Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

18. విజయయాత్ర

వ్యాసభగవానుని ఆదేశంపై భగవత్పాదుల వారు భారతదేశము మూడుసార్లుగా పర్యటించారు. వీరి విజయయాత్రలలో వేలాదిగా శిష్యులు, సుధన్వమహారాజుచే ఏర్పాటుచేయబడిన రక్షక భటవర్గం ఉండేదని శంకరవిజయములు తెలియజేస్తున్నాయి. ఈ విజయ యాత్రల వెనుక ఆచార్యులవారి ఉద్దేశ్యములు స్థూలంగా క్రింది విధంగా చెప్పుకోవచ్చు.

శంకరులు వేదాంతమును పునఃప్రతిష్టాపనము చేసి వైదికమార్గములన్నిటి గమ్యము ఆత్మసాక్షాత్కారమే, అది జ్ఞానము వలన మాత్రమే సిద్దించుతుందని సిద్దాంతం చేశారు కదా! దేశము నలుమూలల ఉన్న పండితులను కలిసి వారితో చర్చించి, ఒప్పించడం అన్నది వారి విజయయాత్రలలో ఒక ఉద్దేశ్యం. దీనికై వారు కాశీ, బదరీ, కాశ్మీరము, ప్రయాగ, నైమీశము, మహిష్మతీపురము, రామేశ్వరము, కంచి వంటి భారతదేశపు నలుమూలలలోనూ ఉన్న విద్యాస్థానముల కన్నిటికీ వెళ్లి అక్కడి పండితులతో చర్చలు జరిపారు. వారిని ఒప్పించారు. అనేకమంది పండితులను శిష్యులుగా గ్రహించారు. కాశ్మీరములోని అన్ని మార్గముల పండితులను తమ వాదనతో మెప్పించి సర్వజ్ఞపీఠాధిరోహణము చేశారని కొన్ని శంకర విజయాలు చెబుతున్నాయి.

ఇట్టి యాత్రలలో వారికి అనేకమంది జిజ్ఞాసువులు ఎదురయ్యారు. వేరు వేరు స్థాయిలకు చెందిన శిష్యులు వారిని ఆశ్రయించారు. పరమ దయాళువైన ఆచార్యులవారు వారి తాహతుకు అర్దమయ్యేట్లుగా వారు తరించడానికి కావలసినంతగా అద్వైత సిద్దాంత ప్రతిపాదనము చేసే ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి, ఉపదేశ సాహస్రి, సర్వవేదాంత సిద్దాంత సారసంగ్రహము మొదలైన ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. ఉత్తమాధికారులు ప్రస్థానత్రయభాష్యం చదివి అద్వైత సిద్దాంతంపై ఎవరైనా విమర్శ చేసినపుడు ఖచ్చితమైన సమాధానం చెప్పగల ప్రజ్ఞ సంపాదించవచ్చు. జిజ్ఞాసువులు వారు రచించిన ఏ చిన్న గ్రంధం చదివినా వారితో నేరుగా మాట్లాడుతున్న అనుభూతిని పొందవచ్చు. మనం తరించడానికి అది చాలు. ఈ రకంగా శంకరుల జ్ఞానప్రచారోద్యమం పండితులకే కాదు. జిజ్ఞాసువులందరకీ ఉద్దేశ్యించి జరిగింది.

దేశంలో అనేక ఉపాసనమార్గములున్నవి. వాటికన్నిటికీ మూలము వేదమే. కాలక్రమాన వెఱ్ఱితలలు వేసి అవైదికములైన అశాస్త్రీయములైన విధానాలు వాటిలో చొచ్చుకొని వచ్చాయి. శంకరులు శాక్తేయ కపాలికాది మార్గములలోని ప్రముఖులందరినీ కలుపుకొని వారిచే వేదప్రామాణ్యాన్ని ఒప్పించి వారి వారి ఉపాసనామార్గములను మెరుగుపరిచారు. ఉపాసనా మార్గపు గమ్యము జ్ఞానమేనన్నది నిరూపించారు. ఈ విషయం షణ్మతస్థాపన ప్రస్తావనలో వివరంగా చెప్పుకొన్నాం. ఇది వైయక్తికమైన ఉపాసనా విధానాలలో శంకరులు తీసుకొని వచ్చిన పరివర్తన.

ఇక సామాన్యప్రజలకు జ్ఞానము, ఉపాసన అర్ధమవుతుందా? భారతీయ సంస్కృతిలో పెనవేసుకొనిన దేవాలయములు జ్ఞానులు మొదలుకొని సామాన్యప్రజల వరకూ అందరికీ అవసరము. మతమంటేనే నమ్మకము. దక్షిణాదిన శంకరుల తరువాత, ముందర ఉన్న నాయనార్లు, ఆళ్వార్లు కూడా ఈ దేవాలయముల ద్వారా ప్రజలలో భక్తిని పెంపొందింప చేశారు. శంకరులు దేశం నలుమూలల్లో ఉన్న ప్రధాన దేవాలయములన్నిటినీ దర్శించారు. అక్కడ స్వామిని, అమ్మను కీర్తించారు. భక్తియొక్క ప్రాధాన్యతను పూర్తిగా ఎఱిగి ప్రచారం చేసినవారు శంకరులు. దేవాలయాల్లో కాలక్రమాన ఏర్పడిన విపరీత పూజావిధానాలను వారు సంస్కరించారు. ఈ రకంగా సమాజములోని ప్రతివ్యక్తి యొక్క అభ్యుదయమునకు శంకరుల విజయయాత్ర ఉపయోగించింది.

తాము పునః ప్రతిష్టించిన ధర్మపరిపాలనములో మార్గదర్శకత్వము నెరపడానికి వారు కొన్ని మఠములను స్థాపించారు. ఈ మఠములు కేవలము అద్వైత సిద్దాంత ప్రచార కేంద్రములు మాత్రమే కాదు. యావత్‌ భారతీయసంస్కృతి పరిరక్షణకు ఉద్దేశించినవి. అద్వైత శాస్త్రములో పండితులు, అనుష్టాతలు అయి ఉండి అపరోక్షానుభూతి కలిగిన ఈ మహాత్ములు వైదికమయిన అన్ని మార్గములలోనూ మార్గచోదనము చేయగల మహితాత్ములు. శంకరులెన్ని పీఠములు స్థాపించారన్న విషయం మీద శంకర విజయాలకు ఏకాభిప్రాయం లేదు. కొన్ని శంకర చరిత్రలు ఒకే పీఠం (కంచి సర్వజ్ఞ పీఠం) స్థాపించినట్లు వ్రాశాయి. సంప్రదాయమును బట్టి శంకరులు అనేక పీఠములు స్థాపించారన్నది సుస్పష్టము. ప్రస్తుతము కంచి, శృంగేరీ, ద్వారకా, పూరీ, జ్యోషీమఠ్‌ (బదరీ) పీఠాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి.

శంకరులు తమ విజయయాత్రలో దర్శించిన క్షేత్రాలపై శంకరవిజయాలలో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ, దరిదాపు అన్ని శంకర విజయములు సూచించిన కొన్ని క్షేత్రముల గురించి చెప్పుకొందాం. ఆర్యాంబ అంత్యక్రియలు తరువాత శంకరులు రామేశ్వరం నుండి యాత్ర ఆరంభించారు. అక్కడనుండి అనంత పద్మనాభస్వామి ఆయలమున్న త్రివేండ్రం చేరి స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యంలో కుమారధాలో స్నానం చేసి సుబ్రహ్మణ్యాన్ని అర్చిస్తూ కొంతకాలమక్కడ ఉన్నారు. గోకర్ణంలో మహాబలేశ్వరుని దర్శించి పంచక్రోశ యాత్ర పూర్తి చేసుకున్నారు. అక్కడ నుండి మూకాంబికా క్షేత్రం చేరారు. మూకాంబికా క్షేత్రములో అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారు. కొలది కాలం అక్కడ నుండి పండరీపూర్‌, త్య్రయంబకముల మీదుగా సోమనాధాలయం దర్శించారు. అక్కడ శంకరులు ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రము చేశారు.

సప్త మోక్షపురులలో ఆరు ఉత్తరాదినే ఉన్నాయి. దక్షిణాదిన ఉన్న ఏకైక మోక్షపురి కంచి. మోక్షపురులలో ఒకటైన కాశీలో శంకరుల విజయం మనం వివరంగా చెప్పుకొన్నాం కదా! ఇప్పుడు పడమటితీరములలో విజయయాత్ర ముగించుకొనిన శంకరులు అవంతికాపురమని పిలవబడే ఉజ్జయినీ నగరం చేరారు. అక్కడ ఆ కాలంలో ఉగ్రభైరవ తంత్రము బహుళ ప్రచారంలో ఉండెడిది. ఉజ్జయినిలో క్షిప్రానదిలో స్నానం చేసి చండికా మహాకాళేశ్వరులను దర్శించి, ఉగ్రభైరవ తంత్రములలోని అవైదిక ఆచారములను రూపుమాపారు. ఈశాన్యంగా ప్రయాణం చేసి మధురా నగరము చేరి కృష్ణుని ధ్యానించారు. బృందావనంలో కొంతకాలముండి హస్తినాపురం మీదుగా కైలాస యాత్ర చేశారు. బదరి నుండి కేదారము చేరిన శంకరులు నేపాళ##దేశం చేరారు. అప్పుడక్కడ బౌద్దమతం బహుళ ప్రచారంలో ఉన్నది. శంకరుల విజయానంతరము రాజులు వైదిక ధర్మావలంబరులయ్యారు.

నేపాళం నుండి కాశ్మీరం చేరిన శంకరులు వాగ్దేవీ ఆలయంలో అక్కడ పండితులను అద్వైత సిద్దాంతమునకు ఒప్పించి సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. కాశ్మీరు నుండి గయ గంగాసాగరముల మీదుగా అంగ దేశములను చేరి అక్కడి దేవి కామాఖ్యా ఆలయాన్ని దర్శించారు. కామాఖ్యా భారత దేశంలోని ప్రధాన శక్తిపీఠములలో ఒకటి. అంచెలంచెలుగా శంకరులు శ్రీశైలం చేరారు. శ్రీవారి శ్రీశైల విజయం మనం ముందే ముచ్చటించుకొన్నాము.

శ్రీశైలం నుండి దక్షిణదిశగా ప్రయాణిస్తూ అహోబిల నృసింహస్వామిని దర్శించి శంకరులు తిరువత్తియూరు (మదరాసు) చేరారు. తిరువత్తియూరిలో బహు పురాతనమైన త్యాగేశుని ఆలయంలో త్రిపురసుందరీదేవి మహోగ్రమైన కళతో విరాజిల్లుతుండేది. శంకరులు ఇక్కడ కూడా శ్రీచక్రమును ప్రతిష్టించి ఉగ్రకళను శాంతింపచేశారు. తిరువత్తియూరు ఆలయప్రాంగణంలో శంకరుల మూర్తి ప్రతిష్టించబడింది. దేవాలయమునకు ప్రక్కనే ఉన్న కంచి శంకరమఠములో కూడా నలుగురు శిష్యులతో కూడిన శంకరుల బహుపురాతనమైన విగ్రహమొకటున్నది.

తిరువత్తియూరు నుండి ఆచార్యులవారు వేంకటాచలము చేరి స్వామిని స్తోత్రం చేశారు. అక్కడ ధనాకర్షణ యంత్రం ప్రతిష్టించారు. తిరుచిరాపల్లిలో కొంత కాలమున్న శంకరులు శ్రీరంగమును దర్శించి అక్కడ జనాకర్షణ యంత్రము ప్రతిష్టించారు. ప్రక్కనే ఉన్న జంబుకేశ్వరము చేరి, అఖిలాండేశ్వరీదేవి ఉగ్రకళను ఎదురుగా వినాయకుని ప్రతిష్టించడం ద్వారానూ, శ్రీచక్రము లిఖించబడిన తాటంకములు అలంకరించడం ద్వారా తొలగించారు. 'శ్రీచక్రాత్మక తాటంక పోషితాంబా మనోరధు'డని అష్టోత్తర శతనామస్తోత్రములలో శంకరున కొక పేరున్నది. ఈ రోజునకు కూడా ఆదిశంకరుల అవిచ్ఛిన్న పరంపరలో వస్తున్న కంచి కామకోటి పీఠాధిపతులు అవసరమైనప్పుడు ఈ తాటంకములను మరమ్మత్తు చేసి పునః ప్రతిష్టిస్తూ ఉంటారు. పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళాలలో ఈ గౌరవాన్ని పురస్కరించుకొని ప్రతివాదులు తెచ్చిన అభ్యంతరములనన్నిటినీ అప్పటి న్యాయస్థానములు కొట్టివేసినాయి. ఇంకా అనేక క్షేత్రములను శంకరులు దర్శించినట్లు శంకర విజయములు, సంప్రదాయములు చెబుతున్నాయి. దక్షిణాదినే చిదంబరం, అరుణాచలములు శంకరులు దర్శించారు. మధ్యార్జునంలో శంకరునిచే ప్రార్ధితుడైన ఈశ్వరుని మహాలింగము సత్యమద్వైతం అని పండితులందరూ వింటుండగా ముమ్మారు వచించినట్లు ప్రతీతి. శంకరులు ఆపైన రామేశ్వరము దర్శించి సంపూర్ణ పూర్ణయాత్ర ముగించుకొని తుదకు కంచి చేరారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page