Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

19. కాంచీక్షేత్రము

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వారవతీ చైవ సపై#్తతే మోక్షదాయికాః

సప్తమోక్షపురులలో దక్షిణాదిన ఉన్న ఏకైక నగరం కంచి. దీనికి సత్యవ్రత క్షేత్రమన్న నామాంతరం ఉంది. కాంచి అంటే మొలనూలు లేక ఒడ్డాణం అన్న అర్ధమున్నది. కాంచీక్షేత్రము భూదేవికి నాభిస్థానంగా వివిధ పూరాణములలోనూ, పురాతన గ్రంధములలోనూ అభివర్ణించబడినది. శాక్తేయ గ్రంధాలలో ప్రధానమైన మహాలక్ష్మీ తంత్రము దేశములో ప్రధానమైన పద్దెనిమిది శక్తి క్షేత్రములలో మూడు ముఖ్యమైనవనీ, అందులో కాంచీపురంలో ఉన్న కామరాజ పీఠము మరింత ప్రధానమైనదనీ తెలియజేస్తుంది.

ఇక్కడి శక్తి కామాక్షి. ఈ పీఠం పురాణములలో కూడా ఎంతో ప్రసిద్ధంగా చెప్పబడింది. ప్రపంచములోని శక్తినంతా తనలోనికి ఆకర్షించుకొనిన కామకోటి బిలాకాశం కామాక్షీసన్నిధి లోనే ఉన్నది. కంచి యావత్తు ఈ శక్తి చిదాకాశరూపంలో వ్యాపించి ఉన్నదని చెప్పబడుతోంది. అందువల్లనే కాంచిలో నివసించడమే ముక్తిసాధకమని చెప్పబడింది. అంతేకాదు. ఈ క్షేత్రములో నున్న 108 శివాలయములలో ఏ శివాలయములోని అమ్మవారికి ప్రత్యేక మందిరం లేదు. కామాక్షి కంచి అంతటా వ్యాపించి ఉండటమే దీనికి కారణం. శ్రీవిద్యకు ప్రధానమైన లలితాసహస్రనామం, లలితా త్రిశతి వంటి అన్ని స్తోత్రములలోనూ గ్రంధములలోనూ ఈ పీఠప్రసక్తి ఉన్నది. కంచిలోని ఈ కామరాజపీఠాన్ని శ్రీరాముడు, బలరాముడు వంటి అవతారమూర్తులే కాదు హయగ్రీవుడు, అగస్త్యుడు, దుర్వాసుడు, వ్యాసుడు వంటి మహాపురుషులు కూడా సేవించారని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకొక్క విశేషమున్నది. మిగతా మోక్షపురులలో ఒక దేవతకే ప్రాధాన్యమున్నది. ఉదాహరణకు అయోధ్య రామభక్తులకు, మధుర కృష్ణభక్తులకు ప్రధానమైనవి. కంచి అలా కాదు. శాక్తేయులకు అత్యంత ప్రధానంగా ఎంచబడే కంచి పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకామ్రేశ్వర లింగము ఉండటముతో ప్రసిద్ధమైన శైవక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. నాయనార్లందరూ ఈ స్వామిని గురించి పాటలుపాడారు. వైష్ణవులకు నూట ఎనిమిది దివ్య క్షేత్రములలో ఒకటైన వరదరాజస్వామి దేవాలయం ఇక్కడ ఉండటంతో ప్రధానమైన వైష్ణవక్షేత్రం అయింది. అనేక మంది ఆళ్వార్లు ఈ స్వామిపై పాటలు పాడారు. కంచిలో నూట ఎనిమిది పైగా శివాలయములు ఇప్పటి వరకూ (111 లెక్కించబడ్డాయి) అనేక విష్ణ్వాలయములు ఉన్నాయి. ఈ దేవాలయములలో ఏ స్వామికి ఉత్సవమైనా కామాక్షీదేవాలయములకు ప్రదక్షిణంగా ఊరేగింపు జరపడం ఇక్కడి సంప్రదాయము. చివరికి తురుష్కులు కూడా ఈ దేవాలయమును తమ ఊరేగింపులలో ఉత్తరంగా చుట్టి రావడం ఆశ్చర్యం.

ఈ క్షేత్రమొకప్పుడు వైదికమతములైన శైవ, వైష్ణవ, శాక్తేయ, కౌమార సంప్రదాయములకే కాక కాపాలిక, తాంత్రిక, జైన, బౌద్ద మతాలకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు పెద్ద కంచి, చిన్న కంచి అని పిలువబడుతున్న క్షేత్రములు శివకంచి, విష్ణుకంచి అని పిలువబడేవి. అలాగే ఒకప్పుడు జైనకంచి, బౌద్దకంచిలు కూడా ఉండేవట. నలువర్‌గా ప్రసిద్దిపొందిన ప్రధానశైవ నాయనార్లలో ఒకరైన అప్పర్‌ కంచికి అప్రమేయకళా నిలయమని పేర్కొన్నారు. కాంచీపురంలో దిగ్దంతులైన జైన బౌద్ద విద్వాంసులు కూడా ఉండేవారు. దిజ్మాగుడు, ధర్మపాలుడు అటువంటివారు. కంచిలో సర్వజ్ఞ పీఠముండేది. సకల శాస్త్రములలోనూ పారమ్యతను సంపాదించిన మహాపురుషులు మాత్రమే ఈ పీఠమును అధిష్టించిన సమర్ధులు. శంకరులు ఈ పీఠాన్ని అధిష్టించిన వైనం మనం ముందు చదువుతాం. ఆదిశంకరులు ఆ గమనంతో ఈ క్షేత్రప్రాశస్త్యం మరింత పెరిగింది. కంచీపురమును పునర్నిర్మించిన ఘనత వారిది. భగవత్పాదులవారు ఇక్కడ ఎనిమిది కాళికాలయములలో దేవతలను సౌమ్యమూర్తులుగా చేసి, కామాక్షీదేవాలయంలో శ్రీచక్రమును ప్రతిష్టించారు. కంచిలో ఆదిశంకరులు కామకోటి పీఠమును అధిష్టించి కైలాసం నుండి తాను తెచ్చిన చంద్రమౌళీశ్వర స్పటికలింగములలో ఒకటైన యెగేశ్వర లింగానికి తన అనంతరము కూడా పరంపరగా పూజ జరిగే ఏర్పాటు చేసి కాంచీనగరంలో సిద్ధి పొందారు. తదాదిగా అవిచ్ఛిన్న శిష్యపరంపరతో వెలుగొందుచూ, మహామహిమాన్వితులైన ఆచార్యుల ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠము, కాంచీపురము అద్వైత సంప్రదాయమునకు ప్రధాన క్షేత్రమగా పరిఢవిల్లుతున్నాయి. బెంగాలీ విశ్వకోసము కంచిని గురించి క్రింద విధంగా తెలుపుతోంది.

''కాంచీపురము ఒక ప్రాచీన మహాతీర్ధము. కేవల తీర్ధమే కాదు. కాంచి మహాపీఠస్థానము. శివ కాంచిలోని ఏకామ్రనాథుని ఆదిలింగము, భగవతి కామాక్షీ మూర్తి, భగవాన్‌ శంకరాచార్యుల ప్రతిమ మరియూ సమాధి స్థలము.. కామాక్షీదేవాలయము చిన్నదే. ఈ దేవాలయ ప్రాంగణంలోనే శంకరుల సమాధి ఉన్నది.''

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page