Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

5. కాలము

మన దేశ చరిత్రలో ప్రధాన వ్యక్తుల సంఘటనల కాలనిర్ణయం చేసినవారు విదేశీ చరిత్రకారులు. విలియంజోన్స్‌ వంటి ప్రాచీన పాశ్చాత్యపండితులు మన సంస్కృతీ సంప్రదాయములపై గౌరవం చూపించినప్పటికీ, మన దేశంలో ఇంగ్లీషువారు స్థిరబడి, రాజ్యాధికారం స్వీకరించి మనలను బానిసలుగా చూడటం ఆరంభించినప్పటినుండీ, అంటే మెకాలే పండితుని తరువాత వారికి మన పురాణములు కట్టుకధలు. దానిలో ఏ మాత్రం నిజం లేదని వారి ఉద్దేశ్యము. వారికి మన సంస్కృతీ సంప్రదాయములపైన గౌరవం లేదు సరికదా తేలికభావం. అటువంటివారు మన దేశచరిత్రను, చరిత్రలోని ప్రధానవ్యక్తులను, వారి కాలములను నిర్ణయం చేశారు. ప్రాచీన పాశ్చాత్య పండితుల ఉద్దేశ్యంలో సృష్టి జరిగి కేవలం ఆరువేల సంవత్సరముల కాలం మాత్రం అయింది. వారి మతగ్రంధములలా చెబుతున్నాయి. భారతదేశంలో చరిత్రనంతటినీ ఈ ఆరువేల సంవత్సరముల కాలంలో ఇమిడ్చి వేయాలి.

అందువలననే మన చారిత్రక పురుషుల పౌరాతన్యాన్ని సాధ్యమైనంత కుదించివేశారు. వారు దేశీయమైన ఆధారాలను పుక్కిటి పురాణాలుగా త్రోసిపుచ్చడంతో, ఆధారాల కోసం బయటవారి వ్రాతలను పరిశీలించవలసి వచ్చింది. అటువంటి వ్రాతలలో గ్రీకులు వ్రాసినవి మొట్టమొదటివి. అలగ్జాండర్‌ దండయాత్ర విఫలమయినప్పటికీ, వారి వలన ఈ దేశపు సంస్కృతి బహుళ ప్రచారము పొందినది. వారి వ్రాతలలో సాండ్రకోటన్‌ అనే చక్రవర్తి ప్రస్తావన ఉంది. సాండ్రకోటన్‌ చంద్రగుప్తమౌర్యుడా లేక సముద్రగుప్తుడా అన్నది వివాదాంశము. వారు సముద్రగుప్తుడని చెప్పుకొంటే మన పురాణాలలో చెప్పబడిన కాలము సరిపోతుంది. అలా అనడానికి అనేక ఆధారములున్నాయి. ఈ రెంటి మధ్య పదిహేను వందల సంవత్సరముల కాలం వ్యత్యాసమున్నది. దీని ఆధారంగా బుద్ధుని కాలం 1500 సం||లు వెనుకకు జరుగుతుంది.

శంకరుల కాలం విషయంలో కూడా ఇటువంటి ప్రయత్నమే జరిగింది. కంబోడియాలో ఒక శిలాశాసనం దొరికింది. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఇంద్రవర్మ అనే రాజు తన గురువు శివసోముడు భగవాన్‌ శంకరుల వద్ద అనేక చదువుకున్న శాస్త్రములలో అద్వైత వేదాంతము లేకపోవడం విశేషం. శివసోముని గురువు ఆదిశంకరులా, తరువాతి కాలపు శంకరులా అన్నది రూఢిగా వారికే తెలియదు.

ఆధునికులు ఇంకా భాష్యంలో శంకరులవారు ప్రస్తావించిన అంశాలు, ఆయన చేసిన స్తోత్రములలో ప్రస్తావించిన చారిత్రకపురుషులు వంటి ఒక ఇరవై ఆధారములతో శంకరుల కాలం క్రీ|శ|| 788 - క్రీ|శ|| 820 గా నిర్ణయించారు. సాంప్రదాయమునకు చెందినవారు ఈ వాదనలను నిర్ద్వందము అర్ధరహితమైనవిగా త్రోసి పుచ్చారు.

పాశ్చాత్య చరిత్రకారులు శంకరపీఠముల అవిచ్ఛిన్న పరంపరను, వారి సాంప్రదాయములో వచ్చిన చరిత్రను నమ్మకపోవచ్చు. అయితే స్వాతంత్ర్యానంతరము కూడా ఆ సాంప్రదాయములను పరిగణలోనికి తీసుకోకపోవడం ఆశ్చర్యం. ప్రతిదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత చరిత్ర పునఃపరిశీలించడం జరిగింది. జరుగుతోంది. మన దేశంలో అటువంటి ప్రయత్నం జరుగలేదు సరికదా ఎవరైనా ఆ ప్రస్తావన తెస్తే వారికి కాషాయం రంగు పులుముతున్నారు. శంకరుల నుండి ఈనాటి వరకూ అవిచ్ఛిన్న శిష్యపరంపరతో వెలుగొందుతున్నాయని నమ్మబడుతున్న పీఠములు నాలుగున్నాయి. బదరిమఠం మధ్యలో కొంతకాలం విచ్ఛిన్నమయినప్పటికీ తిరిగి పునరుద్ధరించబడింది. ఆదిశంకరుల కాలం నిర్ణయం చేయడంలో ఈ పీఠముల సంప్రదాయమును పరిగణలోనికి తీసుకోవడం అత్యంత ఆవశ్యకము.

కంచి, ద్వారక, పూరీ పీఠములవారు, బదరీపీఠమువారు ఆదిశంకరుల జన్మసంవత్సరము క్రీ|పూ|| 508 - క్రీ|పూ|| 509 లుగా తెలియజేస్తున్నారు. తరతరములుగా ఈ సంప్రదాయము వారి వారి పీఠములలో పరిరక్షించబడి తరువాతి వారికి అందజేయబడుతోంది. శృంగేరీ పీఠమువారు మాత్రం క్రీ|శ|| 1954 దాకా శంకరుల కాలం క్రీ|పూ| 44గానూ ప్రస్తుతం క్రీ|శ|| 788 గానూ తెలియజేస్తున్నారు. కంచి కామకోటి పీఠములో 1524-39 లలో పీఠాధిపతులుగా విరాజమానులైన సర్వజ్ఞ శివేంద్ర సరస్వతీస్వామివారిచే వ్రాయబడిన పుణ్యశ్లోక మంజరి, సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామివారిచే వ్రాయబడిన గురురత్నమాలికల ఆధారంగా శంకరులాదిగా ఉన్న పీఠాధిపతుల జనన-సిద్ది వివరాలతో సహా, ఆయా స్వామివారల చరిత్ర సంక్షేపంగా తెలియవస్తోంది.

18వ శతాబ్దం వరకూ కంచిలో ఎంతమంది పీఠాధిపతులున్నారో ద్వారకలో కూడా దరిదాపు అంతేమంది ఉండటం గమనార్హం. వీరి పూర్వపీఠాధిపతులచే వ్రాయబడిన గ్రంధంలో సుధన్వమహారాజుగారిదని చెప్పబడుతున్న తామ్రపత్రపు శాసనమున్నది. అందులో శంకరుల కాలము యుధిష్టిర శకం 2031 వైశాఖ శుక్ల పంచమిగా వివరించబడింది. ద్వారకలో ఇప్పటివరకూ ఎనభై మంది పీఠాధిపతులున్నట్లు వారి పీఠారోహణ సిద్ది వివరాలతో సహా ఆ మఠమువారు తెలియజేస్తున్నారు. ఇక పూరీ పీఠములో నూట నలభైమంది ఆచార్యుల వివరాలున్నాయి.

శృంగేరీ పీఠమువారు చెప్పే శంకరుల కాలం వారి సంప్రదాయానుసారం వచ్చినది కాదు. 1954 వరకూ వీరు శంకరుల కాలము క్రీ|పూ|| 44గా నిర్ణయించారు. క్రీ|శ|| 1844లో తిరుచిరాపల్లిలో దాఖలు చేయబడిన ఒక అప్పీల్‌లో శంకరాచార్యులు అప్పటికి రమారమి రెండువేల సంవత్సరముల పూర్వము విరాజమానులయి ఉన్నారనీ, అప్పటినుండి 1844 వరకూ ఆ పీఠములో అరవై ఎనిమిది మంది ఆచార్యులున్నారనీ, వారి వారి అధిష్టానములకు (సిద్ధి స్థలము) అప్పటికింకా పూజలు జరుగుతున్నట్లునూ శృంగేరీ పీఠ పక్షాన లిఖిత పూర్వకముగా తెలియజేయబడింది. తరువాత ఏ కారణం చేతనో తెలియదుగానీ, అప్పటి పీఠాధిపతుల పూజాపేటిక నుండి గ్రహించ బడినదని చెప్పబడిన పరంపరా విశేషములో ముప్పయి ఇరువురు పీఠాధిపతుల పేర్లు మాత్రమే ఉదహరించబడినాయి. మళ్ళీ 1910 లో కాలడిలో అప్పటి పీఠాధిపతులు వేయించిన శిలాశాసనము (ప్రస్తుతం తొలగించబడినది) ఆదిశంకరుల కాలం అప్పటికి 2000 సం|| పూర్వముగా గుర్తించబడింది. శృంగేరీ పీఠములో సంబంధమున్న కుడలి శృంగేరీ పీఠమువారు కూడా ఆదిశంకరుల కాలం క్రీ|పూ|| 44 గా చెప్పడం గమనార్హం. తరువాతి కాలంలో బహుశః 1967-68లలో అప్పటి పీఠాధిపతులు పూర్వాపరములను పరిశీలించి, ఆధునికులు చెబుతున్న కాలం సరి అయిందనే నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకూ శృంగేరీ పీఠము పక్షమున వచ్చిన పుస్తకాలలో శంకరులకాలం క్రీ|పూ|| 44 గా ఉల్లేఖించ బడి ఉండగా అప్పటినుండి క్రీ|శ|| 788 గా చెప్పనారంభించారు. దీనికి కారణం శంకరుల తరువాత పీఠాధిపత్యం స్వీకరించారని చెప్పబడే సురేశ్వరుల పీఠాధిపత్య కాలం ఏడువందల సంవత్సరాలని ప్రస్తావించబడటం కావచ్చు. ఈ విషయంపై పూర్వపీఠాధిపతులు పదే పదే ప్రశ్నింపబడ్డారు. ఆర్‌.ఎన్‌.ఘోష్‌ ఈ విషయం ప్రస్తావించగా అప్పటి పీఠాధిపతులు శ్రీ శివాభినవ నృసింహభారతీస్వామివారు 'ఆధునిక పురాతత్త్వ శాస్త్రవేత్తల ప్రార్దనానుసారం మా గురువుగారిచే ఈ జాబితా నిర్మించబడింది. శంకరుల కాలం విక్రమ సంపత్‌ 14 గానూ, సురేశ్వరాచార్యుల వారు ఎనిమిది వందల సంవత్సరములు క్రీ|శ|| 757 వరకూ పీఠాధిపత్యం చేశారని అందు ఈయబడింది. మీరు నిజమనో, అబద్దమనో మీ ఇష్టమొచ్చినట్లు నిర్ణియించుకోవచ్చు' అని చెప్పారని జడునాధ్‌ సర్కార్‌ అనే ప్రఖ్యాత చరిత్రకారులు వ్రాస్తారు. వారి తరువాతి పీఠాధిపతులు సురేశ్వరులు మహాయోగి అయినందున ఎనిమిది వందల సంవత్సరములు జీవించడం అసాధ్యమైన విషయమేమీ కాదన్నారని వారి సంభాషణలలో వివరించబడింది. జడునాధ్‌ సర్కార్‌ దశనామినాగాల చరిత్ర అనే పుస్తకంలో '19వ శతాబ్దపు పూర్వమునకు సంబంధించిన ఏ కాగితమూ శృంగేరీ మఠములో పరిరక్షించబడలేదు. మహా అయితే 13వ శతాబ్దపు తరువాతి జాబితా సరి అయినదిగా అంగీరకించవచ్చు' అంటారు. భారతచరిత్ర చతురానన శ్రీ కోట వేంకటాచలంగారు 'శృంగేరీ పరంపర పరస్పర స్పర్ధ గల ఇరువురి మధ్యబడి విచ్ఛిన్నము చేయబడినందున, దానిని, దానిననుసరించువారిని ప్రమాణముగా అంగీకరింప వీలు లేదు' అంటారు. పై చర్చ శృంగేరీ వారు చెప్పే కాలం వారి సంప్రదాయానుసారమైనది కాదని చెప్పడానికి ఉద్దేశించిందే కానీ, పీఠ ఔన్నత్యమును కించబరిచేది కాదని పాఠకులు గుర్తించాలి. ఎతావతా చెప్పవచ్చినదేమంటే ఆదిశంకరుల కాలం క్రీ|పూ|| 509 అనడమే సరి అయినది. శృంగేరీ పీఠపు 32వ ఆచార్యుల వారి జీవిత చరిత్రను ఆంధ్రీకరించిన ప్రముఖ విద్వాంసులు, విమర్శకులు అయిన శ్రీ నాగుపూడి కుప్పుస్వామయ్యగారు శంకరుల కాలం క్రీ|పూ|| 509 అనడానికే ఎక్కువ ఆధారాలున్నాయంటారు. సంప్రదాయ చరిత్రకారులు దీనికి కొన్ని తిరుగులేని

1. అయిదుకు నాలుగు శంకర పీఠముల సంప్రదాయానుసారం శంకరుల కాలం క్రీ|పూ|| 509 గా నిర్ణయించబడింది. ఈ నాలుగు పీఠములు, వేరు వేరు చోట్ల వేరు వేరుగా పరిరక్షించబడిన సంప్రదాయానుసారం ఈ నిర్ణయం చేశారు.

2. ప్రాచీన శంకరవిజయాలలో సూచించిన శంకరుల జననకాలపు గ్రహస్థితి ఆ కాలానికే సరిపోతోంది కానీ వేరే ఏ ఇతర కాలానికి దగ్గరగా కూడా లేదు.

3. పతంజలి చరిత్ర ఆధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ|పూ|| 439గా నిర్ణయించబడింది. ఈ నిర్ణయం శృంగేరీ విరూపాక్ష పీఠమునకు సంబంధించిన విరూపాక్ష పీఠాధిపతులు చేయడం విశేషం.

4. జిన విజయమనే జైన గ్రంధం ఆధారంగా కుమారిలభట్టు కాలం క్రీ|పూ|| 557గా గుర్తించబడింది. కుమారిలులు శంకరుల కంటే 48 ఏండ్లు పెద్ద వారని శంకర విజయాలు చెబుతున్నాయి. దానిని బట్టీ శంకరుల కాలం క్రీ|పు|| 509గా చెప్పవచ్చు.

5. బుహ్లర్‌ సంపాదకత్వంలో వెలువడిన పండిత్‌ భగవాన్‌ లాల్‌ ఇంద్రజీ వ్రాసిన వ్యాసంలో (ఇండియా ఆంటిక్వరీ డిసెంర్‌ 1884, నేపాల్‌రాజు వృషదేవవర్మ బౌద్దాన్ని అభివృద్ధి చేశాడనీ, దాని తరువాత శంకరులు వచ్చి బౌద్దములను ఖండించారనీ వ్రాశారు. వృషదేవవర్మ కాలం క్రీ|పూ|| 546-485 గానూ దానిననుసరించి శంకరుల నేపాళయాత్ర క్రీ|పూ|| 489 గా నిర్ణయించబడింది. శ్రీకోట వెంకటాచలంగారు ఈ విషయంలో మరింత పరిశోధన చేసి శంకరుల కాలాన్ని సోపపత్తికంగా నిరూపించారు. వేంకటాచలంగారు పురాణముల ఆధారంగా బుద్ధునికాలం, నాగార్జుని కాలం నిర్ణయం చేశారు. దానినిబట్టి కూడా శంకరుల కాలం క్రీ|పూ|| 509 అనడం సబబుగా ఉంది.

6. క్రీ|శ|| 788 కి ముందున్నారని ఆధునికులచే ఒప్పుకొనబడిన అనేకుల గ్రంధాలలో (ముఖ్యంగా భవభూతి మహేంద్రవర్మ) శాంకరాద్వైత సిద్ధాంత ప్రసక్తి ఉంది.

7. శంకరుని కాలంలో మగధరాజ్యాన్ని పరిపాలించిన ఆంధ్రహాలుని కాలాన్ని బట్టికూడా శంకరుల కాలం క్రీ|పూ|| 509 అని చెప్పవచ్చు.

8. కాశ్మీరులోని శంకరాచార్య పర్వతంపైనున్న శంకరాచార్య దేవాలయం క్రీ|పూ|| 367లో కాశ్మీరరాజు గోపాదిత్యునిచే కట్టబడింది. దీని పునరుద్దరణ క్రీ|పూ|| 220లోనూ, క్రీ|శ|| 600లోనూ జరిగింది. దీనిని బట్టి శంకరులకాలం క్రీ|పూ|| 367.

9. క్రీ|శ|| 500-515 వరకూ గుజరాత్‌ ను పాలించిన బూటా అనే రాజుకు చెందిన శిలాశాసనం సంజేలి గ్రామంలో ఈమధ్య గుర్తించబడింది. ఆ శాసనం ప్రకారం బూటాయొక్క రాజమాత చేత కట్టబడిన భగవత్పాదాయతనమునకు పరివ్రాజక భోజ్యంగా రెండు గ్రామములు ఇవ్వబడినాయని వ్రాయడింది. (జూలై 31, 2001 భావన్స్‌ జోర్నల్‌) ఈ శాసనం భగవత్పాదులవారు క్రీ|శ|| 500 కన్నా ముందున్నారని స్పష్టం చేస్తోంది. అయితే ఒకే శంకరులు అనేక కాలాల్లో ఉన్నారనడానికి తగిన ఆధారాలు కనిపించడానికి కారణం ఏమిటి? టిబెట్టు బౌద్దగ్రంధమొకటి రెండవ శతాబ్దానికి చెందిన నాగార్జనుని ఒక శంకరుని సమకాలీనునిగా పేర్కొంటుంది. అదే పుస్తకంలో ఇంకొక శంకరాచార్యుడు ధర్మకీర్తి అనే బౌద్ధ భిక్షువుతో వాదనలో ఓడిపోయి గంగాప్రవేశం చేశాడని చెబుతోంది. శంకరాచార్యులవారి గంగాప్రవేశం సంగతి అలా ఉంచి బౌద్దులు కూడా వివిధ కాలాల్లో వివిధ అద్వైత పీఠ ఆచార్యులను శంకరులనే పేరుతో పిలిచేవారని గ్రహించదగింది. శంకరవిజయాలు కూడా చరిత్ర వ్రాసినప్పుడు వేరు వేరు శంకరులొకరుగా పొరబడినట్లు మనకు అవగతమవుతుంది. ముఖ్యంగా కంచి కామకోటి పీఠంలో ఎనిమిదవ శతాబ్దంలో విరాజమానులయిన అభినవ శంకరులను ఆదిశంకరులుగా పొరబడటం జరిగింది.

బౌద్ధంలో కూడా నాగార్జునాచార్యుడనే పేరుతో ఒకరి కంటె ఎక్కువ మందినిపిలిచారు. ఇప్పటికీ వారి ఆచార్యులను లామాలంటారు. అలాగే ఆదిశంకరుల నుండి ఇప్పటివరకూ వారు స్థాపించిన అనేక పీఠాలలో, అనేక కాలాలలో శంకరతుల్యులైన అనేక మంది మహామహులుద్భవించారు. వారినందరినీ శంకరాచార్యులనే పేరుతోనే కదా పిలుస్తున్నాం. మరి ప్రసిద్ధులైన ఆయా శంకరుల ప్రశంస అనేక గ్రంధాలలో, శాసనాలలో ఉండటం సహజం. వేటినీ కట్టుకధలని త్రోసిపుచ్చనక్కరలేదు. అయితే ఆయామహాత్ముల కాలాలను ఆదిశంకరుల కాలంగా పొరబడటం ప్రమాదం. ధీమంతులైన మహాపురుషులు కూడా ఈ విషయంలో ప్రమాదపడినారు. ఆదిశంకరుల జననము క్రీ|పూ|| 509 లో జరిగింది అనేది స్పష్టము.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page