Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తమోధ్యాయః.

అథ అరణ్యకాణ్డ వర్ణనమ్‌.

నారద ఉవాచ :

రామో వసిష్ఠం మాతౄ శ్చ నత్వాత్రిం చ ప్రణమ్య చ | అనసూయాం చ తత్పత్నీం శరభఙ్గం సుతీక్‌ష్ణకమ్‌. 1

అగస్త్యభ్రాతరం నత్వా అగస్త్యం తత్రప్పసాదతః | ధనుః ఖడ్గం చ సంప్రాప్య దణ్డకారణ్యమాగతః. 2

రాముడు వసిష్ఠుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహామునిని, ఆతని భార్య యైన అనసూయను, శరభంగుని, సుతీక్‌ష్ణని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానే పఞ్చవట్యాం స్థితో గోదావరి తటే | తత్ర శూర్పణఖా యాతా భక్షితుం తాన్బయజ్కరీ. 3

రామం సూరపం దృష్ట్వా సా కామినీ వాక్యమబ్రవీత్‌ |

జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటిలో నివసించెను. భయంకరులా లైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.

శూర్పణఖోవాచ :

కస్త్వం కస్మాత్సమాయాతో భర్తా మే భవ చార్థితః. 4

ఏతౌ చ భక్షయిస్యామి ఇత్యుక్త్వా తం సముద్యతా | తస్యా నాసాం చ కర్ణౌచ రామోక్తో లక్ష్మణోచ్ఛినత్‌. 5

శూర్పణఖ ఇట్లు పలికెను. '' నీవు ఎవరవు ? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.

రక్తం క్షర న్తీ ప్రయ¸° ఖరం భ్రాతరమబ్రవీత్‌ | మరిష్యామి వినా సాహం ఖర జీవామి వైతదా. 6

రామస్య భార్యా సీతాస్తి తస్యాసీల్లక్ష్మణో7నుజః | తేషాం యద్రుధిరం కోష్ణం సాయయిష్యసి మాం యది. 7

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. '' ఖరుడా ! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.

ఖర స్తథేతి తాముక్త్వా చతుర్దశసహస్రకైః | రక్షసాం దూషణనాగాద్యోద్ధుం త్రిశిరసా సహ. 8

రామం రామో7పి యుయుధే శ##రైర్వివ్యాధ రాక్షసాన్‌ | హస్త్యశ్వరథపాదాతబలం నిన్యే యమక్షయమ్‌. 9

త్రి శీర్షాణం ఖరం రౌద్రం యుధ్యన్తం చైవ దూషణమ్‌ |

అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ - త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరన్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.

య¸° శూర్పణఖా లఙ్కాం రావణాగ్రే7పతద్భువి. 10

అబ్రవీద్రావణం క్రుద్ధా న త్వం రాజా చ రక్షకః | ఖరాది హన్తూరామస్య సీతాం భార్యాం హరస్వ చ. 11

రామలక్ష్మణరక్తస్య పానాజ్జీవామి నాన్యథా |

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. ''నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.

తథేత్యాహ చ తచ్ర్ఛుత్వా మారీచం ప్రాహ చ వ్రజ. 12

స్వర్ణచిత్రమృగో భూత్వా రామలక్ష్మణ కర్షకః | సీతాగ్రే తాం హరిష్యామి అన్యథా మరణం తవ. 13

ఆ మాటలను విని రావణుడు ''అటులనే చేసెదను'' అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణమైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్నచో నీకు మరణమే. ''

మారీచో రావణం ప్రాహ రామో మృత్యుర్దనుర్ధరః | రావణాదపి మర్తవ్యం రాఘవాదపి. 14

అవశ్యం యది మర్తవ్యం వరం రామో న రావణః | ఇతి మత్వా మృగో భూత్వా సీతాగ్రే వ్యచరన్ముహుః. 15

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను (అనుకొనెను). ధనుర్దారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

సీతయా ప్రేరితో రామః శ##రేణాథావధీచ్చతమ్‌ | మ్రియమాణో మృగః ప్రాహ హా సీతే లక్ష్మణతి చ. 16

సీతచే ప్రేరితుడైన రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.

సౌమిత్రిః సీతయోక్తో7థ విరుద్ధం రామమాగతః | రావణో7ప్యహత్సీతాం హత్వా గృధ్రం జటాయుషమ్‌.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను రావణుడు జటాయువును చంపి సీతను హరించెను.

జటాయుషా న భిన్నాజ్గో అఙ్కేనాదాయ జానకీమ్‌ | గతో లఙ్కామశోకాఖ్యే దారయామాస చాబ్రవీత్‌. 18

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణ ఉవాచ :

మమ భార్యా భవాగ్ర్యా త్వం రాక్షస్యో రక్ష్యతామియయ్‌ |

రామో హత్వా తు మారీచం దృష్ట్వా లక్ష్మణమబ్రవీత్‌.

రావణుడు పలికెను. ''నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము''. ''ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.'' రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీరామ ఉవాచ :

మాయామృగో7సౌ సౌమిత్రే యథా త్వామిమచాగతః | తథా సీతా హృతా నూనం నాపశ్యత్స గతో7థతామ్‌.

శ్రీ రాముడు పలికెను. ''లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు. '' పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

శుశోచ విలలాపార్తో మాం త్వక్త్వా క్వ గతాసి వై | లక్ష్మణాశ్వాసితో రామో మార్గయమాస జానకీమ్‌. 21

రాముడు దుఃఖించుచు ''నన్ను విడచి ఎక్కడికి పోతివి'' అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

దృష్ట్వా జటాయుస్తం ప్రాహ రావణో హృతవాంశ్చ తామ్‌ | మృతో7థ సంస్కృతస్తేన కబన్దం చావధీత్తతః.

శాపముక్తో7బ్రవీద్రామం స త్వం సుగ్రీవమావ్రజ |

ఇత్యాది మహా పురాణ ఆగ్నేయే రామాయణ ఆరణ్యకాణ్డ వర్ణనం నామ సప్తమోధ్యాయః.

జటాయువు రాముని చూచి ''సీతను రావణుడు అపహరించెను'' అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై ''సుగ్రీవుని వద్దకు వెళ్లుము'' అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకాండవర్ణన మనెడు సప్తమాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters