Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

7. కనక ధార

శివగురువు శంకరుల నాల్గవ ఏటనే విదేహముక్తి పొందటంతో వారిని పెంచే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఆర్యాంబ పైన పడింది. మాములుగా గర్భాష్టమాల్లో (ఏడవ సంవత్సరం) ఉపనయనం చేయడం సంప్రదాయమైనప్పటికీ, ప్రతిభాశాలురైన బాలుర విషయంలో ఐదవ ఏట ఉపనీతుని చేయడం శాస్త్ర సమ్మతమే. శంకరులకు ఐదవ ఏట ఉపనయనమయ్యింది. కాలడి గ్రామంలోనే ఉన్న గురుకులానికి విద్యాభ్యాసం కోసం పంపబడ్డారు. చరిత్రానుసారం శంకరుల పూర్వీకులు సంపన్నులే అయినప్పటికీ ఆ రోజుల్లో ఎంతటి సంపన్నులయినా గురుకులాల్లో భోజనానికి కూడా గురువులపై ఆధారపడి వారింటిలోనే ఉండి చదువుకోవాల్సిందే| తాము చెప్పే విద్యకు ప్రతిఫలంగా డబ్బు పుచ్చుకొనే అలవాటు ఆచార్యులకు లేదు. వసతి ఉంటే తమ ఇంట్లోనే భోజనం పెట్టేవారు. లేదా ఈ బ్రహ్మచారులు భిక్షావృత్తితో తెచ్చిన పదార్ధాలను గురుపత్నికి సమర్పిస్తే ఆమె శిష్యులందరకూ వడ్డించేవారు. దీనివల్ల అంటే గురుశిష్యుల మధ్య డబ్బు సంబంధం లేకపోవడం వల్ల శిష్యుడు వినయశీలి అయి ఉండేవాడు. అంతే కాదు. తన భోజనానికి సంఘంపైన ఆధారపడటంతో, సంఘం పట్ల కృతజ్ఞతతో పెద్ద అయిన తరువాత బాధ్యతతో ప్రవర్తించేవాడు. మొన్న మొన్నటి వరకూ గ్రామాల్లో చదువుకొనే విద్యార్థులకు 'వారాలు' ఇవ్వడానికి గృహస్థులందరూ ఎంతో ఆదరంతో ఒప్పుకొనేవారు. (వారం అంటే వారానికికొక రోజు ఆ విద్యార్థికి భోజనం పెట్టడం). గురుకులంలో చేరిన శంకరులు గురువులకు ఆశ్చర్యం కలిగే రీతిలో చతుర్ధశ విద్యలు త్వరితగతిన గ్రహింపనారంభించారు.

ఒకనాడు సంప్రదాయానుసారం భిక్షకై వెళ్ళారు శంకరులు. ఒక పూరిపాక ముందు నుంచొని 'భవతి భిక్షాం దేహి' అంటూ భిక్షను అర్ధించాడు. ఆ ఇంటి యజమాని యాయవారానికి వెళ్లినట్లున్నాడు. ఇంట్లో లేడు. గృహిణి బ్రహ్మతేజంతో మెరిసిపోతున్న బ్రహ్మచారి తన ఇంటి ముంగట భిక్షకై అర్ధించటం చూసింది. అయ్యో! పసి పిల్లవాడు, విద్యార్ధి భిక్షకొస్తే ఇవ్వటానికి ఏమీ లేని దరిద్రం పట్టుకొందే! ఈ పాలుకారే పసికందును ఒట్టి చేతులతో ఎలా పంపను? అనుకొంటూ ఇల్లంతా మూలమూలలా వెతికింది. ఆ ఇంటి యజమాని ద్వాదశి పారణకు ఉంటుందని ఒక ఉసిరికాయ దాచి ఉంచుకొన్నాడట. దానిని తీసుకొని వచ్చి శంకరులకు సమర్పిస్తూ 'నాయనా! నీవు నా ఇంటి ముంగట నిలిచి భిక్ష అడిగితే ఈ ఎండు ఉసిరికాయ తప్ప ఏమీ ఇవ్వలేకపోయానయ్యా!' అంటూ కన్నీళ్ళతో దీనంగా పలుకుతూ జోలెలో ఎండు ఉసిరికాయ వేసింది ఆ మహాతల్లి!

చలించి పోయారు శంకరులు. ఆ అమ్మ కన్నీటిలో, గాద్గదికమైన కంఠస్వరంలో దరిద్రం అనేది ఎంత భయంకరమైనదన్న విషయం అవగతమయింది మహామేధావి అయిన అయిదేళ్ళ బాలశంకరులకు. సమర్ధులు, ప్రతిభాసమన్వితులు కాబట్టి ఎలుగెత్తి లక్ష్మీదేవిని ప్రార్ధించారు. ఆ స్తవము కనకధరాస్తవంగా బహు ప్రసిద్ధము. ఎట్లాంటి శ్లోకాలు అవి. ఒక్కొక్క శ్లోకానికి మళ్లీ అంతంత కనకవృష్టి కురిపించవచ్చు. కరుణారసం నుండి పుట్టిన కవిత్వం హృదయాన్ని కదలిస్తుంది. మహాలక్ష్మి కదిలిపోయింది. ప్రత్యమయ్యింది. 'అవునయ్యా! వీళ్లకు నువ్వు అఖండైశ్వర్యమును ప్రసాదించమంటున్నావు సరే! కానీ వీరి ప్రారబ్ధం చేత మరి వీళ్లు దారిద్య్రాన్ని అనుభవించ వలసి ఉన్నది కదా!' అన్నది లక్ష్మీదేవి. శంకరులు 'అమ్మా! నాకుఎంతో ప్రేమతో, ఆదరంతో ఉసిరికాయ భిక్ష పెట్టిన దానికి ఫలితంగా రావలసిన సంపదనైనా సద్యోఫలితంగా అనుగ్రహంచవమ్మా' అన్నారు. ఒప్పుకొని అమ్మవారు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. విద్యార్ధికి మనఃస్పూర్తిగా భిక్షపెట్టిన దానికి అమ్మవారు నిర్ణయించిన ఫలితం అది. ఆధునికులు ఈ కధను కట్టుకధగా త్రోసివేయవచ్చు. కానీ ఈ కధ వెనుకనున్న ఆ తల్లి ధర్మభావాన్ని, శంకరుల కరుణకు, బ్రహ్మచారికిచ్చిన భిక్షకు మహాలక్ష్మి ప్రతిఫలాన్ని మదింపు చేసిన విధానానికి స్పందించక తప్పదు. ఆ సందప ఈనాటికీ తరతరాలుగా ఆ కుటుంబం అనుభవిస్తోంది. శంకరులు జన్మించిన అత్రిగోత్రజులైన కైప్పల్లి నంబూద్రిల కుటుంబాలూ, కనకవర్షాన్ని కురిపించిన దాదిగా 'స్వర్ణాట్టమాన' అనే వంశనామంతో పిలువబడుతున్న ఆ తల్లి వంశానికి చెందిన సంపన్న గృహస్తులు ఈనాటికీ కాలడి ప్రాంతాలలో ఉన్నారు. కుచేలుని వద్ద గుప్పెడు అటుకులు తిని అనంతమైన సంపదలిచ్చిన కృష్ణ పరమాత్మ, తొండై మండలపు క్షామంలో చిక్కుకొనిపోయి ఆక్రోశించిన ప్రజలపై కరుణతో కనకవర్షాన్ని కురిపించిన కామాక్షీదేవి ఈ కధ వింటుంటే గుర్తుకు రాక మానరు.

సన్యాస పర్యంతము శంకరులింకా కొన్ని మహిమలు చూపారని శంకర విజయాలు చెప్పాయి. తమ అమ్మగారు వృద్ధాప్యం మూలాన నదీస్నానానికి అశక్తులైనందున, నదిని ప్రార్ధించి పెరట్లోకి ప్రవహించేటట్లు చేశారట. ఈ కరుణలనన్నీంటిని మించిన కరుణ ఇంకొకటున్నది. సంసార తాపంలో చిక్కుకు పోయిన, చిక్కుకు పోతున్న భారతీయుల తాపకుపశనార్ధం వారు భాష్య గంగను ప్రవహింపజేశారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page