Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

14. కుమారిల భట్టు

భగవత్పాదులవారి చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు కుమారిలభట్టు గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకము. కుమారిలభట్టు తీవ్ర వైదిక మాతానుయాయి. ప్రయాగలో అవతరించారు. ఆ కాలంలో భారతదేశంలో బౌద్ధమతం విజృభించి ఉంది. బౌద్దులు తమ యుక్తి చాతుర్యంతో కూడిన మహాప్రజ్ఞతో పండితులను సైతం ఆకర్షించ నారంభించారు. వైదికధర్మం అనేక నియమాలతో కూడినది. ఈ కష్టమేమీ పడకుండా నేరుగా మోక్షమనే వాదము సామాన్యులను కూడా ఆకర్షిస్తుంది కదా! ఈ రోజులలో కూడా అరచేతిలో వైకుంఠాన్ని చూపే అనేకమంది ఆసాముల మాటలకు మనం మోసపోతూనే ఉన్నాము. సరి! వైదిక మతోద్దరణము కోసం బౌద్దాన్ని బుద్దితో ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది. ఆ రోజుల్లో ఎదుటివారి సిద్దాంతమేమిటో కూలంకషంగా తెలుసుకోకుండా తమకున్న అరకొర జ్ఞానంతో ఆ సిద్దాంతం ఖండించే అలవాటు లేదు. ఈ కాలంలో రామశబ్దం రానివారే సంస్కృత భాషలో ఉన్న మహద్గ్రంథాలపై తమ అమూల్యాభిప్రాయాల్ని విరివిగా సరఫరా చేస్తున్నారు. తాము ఖండించబోయే సిద్దాంతమును ఆ సిద్దాంతమునకు చెందిన వారు సైతం వివరించలేనంత చక్కగా వివరించగల నైపుణ్యం గలవారు భాష్యకారులు. (శంకరులు). ఇప్పుడు కుమారిలులకు వైదిక ధర్మము ఖచ్చితంగా సత్యమనే నమ్మకమున్నది. అయితే బౌద్ధ ధర్మమేమిటో తెలుసుకోకుండా దానిని ఖండించడమెలా? ఆ రోజుల్లో బ్రాహ్మణులకు బౌద్దవిద్యాలయములలో ప్రవేశం అంత తేలికగా దొరికేది కాదు. కుమారిలులు బౌద్దుని వేషంలో ఏడంతస్తుల బౌద్దవిశ్వవిద్యాలయంలో చేరారు.

బౌద్దాచార్యులు వేదదూషణ చేస్తున్నప్పుడు కుమారిలుల కళ్ళ నుండి ధారాపాతంగా నీరుకారేవట. బౌద్దాచార్యులకు అనుమానం వచ్చి అడిగితే మీరెంత చక్కగా వేదాన్ని విమర్శిస్తున్నారో తెలుసుకొని ఆనందంతో కన్నీరు వస్తున్నాయని చెప్పేవారట. ఎంత దాచుకొందామనుకొన్నా వీరి వైదికాభిమానం దాగలేదు. వీరు నేర్చుకోవలసినది పూర్తి కాక ముందే బౌద్దాచార్యాన్ని ఖండించనారంభించారట. బౌద్దులు కుమారిలులను ఏడంతస్తుల భవనం నుండి క్రిందకు తోసివేశారు. గాక అని ప్రార్థించారట. 'అయితే' అన్న అనుమానసూచకమైన పదం రావడంతో వారి కంటికి మాత్రం రాయి తగిలి గాయం అయిందట. బౌద్దం గురించి కూలంకషంగా తెలుసుకొన్న కుమారిలుల ముందు బౌద్దులెవరూ వాదనలో నిలువలేక పోయారు. పండితులలో, రాజసభలలో వైదిక వాదానికి తిరిగి ప్రతిష్ట లభించింది. వారు మీమాంస శాస్త్రమునకు చెందినవారు. జైమిని మహర్షి వ్రాసిన ధర్మసూత్రములకు అతఃపూర్వమే శాబర భాష్యం ఉంది. శాబర భాష్యానికి వార్తికం వ్రాశారు కుమారిలులు. వార్తికమంటే ఒక రకంగా భాష్యాన్ని పునః పరిశీలించడం వంటిది. మూలంలో ఉన్నది సరిగా స్పష్టంగా చెప్పకపోయినా, మూలంలో లేనిది చెప్పినా సరిచేస్తూ భాష్యాన్ని మరింత మెరుగు పరచడమే వార్తికకర్తల పని. శంకరవిజయాలను పరిశీలించితే బౌద్దులను నిలువరించిన ఘనత కుమారిలభట్టుదే అని తెలుస్తుంది. జైనగ్రంథాలలో కూడా కుమారిలుడు జైనమతాన్ని నిలువరించడానికి చేసిన వాదనల ప్రస్తావన ఉన్నది.

ఒక రకంగా వైదిక ధర్మం సుప్రతిష్ఠితమైనదన్న నమ్మిక కలిగిన తరువాత కర్మ మార్గ తత్పరులు కాబట్టి కుమారిలులు తాము చేసిన దోషాలకు శాస్త్ర విహితమైన మార్గంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకొన్నారు. వీరు చేసిన దోషం విద్య నేర్పిన గురువులను వంచించి, వారినే వాదనలో జయించి పరాజితులను చేయడం ఒకటి. బౌద్దులకు కర్మలు లేవు. ఈశ్వరుడు లేదు. మీమాంసకులకు కర్మ ప్రధానము. అయితే ఈశ్వరుడు వీరి దృష్టిలో ఫల ప్రదాత కారు. ఈశ్వరుండుంటేనేమి - లేకుంటేనేమి, చేసిన కర్మకు ఫలితం ఉంటుంది అనేది వీరి సిద్దాంతము. శాబర భాష్యానికి వ్రాసిన వార్తికంలో కుమారిలులు ఈశ్వర అప్రధానత్వమును నిరూపించారు. ఇది రెండవ తప్పు. ఈ రెండు తప్పులకు ప్రాయశ్చిత్తము ఊక రాశిలో కంఠం దాకా కప్పబడి, నిదానంగా ఆ అగ్నిలో కాలిపోవడమే. చాలా బాధాకరమైన శిక్ష. కుమారిలులకు శాస్త్రమందున్న ప్రమాణ బుద్ది అటువంటిది. ప్రయాగలో త్రివేణీ తీరాన తుషాగ్ని ప్రవేశం చేశారు.

శంకరులకు కుమారిలులచే తమ భాష్యానికి వార్తికం వ్రాయించుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నది. వారికి తమ సిద్దాంత మందున్న ప్రగాఢ విశ్వాసం అటువంటిది. మీమాంసకులైన కుమారిలులను ఒప్పించ గలననడంలో ఎక్కువమందిని వాదముతో కలిసి జయించవలసిన అవసరమేర్పడలేదు. అలాగని వారీ నిరీశ్వర మతములను ఖండించలేదని కాదు. అవసరము వచ్చినప్పుడు నిర్ద్వందముగా ఖండించారు. కానీ వారి పరమోద్దేశ్యము వైదికములైన వివిధ సిద్దాంతముల మధ్య ఒక సమన్వయము ఏర్పరచటం. అందువల్లనే శంకరులకు అన్ని వైదిక మతములూ సమ్మతములే. వాటిని సమన్వయబరుస్తూ చివరి స్థితి అద్వైతమనే శ్రుతి మతాన్ని వారు స్పష్టీకరిస్తారు. ఆ విధంగానే శంకరులు మీమాంసా శాస్త్రమును న్యాయమును తమ భాష్యములలో ఎంతో ఉపయోగించుకున్నారు. అలాగే సాంఖ్యంతోనూ వారికి విరోధం లేదు. శంకరులు ప్రయాగ చేరేసరికే కుమారిలభట్టు తుషాగ్ని ప్రవేశం చేసి యున్నారని విని త్రివేణితీరంలో వారిని కలిసారు. శంకరుల కీర్తి, వారి భాష్యం గురించి అతఃపూర్వమే వినియున్నందున వారిని సాదర వాక్యములతో ఆహ్వానించారు. కుమారిలభట్టుకు తాము వచ్చిన కార్యం వివరించారు శంకరులు. అంతటి బాధలోనూ భాష్యపీఠికను ఆమూలాగ్రంగా విని చివరి దశలో ఆత్మజ్ఞానం ఉపదేశించడానికి శంకరులే వచ్చారని ఎంతో సంతోషించారు. తాను అసక్తులై ఉన్నందున వ్రాయలేకపోతున్నాననీ, లేకుంటే ఎనిమిదివేల శ్లోకములతో ఈ భాష్యంపై వార్తికం వ్రాయాలనిపిస్తోంది అనీ అన్నారు. శంకరులు ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. మీరు ఒప్పుకుంటే పరమేశ్వరానుగ్రహం వలన మీరు తిరిగి స్వస్తులవుతారన్నారు. దేహత్యాగం తనకు సరియైన ప్రాయశ్చిత్తం అన్న ధృడ నిశ్చయంతో ఉన్న కుమారిలులు దానికి ఒప్పుకోలేదు. 'నా శిష్యుడు మహిష్మతీపురములో ఉన్న విశ్వరూపుడు నా అంతటివాడు. నా కంటే కర్మపై ఎక్కువ శ్రద్ధ కలవాడు. వానితో వాదించి వానిని మీ శిష్యునిగా స్వీకరించండి. అతడు సమర్దవంతంగా వార్తికం వ్రాయగలడ'న్నారు కుమారిలభట్టు. అలా చెప్పి శంకరుల సన్నిధిలో గంగానదీ తీరాన ఆత్మైక్యం పొందారు కుమారిలభట్టు. కుమారిలులు వేదముపై తదుతమైన కర్మానుష్టానంపై అకుంఠితమైన విశ్వాసం కలవారు. కర్మానుష్టానం వలన చిత్తశుద్ది కలుగుతుంది. అటువంటి చిత్తము ఆత్మ సాక్షాత్కారమునకు అత్యంత ఆవశ్యకము. చిత్తశుద్దికల వారే వేదాంతాభ్యాసమునకు సరి అయిన అధికారి. వారికి తుదిలో జ్ఞానబోధ చేయడం ద్వారా శంకరులు వారిని ముక్తులను చేశారనడంలో సందేహం లేదు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page