Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

3. అద్వైతం

అద్వైతమంటే రెండవది లేని స్థితి. పరమాత్మ అంటే పూర్ణవస్తువు. జీవాత్మ పరమాత్మ విడివిడిగా ఉన్నాయి అని చెబితే ఆ పూర్ణవస్తువుకు లోపమేర్పడుతుంది. వేదము 'ఇదం సర్వం పురుష ఏవ' అని ఉద్ఘాటిస్తోంది. ఉపనిషత్తులు జీవబ్రహైక్యమునే చాటుతున్నాయి. ఈ విషయం మనం తాత్త్వికంగా విచారిస్తే గ్రహించగలము. పృధివ్యాది పంచభూతములు, శక్తియొక్క స్వరూప భేదములే యని భౌతికశాస్త్రము కూడా చెబుతోంది.

మనము కార్యప్రపంచములో మునిగి యున్నప్పుడు, అబేధస్థితిని పాటిస్తే, కార్యములు నడవవు కదా! కార్యములు నడవటానికి భేదబుద్ధి అవసరం అయినప్పటికీ, కార్యావస్థలో కూడ అన్నిటినీ ఆత్మస్వరూపంగా ఎరిగి, ఒకే చైతన్య స్వరూపం వివిధంగా కనిపిస్తోందనే సత్యమును జ్ఞాపకంలో ఉంచుకోవాలి.

మన మనోవృత్తులే కార్యరూపాన్ని ధరిస్తున్నాయి. 'నహికశ్చిత్‌ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్‌' మనస్సు ఒక్క క్షణం కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేదు. మనోవృత్తులు ఉపశమిస్తే కానీ కార్యప్రపంచము అణగదు. అద్వైతము అనుభవంలోనికి రావాలంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి.

మనస్సు అణగాలంటే కొన్ని విధులు పాటించాలి. అవి వైదిక విధులు. విధి, కర్మ ఇవన్నీ ద్వైతభూమికకు చెందినవే. ఈ ప్రపంచమును సృష్టించిన ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి పరమేశ్వరుడు. అతడు కరుణామూర్తి. సచ్చిదానంద మూర్తి. మన కొరతలు తీరవలెనంటే ఆ కరుణామూర్తిని ఆశ్రయించాలి. ఇలాంటి ఉపాసనలన్నీ సగుణభూమికి చెందినవే! అద్వితీయ నిర్గుణపరమాత్మను మనస్సులో ధారణ చేయడం కుదరని పని.

గీతలో భగవానుడు -

భక్త్యా మామభి జానాతి యావాన్‌ యాశ్చాస్మితత్త్వతః

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశ##తే తదనంతరమ్‌

అని అర్జునునకు బోధిస్తున్నాడు. జ్ఞాన రూపమగు భక్తి చేతనే భగవంతుని సవిశేష, భగవంతుని ఆత్మరూపమున భక్తుడు దర్శింపగలడు. అంతేకాదు. ఆ యదార్ధస్వరూప జ్ఞానముతో బాటు వెను వెంటనే అతని యందు ప్రవేశింపగలడు. భగవంతునికి భిన్నముగా ఉన్నప్పుడే మనము అతని యెడ భక్తి నెరపగలము. అతని యందు ప్రవేశించిన పిదప అతడు వేరు, మనము వేరు అనే ఆభాస తొలిగిపోతుంది. అద్వయులమైపోతాము.

అద్వైతశాస్త్రము కూడా 'ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసనా' అని చెబుతున్నది. ఈశ్వరానుగ్రహముంటే కానీ మనకు అద్వైతవాసనా, దాని యందు రుచీ జనించవు. అంతవరకూ ఈ మాయాప్రపంచంలో మనము జీవాత్మ అతడు పరమాత్మ లేనే బేదబుద్ధితో భ్రమిస్తాము.

పరమాత్మ తప్ప వేరేది ఏదీ లేదు అనేది 'అద్వైతము'. ప్రాణశక్తి, జీవాత్మ అని ఉన్నప్పటికీ ప్రాణమునకు ప్రాణముగా అంతర్యామిగా అతడున్నాడనేది 'విశిష్టాద్వైతము'.

అతడు వేరు మనము వేరు. అతడే మనలను ఇలా ఆడిస్తున్నాడనేది ద్వైతము. మనకు సాధారణంగా అనుభవంలో ఉన్నది ద్వైతమే. అతడి అనుగ్రహ భిక్ష కోరుతూ అతనిని ఉపాసిస్తే, మనము తెలుసుకొనవలసినది ఏదో దానిని అతడు మనకు తెలియజేస్తాడు. సర్వకార్యములూ ఈశ్వరార్పణం కావాలి. సర్వమూ ఈశ్వరుడే. వాసుదేవ స్సర్వం అన్న భావన రూఢి కాగానే ఒక ఆనందం, పూర్ణత తనకు తాను సిద్ధిస్తుంది. మనం గ్రహించవలసినదేమంటే, జ్ఞానసాధన ప్రణాళికలో ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు మూడింటికీ ప్రయోజనమున్నది. శంకర భగవత్పాదులవారు శివానందలహరిలో:

నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా

పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్‌

సదా తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ

విహారాసక్తం చేద్దృదయ మిహకింతేన వపుషా

నరత్వమో, దేవత్వమో, మృగత్వమో, చివరకు కీటకమైన సరే ఫరవాలేదు. నా దేహం ఏదయితేనేమి? జన్మ ఏదైనా సరే, ఆ జన్మలో నీ పాదాబ్జస్మరణ సుఖముంటే చాలు. నేను పునర్జన్మ అక్కరలేదనీ కోరుకోవడం లేదు అని ప్రార్థిస్తారు.

మనం భగవంతుని ఫలానా వస్తువు కావాలని కోరుకోనక్కరలేదు. 'ఆయనకేది ఇష్టమో దానినే అనుగ్రహించనీ' అనే భావన పెంపొందించుకోవాలి. అది ద్వైతమో, విశిష్టద్వైతమో, అద్వైతమో ఏదైనా సరే. మనం చూపే భక్తి మాత్రం మనకు పరమానంద దాయకంగా ఉండాలి. భగవంతుని పూర్తిగా నమ్మి అతడికి సర్వమూ అర్పించి అతడు దీనిని అనుగ్రహించినా సరే అనే చిత్తవృత్తిని 'ప్రపత్తి' అంటారు. ఈ ప్రపత్తిలో రెండు రకాలు. తల్లి కోతిని పిల్లకోతి బలంగా తన చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. తల్లికోతి ఇలా హత్తుకున్న పిల్లతో సహా ఒక చోటునుండి వేరొక చోటుకు పోతూ ఉంటుంది. దీనిని మర్కట కిశోర న్యాయమంటారు. పిల్లి తన పిల్లను నోటితో దంతము క్షతి కలిగించని విధంగా పట్టుకొని ఒక చోటు నుండి వేరొక చోటుకు పోతుంది. దీనిని మార్జాలకిశోర న్యాయమంటారు. పిల్లకోతి తల్లిని తన ప్రయత్నం చేత పట్టుకొంది. పిల్లి పిల్ల భారమంతా తల్లిపై వదిలి తానే ప్రయత్నం చేయకుండా నిశ్చింతగా ఉంటుంది.

మర్కట కిశోర న్యాయంలో పురుషకారము ఉంది. మార్జాల కిశోరన్యాయములో లేదు. ఈ రెండు విధాల ప్రపత్తులలో ఏ మార్గాన్ని అనుసరించినా తల్లి శిశువును రక్షించినట్లు భగవంతుడు మనలను రక్షిస్తాడు. సర్వమూ నేను ఈశ్వరునికే అర్పించాననే భావన ఉండాలి. భగవద్గీతలో పరమాత్మ 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ' అని చేసిన బోధ కూడ ఇదే.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page