Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

5. అభయస్థితి

అద్వైతమంటే ఏమిటి? దానివలన మనకేమి ప్రయోజనము? అద్వైతం కేవలం తత్త్వం మాత్రమేనా, లేక దానిలో మనకుపయోగించేది ఏమైనా ఉన్నదా? దీనిని గూర్చి విచారించుదాము.

అద్వైతము అనే పదానికి అర్దం - రెండవది లేనిది అని. కానీ ఈ మాట మన అనుభవానికి విరుద్ధంగా ఉంది. మన చుట్టూ సహస్రాధికముగా వస్తుజాలమున్నప్పుడు రెండవది లేదు అని చెప్పడం కుదరదు. అలా రెండవ వస్తువు లేదని నిరూపించబడినందున మనకు కలిగే లాభ##మేమిటి?

మనం ఎందుకు ఇంత శ్రమపడుతున్నామని యోచిస్తే, మనం పడే శ్రమ అంతా దుఃఖ నివృత్తికీ, సుఖప్రాప్తికీ అని తేలుతుంది. మనకు కలిగే సుఖం తాత్కాలికమైనది కాక శాశ్వతంగా ఉండాలంటే అది అద్వైతం వల్లనే సాధ్యం. మనకున్న క్షుత్పిపాసలు, లాభనష్టములు, సుఖదుఃఖములు అన్నిటికీ కారణం ద్వైతమే. ఈ ద్వంద్వములకు మనం అతీతంగా ఉండాలి అంటే దానికి సాధనము ఒక్క అద్వైతమే! ఈ ద్వంద్వములన్నీ శరీరానికి సంబంధించినవి. మనకు ఈ దేహము ఉన్నందువలననే క్షుత్పిపాసలు, సుఖదుఃఖములు, జరాజన్మక్లేశములు కలుగుతున్నవి. ఈ దుఃఖములు మనకు వద్దనుకుంటే మనకు ఈ దేహం ఉండరాదు. మనం విదేహులం కావాలి.

అసలు ఈ దేహం ఎలా సంక్రమించింది. మనం చేసిన పాపపుణ్యముల వలన అని చెప్పుకోవాలి. ఆత్మకు పాపపుణ్యముల అనుభవం లేదు. ఈ అనుభవం దేహానికే. ఈ దేహ భ్రాంతి ఉన్నంతవరకూ, సుఖదుంఖానుభూతులు తప్పవు. భగవంతుడు మనకు ఈ దేహమును ఇచ్చి రక్షణా శిక్షణాదులు చేస్తున్నాడు. దీనినే సంసారమంటున్నాము. ఈ సంసారవలయం నుండి తప్పించుకోవాలంటే దేహం ఉండరాదు. మనం చేసే కర్మ వల్ల మనకు ఈ దేహం సిద్దిస్తోంది. ఈ కర్మబంధం తొలిగిపోవాలంటే, మనం పాపకర్మ చేయరాదు. ఈ పాపకర్మలకు కారణం ఆశ. ఒక వస్తువును చూచినప్పుడు దానిపై మనకు ఆశ కలుగుతుంది. ఆ వస్తుప్రాప్తికి ఎన్నో కష్టాలు పడతాం. పాపం చేయడానికి వెనుకాడం. కాబట్టి ఈ ఆశలన్నీ అణిగితే మనకు ఆశ, కోరిక దేనిమీద కలుగుతుంది? మనకన్నా భిన్నమైన వస్తువుపైననే మనకు కోరిక కలుగుతుంది. అన్నీ మనమేననుకొన్నప్పుడు మనకు కోరికే జనించదు. రాగద్వేషములు, ఇష్టానిష్టములు అన్నీ ద్వైతమూలకములు, మన చిత్తవికారముల కన్నిటికీ కారణము ద్వైతమే. 'ద్వితీయాద్వై భయం భవతి' అని ఉపనిషత్తు ఉద్భోధిస్తోంది. మనకన్నా భిన్నమైన వస్తువున్నదను కొన్నప్పుడే మనకు భయం కలుగుతుందని దాని భావం. మరి ఈద్వైత భ్రమ పోయి దాని వలన సంభవించే అరిష్టాలు తొలగడానికి మార్గమేమిటి? మనం అన్నిటినీ ఈశ్వరస్వరూపంగా చూసినామంటే, ఈ భయానికి, ఇష్టానిష్టాలకు, రాగద్వేషములకు తావుండదు. సర్వత్ర ఈశ్వర దర్శనం చేసే వేదాంతులు, జ్ఞానులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు.

మనకు కనబడే వస్తువులన్నీ అసత్యములు. వీని వెనుక ఆధారంగా ఉన్నదేమో సత్యం. ఆ సత్యం ఒక్కటే. ఈ సిద్దాంతమే అద్వైత సిద్దాంతము. దేనిని మనం సత్యం అంటున్నామో అదే బ్రహ్మము. అదే ఆత్మ. లోకవ్యవహారంలో ఈశ్వరుడని పిలుచుకొంటున్నాము. ఇక్కడ బ్రహ్మనిర్గుణము, ఈశ్వరుడు సగుణము అనే విభాగాన్ని నేను చెప్పడం లేదు.

అందుచేత మనము సర్వత్ర ఈశ్వర దర్శనం చేయాలి. మనయందు ఈశ్వరభావమును పెంపొందించుకోవాలి. ఇట్టి దృష్టి జ్ఞానదృష్టి. ఈ జ్ఞానదృష్టి మనకలవడితే అద్వితీయమైన ఆనందానుభవం మనకు కలుగుతుంది. ఐక్యభావం సిద్దిస్తుంది. ఈ దేహం లేకపోతే దుఃఖం ఉండదు. కాబట్టి దుఃఖనివృత్తికి అద్వైతమే మందు. ఉన్నదానిని ఉన్నట్లుగా చూడటమే అద్వైతము. అన్నిటినీ భగవన్మయంగా, చిన్మయంగా దర్శించడమే అద్వైతము. శాంతీ, సౌఖ్యము మనకు సర్వకాముల యందూ శాశ్వతముగా ఉండాలనుకొంటే దానికున్న ఒక రాజమార్గము అద్వైతము. చూచేదంతా ఈశ్వర స్వరూపమనే జ్ఞానం మనలో రూఢి కావాలి.

సత్యమైన వస్తువు ఒకటే ఉండగా మన కన్నులు నానా వస్తువుల రూపంలో ఉన్న కల్లను మాత్రం చూస్తున్నాయి. ఈ లోకమంతా ఒకే వస్తువు. అదే సత్యమని అద్వైతం చెబుతోంది. ఈ నానాత్వము నిరసిస్తే మిగిలేది అద్వైతమే. అంతా ఈశ్వరుడే అయిన పక్షంలో మనం మాత్రం వేరే ఏదో ఎట్లా అవుతాం. మనలను

జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే మూడు అవస్థలున్నవి. జాగ్రదావస్థలో అనేక కార్యములు చేస్తున్నాం. ఈ కార్యాలు మనకు శ్రమను కలిగిస్తాయి. శ్రమ నివారణకు నిదురబోతున్నాము. అదే సుషుప్తి. ఈ రెంటికీ మధ్య స్వప్నావస్థ ఉన్నది. ఈ స్వప్నం ఎందుకుంది? ఈశ్వరుడు అద్వైతబ్రహ్మగా ఉంటున్నాడు. అంతా ఆత్మస్వరూపమే అని చెప్పడానికే ఈశ్వరుడు స్వప్నమును కల్పించాడు. స్వప్నంలోనూ సుఖదుఃఖాను భూతులున్నాయి. ఆ స్వప్నం చెదిరిపోతే ఏదీ లేదు. ఆ స్వాప్నిక శరీరమూ నశిస్తోంది. నేను కల కన్నాననే ఎఱుక మాత్రం మిగులుతోంది.

నానాత్వదృష్టిద్వైతం. అద్వైతంలో నానాత్వం లేదు. చూస్తున్నానని చెప్పడం ద్వైతమే. ద్వైతానుభవం మనకు అనుదినమూ అనుభవములోనిది. అద్వైతం అద్వైతం అంటూనే ద్వైత భ్రమలో పడి కలలు కంటున్నాం. తాత్త్వికంగా మనం అద్వైతులం. అనుభవంలో ద్వైతులం. శాస్త్రమూలంగా తెలుసుకొనేది అద్వైతం. కంటితో చూసేదంతా ద్వైతం.

ద్వైతము, అద్వైతము అనే పదప్రయోగములు ఉపనిషత్తులలో ఉన్నాయి. మాండూక్యోపనిషత్తు ప్రణవమును 'శాంతం శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మావిజ్ఞేయః' అని చెబుతోంది. ఈ అద్వైతము శాంతమూ, మంగళమూ, సుఖమూ, జాగత్సప్నాద్యతిరిక్తమూ - అదే ఆత్మ. దానినే మనము తెలుసుకోవాలి.

కాశీలో గంగ ఉన్నది. మనం కాశీకి వెళ్ళి గంగలో మునిగితే కానీ మన మాలిన్యములు తొలగవు. నోటితో 'అహం కాశీ గమిష్యామి' అని చెబితే దానికెంత ఫలితమో అంత ఫలితమే లభిస్తుంది కానీ, గంగకెళ్ళి స్నానం చేసిన ఫలితం లభించదు కదా! వేదములు అద్వైత స్థితిని మనోవాగతీత స్థితి అని చెబుతున్నాయి. 'యతోవచోనివర్తంతే అప్రోష్య మనసా సహ' అని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది.

పరమాత్మను తెలుసుకోవడమంటే - తెలుసుకొనే వాడొకడూ, తెలియబడే పరమాత్మవేరు అనే ద్వైత ప్రత్యయం ఏర్పడుతోంది. అందుకే కేనోపనిషత్తు - యన్మనసా నమనుతే యేవా హుర్మనోమతమ్‌ - దేనిని మనస్సు చేత తెలుసుకొనజాలడో, దేని చేత మనస్సు తెలుయబడుతున్నదో - అని వివరిస్తోంది. నాకు తెలుసు అన్నావాడు దానినెరుగడు. నాకు తెలియదు అనినవాని అనుభవంలో అది తెలియబడుతోంది. తెలియడం లేదంటే అది మరి తెలియబడే వస్తువు కాదు. అది స్వప్రకాశకం. ఈశ్వర స్వరూపం. ఒక దీపమును చూడడానికి వేరొక దీపం కోసం ప్రయత్నించడం బుద్ధి తక్కువ కదా!

ఇంత వరకూ మనం చర్చించి తెలుసుకొన్నది సత్యమొక్కటే అని. ఆ సత్యమే ఈశ్వరుడు. వాసనాబలం చేత మనము అన్నిటినీ వేర్వేరుగా చూస్తున్నాం. అన్నిటికీ ఒకటిగా చూచేది అద్వైత దృష్టి. దీనికి శాస్త్రపరిచయం. మనన నిధి ధ్యాసలు తోడ్పడే సాధనాంగములు. శృతిస్మృతి పురాణ పఠనం, ఆలయదర్శనం, ఉపాసన, పరోపకారము, త్యాగము, ఇవన్నీ అద్వైతాచరణమునకు అంగికములు. స్థిరమైన ఆనందం కావాలంటే త్యాగం అవసరం.

'నా రాజ్యం విదేహమే కాదు. నీకు నన్ను కూడా ఇచ్చుకొంటున్నాను' అని జనకుడంటున్నాడు. ఇదే అద్వైతం. ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ మనకు అద్వైత వాసన కలుగదు. అద్వైతమంటే అభయస్థితి. ఇది అంత సులభం కాదు. ఈ జ్ఞానం దుర్లభం. ఏ ఇద్దరికో ముగ్గురికో లభిస్తుంది. ఆ అద్వైతస్థితి మనకు కలగాలని మనం ఈశ్వరుని ప్రార్థించాలి.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page