Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

16. పద్మపాదుల గురుభక్తి

సురేశ్వరులను శిష్యులుగా స్వీకరించిన భగవత్పాదులు అశేషమైన శిష్యగణంతో భారతావనిలో పర్యటిస్తూ, అద్వైత తత్త్వమును ఆవిష్కరిస్తూ మహారాష్ట్ర మీదుగా శ్రీశైలం చేరారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఒకటి. మూడు అర్జునక్షేత్రాలలో ప్రధానమైనది. (తిరువిడై మరుదూరు మధ్యార్జునము, తిరునల్వేలి జిల్లా పుటార్జునము తక్కిన రెండు) స్వామి మల్లికార్జున మహాలింగ స్వామి. ఇక్కడి శక్తి అష్టాదశ మహాపీఠాలలో ఒకటైన భ్రమరాంబిక. ఆ కాలంలో శ్రీశైలం కాపాలిక మతమునకు ప్రధాన స్థానంగా ఉండేది.

పాతాళ గంగాస్నానము చేసి, కృష్ణానదిని ప్రార్ధించి, మల్లికార్జున మహాలింగమును సేవించి శంకరులు స్వామిని శివానందలహరి అనే ప్రసిద్ధమైన నూరు శ్లోకములతో స్తోత్రం చేశారు. అమ్మ భ్రమరాంబపై అష్టకము చెప్పారు. శ్రీశైలములో శంకరులు కొంతకాలం ఉండి భాష్య పాఠము చెప్పారట. కాపాలిక మతానుయాయులు శంకరాద్వైతము వంక ఆకర్షితులయినారు. శంకరులు శ్రీశైల రమ్య పర్వతగుహలలో కొంతకాలం సమాధినిష్టులై ఉన్నారు. ప్రసిద్ధమైన యోగతారావళీ అనబడే 27 శ్లోకములున్న యోగశాస్త్ర గ్రంథములోని 'సిద్దిం' అన్న శ్లోకంలో శ్రీశైల శృంగ గుహలలో అత్యున్నతమైన సమాధి స్థితిని ఎప్పుడు పొందగలుగుతానో కదా అనే ఆవేదనను వ్యక్తపర్చడంలోనూ, శివానందలహరికి కొలికి పూసల వంటి 50, 51 శ్లోకాలతో శ్రీశైల స్వామిని అత్యంత రమణీయముగా ప్రార్ధించడం బట్టీ వారికి శ్రీశైలంపై గల మక్కువ అర్ధం అవుతోంది.

కాపాలిక మతము వామాచారమునకు చెందిన సంప్రదాయము. వైదిక దేవతలపై భక్తితో చేసే కొన్ని ఆరాధనలు క్రమశః తాంత్రిక ప్రక్రియలతో మధ్యము, మాంసము, మజ్ఞ మొదలైనవి వినియోగించే ఆచారమును చేపట్టినవి. దీనికి వేదములలో ప్రమాణము లేనందున శంకరులు ఆ ఆచారములను ఖండించారు. కాపాలికుల నాయకులు వాదనలో శంకరుల నెదుర్కొనలేకపోయారు. అలాగనితమ మతంపై అభిమానాన్ని వదులుకోలేక పోయారు. అందుకే శంకరులనే పరిమార్చవలెననే ఉద్దేశ్యంతో ఒక యుక్తిపన్నారు. శంకరులు ఏకాంతముగా ఉన్న సమయంలో వారి వద్దకు చేరి వినయంగా నమస్కరించి తమ తాంత్రికాగమాన్ని అనుసరించి తమ ఆరాధ్యదైవమైన కాలభైరవమూర్తికి ఒక చక్రవర్తిని గానీ, మహాజ్ఞానిని గానీ బలి ఇస్తే పరమేశ్వరునికి సమానమైన హోదాలో తమకు కైలాసవాసం లభిస్తుందనీ, చక్రవర్తి శిరస్సు నడిగే అవకాశ##మే లేదనీ, ఇక శంకరులు జీనన్ముక్తులూ, శరీరభానం లేనివారూ అయినందున వారిని బలి ఇవ్వడం వలన వారికి కలిగే నష్టం లేదు సరికదా బలి ఇచ్చే కాపాలికునికి అనంతమైన ఫలం కలుగుతుంది కాబట్టి వారిని బలి ఈయడానికి అనుగ్రహించి ఒప్పుకోవాలని ప్రార్ధించారు. నిజమే! జీవన్ముక్తులైన శంకరులకు శరీరంపై వ్యామోహం లేదు. కాపాలికునికీ శంకరుల కంటే జీవన్ముక్తుడు దొరకడు కాబట్టి వారి మత విశ్వాసం వలన కైలాసవాసం అనే మహాప్రయోజనం కలుగుతుంది. అయితే అనంతమైన భవగద్విభూతి తనపై కూడా ప్రసరింపజేయమని ప్రార్ధించవచ్చు కానీ, తనపై మాత్రమే ప్రసరింపచేయమని కోరరాదు కదా. అలా ప్రయత్రించిన రావణాసురుని శివుడు బొటన వేలితో త్రొక్కివేశాడు. గజాసురుని సంహరించడానికి ఈశ్వరుడు విష్ణుమూర్తిగా రావలసి వచ్చింది. అయినా శంకరులకు కాపాలికుని కోర్కె తీర్చడంలో ఎట్టి అభ్యంతరమూ లేదు. ఈ సంఘటనలో శంకరుల హృదయం ఆవిష్కరించబడుతోంది. మతం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఏ విశ్వాసాన్నీ కాలరాయడం శంకరుల అభిమతం కాదు. స్పిరుట్యుయల్‌గా ఆలోచిస్తే సృష్టిలో ఏ మతమూ అసత్యం కాదు. అన్ని మతములూ కొంతవరకూ సత్యములే. శంకరులు లోకాన్ని మిధ్య అన్నారంటే పూర్తిగా అసత్యం అని దానికి అర్ధం కాదు. వారు వ్యావహారిక సత్యాన్ని అంగీకరించారు. శంకరులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించనివారు 'మిధ్యంటావా? మాయంటావా? ముద్దుల వేదాంతీ ఏమంటావు?' అని ప్రశ్నిస్తారు. ధనవంతుడి రోల్స్‌ వాయిస్‌, శ్రామికుడు చెమట అంతటినీ శంకరులు వ్యావహారిక సత్యంగా ఒప్పుకొన్నారు. ప్రస్తుతానికి వస్తే వివిధ మతములను సమన్వయపరచి, వైదిక మార్గంలో నడిపి ఒక ప్రామాణికతను సంతరింపజేసి, తుది గమ్యమైన శ్రుతి హృదయమైన అద్వైతము వైపు నడిపించడమే వారి హృదయం. ఉద్దేశ్యం. ఏ మతాన్ని కించపర్చడం వారి అభిమతం కాదు. ఇక్కడ ఆ కాపాలికుడు రావణునివలె అహంకరిస్తే ఏమయ్యేదో కానీ, గజాసురుని వలె ప్రార్ధించడంతో శంకరులు కరుణతో ఒప్పుకొన్నారు. తమ శిష్యులకు తెలిస్తే ఒప్పుకోరనీ, తన అనుష్టానం ముగించి మరునాడు శంకరులు సూచించిన సమయానికి కాపాలికుడు తన ఆచారానుసారం మధిరాపానం చేసి కపాలమాల ధరించి, గండ్రగొడ్డలితో వచ్చాడు. ప్రశాంత చిత్తులై సమాధినిష్టులై ఉన్న శంకరులను సమీపించారు. శంకరులపై అనన్యమైన భక్తితో గంగలో పద్మములచే భరింపబడిన పాదములు గలవారు కాబట్టి పద్మపాదులుగా ప్రసిద్ధులైన సనందులు అక్కడకు కొంచెం దూరంలో ఏదో పనిలో నిమగ్నులై యున్నారు. వారెక్కడున్నా వారి దృష్టి వారి గురువులను అంటి పెట్టుకొనే ఉంటుంది. వారికి శంకరులకు రానున్న ప్రమాదం అవగతమయింది. పద్మపాదులవారు పూర్వాశ్రమంలో నృసింహోపాసకులు. వారు చోళ దేశస్థులు. తిరుమలకొండ శిరస్సుగా, శ్రీశైలం తోకగా ఆళ్వారులచే పాడ బడిన శ్రీశైల పర్వత శ్రేణికి చెందిన అహోబిలారణ్యములలో నృసింహస్వామిని ఉద్దేశించి వారు మహోగ్రమైన తపస్సు నాచరించారు. స్వామిని ఎలాగైనా సరే దర్శించాలని వారి పట్టుదల. ఘోరమైన తపస్సు నాచరిస్తున్న పద్మపాదులను ఒక చెంచుదొర 'స్వామీ! మీరీ అరణ్యాలలో, గుహలలో కూర్చుని ఏమి చేస్తున్నారు? దేనికోసము మీ ఈ ప్రయత్నం?' అని ప్రశ్నించాడు. నృసింహ సాక్షాత్కారానికై తపస్సు చేస్తున్నానంటే ఆ అమాయకుడైన చెంచుకు ఏమి అర్థమవుతుంది.

అందువల్ల 'సింహం ముఖంలో మనిషి మేనుతో ఉండే నృసింహాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నానయ్యా' అన్నాడు. చెంచు ఆశ్చర్యపోయాడు. స్వామీ! పులులను చూచాను. సింహాల్ని చూచాను. అనేక మృగాలను చూచాను. నీవు చెప్పే మృగం ఈ ప్రాంతంలో లేదన్నాడు. పద్మపాదుడు తప్పకుండా ఈ ప్రదేశాలలో ఉంది. అయినా నీవు దానిని చూడటం కష్టము అన్నారు. చెంచు ఒకవేళ అలాంటి మృగము ఈ అరణ్యాలలో ఉంటే కట్టి నీ వద్దకు తెస్తాను. లేకుంటెప్రాణాలు అర్పిస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. పద్మపాదులు నవ్వుకొన్నారు. చెంచు నిద్రాహారాలు మాని ఆ జంతువుకై వెతక నారంభించాడు. ఆ బ్రాహ్మణుడు అబద్దం చెప్పి ఉండడనే అకుంఠిత విశ్వాసంతో అతడు వర్ణించిన స్వరూపం ఏకాగ్రంగా ధ్యానిస్తూ, వెతికి వేసారి ఆ మూర్తిని చూడజాలని ప్రాణాలు అనవసరమని ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ ఏకాగ్రమైన తపస్సుకు నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు. అతడు బలమైన లతలతో కట్టివేస్తుంటే కట్టపడ్డాడు. కట్టివేసిన నృసింహునితో సహా పద్మపాదుని వద్దకు చేరాడు చెంచువు. 'పాడు మృగం! ఎంత కష్ట పెట్టిందయ్యా! ఇదిగో పట్టుకొచ్చాను. తీసుకో!' అంటూ అయింది. కానీ స్వామి కనబడలేదు. 'ఒక్కరోజులో చెంచుకు దర్శనమిచ్చారు. ఇన్నేళ్ల తపస్సుకు నాకు కనపడలేదే స్వామీ' అంటూ ఆక్రోశించారు. నృసింహుడు ''వీడు కోటి సంవత్సరాలు స్వరూప ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రతను ఒక్కరోజుతో సాధించాడు. వీని సాంగత్య ఫలితంగా నీకు నా గొంతు వినిపిస్తోంది. నీ తపస్సు చేత మంత్రసిద్ధి కలిగింది. నీకవసరమయినప్పుడు నీ వద్దకు వస్తాను'' అని చెప్పి ఆశీర్వదించారు. తమ గురువును సంరక్షించుకోవడం కంటే స్వామిని తలుచుకోవడానికి ముఖ్యావసరము ఏముంటుంది. అందుకే నృసింహుని ప్రార్ధించారు పద్మపాదులు. పద్మపాదులపై నృసింహావిర్భావం జరిగిన వికటాట్టహాసంతో కాపాలికుని చీల్చివేశాడు. స్వామి అట్టహాసానికి సమాధి చాలించిన శంకరులు విషయం గ్రహించి నృసింహ ప్రార్థన చేశారు. స్వామి ఉగ్రతనుపసంహరించాడు. పద్మపాదులు స్వాభావిక స్థితిలోనికి వచ్చి శంకరులకు సాష్టాంగ నమస్కారం చేశారు. శంకరుల శరీర భానరాహిత్యం, చెంచు ఏకాగ్రత, పద్మపాదుల గురుభక్తి అనన్య సామాన్యమైనవి. ఇంకొక్క విషయం. గజాసురుని విషయంలో శివుని తిరిగి కైలాసానికి తీసుకొని వెళ్లడానికొచ్చిన విష్ణుమూర్తి అపర శంకరులను మన కోసమై శరీరంతో ఉంచడానికి నృసింహులై ఆవిర్భవించారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page