Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వాదశోత్తరద్విశతతమోధ్యాయః

ఆథ కామ్య - మేరుదానవర్ణనమ్‌

అగ్నిరువాచ :

కామ్యదానాని వక్ష్యామి సర్వకామప్రదాని తే | నిత్యపూజాం మాసి మాసి కృత్వాథో కామ్యపూజనమ్‌. 1

వ్రతార్హణం గురోః పూజా వత్సరాన్తే మహార్చనమ్‌ | అశ్వం వై మార్గశీర్షే తు కమలం పిష్టసంభవమ్‌. 2

శివాయ పూజ్య యో దద్యాత్సూర్యలోకే చిరం వసేత్‌ | గజం పౌషే పిష్టమయం త్రిసప్తకులముద్ధరేత్‌. 3

మాఘే చాశ్వరథం పైష్టం దత్త్వా న నరకం వ్రజేత్‌ | ఫాల్గునే తు వృషం పైష్టం స్వర్గభుక్స్యాన్మహీపతిః.

చైత్రే చేక్షుమయీం గావం దాసదాసీమన్వితామ్‌ | దత్త్వా స్వర్గే చిరం స్థిత్వా తదన్తే స్యాన్మహీపతిః. 5

సప్తవ్రీహీంశ్చ వైశాఖే దత్త్వా శివమయో భ##వేత్‌ | బలిమణ్డలకం చాన్నైః కృత్వాషాడే శివో భ##వేత్‌. 6

విమానం శ్రావణ పౌష్పం దత్త్వా స్వర్గీ తతో నృపః |

శతద్వయం ఫలానాం తు దత్త్వోద్ధృత్య కులం నృపః. 7

గుగ్గులాది దదేద్భాద్రే స్వర్గీ స స్యాత్తతో నృపః | క్షీరసర్పిర్భృతం పాత్రమాశ్వినే స్వర్గదం భ##వేత్‌. 8

కార్తికే గుడఖణ్డాజ్యం దత్త్వా స్వర్గీ తతో నృపః |

వసిష్ఠా! ఇపుడు సమస్తమనోరథములను తీర్చు కామ్యదానములను గూర్చి చెప్పెదను. ప్రతిమాసమునందును పూజ చేయుచు ఒక దినమున విశేషపూజ చేయుదురు. దీనికి 'కామ్యపూజనము' అని పేరు. సంవత్సరము పూర్తి యైన పిమ్మట గురుపూజనము, మహాపూజనము చేసి వ్రతసమాప్తి చేయవలెను. మార్గశీర్షమాసమునందు శివపూజ చేసి పిష్టనిర్మిత మగు అశ్వమును కమలమును దానము చేయువాడు చిరకాలము సూర్యలోకములో నివసించును. పౌషమాసమున పిష్టగజనదానము చేసినవాడు ఇరువదియొక్క తరములవారిని ఉద్ధరించును. మాఘమున పిష్టమయరథాశ్వదానము చేసినవాడు నరకము చూడడు. ఫాల్గునమున పిష్టమయవృషభ దానము చేసినవాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. చైత్రమాసమునందు, దాసీదాసయుక్తము, గుడముతో నిండినది యగు గృహము దానము చేసినవాడు చిరకాలము స్వర్గమున నివసించి పిదప రాజగును. వైశాఖమున సప్తధాన్యదానము చేసినవాడు శివసాయుజ్యము పొందును. జ్యేష్ఠాషాఢములందు అన్నబలి ఇచ్చువాడు శివస్వరూపు డగును. శ్రావణమునందు పుష్పరథదానము చేసినవాడు స్వర్గమునందు సుఖము లనుభవించి, రెండవ జన్మమున రాజ్యమును పొందును. రెండు వందల ఫలములు దానము చేయువాడు సంపూర్ణకులమును ఉద్ధరించి రాజ్యపదమును పొందును. భాద్రపదమున ధూపదానము చేయువాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. ఆశ్వయుజమాసమున దుగ్ధ - ఘృతపూర్ణపాత్ర దానము చేసినవాడు స్వర్గమును పొందును కార్తికమున గుడము, పంచదార, ఘృతము దానము చేసినవాడు స్వర్గమున నివసించి జన్మాంతరమునందు రాజగును.

మేరుదానం ద్వాదశకం వక్ష్యేహం భుక్తిముక్తిదమ్‌. 9

మేరువ్రతే తు కార్తిక్యాం రత్నమేరుం దదేద్ద్విజే | సర్వేషాం చైవ మేరూణాం ప్రమాణం క్రమశః శృణు.

వజ్రపద్మమహానీలనీలస్ఫటిక సంజ్ఞితః | పుష్పం మరకతం ముక్తా ప్రస్థమాత్రేణ చోత్తమః. 11

మధ్యోర్దః స్యాత్తదర్ధోధో విత్తశాఠ్యం వివర్జయేత్‌ | కర్ణికాయాం న్యసేన్మేరుం బ్రహ్మవిష్ణ్వీశ##దైవతమ్‌.

మాల్యవాన్పర్యతః పూజ్యస్తత్పూర్వే భద్రసంజ్ఞితః | అశ్వరక్షస్తతః ప్రోక్తో నిషధో మేరుదక్షిణ. 13

హేమకూటోథ హిమవాంస్త్రయం సౌమ్యే తథాత్రయమ్‌ | నీలః శ్వేతశ్చ శృఙ్గీ చ పశ్చిమే గన్ధమాదనః.

వైకఙ్కః కేతుమాలః స్యాన్మేరుర్ద్వాదశసంయుతః | సోపవాసోర్చయేద్విష్ణుం శివం వా స్నానపూర్వకమ్‌.

దేవాగ్రే చార్చ్య మేరుం చ మన్త్రైర్విప్రాయ వై దదేత్‌ |

విప్రాయాముకగోత్రాయ మేరు ద్రవ్యమయం పదమ్‌. 16

భుక్త్యై ముక్త్యై నిర్మలత్వే విష్ణుదైవం దదామి తే | ఇన్ద్రలోకే బ్రహ్మలోకే శివలోకే హరేః పురే. 17

జలముద్ధృత్య క్రీడేత విమానే దేవపూజితః | అన్యేష్వపి చ కాలేషు సంక్రాన్త్యాదౌ ప్రదాపయేత్‌. 18

ఇపుడు భుక్తిముక్తిప్రదము లగు పండ్రెండు విధములైన మేరుదానములను గూర్చి చెప్పెదను. కార్తికపూర్ణిమ నాడు మేరువ్రతము చేసి బ్రాహ్మణునకు 'రత్న మేరువు' దానము చేయవలెను. ఇపుడు అన్ని మేరువుల ప్రమాణము వినుము. వజ్రములు, మాణిక్యములు, నీలమణులు, వైడూర్యములు, స్ఫటికములు, పుష్పరాగములు, మరకతములు, ముత్యములు - వీటిని ఒక్కొక్క ప్రస్థము చొప్పున ఇచ్చినచో ఉత్తమము, ఇందులో సగ మైనచో మధ్యమము, మధ్యమములో సగము అధమము. రత్నమేరుదానము చేయువాడు పిసినారితనము వీడవలెను. ద్వాదశదల కమలము నిర్మించి దాని కర్ణికపై మేరువును స్థాపించవలెను. దీనికి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మేరువునకు తూర్పున మూడు దలము లుండును. వాటిపై వరుసగ మాల్యవత్‌ - భద్రాశ్వ - ఋక్ష, పర్వత ములను పూజించవలెను. మేరువుకు దక్షిణమునం దున్న దళములపై నిషధ హేమకూట - హిమవత్పర్వతములను పూజించవలెను. మేరువునకు ఉత్తరమునం దున్న దలములపై వరుసగ నీల - శ్వేత - శృంగులను పూజించవలెను. పశ్చిమదలములపై గంధమాదన - వైకంక - కేతుమాలములను పూజించవలెను. ఈ విధముగ పండ్రెండు పర్వతములతో గూడిన మేరుపర్వతమును పూజించవలెను. ఉపవాస ముండి స్నానము చేసి, విష్ణువును, శివుని పూజించవలెను. భగవంతునిఎదుట మేరువును పూజించి మంత్రోచ్చారణపూర్వకముగ ఆ బ్రాహ్మణునకు దానము చేయవలెను. దానసంకల్పము చేయునపుడు దేశకాలములను ఉచ్చరించి ''ఈ ద్రవ్యముతో నిర్మించినదియు శ్రీమహావిష్ణువు దేవతగా కలదియు అగు ఈ మేరువును ఈ గోత్రము గల బ్రాహ్మణునకు దానము చేయుచున్నాను. ఈ దానముచే నా అంతఃకరణము శుద్ధమగు గాక. నాకు ఉత్తమములగు భోగములును, మోక్షము సంప్రాప్తించు గాక'' అని చెప్పవలెను. ఈ విధముగ దానము చేసినవాడు తన సమస్తకులమును ఉద్ధరించి, దేవతలచే సంమానితుడై, విమానముపై కూర్చుండి ఇంద్రలోక - బ్రహ్మలోక - శివలోక శ్రీవైకుంఠములందు విహరించును. సంక్రాంత్యాది పుణ్యకాలములందు మేరుదానము చేయవలెను; చేయించవలెను.

పలానాం తు సహస్రేణ హేమ మేరుం ప్రకల్పయేత్‌ | శృఙ్గత్రయసమాయుక్తం బ్రహ్మవిష్ణుహరాన్వితమ్‌. 19

ఏకైకం పర్వతం తస్య శ##తైకైకేన కారయేత్‌ | మేరుణా సహ శైలాస్తు ఖ్యాతాస్తత్ర త్రయోదశ. 20

అయనే గ్రహణాదౌ చ విష్ణ్వగ్రే హరిమర్చ్య చ | స్వర్ణమేరుం ద్విజా యార్ప్య విష్ణులోకే చిరం వసేత్‌.

పరమాణవో యావన్త ఇహ రాజా భ##వేచ్చిరమ్‌ | రౌప్యమేరుం ద్వాదశాద్రియుతం సంకల్పతో దదేత్‌. 22

ప్రాగుక్తం చ ఫలం తస్య విష్ణుం విప్రం ప్రపూజ్య చ | భూమిమేరుం చ విషయం మణ్ణలం గ్రామమేవ చ.

పరికల్ప్యాష్టమాంశేన శేషాంశాః పూర్వవత్ఫలమ్‌ | ద్వాదశాద్రిసమాయుక్తం హస్తిమేరు స్వరూపిణమ్‌. #9; 24

దదేత్త్రిపురుషైర్యుక్తం దత్త్వానన్తం ఫలం లభేత్‌ | త్రిపఞ్చాశ్వైరశ్వమేరుం హయద్వాధశసంయుతమ్‌. 25

విష్ణ్వాదీన్‌ పూజ్య తం దత్త్వా భుక్తభోగో నృపో భ##వేత్‌ | అశ్వసంఖ్యాప్రమాణన గోమేరుం పూర్వవద్దదేత్‌.

పట్టవసై#్త్రర్భారమాత్త్రైర్వస్త్రమేరుశ్చ మధ్యతః | శైలైర్ద్వాదశవసై#్త్రశ్చ దత్వా తం చాక్షయం ఫలమ్‌. 27

ఘృతపఞ్చసహసై#్రశ్చ పలానామాజ్యపర్వతః | శతం పఞ్చభిరేకైక పర్వతేస్మిన్‌ హరిం యజేత్‌. 28

విష్ణవే బ్రాహ్మణాయార్ప్యం సర్వం ప్రాప్య హరిం వ్రజేత్‌ |

ఏవం చ ఖణ్డమేరుం చ కృత్వా దత్వాప్నుయాత్ఫలమ్‌. 29

ధాన్యమేరుః పఞ్చఖారిః పర ఏకైకఖారికాః | స్వర్ణత్రిశృఙ్గకాః సర్వే బ్రహ్మవిష్ణుమహేశ్వరాన్‌. 30

సర్వేషు పూజ్య విష్ణుం వా విశేషాదక్షయం ఫలమ్‌ | ఏవం దశాంశమానేన తిలమేరుం ప్రకల్పయేత్‌. 31

శృఙ్గాణి పూర్వవత్తస్య తథైవాన్యనగేషు చ | తిలమేరుం ప్రదాయాథ బన్ధుభిర్విష్ణులోకభాక్‌. 32

నమో విష్ణుస్వరూపాయ ధరాధరాయ వై నమః | బ్రహ్మవిష్ణ్వీశశృఙ్గాయ ధరానాభిస్థితాయ చ. 33

నగద్వాదశనాధాయ సర్వపాపాపహారిణ | విష్ణుభక్తాయ శాన్తాయ త్రాణం మే కురు సర్వథా. 34

నిష్పాపః పితృభిః సార్ధం విష్ణుః గచ్ఛామి ఓం నమః | త్వం హరిస్తు హరేరగ్రే అహం విష్ణుశ్చ విష్ణవే. 35

నివేదయామి భక్త్యా తు భుక్తిముక్త్యర్థహేతవే.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మేరుదానానానినామ ద్వాదశాధిక ద్విశతతమోధ్యాయః.

ఒక వెయ్యి పలముల బంగారముతో మహామేరువును నిర్మించవలెను. దానికి మూడు శిఖరములుండును. వాటిపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థాపించవలెను. మేరు పర్వతము ప్రక్కల నుండు పర్వతములు నూరేసి పలముల సువర్ణముతో నిర్మించవలెను. మేరుపర్వతముతో పదమూడు పర్వతము లుండును. ఉత్తరాయణ సంక్రాంతినాడు గాని, సూర్యచంద్రగ్రహణములందు గాని మేరువును విష్ణుప్రతిమకు ఎదురుగా స్థాపించవలెను. శ్రీ మహావిష్ణువును. ఆ మేరువును పూజించి బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేసినవాడు చిరకాలము విష్ణులోకములో నుండును. పండ్రెండు పర్వతములతో కూడిన రజతమేరువును సంకల్పపూర్వకముగ దానము చేయువాడు భూమిమీద ఎన్ని పరమాణువులున్నచో అన్ని సంవత్సరములు రాజ్యము ననుభవించును. పైన చెప్పిన ఫలమును కూడ అనుభవించును. శ్రీమహావిష్ణువును, బ్రాహ్మణుని పూజించి భూమి మేరువును దానము చేయవలెను. ఒక నగరమునందలి లేదా జనపదమునందలి లేదా గ్రామము నందలి ఎనిమిదవ అంశముచే భూమిమేరువును కల్పించి మిగిలిన అంశముచే పండ్రెండు అంశములను కల్పించవలెను. భూమిమేరు దానమువలన గూడ పూర్వోక్తఫలము లభించును. ఏనుగులతో పండ్రెండు పర్వతములతో గూడిన మేరువును నిర్మించి ముగ్గురు పురుషులతో కూడ ఆ హస్తిమేరువును దానము చేయవలెను. అట్లు చేసిన వానికి అక్షయఫలము లభించును. పదునైదు అశ్వములతో అశ్వమేరువు ఏర్పడును. పండ్రెండు పర్వతముల స్థానములందు పండ్రెండు అశ్వము లుంచవలెను. శ్రీ మహావిష్ణ్వాదిదేవతల పూజ చేసినపిమ్మట ఈ అశ్వమేరుదానము చేసినవాడు ఈ జన్మమున వివిధభోగములను అనుభవించి మరుజన్మమున రాజగును. అశ్వమేరువు విషయమున చెప్పిన విధముననే గోమేరుదానము కూడ చేయవలెను. ఒక పుట్టి బరువు గల పట్టువస్త్రములతో 'వస్త్రమేరువు' అగును. దానిని మధ్యయం దుంచి పండ్రెండు వస్త్రములను ఉంచవలెను. దీనిని దానము చేసినవానికి అక్షయఫలము లభించును. ఐదువేల పలముల ఘృతముతో ఘృతపర్వత మగును. దీని ప్రక్కనున్న పర్వతములు ఒక్కొక్కటి ఐదు వందల పలముల ఘృతముతో నిర్మింపబడును. ఈ ఘృతపర్వతముపై శ్రీమహా విష్ణువును పూజించి తత్సంముఖమున బ్రాహ్మణునకు దానము చేసినవాడు ఈ లోకమునందు సుఖము పొంది విష్ణులోకము చేరును. ఇట్లే ఖండ (పటికబెల్లము) మేరువు నిర్మించి దానము చేసినవానికి పూర్వోక్తఫలము లభించును.

ఐదు పుట్ల ధాన్యముతో ధాన్యమేరువును, ఒక్కొక్క పుట్టెడు ధాన్యముతో మిగిలిన పండ్రెండు పర్వతములను నిర్మించి, వాటి అన్నింటి పై మూడేసి స్వర్ణమయ శిఖరములు ఏర్పరచి, అన్నింటి పైనను బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పూజించవలెను. శ్రీ మహావిష్ణువునకు విశేషపూజ చేయవలెను. దీనివలన అక్షయఫలము లభించును. ఈ ప్రమాణము చేతనే తిలమేరువును, దశాంశప్రమాణము చేతనే అన్యపర్వతములను నిర్మించి, వాటికి వెనుక చెప్పిన విధముగ శిఖరములు నిర్మించి, దానము చేసినవాడు బంధుసహితుడై విష్ణులోకమునకు వెళ్లును - ''విష్ణుస్వరూపమగు తిలమేరువునకు నమస్కారము. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు దేని శిఖరములో, ఏది పృథ్వీనాభియం దున్నదో, ఏది ప్రక్క నున్న పండ్రెండు పర్వతములకు ప్రభువో అట్టి సమస్తపాపహరము, శాంతిమయము, విష్ణుభక్తి యుక్తము అగు తిలమేరువునకు నమస్కారము. అది నన్ను రక్షించుగాక. నేను పాపరహితుడ నై పితరులతో గూడ శ్రీ మహావిష్ణుసన్నిధి చేరగలను. 'ఓం నమః'. నీవు విష్ణుస్వరూప మైనదానవు. విష్ణుసంముఖమునందు, విష్ణుస్వరూపుడగు బ్రాహ్మణునకు, భక్తిపూర్వకముగ, భోగమోక్షప్రాప్తికై నిన్ను దానము చేయుచున్నాను'' అని చెప్పుచు ఆ తిలమేరువును దానము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు మేరుదానవర్ణన మను రెండువందలపండ్రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters