Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

20. కాంచీపురంలో ఆదిశంకరులు

సంపూర్ణ విజయయాత్ర ముగించుకొనిన శంకరులు కాంచీపురం విచ్చేశారు. కంచి పొలిమేరలలో రాజసేన మహారాజు శంకరులకు రాచమర్యాదలతో స్వాగతం పలికారు. ఏకామ్రనాధుని, కామాక్షిని, వరదరాజస్వామిని సేవించిన శంకరులు సర్వతీర్ద సరస్సు వద్దగల విశ్వేశ్వరాలయములోని ముక్తి మంటపములో బస చేశారు. శంకర చరిత్రలో అధికభాగం చరిత్రలు దిగ్విజయ యాత్రానంతరము తమ తుదినాళులు ఆత్మారాములై గడపటానికి శంకరులు స్వచ్ఛందంగా కాంచీపురం విజయం చేశారని తెలుస్తోంది. ముక్తి మంటపము వంటిది కాశీలోనూ, పూరీలోనూ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. శంకరులు ముక్తి మంటపంలో బస చేసిన విషయం జ్ఞప్తిగా కామాక్షీదేవాలయంలో శంకరుల అర్చామూర్తి ఈనాటికీ వ్యాసపూజనాడు ముక్తిమంటపానికి తీసుకొని వెళ్లబడుతుంది.

శంకరుల ఆదేశానుసారం రాజసేనమహారాజు ఏకామ్రనాధ, కామాక్షీ, వరదరాజస్వామి ఆలయములను పునర్నిర్మించారు. పట్టణమే పునర్నిర్మింపబడింది. పట్టణమంతా విశాలమైన వీధులతో, శ్రీచక్రాకృతితో, కామాక్షీదేవాలయం బిందుస్థానముగా నిర్మించబడింది.

భగవత్పాదులవారు పునర్నిర్మించబడిన నగరంలో ప్రవేశించి నేరుగా కామాక్షీ ఆలయానికి విజయం చేశారు. అక్కడ కామాక్షీదేవికి ఎదురుగా సాలగ్రామశిలపై శ్రీచక్రమును స్వయంగా లిఖించి ప్రతిష్టించారు. చిద్విలాసీయ శ్రీశంకర విజయవిలాసంలో 'కామాక్ష్యా పురతోదేశే శ్రీచక్రం స్వయమాలిఖత్‌' అని చెప్పబడి ఉంది. శంకరులు శ్రీచక్రార్చనము స్వయంగా చేసి కామాక్షీదేవి ముందు బిలాకాశం ముందు నిలబడి ప్రార్ధన చేశారు. ఆనందగిరి శంకరవిజయంలో భక్తులు కేవల దర్శనము మాత్రము చేత మోక్షమును తేలికగా పొందగలరనే ఉద్దేశ్యంతో శ్రీచక్రప్రతిష్ట చేయబడిందని చెప్పబడింది. శంకరులు అష్టోత్తరశత నామ స్తోత్రంలో 'కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్ర స్థాపన దీక్షుతు'డన్న పేరు ఉంది.

తరువాత శంకరులు ఆమ్రతరుమూలంలో ఆవాసమున్న ఏకామ్రనాధుని దర్శించి పూజించారు. అక్కడ నిత్య పూజాదులకు ఏర్పాటుచేశారు. కాశ్మీరులో వలె కాంచీపురంలో సర్వజ్ఞపీఠమొక్కటున్నది. శంకరులు సర్వజ్ఞ పీఠరోహణం చేయడం ద్వారా అద్వైతసిద్దాంతపు విశిష్టతను చాటదలచారు. సర్వజ్ఞపీఠారోహణం చేయబోయే సమయానికి తామ్రపర్ణీ నదీ తీరం నుండి వచ్చిన పండితులు కొంతమంది శంకరులను వివిధ ప్రశ్నలు వేశారు. ఏడురోజుల వాదోపవాదముల అనంతరము వారందరూ శంకరుల సిద్దాంతమునకు పాదాక్రాంతులైనారు. మహారాజులు వింజామరలు విసరగా పండితులు, శిష్యులు జయజయ ధ్వానాలు చేయగా శంకరులు సర్వజ్ఞపీఠాధిరోహణం చేశారు. చిద్విలాసీయ శంకర విజయము ఇలా చెబుతుంది.

గీతవాదిత్రనిర్ఘోషైః జయవాద సముజ్జ్వలైః

అధిరోహథ సర్వజ్ఞ పీఠం దేశిక పుంగవం

సర్వజ్ఞ పీఠమధిరోహించిన తరువాత శంకరులు కామాక్షీదేవి ఆలయపు సమీపంలోనే ఉన్న తమ మఠంలో కామాక్షిని, యోగ చంద్రమౌళీశ్వర స్పటిక లింగమును పూజిస్తూ బ్రహ్మానందానుభవ మగ్నులై జీవన్ముక్తులై కాలం గడిపారు. ఈ కాలంలోనే వారు త్రిపుర సుందరీ వేద పాదస్తవాన్ని వ్రాశారని చెప్పబడుతోంది. ఈ కాలంలోనే షణ్మతముల ప్రచారమునకు శంకరులు కంచి నుండి ఆరుగురు శిష్యులను పంపారని తెలియవస్తుంది.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page