Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

శంకరాద్వైత సిద్ధాంతము (కంచి మహాస్వామివారి ప్రసంగములు)

1. శంకర సంప్రదాయము

ఆదిశంకరులు అద్వైతమతమును స్థాపించారు. వారి అనుయాయులు స్మార్తులంటారు. కానీ ఈ తరమువారికి స్మార్తులనే పేరు తెలియని స్థితి ఏర్పడింది. అంతేకాదు శంకరులు ఉపాసనకు ఒక్క దేవతామూర్తినే నిర్దేశంచక సకల దేవతలను సమానముగా చూడవలెనని బోధించారనే విషయం చాలా మంది అద్వైతులకే తెలియకుండా పోయింది.

సనాతన ధర్మపరులైన వైదిక మతానుయాయులను స్మార్తులని వ్యవహరించేవారు. స్మృతులను అనుసరించేవారు స్మార్తులు. స్మృతులనగా ధర్మశాస్త్రములు. వేదములో ప్రకీర్ణములైయున్న ధర్మములను క్రోడీకరించి, తల్లి గర్భమును జీవుడు ప్రవేశించినది మొదలు శిశుజననము, శైశవము, విద్యాభ్యాసము, వివాహము, పుత్రోత్పత్తి, మరణము, దహనము వరకు పాటించవలసిన విధులను చెప్పేవి ధర్మశాస్త్రములు.

ధర్మశాస్త్రములలో ఒక విష్ణువునో, శివునినో ఆరాధించవలెనన్న నిబంధన ఏదీ లేదు. అన్ని దేవతామూర్తులూ సమాన గౌరవాధిక్యతలు కలవే. ఏ దేవతామూర్తిని ఉపాసించిననూ తప్పులేదు. సకల దేవతలూ ఒక్కటేనన్న జ్ఞానముతో ఉపాసించుట విశేషము. సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు అనే అయిదు ప్రధానదేవతామూర్తుల ఉపాసనను పంచాయతనమని అంటారు. పంచాయతన పూజ స్మార్తులకు నిర్దేశించిన ఉపాసనా విశేషము. కొందరకు శివుడు ఇష్టదైవముగానూ, మరి కొందఱకు విష్ణువు ఇష్టదైవముగానూ ఉన్నప్పటికీ ఆ కారణుచేత వారు తమను శైవులనిగానీ, వైష్ణవులని గానీ వ్యవహరించుకొనక స్మార్తులని పరిగణించుకొని ఏకతా భావంతో మెలిగేవారు. అందరూ వేదవిహితమైన కర్మానుష్టానాన్ని ఆచరిస్తూ ఉండేవారు.

వేదములలోనూ, ధర్మశాస్త్రములలోనూ ప్రతిఒక్కడూ యజ్ఞకర్మానుష్టానపరులై, హోమ భస్మమును నుదుట ధరింపవలెనని చెప్పబడి ఉన్నది. మాధ్వులూ, వైష్ణవులూ కూడా హోమము చేస్తే హోమభస్మమును ధారులను మాధ్వులనీ, భస్మధారులను శైవులనీ పిలిచే వాడుక ఉన్నప్పటికీ - నిజమునకు వీరందరూ స్మార్తులే. స్మృతులను అనుసరించేవారే. నిజానికి భస్మధారణకు శైవమత సంబంధము లేదనీ, వేద సంబంధమేననీ మనము గ్రహించాలి. భస్మధారణకు వేదములో ప్రత్యేకముగా ఒక మంత్రము చెప్పబడింది. పాంచరాత్రదీక్షలో వైష్ణవులు హోమభస్మమును ధరింపవలసి ఉన్నది. సన్యాసులకు యజ్ఞాధికారము లేనందున హోమము చేసి భస్మమును ధరించనప్పటికీ, భస్మమునే ధరించుచున్నారు.

శంకరుల అవతరణ సమయమున సనాతనమైన ఈ స్మార్తమతముతో పాటు డెబ్భైరెండు దుర్మతములు ఉన్నట్లు శంకర విజయములు చెబుతున్నాయి. వైదికమతమునకు భిన్నముగా ఆ కాలమున ఉన్న మతములలో బౌద్దము ముఖ్యమైనది. బుద్దుడు వైదిక మతమును ప్రతిఘటిస్తూ యజ్ఞయాగాది కర్మానుష్టానములు చేయనవసరం లేదని బోధించాడు. ఈశ్వరుని గురించి ఆయన ఏమీ చెప్పనందువల్లన బౌద్దములో భక్తిలేదు. బుద్దుని కాలంలో కర్మానుష్టానపరులైన స్మార్తులు చాలామందే ఉండేవారు. వారంతా అద్వైతులు కారు.

పూర్వమీమాంసకులని పిలవబడే వీరు వేదప్రమాణమందు ప్రగాఢమైన విశ్వాసమున్నప్పటికీ - ఈశ్వరుడు ఉంటేనేమీ, లేకుంటేనేమి, మనకు వైదిక విహిత కర్మలున్నవి. వైదిక కర్మానుష్టానమే శ్రేయోదాయకమని విశ్వసించి - ఈశ్వరాస్తిత్వము గురించి పెద్దగా పట్టించుకోలేదు. వీరికి కర్మ మొక్కటే ప్రధానము. భక్తి లేదు. జ్ఞానము లేదు. అందువల్ల ధ్యానము, ఆత్మవిచారణం, సత్యాన్వేషణము, కర్మసన్యాసము, నిరంతర పరమాత్మచింతన ఇత్యాది లక్షణములు కలిగిన అద్వైతమునకు వీరు ప్రతిద్వందులు. కుమారిలభట్టు ఈ పూర్వమీమాంసకులలో ముఖ్యులు. వీరు బౌద్ధమును తీవ్రముగా ఖండించి వేదకర్మానుష్టాన ఆచరణలకు పాటుపడినవారు.

బౌద్దములో ఈశ్వర ప్రశంసగానీ, భక్తిగానీ లేదు. ఈ వెలితిని ఉదయనాచార్యలువారు ఖండించారు. వీరు తర్కశాస్త్ర పారంగతులు. యుక్తిమూలకముగా లోకవ్యవహారమునకు ఈశ్వరుడు అవసరమని వీరు విస్తారముగా

బ్రిటిష్‌ ప్రభుత్వమువారు వారి విద్యాప్రణాళికలో బుద్దుని ప్రశస్తముగా వివరించినా ఉదయనులు, కుమారిలుల వంటి సనాతన ధర్మసంస్థాపకుల పేర్లు పూర్తిగా విస్మరించారు. కారణము వారి సనాతన ధర్మవ్యతిరేకతే! వేదప్రమాణమును, కర్మానుష్టాన ప్రాముఖ్యతను బలపరచిన కుమారిలభట్టు, నిరీశ్వరవాదమును ఖండించిన తర్కశాస్త్రముల అనంతరము శ్రీశంకరభగవత్పాదులు అవతరించి వైదికమార్గ పురస్సరమైన జ్ఞానమార్గమును బోధించారు.

విశిష్టాద్వైతులూ, ద్వైతులూ బౌద్దమునకు, అద్వైతమునకు అంతగా భేదములేదనీ భగవత్పాదుల వారు ప్రచ్ఛన్న బౌద్దులనీ నిరసించడం కద్దు. బౌద్దమూ, అద్వైతము ఈ లోకము మాయ అని చెప్పడమూ, అద్వైత ఉన్నత జ్ఞాన భూమికలలో ఈశ్వరోపాసన విరమింపబడుటయూ వారలా అనడానికి కారణమయివుండవచ్చును.

శంకరులు ఈ ప్రపంచము మిథ్య అనినప్పుడు బౌద్ధులవలె శూన్యమని చెప్పలేదు. లోకము తాత్కాలిక సత్యమే కానీ పారమార్థిక సత్యము కాదని వారు చెప్పినది. మాయ, శూన్యము రెండూ ఒకటి కాదు. ఈ మాయాప్రపంచము శూన్యములో కలిసిపోవుట లేదు. ఈ లోకము పారమార్ధిక సత్యము కాదని తెలుసుకొన్నప్పుడు, ఈ మాయాప్రపంచమూ, మనమూ, పరమసత్యమునూ పూర్ణమునూ అయిన బ్రహ్మమే అని తెలుసుకోగలమని శంకరులు బోధించారు.

బౌద్దులు చెప్పే మోక్షము అనగా నిర్వాణము, ఏమీ లేని శూన్యస్థితి. కానీ శంకరుల పరిభాషలో అద్వైతము లేదా మోక్షము పరమసత్యము, పరమానందము, పరమ జ్ఞానస్థితి - అనగా సచ్చిదానందమైన పూర్ణస్థితి. ఈ రెండూ ఒక్కటే అనడం సరికాదు.

భగవత్పాదుల విశిష్టత ఏమిటి? వారు అన్ని మార్గములూ, అన్ని సిద్దాంతములూ ఆయా స్థితులలో (Levels) సరియైనవేననీ, ఇవన్నీ చేరి పరమోన్నత స్థితిలో జ్ఞానపర్యవసానములౌతాయనీ తీర్మానించారు. బౌద్దులు కర్మకాండని పూర్తిగా నిరసించినవారు. భగవత్పాదులు వైదిక మార్గమును, వైదిక కర్మములనూ పూర్తిగా, విశేషముగా ఆదరించినవారు. వారు సాధన పంచకములో కర్మానుష్టానము విధి అని బోధించారు. జ్ఞానోపలబ్ధికి మనస్సు ఏకాగ్రం కావాలి. దీనికి భక్తీ, ఉపాసనము అత్యవసరములయిన అంగములు. కర్మానుష్ఠానము వలన చిత్తశుద్ది కలుగుతుంది. అంటే మనస్సు నిర్మలమవుతోంది. అట్టి నిర్మలమైన మనస్సు పరమసత్యమైన జ్ఞాన వస్తువుతో తుట్ట తుదకు లయమవుతుందని ఆచార్యులవారు సోపాన ప్రక్రియలో బోధించారు.

పూర్వమీమాంస కర్మ ప్రతిపాదకము. ఈశ్వరాస్తిత్వమును నిరూపణ చేయునది నైయాయికమతము. నిరీశ్వరమైన బౌద్దము ధ్యానవిచారములను ప్రోత్సాహించునది. ఇవన్నీ భగవత్పాదుల అద్వైతములో చేరియున్నవి. ఈ మతములన్నీ పాక్షిక సత్యములే. పూర్ణసత్యస్పోరకములు కావు. ఆచార్యులవారికి వైదిక కర్మ సమ్మతమే. కానీ పూర్వమీమాంసకులకు కర్మ ఒక్కటే చాలు. భక్తి జ్ఞానములు వారికి పట్టవు. కర్మ జడ వస్తువు. అది స్వయముగా కర్మఫలమును ఇవ్వజాలదు. కర్మఫలప్రదాత ఈశ్వరుడు. ఈ లోకవ్యాపారములను సమీక్షించు కర్మాధ్యక్షుడాయన. లోక క్షేమము కోసమే కర్మ ఏర్పడి ఉంది. నిష్కామ కర్మనాచరించే మనము కర్మఫలమును ఈశ్వరార్పణము చేయాలి. ఇట్టి కర్మఫల త్యాగము వలన మనకు చిత్తశుద్ది అని వారు మీమాంసకులకు చెప్పారు.

ఈశ్వరాస్తిత్వమును యుక్తి యుక్తముగా నిరూపించిన చాలదు. ఆ జ్ఞానము అనుభవసిద్ధము కావాలి. ఈశ్వరాన్యమైనది ఏదీ లేదనే నిశ్చయానుభవము కలిగితే కానీ అద్వైతానుభూతి కలుగదని నైయాయికులకు వారు బోధించారు. ఈశ్వరభక్తికి చరమావస్థ అద్వైతమే అని వారు ఉద్ఘాటించారు.

'మనమెవరము? దుఃఖమునకు కారణమేమిటి? సత్యవస్తువు అనగా ఏది?' అని అశాపాశములను నిరసించి సంతతము విచారణము చేసి ధ్యానమగ్నులమైనచో బోధిసత్వునకు కలిగినట్లు మనకు కూడా జ్ఞానబోధ కలుగవచ్చు. బుద్దుడు నిర్యాణమును నిర్వచించలేదు. ఈశ్వరుని ఆక్షేపించనూ లేదు. ఆయనకు అద్వైతానుభవము కలిగి యుండిననూ కలిగి ఉండవచ్చును. కానీ ఆయన ఆ అనుభవమును విశదీకరించలేదు... అని కూడా చెప్పవచ్చును. అయితే అందరికీ ఇలా విచారణ, ధ్యానమూ వీలవుతుందా? దానికి పక్వత అవసరం లేదా? అటువంటి పరిపక్వత కోసమే వైదిక ధర్మములో కర్మోపాసనాదులు ప్రాధమిక దశలో విధించబడినవి. వైదిక కర్మాచరణము మూలముగా చిత్తశుద్ధి, ఏకాగ్రత కలిగి మనోధారుఢ్యము ఏర్పడి జ్ఞన విచారణకు సాధకుడు అధికారి కాగలడు. ఇట్టి పక్వత కొఱకే వర్ణాశ్రమ ధర్మములు వేదములచే స్మృతులచే విధించబడినవి. ఇవి అధికారి భేదముననుసరించి ఉన్నవి. కానీ బౌద్ధము అధికారి బేధమును, కర్మ ఉపాసనాదులను అంగీకరించనందున అందరూ బుద్దులు కాలేరు సరికదా లోక వ్యవహారములకు హాని కలుగుతున్నదని భగవత్పాదులవారు బౌద్ధమును ఖండించారు. పూర్వమీమాంసకులు, నైయాయికులు ప్రారంభించిన బౌద్ధమత ఖండనము ఆచార్యులవారు పూర్తి చేశారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page