Satyanveshana    Chapters   

భక్తి యోగము

ముముక్షువు తరించుటకు వివిధయోగముల ప్రపంచించిన భగవద్గీతయందు కర్మభక్తిజ్ఞానములు ముఖ్యములని తెలిసికొంటిమి. అధికార తారతమ్యమునుబట్టి ఆయామార్గములు అనుసరణీయములనియు ఆ మూడు మార్గములు పరస్పరసంబంధము గలిగి పరస్పరాశ్రయమువలన భాసిల్లు చున్నవనియు గ్రహించితిమి. కొందఱు భక్తియోగము ఇతరయోగముల కంటె ఎక్కువగ ఆచరనీయమనియు, ముక్తి ప్రదాయిని అనియు చెప్పుదురు. ఏలనన భగవంతుని చేరుటకు అది అత్యంతసులభ##మైన మార్గమని చెప్పుదురు. పూర్వమీమాంసయందు ప్రతిపాదితమైన కర్మమార్గమునకు కుమారిలభట్టు ప్రాధాన్యమీయగా ఉత్తరమీమాంస ప్రతిపాదించిన జ్ఞానమార్గమునకు ఆదిశంకరులు ప్రాధాన్యమిచ్చి వీరిరువురుకూడ భక్తిమార్గమును కాదనలేదు. కర్మయోగమున చెప్పబడిన అన్నికర్మలకు అందఱికి అధికారము లేనందున, ఆ కర్మలుకూడ విధిని షేధములతోగూడి ఆచరణకష్టమగు టను, జ్ఞానమార్గము మధ్యమ మందాధికారులకు అదుబాటులో నుండనందునను, అపండితులకు, సామాన్యులకు, సహితము అందుబాటులో నుండు ముక్తిమార్గముగ శ్రీమద్రామానుజులు ప్రచారముచేసిరి ముఖ్యముగ అందరికి అనగా గృహస్థులందరికి కర్మభక్తి మార్గములు అనుసరణీయము లంటిమి. ముముక్షువునకు సగుణోపాసన నిర్గుణోపాసనలు రెండును ముఖ్యములేననియు అందు సుగుణోపాసనయే సుకరమగు మోక్షసాధన మనియు కొంతవఱకు గుర్తించితిమి. అట్టి యుపాసన భక్తిరహితముగ నుండజాలదనియు నెఱింగితిమి. ఆస్తికబుద్ధికలవారగుచు తమధర్మమును, తమ ఆశ్రమమును తమజనులను, పుత్రమిత్ర కళత్రాదులను వారివారి వృత్తులను, లక్షణములను, వీడకయే విశ్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వాత్మకుడునగు పరమేశ్వరుని ఉపాసించుటకు భక్తినిమించిన సులభ##మైన మార్గములేదు. విషయముల పరిత్యాగము, ఆశ్రమధర్మానుష్ఠానము, యమనియమాద్యభ్యాసము, ఆసత్ర్పత్యము, నిరాకారమునందు మనసును కేంద్రీకరించుట యనునవి కష్టసాధ్యములు, క్లేశముతో గూడినవి. అనాయాసముగా, అక్షరోపాసన సిద్ధించుటకు భక్తితోచేయు సగుణోపాసన ముముక్షువులకు అవస్వకర్తవ్యము. సగుణోపాసననయందు నిష్ఠ బలీయమైనకొలది, ఆ ఉపాసనదేవతయందు భక్తిభావము బలీయమగుచు, దృఢపడుచుండును. నిర్గుణోపాసన సగుణోపాసనలకు సాధ్యసాధన భావనముండుటచే ముందు సాధనరూపమే ముఖ్యాచరణీయము.

అధికారులైన మహాత్ములకు బ్రహ్మజ్ఞానము సులభ##మే, మోక్షమును సులభ##మే. అనధికారులైన ముముక్షువులు భగవంతునియందు భక్తి భావముకలిగి తమ స్వధర్మముల నెఱవేర్చుచున్నచో భగవంతుడట్టివారికి అతిసులభుడై ఎల్లప్పుడు వెంటనంటియే యుండును. స్వధర్మ తత్పరుడై ప్రాప్తించినదానితో తృప్తిజెందుచు, త్రివర్గ ధర్మవృత్తి మోక్షాసక్తితో మితాహారుడగుచు, అహింస, సత్యము, శౌచాదుల పాలించుచు, స్వాధ్యాయనము, భగవతారాధన చేయుచు మనోనిగ్రహముకలిగి పరమేశ్వరుని ప్రార్థించుచు, తిరస్కార పురస్కారములకు చలింపకుండుటయు, భగవంతునియెడ జ్ఞానకర్మేంద్రియములను, ఏకాగ్రమనస్సుతో పరాభిసంధి విడచి అప్రయత్నముగ వర్తించుటయు, సర్వభూతములయందు నమతాభావ ముంచుటయు భక్తుని లక్షణములు. వైరాగ్యము, యోగము, జీవగుణములైతే, అవి యుత్తమజీవులకే లభించును కాని భక్తియు, జ్ఞానము, అనునవి దైవగుణములు అవి యుత్తమోత్తములకే లభ్యమగును.

సమస్తాధారభూతమైన పరమాత్మవలె, సమస్తయోగములకు భక్తి ప్రాణాధారసూత్రము, పరమాత్మ రాగద్వేషవిహీనచిత్తులకు నులభుడు. పరమాత్మను సులభముగ జేరవలయునన్న మానవుడు తనమనసునుండి రాగద్వేషాదుల బారదోలవలయును. ఉదయాస్తమయముల, భగవంతుని ప్రార్థించవలయును. భగవద్బక్తులు కోరినను కోరకున్నను భగవంతుడు వారికి కవాలసినది ప్రసాదించి చివరికి ముక్తినిచ్చును. కాన జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తియోగమే పరమాత్మవిషయమున కర్తవ్యము. నామ సంకీర్తన, భక్తీదృవపడుటకు సాధనము భగవత్కధావర్ణనంబు ముక్తి హేతువు, చిరవైరాగ్య జ్ఞానజనకమగు భక్తీవిధానము గోవిందవరకధా వర్ణనయే యగును.

''ఏకథలయందు పుణ్య

శ్లోకుడు హరి చెప్పబడునో సూరిజనులచే

యాకథలు పుణ్యకథలని

యాకర్ణించెదరు పెద లతిహర్షమునన్‌'' (భాగ)

నియమపూర్వకముగ భగవద్గుణనామముల గీర్తించినను, ఆ సంకీర్తనము వినినను పాప క్షయమగును. భక్తివలన చిత్తశుద్ధిగలిగినటుల వ్రతాదులవలన గలుగదు. కులము, రూపము, తపము, పాండిత్యము, ఇంద్రియనైపుణ్యము, కాంతి, ప్రతాపములు, బలము, ఉత్సాహము, బుద్ధి, ఆష్టాంగయోగములు, మొదలగునవి యేవియు భక్తియోగమువలె భగవంతుని వశీకరించి ఆ భక్తజన సులభుని దయను సంపాదింపలేవు. శ్రద్ధాన్వితమైన భక్తి ఛండాలునేనియు జాతిదోషముతోగూడ పవిత్రుని చేయును. సత్సదయోపేతమైన ధర్మముకాని, తపోయుక్తమైన విద్యగాని, భగవద్భక్తి రహితుని, పాపపంకిలమునుండి క్షాళితుని చేయలేవు. భక్తునకు మనోవాక్కాయకర్మల సర్వభూతములందును భగవద్భావమే. అన్నియు స్రేమాస్పదములే; అందుచే భక్తుడు బ్రహ్మవిదుడు కావచ్చును. యోగులకు సహితము బ్రహ్మసిద్ధి విషయమున భగవద్భక్తితో సాటివచ్చు ఉత్తమ మార్గము వేఱొండు కానబడదు.

భక్తి, తామసభక్తి, రాజసికభక్తి, సాత్వికభక్తీయని మూడువిధములని చెప్పుదురు. హింసనొండె, దంభమునొండె, మత్సరముననొండె సంకల్పించి క్రోధియై, భేదర్మముచేయుట, తామసభక్తి. హిరణ్యకశ్యపాదులది క్రోధభక్తి యంటిమికదా అదియే తామసభక్తి రాజసిక తపము వంటిదే రాజసికభక్తి. తపస్వికి భక్తి ప్రధానమేకద. విషయసుఖముల గోరియో, యశముగోరియో, అధికారముకోరియో, ప్రతిమాదుల నర్చించుట రాజసికభక్తి. ధృవాదులు ఈ భక్తకి ఉదాహరణము. పాపక్షయార్థము కాని, పరమేశ్వర ప్రీత్యర్థముకాని అభేదమతిని ఉండుభక్తి సాత్వికభక్తి ప్రతిఫలాపేక్షరహితమగుట ఉత్తమోత్తమము, భక్తీప్రభావము భాగవత మునందు ఇటుల వర్ణింపబడినది.

ఆ వె. కర్మతంత్రుడగుచు గమలాక్షు గొలుచుచు

నుభయ నియతివృత్తి నుండెనేని

జెడును కర్మమెల్ల శిధిలమై మెల్లన

ప్రబలమగుచు విష్ణుభక్తి సెడదు. (భాగ)

కం. చాలదు భూపత్వము

సాలదు దేవత్వ మధిక శాంతత్వంబున్‌

జాలదు హరి మెప్పింపగ వి

శాలోద్యములార భక్తి సాలిన భంగిన్‌

కం. చిక్కడు వ్రతముల గ్రతువుల

జిక్కడు దానముల శౌచశీల జపములన్‌

జిక్కడు యుక్తిని, భక్తిని

జిక్కినక్రియ నచ్యుతుండు సిద్ధముసుండీ''

గృహస్థులకు శ్రద్ధాభక్తు లుండవలయుననికదా యంటిమి. ఏ కర్మ చేయుటకునైన మూలకారణము భగవంతునియందుమానవునకు నుండవలసినదిభక్తిభావమే. భక్తి రెండురకము లనవచ్చు. ఐహిక విషయసంబంధియైన భక్తి పరమగుభక్తి. ఐహికసంబంధియైన భక్తియనగా మానవులకు మాతాపితలయందు, పెద్దలయందు, గురువులయందుగల భక్తి. భక్తి ప్రేమకు మరొక రూపము. లేదా, రెంటికిని అవినాభావసంబంధమున్నదనియైన అంగీకరించవలయును. మనము ప్రేమించనివారియెడ మనకు భక్తి యుండదు. పైగా ద్వేషముకూడ నుండటయు సంభవమే. మానవుడు తన తలిదండ్రుల ప్రేమించును. వారియెడ గౌరవభావముండును. అనగా భక్తి భావ ముండునన్న మాట. అటులనే గురువులను ప్రేమించి గౌరవించును. అనగా గురువులయెడ భక్తికలిగి యుండునన్నమాట. మొదటిది ప్రేమ చనువుతోగూడిన భక్తి. రెండవది కొంచెము భయముతోగూడిన భక్తి. తలిదండ్రులు తమ పిల్లలను ప్రేమింతురు. ప్రేమ, భక్తి యొకటియే యనిన, ఈ ప్రేమను భక్తియనవచ్చునా? పిల్లలకు మాతాపితలయెడనుండు ప్రేమ, ఆప్యాయత శ్రద్ధలతో గూడియుండును. తలిదండ్రులకు తమ పిల్లలయందుండు ప్రేమ, వాత్సల్యరూపముననున్న శ్రద్ధ, అదియు భక్తికి మారురూపమే. అటులనే గురువులకు శిష్యులయందుగల ప్రేమ వాత్సల్య రూపమున నున్న శ్రద్ధయే, అభిమానమే, అదియుకూడ భక్తి యక్క మారురూపమే. అటులనే పెద్దలయెడ పిన్నలకు భక్తి, పిన్నలయెడ పెద్దలకు వాత్సల్యము, ఈ ప్రేమనే భగవత్పరముగా చెప్పుకొనిన, అది పరమునందు భక్తియగును. మానవుడు భగవంతుని ప్రేమించును. కాన భక్తిచూపును. ప్రేమలేనిచోట భక్తి యుండదుకదా. గురువునందు భక్తి భయముతో గూడియున్నటులనే భగవంతునియందు భక్తునకుగల భక్తి కొంతవరకు భయముతో శ్రద్ధతో గూడియుండును. కాని భగవంతుని ప్రేమించి తానే భగవంతుడనను ఐక్యభావముతో చనువుదీసికొనిన భక్తులు లేకపోలేదు. సర్వవిషయముల తననే నమ్మి, తనయందు భక్తి ప్రేమలుగల భక్తుని భగవంతుడు ప్రేమించును. కృపాఝరిచే పునీతుని చేయును. అది వాత్సల్యము. అనుక్షణము రక్షించుచునే యుండును. కో యన పలుకును. అది ఆ భక్తిప్రియుని వాత్సల్యము. భక్తునకు భగవంతునియందు భయభక్తులుండుటయేకాక, భగవదాదేశముల పాలించుటలోకూడ శ్రద్ధయుండుననుట సువిదితము.

ఇహలోక పరలోక సుఖముల గోరుచు వానికొరకు మాత్రమే, అనగా కాంక్షసహిత భక్తి గలిగియుండుట, అధమభక్తి. మోక్షము కలుగునుగదా యను భావముతో గూడియున్న అది మధ్యమభక్తి ఏ లాభము కోరక ప్రతిఫలాపేక్ష లేకుండుట ఉత్తమభక్తి Devotim for Devotions sake అట్టి భక్తి నిష్కామ కర్మవంటిది. తలిదండ్రలు తనకేదో మేలుచేయుచున్నారు. చేయుదురు అని పుత్రుడు వారియందు భక్తికలిగియుండుట సరియైన భక్తికాదు. గురువులవలన ఏదోలాభము కలుగునుగదాయని వారియెడ భక్తి ప్రదర్శించుటయు మంచిపద్ధతికాదు. అందుచే ప్రతిఫలాపేక్షరహితముగ మాతా పిత గురుదైవతములయెడ భక్తీ గలిగియుండుట ఉత్తమమైన పద్ధతి త్రికరణశుద్ధిగా భవంతుని పాద పద్మముల మఱవకుండుట భక్తీ.

కం. నీపాద కమల సేవయు

నీపాదార్చకుల తోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయు

తాపసమందార నాకు దయచేయగదే. (భాగ)

అను భావము ప్రతిమావునకు గలుగవలయును. అట్టి భక్తునకు ప్రత్యేకలక్షనములుండును. భూతదయ సకలప్రాణికోటియందు సమత్వ బుద్ధి కష్టములనుండి వాటిని తప్పించుటకు మార్గాన్వేషణ భక్తుని కర్తవ్యములలో కొన్ని జ్ఞానులకు వలెనె 'ఆత్మవత్‌ సకలభూతాని' అనుశ్రుతి వాక్యము భక్తునకు ప్రమాణమే. సుఖదుఃఖముల జయాపజయముల సమదృష్టితో చూడవలయును.

జయము, శుభము, కలిగినంత; అంతయు, తనప్రతాపమువలన, శక్తీ సామర్ధ్యములవలన, కలిగినవని, భావించి, ఉబ్బిపోవుట, మానవ సహజము. ఆ మానవుడే కష్టములు, నష్టములు, ప్రాప్తించిన, దుఃఖము కలిగిన అవి స్వయంకృత దుష్కర్మఫలములని భావింపక, ఎవరో జేసిరని కాని, భగవంతుని నిర్దయవలన సంభవించినవనికాని, తలంచుట శుద్ధ అజ్ఞానము. తనకు కలిగిన నష్టము దుఃఖము తాను తెలిసియో తెలియకయో చేసిన దోషములకు భగవంతుడు ఈ జన్మలోనే విధించిన శిక్షలుగ మానవుడు భావించగలిగినచో దుఃఖమునుగూడ సుఖములుగా సంతోషముతో స్వీకరింపగలడు. ప్రపంచమునందు మానవునకు గలుగు దుఃఖములుకూడ ఒకవిధముగ వానిమంచికే. అట్టి దుఃఖములు కష్టములు శరీరమునందును ప్రపంచమునందును అభిమానము మమకారము తగ్గించుటకు పరమాత్మ యెడ దృష్టి మరల్చుటకు సహాయకారులగును. భగవంతుని అనుగ్రహము పొందుటకు ముందు సాధనకాలమున కొన్ని కష్టములు దొరలుటయు కలదు. అది యొకవి మగు పరీక్ష. అప్పుడుకాని ఈ ప్రపంచవ్యవహారము లందు విరక్తి పరమాత్మయందు భక్తీ కుదురదు. ఈ తత్వము తెలిసినచో మానసికముగ తృప్తికలుగును.

అటుల భగవతునియందు నిశ్చలమైన మనసు నిలుపలేని మందప్రజ్ఞులకు 'మత్కర్మ పరమోభవః' నాసంబంధమైన పనులు చేయుము. అని భగవంతుని ఆదేశము. శ్రీమద్రామానుజులు ఈవిధముగ మత్కర్మలునిర్ణయించిరి; అలయనిర్మాణోద్యాన, కరణ, ప్రదీపారోపణ, మార్జన, భ్యుక్షణోపలేపపుష్పహరణ, పూజాప్రవర్తన, నామసంకీర్తన, ప్రదక్షణ, స్తుతినమస్కారములు, రామార్పణముగ, కృష్ణార్పణముగ సమర్పంపవలయును. భక్తుడు స్థిరమతి. శత్రుమిత్రభేదములేదు. వానికి వేదములు శాస్త్రములు ప్రమాణముల. ఒకమానవుని బుద్ది ఏమాత్రం ప్రమాణంకాదు. వేదములు ప్రపంచించిన కర్మలందు వర్తించుచుండును. భగవంతునియందు మనసు లగ్నముచేసి వారివారి ధర్మములు భక్తులు శ్రద్ధతో నెఱవేర్తురు. మానసమందు పరమాత్ముని నిలుపుటవలన వారికి అన్నిబాధలు నశించును; అవి బాధలుగానే తోచవు. కలిగినభాధలను భక్తులు వరములుగా స్వీకరింతురు. భక్తి అనేకరూపముల ప్రవర్థమగుచున్నది.

శ్లో. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌

ఇతి పుంసార్పితా విష్ణౌభక్తి శ్చేనవలక్షణా

క్రియతే భవత్యర్థా స్మన్యేధీరముత్తమం.

అని భక్తి మార్గము. నిర్వచింపబడినది అనగా శ్రవణం, కీర్తనము, నామస్మరణము, పాదసేవనము అర్చనము వందనము, దాస్యము, సఖ్యము ఆత్మనివేదనము, అనునవి నవవిధ భక్తిమార్గములు. వివ నాలుగు యుగముల నాలుగువిధములుగ ఆచరణలోనున్నవి కృతయుగములో ధ్యానమువలన త్రేతాయుగములో యజ్ఞము, కర్మయోగముల వలన, ద్వాపరమున పరిచర్య సఖ్యమువలన, కలియుగములో సంకీర్తనమున, మానవులు తరింతురని చెప్పబడినది.

శ్లో. విష్ణు శ్రవణ పరీక్షదభవద్వై యసకః కీర్తనే

ప్రహ్లాద స్మరణ దదంఘ్రి భజనే లక్ష్మీః పృధుః పూజనే

అక్రూర స్తఖినందనే కపిపతి ద్దాస్యేచ సఖ్యేర్జునః

సర్వస్వాంత నివేదనే బలి రభూతైః వల్యమేషాం ఫలే

శా. కామోత్కంఠత గోపికల్‌, భయమునం గంసుండు వైరక్రియా

సామగ్రిన్‌ శిశుపాల ముఖ్య నృపతుల్‌ సంబంధులై వృష్ణులున్‌

బ్రేమల్‌ మీరలు భక్తి నేమునిదె చక్రింగంటి మెట్లయిన ను

ద్దామధ్యాన గరిష్ఠులైన హరి చెందన్‌వచ్చు ధాత్రీశ్వరా.

వివిధ మార్గముల భగవంతుని సేవించి తరించిన మహాత్ముల చరితము లనేకములు కలవు. అందు స్మరణభక్తికి యోగవ్రత తపోయజ్ఞాది సాధనంబులు కాని, వేదాధ్యయనాదులుగాని, తర్కమీమాంస వ్యాకరణ జ్యోతిష శాస్త్రాదులందు పరిచయముకాని అవసరములేదని గ్రహించియే యుంటిమి.

భగవంతుని అవతారముల ఆవశ్యకతను గురించి కొంత పరిశీలించితిమి. ఆయా అవతారలీలలు అందు ముఖ్యముగా కృష్ణావతారలీలల అంతరార్ధము గ్రహించుట చాలకష్టము. స్థూలబుద్ధికి దోషైక దృక్కులగు పరమతస్తులకు లోపములుగ తోచవచ్చును. కాని కొంచెము శ్రమించి ఆలోచించిన వాటి అంతరార్థము గోచరము కాకపోదు. ఒకటి రెండు మాత్రము కించిత్తు పరికింతము రాధాకృష్ణుల ప్రణయము చెడుగా, అసభ్యముగా అర్థముచేసికొనినవారు సామాన్యులేకాదు, కవులుకూడ గలరు. గోపాంగనలు శ్రీకృష్ణునితో విహరించిరని, రాసక్రీడాదు లాడిరని, భాగవతమున కలదు. ఆ సమయమునకు శ్రీకృష్ణపరమాత్మకు నవవర్షములైన నిండలేదు. రాధ, గోపాంగనలు; వయసుమీరినవారు అట్టిచో రాధామాధవుల ప్రణయమునుగాని గోపికల ప్రణయమునుగాని కాముక వ్యాపారముతో ముడివెట్టుట అసంగతము. మధురమోహనమూర్తియగు ఆ బాల కృష్ణుడు, తన మహిమవలన గోపాంగణాదుల హృదయముల నా కర్షించెను అంతియేకాదు గోగోపాలుర భక్తివిశ్వాసముల చూరగొనెను. అది మధురభక్తి. కాని శారీరక దౌర్బల్యముకాదు. 'అంగనా యంగనా మధ్యరే మాధవం. మాధవం మాధవం మధ్యరేయంగనా' అని రాసక్రీడ వర్ణించుటలో భావమేమి? ప్రతి భక్తుడును తన ప్రక్కను భగవంతుని చూచినాడని భగవంతుడు తన భక్తునిప్రక్క అనవరతము ఉండెననుటకదా అనగా భక్తునకు భగవదంశ ఎల్లవేళల తన నీడవలె గోచరించినదన్నమాట. భగవంతుడు పురుషుడు. భగవంతుని మాయాకల్పిత ప్రకృతియంతయు స్త్రీ పురుషభేద రహితమైన స్త్రీరూపము అనుభావము. ప్రకృతి పరమాత్మ యందు లీనమగుటయే ముక్తి. ఈ భావమే చిన్నెవన్నెలతో అతిశయోక్త్యాది అలంకారములతో అనేక కధలుగ కవులచే చిత్రితమైనది. జనశ్రుతిగా వచ్చుచున్న ఇంకొక అపప్రధ విచారింతము. శ్రీకృష్ణునకు పది యారువేల కాంతాజనము అంతఃపురాంగనులుగ గలరనునది భగవంతుడు భక్తజనపారిజాతము. అనాధులకు నాధుడు. అనగా దిక్కులేనివారికి దిక్కు. పతిత పావనుడు. నరకాసురాది రాక్షసులు అనేకమంది రాచకన్నియల చెరవెట్టిరి. అట్టి రాక్షసులను శ్రీకృష్ణపరమాత్మ సంహరించి ఆ రాచకన్నియల విడిపించెను. ఇక వారిగతియేమి? తలిదండ్రులు, బంధువుల రానీయరు. వివాహమైన యువతులను వారి భర్తలు మరల వారిని పాలింపరు. వారు పతితులు. వారిని పోషించువారెవరు? వారినందరిని పోషించుభారము పతితపావనుడు, జగద్రక్షకుడు, జగన్నాధుడైన, శ్రీకృష్ణపరమాత్మ వహించెను. ఈనాడు సహితము సంఘోద్ధరణమనుపేర పతిత స్త్రీలకు అనాధశరణాలయములు ప్రభుత్వము నెలగొల్పుటలేదా? ఆనాడే అట్టి సంస్కరణను ప్రారంభించిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాత్రముగనైన అర్థముచేసికొనిన కొంతవరకైన భగవంతుని లీలలుకు అంతరార్థ మున్నదని ఊహించగలము.

శ్లో. యోగానా మపి సర్వేషాం మద్గతే నాస్త రాత్మనా

శ్రద్ధవా న్భవతే యోమాం సమేయుక్త తమోమతః (గీ)

అనగా ''యోగులందరిలోను నాయందుంచబడిన అంతఃకరణచేత ఎవడు శ్రద్ధకలవాడై నన్ను సేవించునో, వాడు యోగము కలవారిలో శ్రేష్ఠుడు.'' అని భగవానుని సూక్తి. నామస్మరణమును గురించి శ్రీసమర్థరామదాసస్వామివారు దాసబోధయను గ్రంధములో ఈ విధముగ నుడివిరి. ''బాల్యావస్థయందును, తరుణావస్థయందును, వార్థక్యావస్థయందును, కష్టకాలమందును భగవంతుని స్మరించుచుండవలయును.'' నామస్మరణ మహిమ శివుడు బాగుగ నెరుంగును. అతడు కాశీనగరమున అవతరించి నిజభక్తులకు శ్రీరామనామము నుపదేశించుచుండును. పార్వతీదేవికి ఆధ్యాత్మిక రామాయణ రూపమున రామనామస్మరణ మహిమను విశదము చేసెను. పరమపావనమైన హరినామము నిరంతరము జపించి ప్రహాదుడు ముక్తుడాయెను. రామనామస్మరణచే జడజీవియగు పాషాణము గూడ తరించినది. నామస్మరణమున అసంఖ్యాకులగు భక్తులు ఉద్ధరింప బడిరి. స్మరణభక్తి సర్వజనసాధ్యమైనది. ముముక్షువులు తరించుటకు ఇంతకంటె సులభోపాయము లేదు.

ప్రహ్లాదుడు పుట్టిననాటినుండియు వాసుదేవునియందు సహజ సంవర్థమాన నిరంతర ధ్యానరీతుడై

సీ. శ్రీవల్లభుడు దున్ను జేరిన యట్లయిన

జెలికాండ్ర నెవ్వరి జేర మరచు

నసురారి తనమ్రోల నాడిన యట్లయిన

నసుర బాలురతోడ నాడమరచు

సురవంద్యు దనలోన జూచిన యట్లయిన

జొక్కి మస్తంబు జూడ మరచు

భక్తవత్సలుడు సంభావించి నట్లయిన

పరభాషలకు మారు పలుకమరచు

గీ. హరిపదాంభోజ యుగజింతనా మృతమున

నంతరంగంబు నిండినట్లయిన నతడు

నిత్య పరిపూర్ణుడగుచు నన్నియును మరచి

జడతలేకయు నుండును జడుని భంగి. (భాగ)

అట్టి ప్రహ్లాదుడు సర్వవేళలయందును సంకీర్తనంబు జేయుచు శ్రీహరి తన ప్రక్కనే యుండినటుల సాన్నిధ్య సౌఖ్య మనుభవించు చుండువాడు. పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతంబైన ముకుందు చరణారవింద సేవాతిరేకంబున, నఖర్వ నిర్వాణ భావము విస్తరించుచు, దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తం బన్యాయత్తంబు కానీక, అప్రమత్తుడైన సుగుణగరిష్ఠుడు. పరమ భాగవత శ్రేష్ఠుడు. అడుగడుగునకు మాధవానుచింతన సుధామాధుర్యమున మేను మరచువానిని, అంభోజగర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని, తనలోన అఖిల ప్రపంచంబు శ్రీమహావిష్ణుమయముగా భావించువానిని, హిరణ్యకశ్యపుడు ఘోరశిక్షల బాల్సేయ, సర్వాత్మకంబై నిట్టిదట్టిదని నిర్ధేశింపరాని పరబ్రహ్మంబు దానయై యమ్మహావిష్ణువునందు చిత్తంబుచేర్చి పరమానందంబునంది బాధలను బాధలుగ పరిగణింపని ప్రహ్లాదుని చరిత్ర భక్తుల చరిత్రలలో అతిముఖ్యమైనది. భక్తుడు మనోవాక్కాయకర్మల భగవంతునే నమ్మి భగవంతునే స్మరించుచు, మర్కట కిశోర న్యాయమున, మనసును చిక్కబట్టియున్న, భగవంతుడు మార్జాల కిశోరన్యాయ మున భక్తునకు ఎట్టి ఆపదలు కలుగకుండ రక్షించి తరుణోపాయము చూపును. చంటిపిల్ల ఏమియు అడుగకున్నను తల్లి ఆయా సమయముల అవసరముల గుర్తించి పోషణ చేయుచున్నది. అటులనే ఎవడైతే యేమియు ఆలోచించకుండ ఏమియు కోరకుండ, తన శరీరమేకాక, తన సర్వస్వము పరమేశ్వరుని సొత్తేయని, భగవంతునియందు ఏకీభావము గలిగియుండి భక్తితో భజించునో వాని యోగక్షేమములు, వానికి కావలసిన మేలు అన్నియు భగవంతుడే సమకూర్చును. మనకు ఏది మంచిదో ఏది మంచిదికాదో మనకు తెలియదు. సర్వమునకు భగవంతునిమీదనే భారముంచి, భక్తిగలిగి సన్మార్గులమైయున్న మనకు కావలసిన మేలు భగవంతుడే సమకూర్చును.

శ్లో. అనన్యాశ్చిన్తయన్తోమాం యేజనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ (గీ)

పరమాత్మయందు మనకు నిశ్చలమైన భక్తి యున్న యెడల అరణ్య ములనున్నను మనకు ఏలోపము జరుగదు. భగవంతుని కృపయున్న ''అడవిరక్షలేక, అబలుడు వర్థిల్లు'' అదిలేనియెడల ''మందిరంబున, రక్షితుండు చచ్చు'' పరమాత్మ నిజభక్తుని సర్వవిధముల కాపాడుటయేగాక ముక్తినిగూడ ప్రసాదించును. 'అన్యధా శరణం నాస్తి' అను అచంచలమైన భక్తియున్నచాలును. అది మూఢభక్తియైనను సరియో. Implieit faith in god. అముక్తమాల్యద కావ్యములో విష్ణుచిత్తు డట్టివాడే. అపఠిత శాస్త్రజాత్యంధుడు. భగవంతుని సేవ, భాగవతులసేవ, తన నిత్యవ్రతముగా భావించిన గృహస్థు. అహంకారదూరుడు. మత్కర్మలచే, విష్ణుసేవ చేయువాడు. అట్టి శాస్త్ర గ్రంధ జాత్యంధుడు. శ్రీమహావిష్ణువు అదేశమున భగవత్ప్రసాదిత జ్ఞానసంపత్తిచే పాండ్యభూపాల సభలో ఇతర మతముల ఖండించి, వైష్ణవమత ప్రాశస్త్యము ఋజువుచేసి స్థాపించెను. అన్ని ఆశ్రమములవారికి కుల వర్ణ లింగ వయోభేదములు లేకుండ, భక్తియే అవసర కర్తవ్యమని చాటెను. భక్తిమార్గములో కలియుగమున భగవంతుని నామస్మరణ సంకీర్తనలు ముక్తిప్రదము లనిగదా చెప్పితిమి.

శ్లో. నామసంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం

ప్రణయో దుంఖఃశమనం తం నమామి హరిం పరం. (భాగ)

ముఖ్యముగా గృహస్థులకు ఈ నామస్మరణ సంకీర్తనలు నిత్యకర్మలతోపాటు ముక్తిప్రదములుగ శాస్త్రములు చెప్పుచున్నవి.

ఎల్లపుడు భగవంతుని పాదములను మనసుననిలిపి, హరినామ సంకీర్తన చేయువారికి పాపములు పటాపంచలగుననియు, ముక్తి గలుగుననియు వేదములు చెప్పుచున్నవి నారదతుంబురాది మహామునులు, సనక సనందాది భక్తులు, నిరంతర హరినామ స్మరణముననే సిద్ధులై పూజనీయులైరి. త్యాగరాజు, క్షేత్రయ్య రామదాసు, కబీరు, జయదేవుడు మొదలగు వారందరు భగవన్నామస్మరణ సంకీర్తమున తరించినవారే.

శ్లో. కలేర్దోషనిధేరాజన్‌ అస్తిహే కో మహిన్‌ గుణ

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధః పరంవ్రజేత్‌.

ధ్యానములు, భజనలు, సమూహిక సంకీర్తనలు కూడ, భక్తిమార్గ మున సాధనమార్గుములని, జెప్పబడినవి. భజనలలో సంకీర్తనలలో భగవంతునియందు ఏకాగ్రత గలిగి, తన్మయావస్థగలుగుటకు అవకాశము కలదు. సంకీర్తనవలన సంకీర్తనాపరులేగాక ఆసంకీర్తన వినినవారును భక్తులగుటకు అవకాశము కలదు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అట్టి సమూహిక భజనలవలన ఆధ్యాత్మిక భావతరంగములు కలుగునని చెప్పుదురు. అందువలన సజ్జన సహవాసఫలము కలగుటయు, మంచి ఆలోచనలు, భగవద్భక్తీ గలుగుననియుకూడ చెప్పుదురు.

అముక్తమాల్యద యందలి మాలదాసరి కథ ఈ సత్యమును ఋజువుచేయుచున్నది. ఆ దాసరి నిరంతరము హరినామ సంకీర్తన దీక్షా పరతంత్రుడు. వానికధ చదివిన భగవంతుని నిస్తుల కృపామృతము జూరుటకు, ఈ కులము ఆ కులము అను భేదముగాని, స్త్రీపురుష భేదముగాని లేవనునది యెరుకపడును ఆ మాలదాసరి విద్యాగంధశూన్యుడు. తన కులోచిత ధర్మముల దప్పనివాడు. బహు సుచి, బ్రహ్మముహూర్తమున మేల్కాంచి విలిపుత్తూరునకు ఏగి, మంగళ##కైశికీ రాగమున విష్ణువును స్తోత్రము చేయుట పరిపాటి. అదియే తన జీవితపరమావధిగ పెట్టికొనినవాడు. వానిని భగవంతు డనుగ్రహించెను. వానిది మూఢభక్తి ఒకనాడు మార్గమధ్యంబున ఒక బ్రహ్మరక్షస్సుచే నిరోధింపబడి, వానికి ఆనాడు విష్ణుసంకీర్తనంబున తనకు ప్రాప్తంబైన పుణ్యఫలము ధారవోసి, వాని బ్రహ్మరాక్షసత్వము బాపిన పుణ్యాత్ముడు. ఆ బ్రహ్మరాక్షసుడు క్రిందటి జన్మలో సోమశర్మయను బ్రాహ్మణుడు. వేదముల, శాస్త్రముల చదివిన వాడే. కాని విద్యాహంకారమున తార్కికులను వాజ్ఞయ్‌పుణి గెలుచుచుండెను శ్రౌతియుల, స్మార్తకర్తల ప్రయోగకారిక గ్రంధముల నపహాస్యము చేయుచు, జెప్పవాదియై హేతువాదమను కుతర్కముతో వేద విహితములును విధినిషేధములతో గూడినవి యగు కర్మల పరిహసించి పరహరించువాడు. వాడు సై#్వరవిహారి. గర్వాంధుడు, ధనాపేక్ష, తిలలోహ మహిష పాదరక్ష దానాదుల, దుర్ధానముల బట్టియు, మైలకూళ్ళు కుడిచియు, కుల బహిష్క్రతులతో బంతికూడు గుడిచియు, అబ్రాహ్మణ కర్మల కాలక్షేపము చేయువాడు స్వీయధర్మమగు బ్రాహ్మణధర్మముల వీడి, ధర్మ భ్రష్టుడగుటయేగాక పరధర్మమగు వైశ్యవృత్తి చేపట్టి మోసము చేయుచు పాపకర్ముడయినాడు. ఆ కారణమున మరణానంతరము వానికి బ్రహ్మరాక్షసత్వము సిద్ధించినది. మాలదాసరి తన సంకీర్తన ఫలమును వానికి ధారవోయగ, వాని రాక్షసత్వము పోవుటయేగాక, వాడు ముక్తుడాయెను. భగవత్‌స్తోత్ర మహిమ అంత మహిమకలది. పాపక్షాళనము చేయు శక్తికలది.

ఈ గాధయందుకొన్ని ధర్మములు ద్యోతకమగుచున్నవి. జాతి ఛండాలుడు ధారవోసిన పుణ్యఫలమున, కర్మఛండాలుడు పునీతుడైనాడు. స్వధర్మమును వీడుట, పరధర్మమనుష్ఠించుట పాపమనిగదా గీతావాక్యము. ఎంతటి యున్నతకులముల జన్మించినను ఎంతటి పండితుడైనను, యుక్తీ వాదమున చారువాక్కుల, జల్పవాదముల వేదముల పరిహసించుట, విమర్శించుట, విపరీతార్థములు చెప్పుట, శాస్త్రములు నిరసించుట, పెద్దల పరిహసించుట నిత్యవిధుల గమనింపకుండుట, దుర్దానములు పట్టుట, దురాన్నములు తినుట, అన్నవిక్రయాదులు సేయుట పాపహేతువగును. సంకీర్తనము చేయువారును, వినువారును కూడ తరింతురనుటకు ఈ గాధయే యుదాహరణము నవవిధ భక్తిమార్గములలో సంకీర్తనమెంత ముక్తి ప్రదమో, భగవన్నామ స్మరణముగూడ, అంత ముక్తి ప్రదము. మానవ శరీరమునకు చక్షు శ్రవణంద్రియాదుల ప్రయోజనము; భగవత్కార్యము లందు వినియోగించుటయేయని చెప్పవలయును. భగవన్నామస్మరణ చెవిని బడినంతనే పరవశుడగు భక్తునకు మరల జన్మయుండదు.

సీ. విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు

గొండల బిలములు కువలయేశ

చక్రిపద్యంబులు జదువని జిహ్వలు

గప్పల జిహ్వలు కౌరవేంద్ర

శ్రీ మనోనాధు వీక్షింపని కన్నులు

గేకిపింఛంబులు కీర్తిదయిత

కమలాక్షు పూజకు గాని హస్తంబులు

శవము హస్తంబులు సత్యవచన

గీ. మరిపద తులసీ దళామోద రతిలేని

ముక్కు పందిముక్కు ముని చరిత్ర

గరుడ గమను భజన గతిలేని పదములు

పాదపములు పాద పటల మనఘ. (భాగ)

గీ. చేతులారంగ శివుని పూజింపడేని

నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని

దయయు సత్యము లోనుగా దలపడేని

గలుగ నేటికి దల్లుల గడుపుచేటు. (భాగ)

సీ. శ్రీ భవనాయక శివనామ ధేయంబు

చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ

దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి

చూడంగ నేర్చిన చూపు చూపు

దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి

చే నింపనేర్చిన చెవులు చెవులు

తారక బ్రహ్మ విద్యాదాత ¸°దల

విరులు పూన్పగ నేర్చు కరము కరము

గీ. లంబికా నాయకా ధ్యాన హర్ష జలధి

మధ్యమున దేలియాడెడి మనసు మనసు

ధవళగిరి శేఖరునకు ప్రదక్షణంబు

నర్థి దెరుగంగ నేర్చిన యడుగు యడుగు. (భీమేశు)

నవవిధ భక్తి మార్గములలో పూజామార్గమొకటి. పూజావిధానములో భేదములున్నను, అన్నియు భక్తి యుతములుగ నున్న ఆదరణీయములే. భక్తిలేనిపూజ పత్రిచేటు. నా పూజావిదానము మంచిది, నా పూజావిధానము మంచిది, నాదేవుడు గొప్పవాడు, నాదేవుడు గొప్పవాడు అని కలహించుట అవివేకము. అటుల కలహించుట ఉత్తమ భక్తి మార్గము కాదు. అట్టి వారికి భగవద్భక్తి నిజస్వరూపము తెలియదనవలయును. అది అధమ భక్తి. ఉత్తమభక్తి యనగా పరాభక్తి. అనగాఉపరముడగు భగవంతుని మనసార ప్రేమించుట. ప్రపంచమంతయు సర్వజీవులు. ఆ పరమాత్మ ఆ భాసజనిత రూపములేయని, వాటియందు పరమాత్మ దివ్యములు దర్శించుట, ప్రేమించుట ఉత్తమభక్తి. లోకులు పలుపోకడల పోవుచుందురు. మహమ్మదీయులు తమమతమే గొప్పదని; ఆ మతేతరులందరు కాఫరులని, వారికి ముక్తిలేదని, బలవంతముగా మహమ్మదీయులుగా మార్చుటకు అటుల మారనివారిని చంపుటకు వెనుకాడని రోజులుండెడివి. అట్టివారు మహమ్మదుప్రవక్త ప్రబోధముల పూర్తిగ గ్రహించియుండరు. 'ఇతర దేవ తోపాసనల చేయువారిని ఆక్షేపించవలదు అసహ్యించుకొనవలదు.' అను కొను వాక్యమును చదివియుండరు. వీరివలెనే క్రైస్తవమత గురువులు, ఆ మతేతరులందరు పాపులని వారు తప్పక నరకమునకు పోవుదురని, వారికి ముక్తిలేదనియు, నేటికినీ ప్రచారము చేయుచున్నారు. మతము పేరట యుద్ధములు చేసియు, క్రైస్తవమతేతరుల చిత్రహింసచేసియు, మతప్రచారమునకు, గడంగిన, క్రైస్తవమతగురువులు, మహాత్ముడైన జీససు ప్రేమమూర్తియనియు, పరుల పాప పరిహారార్థము తన రక్తము ధారబోసిన స్వార్థత్యాగియనియు ఏల గుర్తింపరు? దీనికంతకు కారణము ఆజ్ఞానము, అహంకారము, స్వార్థము; ఇటులనే శైవ వైష్ణవ మతస్థులు కలహించినరోజులు మనదేశమున లేకపోలేదు. అట్టివారి దంతయు వెర్రిమతావేశము. అధమభక్తి ఆవేశముగా మారును. అట్టి మతావేశాపరుల చర్యలు సమర్థనీయములు కావు. వారికి మతముయొక్క నిజతత్వము తెలియదు. వారికి ముక్తిలేదు ఏ మతమైనను భక్తితో గూడియుండవలెను. సర్వము పరమేశ్వరార్పణమను భావముగల భక్తుడు మాత్రమే, భగవంతునకు ప్రీతిపాత్రుడు.

కుల వర్గ లింగబేధములులేక నిజభక్తులందరు పరమేశ్వరుని కరుణకు పాత్రులగుదురనుటకు కాళహస్తిమహాత్మమునకు మకుటాయమానమగు తిన్నని చరిత్రయే పరమోదాహరణము. తిన్నడు అటవికజాతివాడు, మూఢుడు. కులధర్మమగు వేటయందు ఎక్కువ అభిలాషకలవాడు. వన్యమృగపక్ష్యాదుల మాంసము భుజించుట వానికి నిత్యకృత్యము. అట్టివాడు శివలింగమును చూచుటయు, పందిమాంసము నివేదనచేయ - తినని శివుని తన కండ్లు సమర్పించి ప్రసన్నుని చేసికొనుటయు, అటుల శ్రుతివ్యవహరేతర విధుల, శివుని పూజించియు తరించిన భక్తుడు. అట్టికిరాతుని పూజల నివేదనల, ఎందులకు అంగీకరించినధి. తన ప్రియభక్తుడగు శివగోచరునకు ప్రత్యక్షముగ ఋజువుచేసి, శివుడు వారిరువురకు కైవల్యము ప్రసాదించెను. మూఢుడైనను, హీనజాతి జన్ముడైనను భగవంతుని పూజించుటకు, భగవంతుని దయగాంచుటకు అందరు అర్హులె. మానసికపూజయైన చాలును.భగవంతుడు భక్తపరాధీనుడు. భక్తజన సులభుడు. కావలసినది ఆచంచలమైన భక్తికాని, నివేదించు వస్తువుకాదు. ''పత్రం పుష్పం ఫలం తోయం'' ''యో మే భక్త్యాప్రయశ్చతి, తదహంభక్త్యుప హృతం మశ్నామి ప్రయతాత్మనః'' అనిగదా భగవంతుని ప్రతిజ్ఞావాక్యము. గుప్పెడు అటుకులను స్వీకరించి, బాల్యనఖుడగు కుచేలుని సర్వసంపద వైభవోపేతునిగ చేసిన భగవంతుని కృపాసముద్రమునకు చెలియలు కట్టలేదు కుచేలుడు ఏమియు కోరలేదు కోరవలయునను వాంఛగూడలేని నిర్లిప్తుడు. భార్య ప్రోద్బలమున, బాల్యసఖుడగు శ్రీకృష్ణుని చూడనేగెను. దేవతలకుకూడ లభింపరాని పూజల, సత్కారముల, ఆలింగనాది సంభావనల పరవశుడాయెను. భగవంతునిదర్శనముచే పునీతుడనైతినని ఎంతో సంతోషముతో తాను వచ్చినపని మరచెను ఏమియు కోరలేదు. భగవంతుడును నీకు ఏమికావలయునని కుచేలుని ప్రశ్నింపలేదు. మరునాడు తిరిగివెళ్ళుచు కుచేలుడు ఇటుల తర్కించెను. ''శ్రీ కృష్ణుడు పరమదయాళుడు, సర్వజ్ఞుడు, ప్రేమస్వరూపుడు. నే వచ్చినపని గ్రహింపకపోలేదు. నాస్థితి యెరుగనివాడుకాడు. అయినను తానుగ ఏమియు ఈయలేదు. చివరకు ఏమికావలయును అనియైన యడుగలేదు. అది సమంజసమే. ఐశ్వర్య వంతుడు, ఇహలోకసౌఖ్యముల దవిలి, పరమపావనమైన ముకుంద చరణారవిందముల మరచునుగదా. మిత్రుడనగుట నా మేలుగోరి పరమ కృపాళుడగు శ్రీకృష్ణపరమాత్మ నన్ను ఆ ఆపదనుండి రక్షింపనెంచెను. ఆహా! ఆ భక్తజనమందారుని మైత్రీవాత్సల్యతః''

అవును ధనమదాంధులు భగవంతునియందు భక్తి కలిగి యుండుట కష్టము ఐహికములగు కోరికలు, సంపదలు బలీయమై వారిని బంధించును. "It is easice for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of god" అను బైబిలులోని సూక్తిభావము గూడ నిదియెకద. ఐశ్వర్యము, పదవి, అధికారము, మనుష్యులను అంధులను చేయును. కుచేలుడు ఇంటికి జేరగానే సర్వవైభవములతో సుఖపడుచున్న భార్యా పుత్రాదులచూచి, అదియంతయు శ్రీకృష్ణపరమాత్మ కృపావిశేషప్రాప్త మని మనసునందు భగవంతునకు కృతజ్జతాంజలు లిడెను. ఈ సందర్భమున ఆంధ్రీకృత భాగవతమునందలి పోతనామాత్య ప్రణీతంబైన ఈ పద్యము జ్ఞాపకమునకు వచ్చును.

కం. దళ##మైన పుష్పమైనను

ఫలమైనను సలిలమైన పాయని భక్తిం

కొలిచిన జను లర్పించిన

నెలమిన్‌ రుచిరాన్నముగ నేను భుజింతున్‌

భగవంతుడటుల అనినాడుగదాయని అది సర్వులకు సమాదరణీయమని భావించరాదు. అది అశక్తులై నవారిని గురించికాని ధనవంతుల నుద్దేశించికాదు. ధనికులు ఈ శ్లోకార్థమునే ప్రమాణముగ స్వీకరించరాదు. అటుల భావించుట అవకాశవాదులగుట. అది ఆత్మవంచన. భగవదపరాధము. విరివిగా చేయగల శక్తిగలవారు యధాశక్తి చేయవలయును.

భగవంతుడు భక్తపరాధీనుడు. భక్తుని సర్వవేళల కంటికి రెప్పవోలె కాచుచునే యుండును. అంబరీషుని చరిత్రయే దీనికి ఉదాహరణము. అంబరీషుని అయాచితముగ రక్షించెను. ఆ భక్తజనపాలిటి కల్పతరువు, విస్తుల కృపాతిశయము ఇంతయని యెవరు చెప్పగలరు? ''నీవే తప్ప నితః పరంబెరుగ రక్షింపంగదే'' అనిన గజేంద్రుని కుయ్యాలించి భక్తరక్షణ పరాధీన మనస్కుడై, సర్వమును మరచిన ఆ శ్రీమన్నారాయణుని, ఆ ఆపద్భాంధవుని కృపకు భక్తవాత్సల్యతకు మేరయెట్టిది? ఆ పరమాత్మ యొక సందర్భమున ఇటుల సెలవిచ్చెను.

కం. సద్భక్తి సేవచేతన్‌

మద్భావము తుష్టిగన్న మాడ్కి దరుశిలా

ద్యుద్భూత ప్రతిమార్పల

ముద్భరితము కాదు నిక్కముగ దలపోయన్‌

మ. వలనా యేటికి నాశ్రయించి మనగా వానీరమున్‌ నీరమున్‌

దలవెర్రేప చరింపనేటికి సవిద్ధానంబు దానంబు న

చ్చలమా యేటికి నెత్తిగొట్టుట కొనగా సన్యాసమున్‌ న్యాసమున్‌

కలిదే జాలు మదీయభక్తి రుచి భక్తశ్రేణి కశ్రాంతమున్‌.

కం. నాయందు భక్తుడుండున్‌

బాయక నేనధివసింతు భక్తునియందున్‌

మాయిరువురకున్‌ గలుగున్‌

గాయప్రాణానుకూల్య కౌశల్యంబుల్‌. (పాండు)

భగవత్ర్పీతికరమగు అట్టి భక్తిమార్గము సర్వోత్కృష్టము సర్వులకు అనుసరణీయము.

శ్లో. వేదేషు యజ్ఞేషు తపస్సుచైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌

అత్యేతి తత్సర్వమిదం విధిత్వా

యోగీపరం స్థాన ముపైతబాద్యమ్‌. (గీ)

అనగా భగవంతునియందు భక్తిలేకున్న యజ్ఞ యాగాది క్రతువుల వల్లగాని; వేదా ధ్యయనాదులవల్లగాని, తపస్సువలనగాని, లాభములేదు. అన్నిటికి భక్తిప్రధానము; భక్తియున్న సర్వఫలములు పొందవచ్చు. మానవ జన్మ ఉత్తమమైనదే, అయినను మానవుడు భక్తివలనగాని తరింపడు అందుచే కర్మయోగులకు జ్ఞానయోగులకు అందరికీ భగవంతునియందు భక్తియుండవలయును. అది సత్కర్మఫలముల మణిమాలగా గూర్చ సూత్రము. మానవుడు ''అన్యధాశరణం వాస్తిత్వమేవ శరణంవినా'' అని భగవంతుని పాదారవిందముల నమృడు కావలయును. భక్తియోగము అందఱికి అందుబాటులోనుండి ఆచరణీయమైన ముఖ్యమగు ముక్తిమార్గము, భక్తుని భగవంతుడు తనలో లీనముచేసికొనును. కనుక గృహస్థులు కర్మమార్గముతోపాటు భక్తిమార్గముకూడ అనుష్ఠింపవలసినదే. ఈ రెండు మార్గముల గమింపనివారికి జ్ఞానమార్గము దుర్లభము; దుర్గ్రాహ్యము, దుర్గమము, అటుల కాదనుట అజ్ఞానము.

ప్రపంచము సుఖమయమగుటకన్న దుఃఖమయమనుటయే కొంత వఱకు సమంజసము ఇది నాది, ఈ శరీరము నాది, ఈ గృహము నాది, అను భావమున్నంతవఱకు ఏదో రూపమున దుఃఖము కలుగుచునేయుండును. ప్రాపంచిక విషయములందు అభిమానము తగ్గించుకొని, దృష్టిని పరమాత్మయందు నిలుపుటవలన దుఃఖము నశించును. భగవంతుని అనుగ్రహము బడయుటకు ముందు, మానవుడు కొన్ని కష్టములకు గురికావలసివచ్చినను అనుభవించవలసినదే. అప్పుడే ప్రాపంచిక వ్యవహారము లందు విరక్తి, పరమాత్మయందు భక్తి కుదురును. మనకు కలుగు కష్టములు భగవంతుడు మనలను పరీక్షించుటకు కల్పించినవిగా భావించవలయును. భక్తుని పూర్తిగ పరీక్షించినగాని భగవంతుడు ముక్తినీయడు. పైపైవేషములకు, నటనలకు మోసపోడు. ఆత్మశుద్ధిని పరీక్షించును. బంగారము పుఠముపెట్టినగాని మేలిమిచాయ రాజిల్లదు వజ్రమును సానపెట్టినగాని ప్రకాశింపదు. అటులనే మానవునిభక్తి, అచంచలత్వమును, నైర్మల్యమును భగవంతుడు పరీక్షించును. అది గ్రహించిన భక్తుడు కష్టసుఖముల నిర్వికారముగ, భగవంతుడు ప్రసాదించినవిగ స్వీకరించును. అదియే నిజమగు భక్తుని క్షణము.

___________________________________________

తాను తానుగ నుండుటయే తన్నెరుంగుట. ఆత్మైక్యానుభూతిచే ఆత్మనిష్ఠ గలుగును. అట్టి నిష్ఠానుభూతితో జీవేశ్వరభేదము నశించును.

(శ్రీరమణమహర్షి)

Satyanveshana    Chapters