Satyanveshana    Chapters   

కర్మ యోగము

శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించినది ఉత్తమ జీవితమునకు నిరంతరము కృషి చేయుటకు కావలసిన మార్గములే. ఉత్తమ జీవితము రెండు విధములు. ఇహమున - ఈ జన్మలో అన్ని విధముల ఉత్తమ ధర్మమార్గమున త్రికరణశుద్ధిగ వర్తించుట, రెండవది శాశ్వతమైన బ్రహ్మానందానుభూతినంది ముక్తుడగుట. మొదటిది లౌకిక జీవితమునకు సంబంధించినది రెండవది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించినది. ఇది సాధించుటకు, నిగ్రహము, ఆకాంక్ష, సంకల్పము, అన్యాయయమును అక్రమమును ప్రతిఘటించుటకు కావలసిన మనస్థయిర్యము, ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, మొదలగునవి ముఖ్య సాధనములు. న్యాయా న్యాయములకు, ధర్మాధర్మములకు, సత్యాసత్యములకు నిరంతరము జరుగు పోరాటములో మానవుని హృదయమున నిగూఢముగానున్న దైవాంశము ఎప్పుడును న్యాయము, ధర్మము, సత్యముల వైపునకే ములుచూపును. అది గమనించి అందర్దృష్టి అలవరచుకొనవలయును. పరమాత్మ మానవుని హృదయములోనుండు జీవాత్మను క్రమమార్గమున నడపించి ప్రతిఘటన శక్తులను ఎదుర్కొనుటకు భగవంతునియందు విశ్వాసము కలవానికి ఎల్ల పుడు అండగనేయుండును. అహంకారమున, అతిశయమున, అజ్ఞానమున, మానవుడు అంతరాత్మ ప్రబోధమును నిర్లక్ష్యము చేసిన పతితుడగుటకు ఆస్కారము కలదు. ఆత్మజ్ఞానము, భగద్భక్తి, కష్టకాలముల మానసిక ముగ యుక్తాయు క్తముల నిరూపించలేని సందర్భముల, మానవునకు క్రమమైన మార్గమును సూచనప్రాయకముగనైన ఎరుకచేయుచునే యుండును. మానవుని ప్రకృతిలో ధర్మాధర్మములకు, సత్యాసత్యములకు, అనవరతము సంఘర్షణ జరుగుచునేయుండును. వానియందు సహజముగ నుండు సత్వరజతమో గుణములు, ఈ సంఘర్షణలో నిలబడు యోధులు. సత్వగుణము ఒక పక్షము, రజస్సు తమము ప్రతిపక్షము తద్జనితగుణములు బహుసంఖ్యాకములు. అవి సంఖ్యాబలముమీద ఐహికములగు ఇతర సాధన ములమీద ఆధారపడి సత్వగుణమును ప్రతిఘటించును. సత్వగుణము లౌకిక సాధనములమీదగాక దైవబలముమీద ఆధారపడియుండును. మహా భారత యుద్ధమంతయు దైవశక్తికి, మానవశక్తికి మధ్య జరిగిన పోరాటమేకద. దైవమును నమ్మిన సత్వగుణ ప్రధానుడు, ప్రతిపక్షము ఎంత బలీయముగ గన్పడినను, భీతిచెందక, దుర్బల హృదయుడుగాక, దానిని ప్రతిఘటించి జయము గాంచును ఇదియే గీత బోధించిన పరమ రహస్యము. ఈ పరమరహస్య తత్వమును విపులముగా వివరించిన శాస్త్రగ్రంధములు, ఇతిహాసములు, ఉపాఖ్యానములు, చాల గలవు.

బ్రహ్మ విద్యవలన ఆత్మానాత్మ విజ్ఞానము, జీవాత్మ పరమాత్మలకు గల సంబంధము, తెలియుచుండగా, జీవాత్మ పరమాత్మైక్యమునకు మార్గములు సాధనలు తీర్చిదిద్దునవి యోగములు. శ్రీమద్భగవద్గీత యందలి పదునెనిమిది అధ్యాయములు యోగము నిరూపించునవే. యోగశాస్త్రము శరీరమును, మనసును కూడ క్రమబద్ధముచేసి ముక్తిమార్గము బోధించును. యోగాభ్యాసము దుర్బలమనస్కులకు, సందేహచిత్తులకు, ఉత్సాహహీనులకు కాదన పతంజలివారు సెలవిచ్చియున్నారు. ఏ యోగమునైనను అనుసరించి, అనుష్టించుటకు, నిశ్చలమైన సంకల్పము, ఉత్సాహము, దీక్ష యుండవలయును. ముక్తిగోరు ముముక్షువునకు, ఆధ్మాత్మిక చింతన, కర్మయోగము ప్రాతిపదికగా ప్రారంభ##మై చిరంతన సాధన క్రమమున జ్ఞానయోగముగా పరిపక్వమై ముక్తిహేతువగును. ఆ కారణముననే శ్రీకృష్ణపరమాత్మ గీతలో కర్మజ్ఞాన యోగములకు సమాన ప్రతిపత్తి కల్పించి భక్తియోగముతో సంబంధముకల్పి మూడు యోగములకు అవినాభావ సంబంధము నిర్ణయించాడు. ఆధ్యాత్మిక జీవితమునకు లౌకిక జీవితమునకు సన్నిహితత్వము కుదురదని కొందరు చెప్పుదురు. కాని కర్మ భక్తి జ్ఞానయోగముల విజతత్వముల అవగాహన చేసికొనిన లౌకిక జీవితములో ఆధ్యాత్మిక జీవితము సాధ్యమనునది బోధితమగును. అది ఎటులనో కర్మాభక్తి యోగముల గ్రహించిన కొంతవరకు తెలియనగును.

కర్మ అనుమాట మొదట యజ్ఞయాగాది వైదిక కర్మగా భావించి యుండవచ్చు. కాని ఉపనిషత్తుల కాలమునకే కర్మ - అనగా విద్యుక్త ధర్మము అను భావము ప్రచారములోనికి వచ్చినటుల గన్పడును. అందుచే వివిధములైన కర్మలు, ఆ యా ఆశ్రమధర్మములకు సంబంధించినవిగా కల్పించబడి యుండవచ్చు. అంత రెంటిని అభేద ప్రతిపత్తి కల్పింప బడినది. అందుచే గృహస్థునకు కర్మభక్తి మార్గములు ప్రధానముగా పేర్కొనబడినవి. ఈ రెంటికివి విడదీయరాని సంబంధమున్నది.

భక్తిలేకుండ చేయబడు కర్మయే లేదు భక్తిలేని జ్ఞానములేదు. కొందరు కర్మబంధ కారణమనియు, అందుచే కర్మయోగియగు గృహస్థునకు ముక్తి లేదనియు, జ్ఞానికిమాత్రమే మోక్షప్రాప్తికలదనియు, జ్ఞాన ప్రధానమైన యత్యాశ్రమమే మోక్షదాయకమనియు, చెప్పుచుండ, మరి కొందరు గృహస్థాశ్రమమున అన్ని ఆశ్రమధర్మముల పాటించుట కవకాశ ముండుటచే అది మోక్షసాధనమని చెప్పుదురు. ఇది యెటుల సాధ్యము?

బంధకారణమగు కర్మను బంధకారణము కాకుండా మోక్షసాధన మార్గముగా మార్చుటయే ఒకపరమ రహస్యము. ప్రకృతి గుణ వాసనా సహితుడగు మానవుడు కర్మలు చేయక మానలేడు. అటుల మానిన వినాశము తప్పదు. అందుచే కర్మలు చేయవలసినదే. అవి బంధకారణములు కాకుండ చేసి కొనవలయును. అప్పుడు ఇదివరలో మనుము చర్చించి గ్రహించినటుల కర్మయోగి జ్ఞాని కాజాలడను మాట సత్యముకాదనియు, కర్మమార్గము ముక్తిదాయకము కానిచో, గృహస్థులకు కర్మ ప్రధానమని విధింపబడి యుండదనియు, గ్రహించితిమి. గృహస్థులకే యననేల బ్రహ్మచారులకు వానప్రస్థులకు, యతులకు కూడ నిత్యకర్మానుష్ఠానము విధిగ చెప్పబడి నది.

అంతయేల జ్ఞానప్రదానమని చెప్పబడు యత్యాశ్రమమున చేయబడు శ్రవణ మనన ధ్యానాదుల శారీరక మానసిక కర్మలుకావా? సమాధి నిష్ఠాగరిష్టులైన యతులు సహితము సమాధినుండి బయటకు వచ్చిన తరువాత లోకసంగ్రహణార్థము ధర్మబోధచేయుట కర్మాచరణకాదా! ఉఛ్వాస విశ్వాసములు కర్మలు కవా! లోతుగ నాలోచించిన యత్యాశ్రమము జ్ఞాన ప్రధానమైనదని చెప్పబడినంతమాత్రమున కర్మ భక్తి మార్గములు యతులకు అనవసరము; ఆచరణయోగ్యములు కావనుట పొరాపాటని చెప్పవచ్చును.

భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మ గీతలో జీవులందరు కర్మ చేయవలయుననియే చెప్పెను. మరియు కర్మయోగి తన కత్యంత ప్రియుడని కూడ చెప్పెను. అట్టి కర్మలు అనేకవిధములుగ విభజింపబడినవి. స్థూలముగా లౌకిక కర్మలు వైదిక కర్మలు అనువిభజన కలదు. మానవుడు శరీరపోషణ నిమిత్తము, తనమీద ఆధారపడిన దారాపుత్రాదుల, బంధుమిత్రాదుల, అతిధి ఆభ్యాగతుల, తదితర జీవరాసుల, పోషణార్థము చేయు కర్మలు లౌకిక కర్మలు 'శరీర మాధ్యం ఖలుధర్మసాధనమ్‌' శరీరము సరిగనుండనిచో ఆత్మవిచారణ చేయుటకుకాని, పుణ్యకార్యములు, వ్రతములు చేయుటకుగాని, మానసిక స్వాస్థ్యముండదు వైదిక కర్మలనగా వేదవిహిత కర్మలు. ఆధ్యాత్మిక భావముతో నియమితములైన యజ్ఞయాగాదులు, కర్మలు, కాయక మానసిక వాచిక కర్మలుగా గూడ విభజింపబడినవి వీటిలో నిత్యకర్మలనియు, నైమిత్తిక కర్మలనియు భేదములు కలవు శరీరపోషణకై మానవుడు లౌకిక కర్మలు చేయునటులనే, ఆత్మసుఖమునకై మతసంబంధమైన కొన్ని కర్మలు చేయుటయు అవసరమే. అవి స్నానము, సంధ్యావందనము, జపము, దేవతార్చన మొదలగునవి. ఇవియన్నియు గృహస్థునకు ప్రధాన ధర్మములుగా ఇదివరకే గ్రహించితిమి. నిత్యకర్మలు వేదవిహితమైనవి, శాస్త్రసమ్మతమైనవి. పరమేశ్వరార్పితముగ చేయవలసినవి. ఇట్టి నిత్యకర్మలు చేయుటవలన అంతఃకరణశుద్ధి, తద్వారా జ్ఞానము కలుగును. చేయకున్న ప్రమాదము వాటిల్లును. నైమిత్తిక కర్మలు, పితృశ్రాద్ధాదులు, సంక్రమణదానము సర్వదినములలో చేయబడిన పితృతర్పణాదులు, వ్రతములు, తీర్థవిదులు మొదలగునవి. వీటివలన ప్రతిఫలమాసించుటకాని, పొందుటకాని యుండదు. నిత్యకర్మలవలెనే నైమిత్తి కర్మలుకూడ వేదవిహిత కర్మలే.

కామ్యకర్మలనగా ఏదో ప్రయోజనము సాధించుటకు ఏదో లాభము పొందుటకు కోర్కెతో చేయబడు కర్మలు. ఇంద్రత్వము నాశించి శతమఖములు చేయుటయు, స్వర్గసుఖములగోరి యాగములు చేయుటయు, సంతానార్థము పుత్రకామేష్ఠి చేయుటయు, రాజసూయము, అశ్వమేధయాగాదులు చేయుటయు, కామ్యకర్మలే యగును అట్టి కోరికలతో గూడిన తపస్సుకూడ కామ్యకర్మయే. సాత్విక రాజసిక తామసిక తపస్సులు కలవు. ఏమియు కోరక పరమాత్ముని గురించి తపస్సుచేయుట సాత్వికతపస్సు. ఏదియో కోరికతో చేయబడునది రాజసికతపస్సు. ధృవుడు చేసిన తపస్సు, బలిచేసిన యాగములు రాజసిక కర్మలే. అర్జునుడు పాశుపతాస్త్రము కొరకు శివుని గురించి చేసిన తపస్సుకూడ రాజసికతపస్సే. అవియన్నియు కామ్య కర్మలు. కామ్యకర్మలై గర్వింపదగినవి తామసిక కర్మలు. ముల్లోకముల జయించి దేవ, మానవ, బ్రాహ్మణ, మునిపుంగవుల బాధించుటకు, పరహింస చేయుటకు, కావలసిన శక్తి సంపాదించుటకు, దేవమానవులవలన మృత్యువు రాకుండుటయు, హిరణ్యకశ్యప రావణాదులు చేసిన తపస్సులు, అభిచారహోమముచేసి యితరుల బాధించు శక్తి సంపాదించుటకు చేయు వ్రతాదులు, తామస కామ్యకర్మల రూపభేదములు. ఇట్టి కామ్యకర్మలు తాత్కాలికమైన ఫలము చేకూర్చినను, దుఃఖమునుండి శాశ్వతమగు విముక్తి కలిగింపజాలవు. ఎప్పటికప్పుడే కోరికలు పెరుగుచుండును. తృప్తియనునది యుండదు. కామమునుండి క్రోధము, తరువాత మదము, లోభము మొదలగు అరిషడ్వర్గములు, బలీయములైన అంతశ్శత్రువులై మానవుని అధోలోకమునకు తీసికొనిపోవును. ఒక కామ్య కర్మవలన గలిగిన ఫలము తాత్కాలికమే అగుట మరొక ఫలమునకు మరొక కర్మచేయ ప్రోత్సహించుచునే యుండును. అట్టి కోరికలకు అంతు అనేది యుండదు. తృప్తి యుండదు. అది మానవ సహజము. ఇక నిషిద్ధకర్మ లనునవియు కలవు.

వేదములచే, శాస్త్రములచే, నిర్ణీతమైన, సనాతన ధర్మములకు, వ్యతిరేకముగా చేయబడు కర్మలు నిషిద్ధకర్మలు. శాస్త్రములలోచెడు కర్మలని చెప్పబడిన అసత్యము, పరస్త్రీ గమనము, పరనింద, పరద్రవ్యాప హరణము, పరహింస, మత్తుపదార్థముల సేవించుట, ఆతతాయిలుగ ప్రవర్తించుట మొదలగునవన్నియు గర్హింపదగిన కర్మలు. మానవుడైన వాడు చేయరాని కర్మలు. ఈ నిషిద్ధ కర్మములేగాక ధర్మములయ్యు ఒక పక్షముగ నిషిద్ధమైన కర్మలు కూడ గలవు. ఒకరికి ధర్మముగా నిర్ణయింపబడిన కర్మ మరొకరికి నిషిద్ధము కావచ్చును. గృహస్థునకు విధి విహితమైన సంసారికకర్మ బ్రహ్మచారులకు, యతులకు నిషేధింపబడి నది.యతులకు నియమితములైన కర్మలు కొన్ని గృహస్థు లాచరింపరాదు. వారిపట్ల అవి నిషిద్ధకర్మలయినవి. ''స్వధర్మో నిధనంశ్రేయః పరధర్మో భయావహః'' అను గీతావాక్యము కలదుకదా. కనుక కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. కర్మలనగా వేదవిహితముగ, శాస్త్ర సమ్మతముగ, వారి వారి, అధికార తారతమ్యముల కనుగుణముగ విధింపబడిన కర్మలని యిదివరకే గ్రహించితిమి. ముక్తికారకములు, భగవదర్పితములు, భగవత్సేవ సంబంధములు మాత్రమే కర్మలను భావమును కూడ కొందరు చెప్పుదురు.

ఇటుల వివిధములుగ జెప్పబడిన కర్మలలో ఏవి బంధకారణములు? ఏవికావు? బంధకారణములని చెప్పబడు కర్మలను అటుల కాకుండ చేయగలమా అనునది పరిశీలింతము. ఈ కర్మలు చేయుటలో ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అనునవి చెప్పబడినవి. ఫలమునుగోరి కర్మలుచేయుట నివృత్తిమార్గము. అనగా కామ్యకర్మలు చేయుట అన్న మాట. ఫలాపేక్ష లేకుండా భగవదర్పితముగా, పరమేశ్వర ప్రీత్యర్థం కర్మలు చేయుట నివృత్తిమార్గము. ఆ నివృత్తి మార్గమును నిష్కామ యోగము లేక అనాసక్తయోగము అని చెప్పుదురు. నివృత్తిమార్గము నిష్కామయోగముకాగా ప్రవృత్తి మార్గము సకామయోగమైనది. ప్రవృత్తి మార్గమున కర్మలాచరించుటలో కొన్ని చిక్కులు కలుగవచ్చును. మంత్ర హీనం క్రియాహీనం, భక్తిహీనం కావచ్చు. మనకు తెలియరాక యే లోపములో సంఘటిల్లవచ్చు. కొంచెము అధికముగ చేసినను తక్కువగ జేసినను అది లోపభూయిష్టమై కాంక్షించిన ఫలముల చేకూరవు, సరికదా అనిష్టములుకూడ కలుగవచ్చును. అటుగాక నివృత్తి మార్గమున, ఫలాపేక్ష రహితముగ చేయబడ్డ కర్మలయందు లోపములు కొన్ని జరిగినను, అవి క్షంతవ్యములే యగును. ప్రవృత్తిమార్గమున కర్మలు చేయువారు దీనులు. తాము చేయు పనియంతయు, భగవత్కైంకర్యము చేయువారు కృతార్థులు. ధర్మానుష్ఠానము ఫలాపేక్షరహితముగ జేయవలయును. కర్మలు చేసియే తీరవలయును. అటుల చేయుట మానవుని విధి. ఫలము దైవేచ్ఛ. పురుషయత్నము లేనిది దైవము తోడ్పడడు అను సత్యమును విస్మరింపరాదు.

పాపముచేసినను బంధమే. పుణ్యము చేసినను బంధమే. అట్టిచో బంధకారణమగు కర్మల నేల చేయవలయును? అను సందేహము కలుగుట సాధారణ మానవ ప్రవృత్తికి సహజమే. ఈ సందేహమే అర్జునునికి కూడ గలిగినది. కృష్ణభగవానుడే సమాధానము చెప్పినాడు. ఏదో కర్మయగనా శారీరకముగాగాని మానసికముగాగాని చేయకుండనుండుట ఎవరి కైన సాధ్యమా? కాయక, మానసిక, కర్మలు చేయనివారు కలరా? అటు లున్న ప్రాపంచిక వ్యవహారములు జరుగునా? సామాన్య మానవులకేగాక తపస్సంపన్నులైన యోగులకు సహితము అది దుస్సాధ్యము. నిర్వికల్ప సమాధిలోనున్న సమయములదప్ప మిగిలిన కాలమున ఏదోవిధముగ కర్మలు చేయకుండ నుండజాలరు. నిర్వికల్ప సమాధి శాశ్వతావస్థ కాదు.

ఈలోకమున ఎన్నడును ఏప్రాణియుక్షణమైనను ఏదో కార్యము చేయకుండ నుండనేరదు. జాగ్పత్సుషుప్తి స్వప్నావస్థలయందైనను శరీరము చేతనో, మనసుచేతనో, ఏదో కర్మ చేయుచుండును. ప్రాణివర్గమంతయు సత్వరజస్తమో గుణరూపిణి. ఆ ప్రకృతినుండి ఏర్పడి; యట్టి ద్రవ్య వాసన, గుణవాసన, కర్మజాతివాసన, రాగద్వేషాదులు, అను గుణములచే బ్రేరేపింపబడుచు, పరాధీనమై, నానావ్యవహారరూపమైన, కర్మలను చేయుచునే యుండును. మానవుడు వాసనారూపిణియగు ప్రకృతికి వశుడై ఊరకుండ లేకున్నాడు. కేవలము పరమునకే కర్మలు కర్తవ్యమని భావింపరాదు. ఇహమునకు కూడ అవసరమే. నిశ్చలముగ స్థాణువువలె ఊరకయే యుందుట అకర్మ అటులుండుట కర్మసన్యాసమందురు. అటుల సర్వకార్యములు వదులుటవలన, మానవునకు దేహయాత్ర సుఖముగ జరుగదు. పెద్దబండవలె గుహయందో, ఏ భూగృహముననో, పడియుండు వానికి కూడ ఏదేని తన కనుకూలమగు కృషిలేకపోయిన శరీరయాత్ర జరుగదు. కాన శరీరయాత్ర మాత్రమునకై కర్మచేయవలసినదే. శరీర రక్షణకు, చేయు కర్మకన్న ఆత్మరక్షణకుజేయు కర్మ అనగా వేదవిహిత కర్మ ప్రధానముగా నెంచవలయును. శరీరయాత్రకు సంబంధించిన కర్మ లకు అత్మోపలబ్ధికి చేయబడు కర్మలకు భేధము కలదు. మొదటివి అన్ని జీవరాలసుకు సామాన్య ధర్మము. అది ప్రధానము కాదు. అశాశ్వతమగు శరీరమునకు సంబంధించిన కర్మలు కూడా అశాశ్వతములే ఆ శరీరముతో పాటు, అవియు వాటి ఫలితములు కూడ నశించును. అందుచే అత్యాశక్తితో వేదవిహితకర్మల ననుష్ఠించి తద్వారా చిత్తశుద్ధిని దానిచేత అపరోక్షస్వరూపమైన ఆత్మజ్ఞానమును సంపాదించుటకు, ఈ లోకమునకు సంబంధించిన దుఃఖపరంపరలనుండి విముక్తుడగుటకు కావలసిన కర్మలు మానవులు చేయవలయును. జీవుడు ఈ లోకమున, జన్మించుటకు సుఖదుఃఖమిళితమైన జీవితము ననుభవించుటకు, మరణించుటకు ఏదో కారణముండవలయును. కారణములేని కార్యముండదుకదా! ఏకగర్భజనితులయ్యు ఒకేవిధముగ ఒకే పరిస్థితులలో పెంచబడియు, ప్రవృత్తులలో, తెలివితేటలలో, అదృష్టములో, ఆరోగ్యములో భేదించినవారు పెక్కురు కనబడుచునేయున్నారు.

అట్టి భేదములుండుటకు కారణము వారు వారి పూర్వజన్మలలో జేసిన కర్మల ఫలితమేయని శాస్త్రములు చెప్పుచున్నవి. జగమునందు ప్రాణులు తమతమ కర్మఫలముల బుట్టి కర్మంబు నలయించు సుఖదుఃఖములను, క్షేమభయములను కర్మఫలమగా ననుభవించు, కర్మవాసనా వరుడైన దేహి దానినే యనుసరించును భగవంతునకు ఒకడు ప్రియుడు కాదు, మరొకడు అప్రియుడు కాదు. వారి వారి కర్మలనుబట్టి వారి వారికి సుఖదుఃఖముల గలిగించుచుండు కర్మసాక్షి. మానవుడు పూర్వజన్మమున ఇతరులకు గలుగజేసిన సుఖదుఃఖములనే ద్విగుణముగ ఈ జన్మమునందనుభవించుచున్నాడు. పూర్వకర్మఫలము పితృవ్యము వంటిది. అది ఆస్తి కావచ్చు, అప్పుకావచ్చు పితృవ్యమగు ఆస్తిని అనుభవించుటకు సిద్ధమగువాడు అప్పునుగూడ తీర్చుటకు సిద్ధపడవలెను. లేకయున్న అప్పుపెరిగి ఆస్తినంతను హరించును పూర్వజన్మమునందలి కర్మల ఫలమును సంచితమందురు. అనగా నిలువచేసికొనిన దన్నమాట. అది మంచిదైన ఉత్తమజన్మ ప్రాప్తి కలుగును. సుఖభోగములు ప్రాప్తించును. సత్కర్మలు చేయు సంకల్పము కలుగును. అటుగాక క్రిందటి జన్మలో దుష్కర్మలే చేసియున్న ఆ ఫలము వ్యాధులరూపమునను, అంగవైకల్యాదుల రూపమునను, అన్నవస్త్రములు, లేమివలన కలుగు బాధల రూపమునను, జీవితమును దుర్భరముచేయును. ఈ సత్యమును గ్రహించిన మానవులు దుష్కర్మలకు గడంగరు దుశ్చింతలు చేయరు. సంచిత కర్మఫలము అనుభవములోనికి వచ్చిన భాగమును ప్రారబ్థకర్మ యందురు జ్ఞానియగు వాడు ఈ జన్మలో తనకు గలిగిన బాధలను ప్రారబ్ధ కర్మఫలమని యనుభవించును. అందుకు వగవడు. పాపపరిహార మగుచున్నదని సంతసించును కొందరు మహానుభావులు, ఋషితుల్యులు అంత్యకాలమునకు ముందు వ్రణాదులచే బాధపడుట చూచుచున్నాము. వారు ఈ జన్మలో సర్వ విధముల పుణ్యవర్తనులు, తపోధనులు కావచ్చు. అయినచో, అట్టి బాధలు కలుగనేల? ఆ కారణముననే దానిని ప్రారబ్ధకర్మ యనుభవించుట యందురు. ఈ జన్మలోచేసిన కర్మలఫలము ఆగామి. క్రొత్తగ వచ్చినది, పితృవ్యమునకు బలముగా మనము సంపాదించినది. పరజన్మకు నిలువచేసికొనునది. జన్మము పూర్వజన్మకార్మాధీనము. మరణము దైవాధీనము. ఈ రెండును మనచేతిలో లేనివి. కనుక మానవుడు జననమాది మరణము పర్యంతము సంచితకర్మఫల మనుభవించుచు, మంచి కర్మలు చేయుచు, వర్ణాశ్రమ ధర్మవిధుల శాస్త్ర విహిత కర్మల భక్తిశ్రద్ధలతో చేయుచు, అగామియగు సత్ఫలమును సంపాదించి, తద్వారా ప్రాయశ్చిత్తాది కర్మల ద్వారా పాపపంకిలమునుండి బయల్వడుటయేగాక నివృత్తి మార్గమున చరించి మోక్షమునందుటకు చిత్తశుద్ధి సంపాదింపవలయును.

మానవుడు తన విధ్యుక్త ధర్మములు నెరవేర్చుట, సత్కార్యములు చేయుట, ఋజువర్తనుడై యుండుట, ఆముష్మిక చింతకలిగి పరమేశ్వరార్పితముగ కర్మలు చేయుట, తద్వారా ముక్తిమార్గము నన్వేషించుట తన చేతిలోనున్నదని గ్రహించవలయును. అటుల కృషిచేయగా, ఎప్పటికైన వానికి జన్మరాహిత్యము కలుగుటకు అవకాశము కలదు. అటు గాక కర్మఫల మనుభవించుచునే జన్మపరంపరలనుండి తప్పించుకొనుటకు మార్గము కలదా? బంధకారణమైన కర్మలవలన మరల మరల జన్మించుచు మరణించుచు చర్వితచర్వణముగా జీవుడు సంచరింపవలసినదేనా? మార్గాం తరము లేదా?

ప్రతిమానవుడు కర్మాధికారియే. కాని స్నాన, దాన, తపో సంస్కార కర్మలను, భగవన్నామ స్మరణమునను, ఆత్మశుద్ధి గలిగిన వానికే కర్మాచరణకు అధికారము కలదు. ముందు విధులను పాటించవలయును. భగవదర్పితముగ దేశకాల మంత్ర ద్రవ్య కర్తృకర్మశుద్ధి కలవియే ధర్మములు. అవియే ముక్తిసాధనములు. యజ్ఞ, దాన తపోరూపమైన త్రివిధమగు వైదికమైన నిత్యకర్మల గృహస్థు డెన్నడు త్యజింపరాదు. అనగా కర్మసన్యాసము కూడదన్న మాట. నిత్యకర్మలు చేయనిచో ప్రత్యవాయము కలుగును. ఈశ్వరార్పణబుద్ధితో చేయబడిన శ్రౌత స్మార్త రూపములగు కర్మలే పావనములు అట్టి కర్మలు జ్ఞానలబ్ధి కారకము లగును. కర్మలు బంధహేతువులను భావమునగాని, తన అనర్హతనుగాని, ఏమియు నెరుంగక క్లేశ భూయిష్టమైన కర్మలవలన ప్రయోజన మేమన దురహంకారమునకాని, నేను జ్ఞానిని కర్మలకు అతీతుడగును అహంభావమునగాని వైదికకర్మల మానువాడు డంబాచారి, తామసుడు. అట్టి వానికి మోక్షము లేదు.

వేదశాస్త్రముల చదువుటయందును, బోధించుటయందును చెప్పబడిన ధర్మముల ననుష్టించుటయందును. ఆచరింపచేయుటయందును, నేర్పరియైన యుత్తమగుణుడు ఎట్టి విది విహిత కర్మలు శాస్త్రమర్యాదల ననుష్ఠించుచున్నాడో, ఆ యా కర్మలనే, ఆయా ఆచారములనే, ముముక్షువైన సామాన్యుడుకూడ ననుష్ఠింప కుతూహలపడును. అటుల ననుష్టింపయత్నించును. అట్టివారికి శాస్త్రములుగాని, అవి నిర్దేశించిన కర్మల అంతరార్థముకాని, ఏమియు తెలియదు. వారు జ్ఞానులు కారు. అధికారి యగు ఉత్తమ పురుషుడు, ఏ శాస్త్రముల ప్రమాణములుగా స్వీకరించుచున్నాడో, ఎట్టికర్మలు చేయుచున్నాడో, ఆ శాస్త్రములనే సామాన్యుడు ప్రమాణములుగ స్వీకరించి, ఆ ఉత్తముడు చేయు కర్మలనే చేయును. అనగా ప్రతిమానవుడు తనకన్న ఉత్తమజ్ఞాన సంపన్నుడైయున్న శ్రేష్ఠుని అనుసరించునన్నమాట. అందుచే శ్రేష్ఠుడైనవాడు సహితము తాను కృతార్థుడనైతినని తృప్తినందక, లోకహితముకోరి కర్మలు చేయుచునే. యుండవలయును భగవంతుడు షడ్గుణౖక సంపన్నుడు, సర్వేశ్వరుడు అన్ని కోరికలు సిద్ధించినవాడు అందరి కోరికలకు ఫలమునీయగలవాడు. తనకు కర్త్యవ్యమనునది లేదు. అన్ని కార్యములకు కర్త, కర్మ ఫలదాతయు తానే ఎట్టి కర్మలవలన తనకు లాభించవలసిన ఎట్టి వస్తువు ముల్లోకముల లేదు అన్నిటికి ఆయనయే యధికారి. హక్కుదారు.

అఖిలాండకోటి బ్రహ్మాండముల కధినాధుడై ఆ పరమాత్మ లోకసంగ్రహణార్థము రామకృష్ణ్యావతారములనెత్తి కర్మయందు ప్రవర్తించెను ''అశ్రేష్ఠః శ్రేష్ఠానుసారే'' అందుచే సర్వజ్ఞుడు సర్వశ్రేష్ఠుడైవివిధావతారములవర్తించు భగవంతునే అనుకరించి, అనుసరించి, కర్మలుచేయుట మానవులకు సహజము. అందుచే శ్రీకృష్ణభగవాన్‌ గీతలో తాను కర్మలు విడనాడిన అందరును విడనాడియుండెడివారేయనియు, అటుల జరిగిన ధర్మహాని గలిగి యుండెడిదేయనియు, అందరు కర్మలు విడనాడిన సృష్టియే నశించి యుండెడిదనియు, సెలవిచ్చినాడు కృతకృత్యుడనైతినను అభిమానము చేత ఎంత జ్ఞానియైనా ఎట్టి శ్రేష్ఠుడైనా లోకరక్షణ హేతువులగు వైదిక కర్మల విడనాడిన, అట్టివారిని చూచి సామాన్యులగు ఇతరులును కర్మల విడనాడుటయు సంభవమే. ఆ హేతువున సత్కర్మానుష్ఠానము లేకుండును. ఆ కారణమున మానవులు పాపమునకు పాల్పడుదురు. కావున లోక సంగ్రహణము, మానవాభ్యుదయము కాంక్షించు విద్వాంసుడును అధికారియునైన బ్రహ్మవేత్తయు, కర్తవ్యతాభిమానము లేక ఫలాపేక్షలేక కర్మలు చేసియే తీరవలయును. అటులచేయుచు, తాను తరించి, ఇతరుల తరింపజేసినవాడగును పీఠాధిపతులగు ఆచార్యులు, యత్యాశ్రమము స్వీకరించిన మహాత్ములు వేదవేదాంగ రహస్యముల నెరింగి, ఏకాగ్రత బ్రహ్మమునందు మనసు లగ్నముచేసి జప తపాదుల చేయుచు, నిష్ఠ నియమములతో ఆత్మావలోకనము చేసికొన సమర్థులయ్యు నిత్యవిధులు వైదిక కర్మలు చేయుట చూచుచునేయున్నాము. వారు అటులచేయుట ఇతరుల సన్మార్గగాముల చేయుటకు, సత్కార్యాచరణకు ప్రోత్సహించుటకు మాత్రమేనని భావించవలయును. ఆత్మతత్వము నెరుంగనివాడైనను ముముక్షువు నేర్పరియై రాగద్వేషాదులకు వశుడుగాక, ఫలాభిలాషలేక, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయవలయును. అట్టి కర్మయోగి సర్వవిధముల నుత్తమ శ్లోకుడు.

కర్మానుస్ఠానము, కర్మసన్యాసము, సర్వకర్మఫలత్యాగము, ఒకే ఆశ్రమమున సాధ్యమా అనియడిగిన, సాధ్యమేయని చెప్పవలయును. గృహస్థునకు కర్మానుష్ఠానము విధిగ చెప్పబడిన కర్మసన్యాస మెటుల సాధ్యము? ఈ సందేహము తీరుటకు ఏ కర్మలు బంధహేతువులు? ఏవి కావు, ఏ కర్మలు మానవలయును, ఏవి చేయవలయును, అనునది ముందుగ పరిశీలించవలయును. ''యజ్ఞో వై విష్ణుః'' అనెడి శ్రుతివాక్యములబట్టి విష్ణు ప్రీత్యర్థమై చేయునట్టి వైదికకర్మ యజ్ఞార్థ మనబడును. అట్టి నిత్యనైమిత్తిక కర్మలు, అనగా సంధ్యావందన, అగ్న్యారాధన, సూర్యోపాసన, బ్రహ్మయజ్ఞాది, పంచమహా యజ్ఞములు, బంధహేతువులు కావు. వేరైన సామాన్య కర్మలు బంధహేతువులు. అందుచే అట్టికర్మలు చేయువాడు ఎంతటి కర్మిష్టియైనను జన్మరాహిత్యము గాంచలేడు. ఆ కామ్య కర్మల ఫలమనుభవించుటకు మరల మరల జన్మలెత్తుచునే యుండవలయును. కాని పరమేశ్వర ప్రీతికై చేయబడు కర్మలచే బంధింపబడడు. ''తత్కర్మ యనుబంధాయ'' బంధము కలిగించని కర్మయే, కర్మయను శ్రుతివాక్యము లనుబట్టి, ఈశ్వర సేవారూపమైన కర్మలు, బంధకారణములుకావని తేలుచున్నది. ఈ కారణముననే సమాధినిష్ఠాగరిష్ఠులైనవారు తమ మనసును భగవంతునియందు కేంద్రీకరించి చింతన చేయుటచే కర్మసన్యాసులయ్యు కర్మచేయువారేయనియు, అట్టివారు మానసికకర్మ చేయువారనియు, నిత్యం దిన శారీరకావసరములకు కర్మలుచేయు సామాన్యులు కర్మిష్ఠలని చెప్పబడియు, వారుచేయు కర్మలు భగవత్పరము, పరమేశ్వరార్పితము కానందున వారు అకర్మకులని చెప్పు వాదము కూడ గలదు. కావున ఈశ్వర ప్రీత్యర్థం, ఫలాపేక్ష లేకుండా విధి విహిత కర్మల ప్రతిమానవుడు తప్పక చేయవలసినదే. కర్మయోగులైన గృహస్థులకు కర్మయోగము అనగా కర్మరూపమైన యోగము ప్రధాన ముక్తిసాధనము. ఏలనన కర్మాచరణచేత, నిష్ఠ నియమములతో నుండునట్టి స్థితి అలవడును.

''అహరహస్యం సంధ్యా ముపాసీత'' నిత్యము సంధ్య వార్చుము. సూర్యుడుదయింపగనే హోమము చేయుము. గృహస్థు జీవితాంతము వరకు అగ్న్యారాధనాది కర్మలు చేయుచునే యుండవలయును. సత్య సంభాషణ కర్తవ్యము. ధర్మమైన పనులనే చేయవలయును నిందింప రానివియు శ్రేయస్సు కూర్చుననియు అగు కార్యముల చేయవలయును. ఏలనన దేనివలనైతే పురుషునకు కర్మబంధముండదో, అట్టి కర్మ అకర్మకంటెను, మూర్ఖుడుచేయు కర్మసన్యాసముకంటెను ఉత్తమమైనది. మూర్ఖుడుచేయు కర్మ సన్యాసమువలన ప్రత్యవాయము కలుగును. అట్టి బాధ కర్మానుష్ఠానపరునకు లేదుసరిగదా ఈశ్వరానుగ్రహమున చిత్తశుద్ధి జ్ఞానము, మోక్షము సిద్ధించును. అట్టి కర్మ, యుత్తమ ఫలము కలదగుటచే ముముక్షవగు మానవుడు విధ్యుక్తమైన నిత్యనైమిత్తికములైన కర్మలు ఈశ్వర ప్రీత్యర్ధము చేయుచునే యుండవలెను. కర్మ బంధహేతువు, అనునది కామ్యకర్మలకు నిషిద్ధకర్మలకుమాత్రమే వర్తించును. అవి నిజముగ బంధహేతువులే. శాస్త్రసమ్మతమై విధివిహితమైన కర్మచేయకయు, పరధర్మమగు కర్మను, నింద్యమైన కర్మలను చేసినవాడు మాత్రమే కర్మ బద్ధుడగును. ముముక్షవునకు శ్రుతి స్మృతులు విధించిన కామ్యవర్జితము లగు నిత్యనైమిత్తికములకు మాత్రమే యధికారము కలదు. ఇతరత్రా జ్ఞాననిష్ఠయందుగాని, సన్యాసమునగాని లేదు. యజ్ఞము, దాసము, తపస్సు, మానవుని పావనముచేయును. ''ధర్మేణ పాప మపనుదతి'' అనగా ధర్మము (స్వీయధర్మము) ద్వారా పాపమును పోగొట్టుకొనుము. కర్మచేయుట యనునది విధి. ధర్మమవిగదా ఉపనిషత్తులు నిర్ణయించినది. అందుచే అట్టి కర్మపరతంత్రునకు తత్కర్మఫలమునందు అధికారములేదు. అట్టి వాంఛయే యుండరాదు. కర్మఫలాశయున్నచో సర్వదుఃఖములకు మూలమైన జన్మలు ఒకదాని వెనుక ఒకటి కలుగుచునే యుండును. ముక్తి లభించదు. కావున గృహస్థు కర్మఫలమునకు కారణముకారాదు. కర్మ చేయించువాడు భగవంతుడు తత్ఫలము ఈశ్వరునిది. మానవుడు నిమిత్తమాత్రుడు.

ఫలము లేకపోగా క్లేశభూయిష్ఠమైన కష్టములతో నియమములతో కూడిన కర్మ యేలచేయవలయును? అను ప్రశ్న యుత్పన్నమగుట సహజము. కర్మ చేయకుండుట ఆకర్మ, అనగా కర్మను త్యజించుట అది ఆచరణ సాధ్యముకానిదని గ్రహించితివి అది అసంభవము పైగా కర్మ చేయనియెడల ప్రత్యవాయదోషము, దానివలన నరకము లేదా నీచజన్మ మొదలగు అవాంఛనీయములగునవి సంప్రాప్తమగును. కనుక ముముక్షువు నకు కర్మ సన్యాసము యుక్తముకాదు. దుఃఖవిముక్తికి జన్మరాహిత్యమునకు, నిష్కామప్రవృత్తి పరమేశ్వర ప్రీత్యర్థం గృహస్థు కర్మలుచేయుచు తత్కర్మఫలము పరమేశ్వరార్పితము చేయవలయును. గృహస్ధునకు కర్మ సన్యాసము పరధర్మమగుట పాపహేతువగును.

కర్మసన్యాసమననేమి? సకామముగా విధింపబడిన జ్యోతిష్టోమాది కామ్యకర్మల పరిత్యాగమే గృహస్థునకు కర్మసన్యాసమని కొందఱందురు. కర్మలు కామ్యములుకాని అకామ్యములుకాని సర్వకర్మఫలమును పరమే శ్వరార్పతముగా నర్పించుటయే సన్యాసమగునుకాని కర్మత్యాగము కాదని కొందఱందురు. నిత్యకర్మలకు ఫలముచెప్పలేదని కొందఱనగా శ్రుతులయందు నిత్యకర్మలకుకూడ ఫలము చెప్పబడినదని పండితులు కొందరు చెప్పుచున్నారు. వారు,

''అగ్నిశ్చ మా మన్యశ్చ మన్యుపతయశ్చ మమ్యకృతేభ్యాం పాపేభ్యో రక్షన్తాం, యాదహ్నా పాప కారుషం మనసావాచా -'' అనియు

''ద్రుపదాది పముంచతుద్రుపదాది వేన్ము ముచానః స్వేన్న స్యాత్వమలాదివ పూతం పవిత్రేణ......

అనియు, సంధ్యావందనమునుండి ఉదాహరణములు చూపుదురు. కాని, వారు

''అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా''

యస్మ రేత్పుండరీకాక్షం సంభాహ్యభ్యంతరశ్శుచిః అని ప్రారంభించి శ్రీపరమేశ్వరప్రీత్యర్థం సాయంసంధ్యా ముపాసషీ అను సంకల్పమును గమనించవలయును పైన మనము గ్రహించినటుల పరమేశ్వరప్రీత్యర్థం పరమేశ్వరార్పణబుద్ధితో సంకల్పించి చేసిన కర్మ నిష్కామకర్మయే యగుట బంధహేతువుకాదు. నిత్యకర్మలకు ఫలమున్నదని యంగీకరించి నను అవి పరమేశ్వర ప్రీత్యర్ధం విధింపబడిన కర్మలుగాన, అవి కామ్య కర్మలుకావు. కాన ఏదియెటులైనను కర్మసన్యాసము చేయుటయే మోక్ష సాధనకాదనియు, సర్వకర్మఫలత్యాగమే సరియైన సన్యాసమనియు గ్రహించ వలయును.

ముముక్షువునకు సర్వకర్మ సన్యాసపూర్వకముగా నుండు యమ యమాది శ్రమసాధ్యమైని సా నము ప్రతిబంధసహితమైన జ్ఞానముకంటెను ప్రతిబంధ నివృత్తి హేతువైన, సజాతీయ ప్రత్యయ రూపమగు ధ్యానము విశేషమైనది. అనగా జన్మాదిహేతువైన అనిద్య కామ సంకల్పాదుల ప్రతిబంధకముల నివృత్తి చేయునదగుట ధ్యానము మిక్కిలి శ్రేష్ఠమైనది అగుచున్నది. అట్టి ధ్యానముకంటెను సర్వకర్మఫలత్యాగము శ్రేష్ఠతరమైనది. ఏలనన మనోనిశ్చయము అతి దుర్లభము; అతిదుష్కరము, ఏకాగ్రత కుదురుట ఎంతో కష్టసాధ్యమగు సాధనతో కూడినది. నిత్యనిరంతర సాధన సాధ్యమగుటచే ధ్యానము మహత్తరక్లేశసాధ్యము. అంతకన్న యధాశక్తిగ విధివిహిత కర్మచేసి, తత్కర్మఫలము పరమేశ్వరార్పితము చేయుట సులభము అటుల కర్మల ననుష్ఠించినవాడు ఉత్తరక్షణ ముననే సర్వకర్మఫల సన్యాసియు, నియతసిద్థుడును కామసంకల్పత్యాది దోష నిర్ముక్తుండును, శుద్ధబుద్ధియునైన కర్మయోగి యనంబడును. అట్టి కర్మయోగికి సంసారోపశమనెడి మోక్షము సిద్ధించును. అత్యంత స్థూలబుద్థి యనగా మందాధికారియగు ముముక్షువునకు కూడ అభ్యాసమునందు ఈశ్వరునుద్దేశించి చేయబడుకర్మ చిత్తశుద్ధికి సాధనమముగా నున్నదగుట కర్మచేయుట, కర్మఫలత్యాగము చేయుట మోక్షసాధనములుగా విధింపబడినవి ఆ కర్మలు బ్రహ్మమునందర్పితములుకాగా మరల వాటియందుగాని వాటిఫలమునందుకాని వాంఛకల్గుటకే ఆస్కారములేదని గ్రహించియే యున్నాము.

పరమేశ్వరప్రీతిగా శ్రద్థాభక్తులతో ననుష్టించు శ్రౌత స్మార్తాది రూపమైన కర్మయే ముముక్షువుని ఋణత్రయమునుండి విముక్తిని చేయుచున్నది. దానివలన ఈశ్వరానుగ్రహము సిద్ధించును, అట్టి అనుగ్రహముచే ఇంద్రియనిగ్రహము పిదప హృదయనైర్మల్యము, జ్ఞానసంపాదనా సంపత్తి, వానికి లభించును. అందుచే సన్యాసముకంటె కర్మయోగమే శ్రేష్ఠమైనదగుచున్నది.

నిష్కామకర్మ ప్రతిఫలాపేక్షరహితము కాన ఉత్తమమైనదే. అయినను అది ప్రారంభదశయందు ఎల్లరకు ఆచరణసాధ్యము కాకపోవచ్చు నిర్గుణోపాసన శ్రేష్ఠమేఅయినను సగుణోపాసన చేయవలయుననియే శాస్త్రములు చెప్పుచున్నవి అటులనే నిష్కామ కర్మపరతంత్రుడగుటకు మున్ను, కామ్యకర్మలుకూడ చేయవలసినదే. ఏ కర్మనైనను చేయుటకు నియమము నిష్ఠకావలయును. శౌచము, శమము, నిగ్రహము, ఉండవలయును. చేయుపనియందు ఏకాగ్రత యుండలయును. ఏ కర్మలైనను కర్తకు మాత్రమేకాక లోకముకుగూడ నుపయోగకరము కావలయును కామ్యకర్మలగు యాగములవలన దీనిని సాధించవచ్చు. యాగములందు చేయబడు అన్నదానాదులవలన భూతతృప్తి కలుగును. అది పుణ్యహేతువే కద! అందుచే నిష్కామప్రవృత్తి కలుగుటకు సాధనమార్గములగు కామ్య కర్మలుకూడ చేయుచునే యుండవలయును అటుల చేయుటవలన అంతఃకరణశుద్థి, విగ్రహము, శమదమాదులు అలవడును. ఏకాగ్రత కుదురును కర్మచేయకుండుటకన్నబంధకారమైనను సత్కర్మలగుకామ్యకర్మలుచేయుటయే మంచిది. అటులచేయుటవలన తత్కర్మఫలమగు ఉత్తమజన్మ కలుగును సత్సంకల్పములు వృద్ధియగును. విమోచనమార్గమున గమించు జీవులకు అవి సోపానపరంపర. ఈశ్వరార్పణబుద్ధితో కర్మలు చేయుచునే యుండవలెను సుఖకరములుకానీ కాకపోనీ, కర్మలు చేయుటయే తన విధియని మానవుడు చేయవలయును. కర్మయోగి కర్మఫలమును గోరడు. రానిపదార్ధము లభించవలయుననిగాని, కలిగిన ఈ కష్టములు, తొలగవలయుననిగాని, కర్మలుచేయడు. కర్మచేయుట తనవిధియని విహితధర్మమని చేయును. రాగాదిదోషములులేక పరిపక్వహృదయుడై సమచిత్తమున తన విధ్యుక్తధర్మముల నిర్వహించు గృహస్థు కర్మానుష్ఠాన వర్తనుడై యున్నను, భార్యాపుత్రులయెడ బంధుమిత్రాదులయెడ మమకారము వీడి అనాయాసముగ సంసారబంధమునుండి విముక్తి గాంచగలడు. అవే శాశ్వతమని వాటియందు మమకారము పెంచికొనడు చిత్తము పరిపక్వము కానిచో యత్యాశ్రమము స్వీకరించినవారు సహితము ముక్తినందలేరు. వారికి ప్రత్యవాయము కలగుటయు సంభవమే. కర్మోపసనాసక్తునకు చిత్తశుద్ధి సులభమగును. అంత నాతడు జ్ఞానియగును అందుచే కర్మయోగియగు గృహస్థు జ్ఞానికానేరడును వారి వాదము అంగీకారము కాదు. కర్మ జ్ఞాన సాధనమగుటచే జ్ఞానము, మోక్షసాధనమగుటచే, సన్యాసమునకు, మోక్షమే గమ్యముగాన, జ్ఞానకర్మయోగములు జ్ఞానసన్యాసములకు, సాధ్య సాధన భావమని గ్రహించవలయును. అప్పుడు కర్మఫలమేజ్ఞానఫలమగును. కావున సాంఖ్యయోగ, కర్మయోగ, ఫలములొక్క టేయనియు, అదియే మోక్షమనియు చెప్పుపండితుల వాదమెంతయు సమంజసము. అందుచే కర్మానుష్ఠానతత్పరుడగు గృహస్థు కర్తృభావము, కర్మఫలవాంఛను వీడి, నిష్కామ ప్రవృత్తితో వేదవిహి తకర్మల నెరవేర్చుచున్నచో ముక్తుడగుటకు ఎట్టి అభ్యంతరములేదు. కావున గృహస్థాశ్రమపరునకు ముక్తి లేదనియు, కర్మబంధహేతువగుట చర్వితచరణముగ మరలమరల పుట్టుచు మరణించుచు నుండవలసినదేయనుట నిస్సార మనవలయును. సర్వాశ్రమ లాభములు గృహస్థాశ్రమముననే లభ్యములు, అని యిదివరకే గ్రహించి యుంటిమి కనుక, కర్మయోగియగు గృహస్థు పరమపవిత్రుడు. పునర్జన్మ రహితుడు జీవాత్మపరమాత్మలో ఐక్యమగుటకు గృసాస్థాశ్రమధర్మమగు కర్మయోగమే పరమసాధనము.

కర్మలలో ప్రాయశ్చిత్త కర్మగూడ చెప్పబడినది. అజ్ఞానకృతము లగు దోషములుండుట సహజము. అట్టిదోషముల వలన సంభవించగల పాపములకు ప్రాయశ్చిత్తకర్మలు చెప్పబడినవి. అంతియేగాక తనతప్పును తానుగ్రహించి పశ్చాత్తాపపడువానికి ప్రాయశ్చిత్తకర్మ చెప్పబడినది. అనగా తనతప్పును తాను తెలిసికొని, తానుగా శాస్త్రములు విధించిన శిక్షల ననుభవించుట ప్రాయశ్చిత్తకర్మ. జ్ఞాతాజ్ఞాతపాపములకు పరిహారార్ధము పరమేశ్వర ప్రీత్యర్థం చేయబడు సంధ్యావందనము ముఖ్యసాధనముగా భావించవలయును. సర్వపాపహారిణి గాయత్రీజపము గృహస్థునకు విధిగ జెప్పబడినది. దీర్ఘముగ పరిశీలించగా నిత్యవైమిత్తిక కర్మల సశాస్త్రీయ ముగ నిష్కామప్రవృత్తిజేయు గృహస్థు కర్మయోగియై, ముక్తిగాంచు ననునది సర్వాంగీకారమని తేలుచున్నది.

---------------------------------------------------------------------------------------------------- చాటునగాని బహిరంగముగగాని నీవు ఏది చేసినను పరమాత్మ చూచుచునే యుండును. ఈ విషయము ఎన్నడు మరువకుము.

(శ్రీ శ్రీ శ్రీ సీతారామ యతీంద్రులు)

Satyanveshana    Chapters