Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చాధిక శతతమో7ధ్యాయః.

అథ నగరాదివాస్తునిరూపణమ్‌.

ఈశ్వర ఉవాచ :

నగరగ్రామదుర్గాద్యా గృహప్రాసాదవృద్ధయే | ఏకాశీతిపదైర్వాస్తుం పూజయేత్సిద్ధయే ధ్రువమ్‌. 1

ప్రాగాస్యా దశధా నాడ్యస్తాసాం నామాని చ బ్రువే | శాన్తా యశోవతీ కాన్తా విశాలా ప్రాణవాహినీ. 2

సతీ వసుమతీ నన్దా సుభద్రాథ మనోరమా | ఉత్తరాద్యా దశాన్యాశ్చ ఏకాశీత్య్రంఘ్రికారికా. 3

హరిణీ సుప్రభా లక్ష్మీర్విభూతిర్విమలా ప్రియా | జయా జ్వాలా విశోకా చ స్మృతాస్తత్ర చ పాదతః. 4

ఈశాద్యష్టాష్టకం దిక్షు యజేదీశం ధనఞ్జయమ్‌ | శక్రమర్కం తథా సత్యం భృశం వ్యోమ చ పూర్వతః. 5

హవ్యవాహం చ పూషాణం వితథం భౌమమేవ చ | కృతాన్తమథ గన్ధర్వం భృఙ్గం మృగం చ దక్షిణ. 6

పితరం ద్వారపాలం చ సుగ్రీవం పుష్పదన్తకమ్‌ | వరుణం దైత్యశోషౌ చ యక్ష్మాణం పశ్చిమే సదా. 7

రోగాహిముఖ్యౌ భల్లాటః సౌభాగ్యమదితిర్దితిః | నవాన్తఃపదగో బ్రహ్మా పూజ్యో7ర్ధే చ షడంఘ్రిపాః. 8

బ్రహ్మేశాన్తరకోష్ఠస్థమాపాఖ్యంతు పదద్వయే | తదధశ్చాపవత్సాఖ్యం కేన్ద్రాన్తరేషు షట్పదే. 9

మరీచికాగ్నిమధ్యే తు సవితా ద్విపదస్థితః | సావిత్రో తదధో ద్వ్యంశే వివస్వాన్షట్పదే త్వధః. 10

పితృబ్రహ్మాన్తరే విష్ణుమిన్దుమిన్ద్రం త్వధో జయమ్‌ | వరుణబ్రహ్మణోర్మధ్యే మిత్రాఖ్యం షట్పదే యజేత్‌.

రోగబ్రహ్మాన్తరే నిత్యం ద్విపఞ్చరుద్రదాసకమ్‌ |

తదధో ద్వ్యంఘ్రిగం యక్ష్మ షట్‌ సౌమ్యేషు ధరాధరమ్‌. 12

చరకం స్కన్దవిటపం విదారీం పూతానాం క్రమాత్‌ | జమ్భం పాపం పిలిపిచ్ఛం యజేదీశాదిబాహ్యతః. 13

పరమేశ్వరుడు పలికెను. నగర గ్రామ దుర్గాదులలో గృహప్రాసాదవృద్ధికై ఎనుబదియొక్క పదముల వాస్తు మండలము నిర్మించి, దానిపై తప్పక వాస్తుదేవతాపూజ చేయవలెను. పూర్వాభిముఖము లగు పదిరేఖలు పది నాడులకు ప్రతీకములు. శాంత, యశోవతీ, కాంతా, విశాలా, ప్రాణవాహినీ, సతీ, వసుమతీ, నందా, సుభద్రా, మనోరమా అనునవి ఆ నాడుల పేర్లు, ఉత్తరాభిముఖముగ ప్రవహించు ఇంకను పది నాడులు కూడ ఉన్నవి. వాటిచే తొమ్మిది పదములు ఎనుబదియొక పదములుగ విభజింపబడును. హరిణీ, సుప్రభా, లక్ష్మీ, విభూతి, విమలా, ప్రియా, జయా, జ్వాలా, విశోకా అని వాటి పేర్లు. సూత్ర పాతము చేయగా రేఖామయములగు నాడులు అభివ్యక్తములై చింతనబిషయములగును. ఈశాదిదేవతలు ఎనమండుగురు చొప్పున అష్టకము లగును. ఆ అష్టకములను నాలుగు దిక్కులందును పూజించవలెను. ఈశ-ఘన-జయ-శక్ర-ఆర్క-సత్య-భృశ-వ్యోమదేవతలను. (అష్టకమును) వాస్తుమండలము మీద పూర్వదిక్కున పూజించవలెను. అగ్ని-పూషన్‌-వితథ-సోమ-కృతాంత-గంధర్వ-భృంగ-మృగులను దేవతాష్టకమును దక్షిణమును నున్న పదములందు పూజించవలెను. పితృ, ద్వారపాల, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, దైత్య, శోష, యక్ష్మ లను అష్టకమును పశ్చిమపదములందు పూజించవలెను. రోగ, అహి, ముఖ్య, భల్లాట, సోమ, శైల, అదితి, దితులను దేవతాష్టకమును ఉత్తరమున నున్న పదములపై పూజించవలెను. వాస్తుమండలము మధ్య నున్న తొమ్మిది పదములపై బ్రహ్మయు, ఇరువదినాలుగు పదములపై, ఆరేసి పదములపై అధికారము గల పూజించవలెను. బ్రహ్మకును, ఈశునకును మధ్య నున్న కోష్ఠకములందున్న పరములపై ఆపదేవతను క్రింది రెండు పదములపై ఆపవత్సుని పూజించవలెను. దాని తరువాత నున్న ఆరు పదములపై మరీచిని పూజించవలెను. మరీచికిని, అగ్నికిని మధ్యనున్న రెండు పదములపై సవిత ఉండును. వాటి క్రింద నున్న రెండు పదములపై సావిత్రుడు ఉండును. దాని క్రింద ఆరు పదములపై వివస్వంతు డుండును. పితృదేవతలకును బ్రహ్మకును మధ్య నున్న రెండు పదములపై విష్ణువు, ఇంద్రుడును ఉందురు. క్రింద రెండు పదములందు ఇంద్రుడును, జయుడును ఉందురు. వారిని పూజించవలెను. వరుణనకును, బ్రహ్మకును మధ్యనున్న ఆరు పదములపై మిత్రదేవతను పూజించవలెను. రోగమునకును, బ్రహ్మకును మధ్యనున్న రెండు పదములపై రుద్ర--రుద్రదాసులను, క్రింద రెండు పదములందు యక్ష్మను పూజించవలెను. మండలము బైటి ఈశానాదికోణములందు క్రమముగా చరకీ-స్కంద-విదారీ-వికట-పూతనా-జంభ-పాపా-పిలిపిచ్ఛ లను బాల గ్రహములను పూజించవలెను.

ఏకాశీతిపదం వేశ్మ మణ్డపశ్చ శతాంఘ్రికః | పూర్వవద్దేవతాః పూజ్యా బ్రహ్మా తు షోడశాంశ##కే. 14

మరీచిశ్చ వివస్వాంశ్చ మిత్రం పృథ్వీధరస్తథా | దశకోష్ఠస్ఠితా దిక్షు త్వన్యే వేశాదికోణగాః. 15

చైత్యమాతా తథేశాగ్నీ మృగాఖ్యౌ పితరౌ తథా | పాపయక్ష్మానితాదేవాః సర్వే సార్ధాంశ##కే స్తితాః. 16

యత్పాద్యౌకః ప్రవక్ష్యామి సంక్షేపేణ క్రమాద్గుహ | సదిగ్వింశతికరైర్దైర్ఘ్యాదష్టావిం శతి విస్తరాత్‌. 17

శివాశ్రయః శివాఖ్యశ్చ రుద్రహీనః సదోభయోః | రుద్రద్విగుణితానాహాః పృథుష్ణోభిర్వినాత్రిభిః. 18

స్వాద్గృహద్విగుణం దైర్ఘ్యాత్తిథిభిశ్చైవ విస్తరాత్‌ | సావిత్రః సాలయః కుడ్యాస్తథా త్రింశాంశతః పృథక్‌. 19

కుడ్యపృథూపజం ఘోచ్చాత్కుడ్యం తు త్రిగుణోచ్ఛ్రయమ్‌ | కుడ్యసూత్రసమా పృథ్వీ వీథిబేదాదనేకధా. 20

భ##ద్రే తుల్యం చ వీథీభిర్ద్వారవీథీ వినాగ్రతః | శ్రీజయం వృష్ఠతో హీనం భద్రో7యం పార్శ్వయోర్వినా. 21

గర్భపృథుసమా వీథీ తదార్దార్థేన వా క్వచిత్‌ | వీథ్యర్ధేనోపవీథ్యాద్యమేక ద్విత్రిపురాన్వితమ్‌. 22

సామాన్యాన్యగృహం వక్ష్యే సర్వేషాం సర్వకామదమ్‌ | ఏకద్విత్రిచతుఃశాలమష్టశాలం యథాక్రమాత్‌. 23

ఏకం యామ్యే చ సౌమ్యాస్యం ద్వే చేత్పశ్చాత్పురోముఖమ్‌ |

చతుఃశాలం తు సామ్ముఖ్యాత్తయోరిన్ద్రేన్ద్రముక్తయోః. 24

శివాస్యమమ్బుపాసై#్యష ఇన్ద్రాస్యేయమసూర్యకమ్‌ | ప్రాక్సౌమ్యస్థే చ దణ్డాఖ్యం ప్రాగ్యామ్యే వాతసంజ్ఞకమ్‌.

ఆప్యేన్దౌ గృహబల్యాఖ్యం త్రిశూలం తద్వినర్దికృత్‌ | పూర్వశాలావిహీనం స్యాత్సుక్షేత్రం వృద్ధిదాయకమ్‌.

యామ్యే హీనే భ##వేచ్ఛూలీ త్రిశాలం వృద్ధికృత్పరమ్‌ | యక్షఘ్నం జలహీనౌకః సుతఘ్నం బహుశత్రుకృత్‌.

ఎనుబది ఒక్క పదములు గల వాస్తు చక్రము చెప్పబడినది. శతపదమండలము గూడ ఉండును. దానిమీద కూడ వెనుకటివలెనే దేవతాపూజ చెప్పబడినది. శతపదచక్రమునందు మధ్య నున్న పదునారు పదములపై బ్రహ్మను పూజించవలెను. బ్రహ్మకు పూర్వాదిదిశలందున్న మరీచి-వివస్వత్‌-మిత్రపృథ్వీధరులును పదేసి పదములపై పూజించవలెను. ఈశాన్యాదిదిక్కులందున్న దితి-ఈశ-అగ్ని-పూషన్‌-పితృ-పాపయక్ష్మ-రోగదేవతలు ఒకటిన్నర పదములపై నుందురు.

స్కందా! ఇపుడు యజ్ఞాదులకై కావలసిన మండపములను, క్రమముగా, సంక్షేపముగా వర్ణించెదను. ముప్పది హస్తముల పొడవు, ఇరువదిఎనిమిది హస్తముల వెడల్పు ఉన్న మండపము శివునకు ఆశ్రయము. పొడవువెడల్పులలో పదకొండు చొప్పున తగ్గించగా, పందొమ్మిది హస్తముల పొడవు, పదునేడు హస్తముల వెడల్పు ఉన్న మండపము శివసంజ్ఞకము. ఇరువదిరెండు హస్తముల పొడవు, పదునైదు హస్తముల వెడల్పు ఉన్న మండపమునకు సావిత్రమని పేరు. ఇతర గృహముల విస్తారము అంశికముగ నుండును. గోడఎత్తు దాని లావైన ఉపజంఘ ఎత్తునకు మూడు రెట్లు ఉండవలెను. గోడకొరకై ఎంత సూత్రమానము నిశ్చితమైనదో అంతయే దాని ఎదుట నుండు భూమి ఉండవలెను. అది వీథీభేదముచే అనేకవిధములనుండును. భద్రనామక ప్రాసాదమునందు ద్వారవీథి వీథులతో సమానముగనే ఉండవలెను. శ్రీజయ మనుప్రాసాదమునందు ఉండు ద్వారవీథిలో దానియందు వీథిపృష్ఠభాగ ముండదు. ద్వారవీథిలో వీథీపార్శ్వభాగమును తగ్గించినచో అట్టి ద్వారవీథి కల ప్రాసాదమునకు 'భద్ర' మని పేరు. వీథీవిస్తారము గూడ గర్భవిస్తారము వలె నుండవలెను. కొన్ని చోట్ల దాని సగముతోను, లేదా నాల్గగవంతుతో సమానముగా ఉండును. ఉపవీథులను వీథిలో సగము ప్రమాణ ముండునట్లు నిర్మించవలెను. దానికి ఒకటి లేదా రెండు, లేదా మూడు పురము లుండవలెను. ఇపుడు ఇతర మైన సాధారణగృహములను గూర్చి చెప్పుచున్నాను. ఆ గృహమును ఆ ఆకారముతో నిర్మించినచో అది సమస్త మైన కోరికలను సఫలముచేయును. దానిలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, లేదా ఎనిమిది శాలలు ఉండవలెను. ఏకశాలగృహముయొక్క శాల దక్షిణభాగమును నిర్మింపబడును. దాని ద్వారము ఉత్తరము వైపున ఉండును. రెండుశాలలను నిర్మించు పక్షమున వాటిని పశ్చిమమునందును, తూర్పునందును నిర్మింపవలెను. వాటి ద్వారములు ఎదురెదురుగా ఉండవలెను. నాలుగు శాలల గృహమునకు నాలుగు ద్వారములు, నాలుగు అరుగులు ఉండును గాన అవి సర్వతోముఖముగ నుండును. అది గృహ స్వామికి కల్యాణకరము. పశ్చిమము వైపు రెండు శాలలుండు ద్విశాలాగృహమునకు 'యమసూర్యకము' అని పేరు. తూర్పు, ఉత్తరముల వైపు శాలలున్నచో ఆ గృహమునకు 'దండ' మని పేరు. పూర్వదక్షిణముల వైపు రెండు శాల లున్నచో దానికి 'వాతము'అని పేరు. త్రిశాలాగృహమునందు తూర్పువైపు శాల లేనిచో దానికి సుక్షేత్రము అని పేరు. అది బుద్ధిదా యకము. దక్షిణమున తప్ప ఇతర దిశలందు శాల లున్నచో దానికి 'విశాలము' అని పేరు. కులక్షయకరము. చాల భయదాయకము. పశ్చిమమున శాల లేని విశాలగృహమునకు 'పక్షఘ్నము' అని పేరు. అది పుత్రహానికరము. అనేక శత్రుకారము.

ఇన్ద్రాదిక్రమతో వచ్మి ధ్వజాద్యష్ట గృహాణ్యహమ్‌ | ప్రక్షాళానుస్రగావాసమగ్నౌ తస్య మహానసమ్‌. 28

యామ్యే రసక్రియా శయ్యా ధనుఃశస్త్రాణి రక్షసి | ధనుభుక్త్యమ్బుపేశాఖ్యే సమ్యగన్ధౌ చ మారుతే. 29

సౌమ్యే ధనపశూ కుర్యాదీశే దీక్షావరాలయమ్‌ | స్వామిహస్తమితం వేశ్మ విస్తారాయామపిణ్డికమ్‌. 30

త్రిగుణం హస్తసంయుక్తం కృత్వాష్టాంశైర్హృతం తథా|తచ్ఛేషో7యం స్థితస్తేన వాయసాన్తం ధ్వజాదికమ్‌.

త్రయః పక్షాగ్నివేదేషు రసర్షివసుతో భ##వేత్‌ | సర్వనాశకరం వేశ్మ మధ్యే చాన్తే చ సంస్థితమ్‌. 32

తస్మాచ్చ నవమే భాగే శుభకృన్నిలయో మతః | తన్మధ్యే మణ్డపః శస్తః సమో వా ద్విగుణాయతః. 33

ప్రత్యగాప్యే చేన్దుయమే హట్ట ఏవ గృహావరీ | ఏకైక భవనాఖ్యాని దిక్ష్వష్టాష్టక సంఖ్యయా. 34

ఈశాద్యదితికాన్తాని ఫలాన్యేషాం యథాక్రమమ్‌ | భయం నారీ చలత్వం చ జయో వృద్ధిః ప్రతాపకః. 35

ధర్మః కలిశ్చ నైస్వ్యం చ ప్రాగ్ద్వారే ష్వష్టసు ధ్రువమ్‌ |

దాహో7సుఖం సుహృన్నాశో ధననాశో మృతిర్థనమ్‌. 36

శిల్పిత్వం తనయః స్యాచ్చ యామ్యద్వారఫలాష్టకమ్‌ | ఆయుఃప్రవ్రాజ్యసస్యాని ధనశాన్త్యర్థ సంక్షయాః. 37

శోషం భోగం చాపత్యం చ జలద్వారఫలాని చ | రోగామదార్తిముఖ్యత్వం చార్థాయుః కృశతా మతిః. 38

మానం చ ద్వారతః పూర్వే ఉత్తరస్యాం దిశి క్రమాత్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే గృహాదివాస్తుర్నామ పఞ్చాధిక శతతమో7ధ్యాయః.

ఇపుడు పూర్వాదిదిక్ర్కమమున ధ్వజాదిగృహముల నెనిమిదింటిని గూర్చి చెప్పెదను. స్నానగృహ-అనుగ్రహ గృహములను తూర్పునను, వంటయిల్లును అగ్నేయమునను, శయ్యా-రసక్రియల గృహమును దక్షిణమునందును, శస్త్ర గృహమును నైరృతియందును, ధనరత్నాదుల కోశాగారమును పశ్చిమమునందును, అన్నగృహము వాయవ్యమునందును, ధనపశ్వాదులను ఉత్తరమునందును, దీక్షాగృహమును ఈశాన్యమునందును నిర్మింపవలెను. గృహస్వామి హస్తముచే కొలవబబడిన గృహపిండము పొడవు వెడల్పుల హస్తమానమును మూడుచే గుణించి ఎనిమిదిచే భాగించవలెను. అట్లు భాగించగా వచ్చిన శేషమును బట్టి ఈ ధ్వజాద్యాయములు ఏర్పుడును. దానిని పట్టియే శేషించినచో దానిని బట్టి శుభాశుభఫలము లేర్పుడను. గృహాయము మధ్యమము (ఐదవది) కాని, (చివరిది) కాకము గాని అయినచో అట్టి గృహము సర్వనాశకర మగును. అందుచే ఎనిమిది భాగములను విడచి, తొమ్మిదవ భాగమునందు నిర్మించిన గృహము శుభకరము. ఆ నవమభాగమునందే మండపము ఉత్తమముగా భావింపబడుచున్నది. దాని పొడవు వెడల్పులు సమముగా నుండవలెను. లేదా వెడల్పుకంటె పొడవు రెట్టింపు ఉండవలెను. తూర్పునుండి పశ్చిమము వైపునకు, ఉత్తరమునుండి దక్షిణమునకును, బజారునందే గృహపంక్తి కానవచ్చును. ఒక్కొక్క ఇంటికి, ప్రతిదిక్కునకును ఎనిమిదేసి ద్వారము లుండవచ్చును. ఈ ఎనిమిది ద్వారములకు వేరు వేరు ఫలము లున్నవి. పూర్వదిక్కునందున్న ఎనిమిదిద్వారములకును భయము, స్త్రీ, చాపల్యము, జయము, వృద్ధి,ప్రతాపము, ధర్మము, కలహము, నిర్ధనత అనునవి తప్పక జరుగు ఫలములు, దక్షిణదిక్కునం దున్న ఎనిమిది ద్వారములకు దాహ-దుఃఖ-సుహృన్నాశ-ధనశాన-మృత్యు-ధన-శిల్పజ్ఞాన-పుత్రప్రాప్తులు ఫలము. ఆయుస్‌-సంన్యాస-సస్య-ధన-శాంతి-అర్థనాశ-శోషణ-భోగ-సంతానప్రాప్తులు పశ్చిమద్వారఫలములు, రోగ-మద-ఆర్తి-ముఖ్యతా-అర్థ-ఆయుః-కృశతా-మానములు ఉత్తర ద్వారఫలములు.

అగ్ని మహాపురాణమునందు గృహాదివాస్తు వను నూట ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters