదలి పెట్టినదన్నమాట. రాజసభకు పోవునపుడు విద్వాంసులు విశేషవస్త్రములను ఆభరణములను ధరించి ఇంటికి వచ్చినతరువాత వానిని తీసి వేసి తేలికగానుండు వస్త్రములతో నుందురు. ఆవస్త్రములు తీసివేయు వఱకు అవి బరువుగా చికాకుగా నుండును. అట్లే అవధూతస్థితికి వచ్చినవారికి, సంవర్తునివంటివారికి వస్త్రములవలె స్థూలశరీరముకూడ బరువుగానే తోఁచుచుండును. అందువలన వారు ఎప్పుడైనను జనులతో వ్యవహరింపఁదలఁచుకొన్నప్పుడు అప్పటికి తగిన శరీరమును వేషమునువలె ధరించి ఆపని ముగిసినంతనే ఆశరీరమును పంచభూతములయందు లీనము గావించి సూక్ష్మములు దివ్యములు నై నశరీరములతో దేవతలవలె యథేచ్చగా విహరించుచుందురు.

ఇట్టియోగసిద్ధులు కలిగియుండుటవలననే ఆతాపసి సౌందర్యము ¸°వనము కలిగియుండియు ఏకాకినిగా రాకపోకలు సలుపఁగలిగియుండెను. మనుష్యులో రాక్షసులో కాముకులై ఆమెను సమీపించినచో ఆమె తక్షణమే అదృశ్యరాలు కాఁగలదు. అట్టి సామర్థ్యములేని స్త్రీలు శీలరక్షణముకొఱకు శరీరభద్రతకొరుకు భర్తనో పుత్రునో ఆశ్రయించి యుండవలయునేకాని స్వాతంత్ర్యముతో వర్తింపరా దనుట స్పష్టము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters