Satyanveshana    Chapters   

మతము

ప్రకృతియందంతను వ్యాపించియుండి సర్వకార్యములకు కారణభూతమైన ఆ పరబ్రహ్మమును, ఆ పరాశక్తిని గ్రహించుటకు సాధన అవసరము ఆ సాధన మార్గమేది? అది యెవరికి సాధ్యము?

ప్రపంచమందలి సకలజీవరాసులు ఎనుబదినాలుగు యోనివర్గములలో జేరినవని చెప్పుదురు. అనగా species అన్నమాట. ఆ ఎనుబదినాలుగులక్షల జీవరాసులలో పుణ్యపాపముల, శుద్ధాశుద్ధముల, థర్మాథర్మముల నిత్యానిత్యములాది విషయముల చక్కగ పరిశీలించుటకు సక్రమమార్గమున చరించి జన్మసాఫల్యమందుటకు కావలసి శక్తిమేధసంపత్తి మానవులకేగలదు. అనగా మానవుని బుద్ధి ఆ బాల్యమాది నూతన విషయముల తత్త్వము గ్రహించుటకు ఉత్సుకమగుచుండు నన్నమాట. అట్టి జిజ్ఞాస ప్రారంభదశలో పంచేంద్రియ మూలకము. తరువాత బుద్ధిగమ్యము అయి ఐహికవిషయ సంబంధిగానుండి అనుభవముమీద బుద్ధి వికసించి, జ్ఞానోదయమైనకొలది ఆముష్మిక విషయ విచారణకు గడంగును. పశుపక్ష్యాదులయందుకూడ విశ్వాసాదిగుణములు, ఆలోచనా శక్తి కొంతవరకు ఉన్నటుల అనుభవముమీద కనిపెట్టగలము. కాని వాటి యందు బుద్ధి మానవునియందువలె అభివృద్ధిచెందక, ఐహిక విషయములకు మాత్రమే పరిమితమై యుండును. అట్టిదానిని స్వభావమని చెప్పవచ్చును. అందుచేతనే స్వయముగా నాలోచించి విచక్షణచేయగల మానవజన్మ ఉత్తమమైనదందురు.

కొన్ని విషయములలో కర్మభూమియందు జన్మించిన మానవులు భోగభూమియందలి దేవతలకన్న మిన్నయనిగూడ చెప్పుదురు. ఏలననస్వయంకృషివలన సృష్టి రహస్యమును పరిశోధించి, ఆత్మానాత్మ విచారణసల్పి బ్రహ్మాను సంధానమునకు కావలసి తపోవియమాదుల, శమదమాది గుణముల అలవరచుకొని, సాధనజేసి సాధించి ముక్తిగాంచగలరు. దేవతలు ఎంతటి సౌఖ్యమనుభవించుచున్నను, అనిమిషులయ్యు త్రిదశులయ్యు, అంతకుమించిన ఉత్తమస్థితిని గాంచలేరు. వారికి జన్మరాహిత్యము లేదు. ఆ కారణమున జన్మరాహిత్యమును బ్రహ్మైక్యతను సాధించుటకు అవకాసములుకల, సాధనసంపత్తికల మానవజన్మయే యుత్తమమని పండితులనుటలో విపర్యాయము లేదు. దేవతలుకూడ మానవజన్మ యెత్తవలయునని కోరుచుందురట. కనుక మానవజన్మ గాంచినవారు కాలము వృధాపుచ్చక, తరుణోపాయము నన్వేషించుచునే యుండవలయును. అందులకు కావలసిన సాధన చేయుచునే యుండవలయును. కావలసిన సాధన సంపత్తి సమకూర్చనదే మతము.

జన్మ తరుణోపాయ మార్గములనేకములు చూపబడినవి. మానవునకు వేదవిహితములైన ధర్మములు నిర్ణీతములయినవి. అవి మానవ ధర్మములు. అవియే సనాతతధర్మములు. అవియే సర్వాకాలికములు. సర్వమానవులకు సత్యము, దయ, ఉపవాసము, తపము, శౌచము, శమము, దమము, సైరణ, సదసద్వివేకము, మనోనియమము, దానము యధోచిత జపంబును, సంతోషంబును, మార్దవంబును, సమదర్శనంబును, మహాజన సేవయు, గ్రామ్యములైన కోరికల వీడుటయు విష్పలక్రియల వర్జించుటయు, మితభాషిత్వము, దేహంబుకాని తన్నుతాను వెదకికొనుటయు, ఆర్తత్రాణపరాయణతయు అన్నోదకముల ప్రాణులకు పంచియిచ్చుటయు సామాన్య ధర్మములుగ జెప్పబడినవి. సర్వప్రాణులయందు దైవాంశమును జూచుట. శ్రీపరమేశ్వర నామస్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కారదాస్య ఆత్మసమర్పణ సఖ్యంబులు విశేష లక్షణములనియు శ్రుతులు చెప్పుచున్నవి. ఇటుల ఆలోచించుటకు కావలసిన జ్ఞానమును, స్వాతంత్య్రమును మానవునకు పరమాత్మ ప్రసాదించినాడు. ఆ స్వాతంత్య్రము విధినిషేధములతో నిబందింపబడినది. శాస్త్రకట్టుబాటులతో అదుపులో నుంచబడినది. ఒక గుంజకు త్రాడుతో కట్టబడిన గోవునకు కొంత పరిధిలోగల ప్రదేశములోనే సంచరించుటకు అవకాశము స్వాతంత్ర్యముకలదు కాని ఆ మేరనుమీరి అది సంచరింపజాలదు. ఆ కట్టుత్రాడు అను విబంధనను తెంచికొని బయల్వడి విచ్చలవిడిగ సంచరించిన కష్టములపాలయి శిక్షలకు గురియగును. అటులనే మానవుడు ధర్మవిథియను రజ్జువును శాస్త్రములను కట్టుబాటులను ఛేదించి, విశృంఖల విహార మొనర్చిధర్మబాహ్య కృత్యములకు గడంగిన లోకకంటకుడై తన మానవత్వమును బోగొట్టుకొని దానవత్వమునకు దిగి శిక్షార్హుడగును. అటుల చరించుట పాపమని శాస్త్రములు చెప్పుచున్నవి.

అట్టి కట్టుబాటులలో మానవుని ఉంచి నడపించు తంత్రమును మతమని చెప్పనగును మానవధర్మముల ఇహలోకనడవడిని దిద్దితీర్చి సక్రమమార్గమున నడిపించునది మతము. పరలోకగమనమునకు పరమాత్మను జేరుటకు మార్గము చూపునది మతము. ఆ మతము ధర్మ ప్రభోధాత్మకము. ధర్మాధర్మములు, సత్యాసత్యములు న్యాయాన్యాయములు మొదలుగువానిని నిర్దేశించి, మానవ జీవితపధమును దిద్దునది మతము. మానవుడు ఐహికయాత్ర సాగించుటతో గమనింపవలసిన ధర్మములు, విధినిషేధములతో నిర్వచింపబడి, రూపొందించబడినవనిగదా యంటిమి. అవి బాహ్యనడవడినేగాక, అంతర సంకల్పమును గూడ దిద్ది క్రమమార్గమున నుంచి త్రికరణశుద్ధిగ మానవుడు జీవయాత్ర సాగించితన జీవితమును సుఖప్రదము చేయుటకే గాక, అతడు తానుండు సంఘమునకు, తనపరిసరములనుండు ఎల్లజీవరాసులకు, దేశమునకు, మేలు గూర్చుచు, భూలోకమును స్వర్గధామముగ జేయుటకుపకరించును. మానవతాగుణముల పెంపొందించును ముక్తిమార్గము నిష్కంటకము చేయును

Creates a Heavan in the place of Hell ఇదియే మతము యొక్క ప్రయోజనము పరమావధి. Character is threefourths religien అనిన వివేకానందుని సూక్తికి ఇదియే యర్థము. సచ్చీలుని లక్షణములనే వివేకానందుడు సూచించినది. అది సర్వధా సత్యము, గమనార్హము, సత్ప్రవర్తన, అమానిత్వము, అహంకార మమకారరాహిత్యము, దంభరాహిత్యము, అహింస, శాంతి, శౌచము, ఆర్జవము, స్థయిర్యము, ఆత్మనిగ్రహము, వాంఛారాహిత్యము మొదలగునవికదాసచ్చీలుని లక్షణములు! వీనిని ప్రతిపాదించి శాసించునదే మతము.

ఇట్టి ధర్మముల కట్టుబాటుల ప్రతిపాదించి విధించు గ్రంథములను శ్రుతలనియో , స్మృతులనియో, శాస్త్రములనియో, భగవద్బాక్యములియో పవిత్రగ్రంధములనియో వేరు వేరు మతములవారు వేరు వేరు నామముల గ్రంధస్థము చేసిరి, సత్యం శివం సుందరం అయినది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే సర్వమునకు మూలమంటిమి. అది సర్వమునకు ఆధారభూతమేకాదు. శాసించునది, శాసించునది మాత్రమే కాదు. అక్రమ వర్తనులను ధర్మబాహ్యులను శిక్షించునది కూడ. సద్వర్తనులను రక్షించునదియును. అట్టి పరతత్త్వమును నిరూపించుటయు తద్మహిమల ప్రకటించుటయు, దానిని జేరుటకు కావలసిన మార్గముల జూపుటయు మత ప్రయోజనముంటిమి. అదే జిజ్ఞాసువుల సాధనసారము. సాధనమార్గములు వేరైనను గమ్యస్థానమొక్కటియే.

గమ్యస్థానమొక్కటియే యయినచో, వివిధ మతములు ప్రభవిల్లుటకు కారణమేమి? అని మతముల ధర్మముల ప్రయోజనము ఒక్కటేకదా! ఆదిసత్యమే. అయినను సాధనమార్గము లొకేవిధమున నుండవు ఉపాసణ భేదములుండును. ఎవరిపద్దతి వారిదే. సర్వులకు ఒకే మార్గము నచ్చదు ఉపయోగపడదు అనుసరసాధ్యము కాకపోవచ్చు. దేశ కాలపాత్రలబట్టి మార్పులు సంభవించును. వ్యక్తుల గుణకర్మభేదములబట్టి పద్ధతులు మారుచుండును. ప్రకృతిసిద్ధమైన వ్యత్యాసములుగల మనుజులనెల్ల ఒకేపద్ధతిని బిగించుట, ఒకే సూత్రమున గుదిగూర్చుట, దుస్తరము ఆచరణసాధ్యముకానిది సాధకుడు తన సాధనమార్గమున దేశకాల భేదముల, యుగధర్మముల గమనింపక తప్పదు. అందుచే వేదమతమగు హిందూమతము, జైనమతము, క్రైస్తవమతము, ఇస్లాముమతము మొదలగు మతములు వేరువేరు కాలముల ప్రభవిల్లినవి. క్రమక్రమమున వ్యాప్తిచెందినవి. ఆయా మతములవారందరు మోక్షమును గోరువారే. ఇహము అశాశ్వతమనువారే. నిరీశ్వరవాదులు తప్పమిగిలిన మతముల వారందరు ఏదో విధముగ ఈశ్వరత్వమును, పరమాత్మ జీవాత్మల సంబంధమును అంగీకరించినవారే. అన్ని మతములవారును జీవాత్మ పరమాత్మ నుండి ప్రభవిల్లినదనియు, ఆ జీవాత్మ పునర్జన్మ రాహిత్యమునంది మరల పరమాత్మలో ఐక్యముగాంచవలయుననువారే. పరమాత్మ జీవాత్మల సంబంధము'బింబప్రతిబింబ' భావమనియో ఆ భాసరూపమనియో, సూక్ష్మాతి సూక్ష్మమగు పరమాత్మతేజో రేఖాంశమనియో, ఏమనియో. ఏమనియో చెప్పుచు జీవాత్మ పరమాత్మల సంబంధ మంగీకరించుచున్నారు. క్రైస్తవులు God crceted man in his our image అనుటలో మానవులందరు భగవంతుని పుత్రులనుటలోనుగల అర్ధమిదియే. కనుక ఒక్కొక్క కాలమున మానవాభ్యుదయమునకు లోకకళ్యాణమునకు ఒక మహాత్ముడు ఒక ప్రవక్త భగవదంశసంభూతుడు అవతరించును.''ధర్మసంస్థాపనా ర్థాయ సంభవామి యుగే యుగే'' అను భగవద్వాక్యమునకు భావమిదియె. రామకృష్ణాది యవతారములు, పార్శనాధుడు, బుద్ధడు, ఏసుక్రీస్తు, మహమ్మదు మొదలగు మత స్థాపకులందరు భగవదంశసంజాతులే వీరేయన నేల? వశిష్టాదిమహర్షులు, వ్యాసభగవానుడు, త్రిమతాచార్యులు, ఆర్యబ్రహ్మ సమాజస్థాపకులు. చైతన్యవభాల్లచార్య, రామకృష్ణ, వివేకానంద, రమణ మహర్షి, శాయిబాబా, మోహరుబాబా, సత్యశాయిబాబాదులందరు భగవదంశ సంభూతులనియే భావించవలయును. అటుల కాకున్న వారియందు మానవాభ్యుదయమునకు కావలసిన తహతహ, ప్రబోధాత్మక దివ్యశక్తులుండెడివికావు. లోకము పెడదారిని నడచుచున్నప్పుడు ఐహికవాంఛలే (Materialistic Desires) ప్రబలి ఆధ్యాత్మికచింత మరుగుపడు ఆపత్కాలమున మానవకోటిని మేల్కొలిపి ఆశాశ్వతమగు ఐహికవాంఛల నుండి శాశ్వతమగు పరతత్త్వమునెడ దృష్టిని మరల్చి మానవకోటిని ఉద్ధరించుటకు అవతరించిన మహాత్ములు ప్రవక్తలువారు. కనుక తేలిన సారాంశ మేమన వేదమతమున అంతర్శాఖలుగా విభిన్న మార్గముల చరించు ద్వైతులుకానిండు అద్వైతులుకానిండు, విశిష్టాద్వైతులుకానిండు, శివాద్వైతులుకానిండు, లేక హైందవేతురులేకానిండు, అందరు జీవాత్మ పరమాత్మల సంబంధ మంగీకరించినవారే యునునది. వారందరు జిజ్ఞాసువులు అన్వేషణమార్గములు వేరు. పరమాత్మ నుండి రూపొందిన జీవాత్మ మరల తన జన్మస్థానము జేరుటకు పడు తహతహయే ఆత్మానాత్మ విచారణకు మూలకారణము అదే సాధన. దానిని క్రమమార్గమున నడపించునదే మతము. అందుచే ఏ మతములవారును తమమతమే ఉత్తమమైనదనియు, అన్యమతస్తులు కాఫరులు పేగనులు ముక్తిపొందలేదనియు ప్రచారము చేయుట అవ్యక్తము. అహంకారయుతము; తమ తమ మతములందు వారికి గల దురభిమానము అందుచే మత ప్రచారకులు చేయుచున్న బోధలు, అవలంభించుచున్న పద్ధతులు కొన్ని యెడల కలహములకు కారణమగుచున్నవి. అట్టిబోధలు, ప్రచారములు భగవంతుని నిర్దేశములకు భిన్నములనియు, అట్టి మతబోధకులు మాత్సర్యరహితులు కారనియు భాదవించవలసి యుండును.

మతములన్నిటికి మూలసూత్ర మొక్కటియే. సనాతన ధర్మములు అన్నిమతములకు సామాన్యమే; సమాదరణీయములే. కాని ఒక్కొక్క మతమున ఒక్కొక్క సాధనమార్గమునకు కొన్ని కొన్ని ధర్మములకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్య మీయబడుటచే, మతములు వేరు, ఆ యా మతముల ప్రయోజనములు వేరు, అనుభావము సామాన్యులకు కలుగుటకు ఆస్కారముండుటచే, కొందరు మత ప్రచారకులు, అన్యమతములయెడ ద్వేషమును పురిగొల్పు దుర్బోధల అజ్ఞానము చేతకానిండు, స్వలాభము కొరకు కానిండు చేయుచున్నారు.

వైదికమతము ఏనాడు ఏరూఫమున ప్రారంభ##మైనదో, ఎవరు ప్రారంభించిరో చెప్పలేమని గదా గ్రహించితిమి. హిందూమతము ఇంత విస్తృతమగుటకు యుగయుగముల చెక్కుచెదరక యుండుటకు; ఏదో కారణ ముండవలయును. అది యెరుంగుటకు హిందూమతము యుగయుగముల ఎటుల ప్రవర్ధమానమైనది ఇచట కొంత విచారించుట చాల అవసరము. ఈ వైదికమతము ఆదిఆర్యుల మతమని పండితుల భావము. ఆర్యులు హిందూదేశమునం దడుగు పెట్టుటకు పూర్వము ఈ దేశమునందు ద్రావిడులేగాక అనేకములగు ఆటవికజాతులు గలవు. వారందరు ఏదో విధమగు మతము కలవారే. ఆ మతముల పేర్లు మనకు తెలియనంత మాత్రమున వారికి మతములులేవని భావింపజనదు. ఆర్యులు ఆర్యావర్తమునేగాక భారతావని యంతటను వ్యాపించినప్పుడు ఆ యా ప్రాంతముల గల పూర్వవాసులతో కలసిమెలసి, వారి ఆచారముల, మతవిశ్వాసముల, పూజావిధానాదుల కొంత కొంత స్వీకరించి తమ మతమునందు జేర్చి, అటుల సమన్వయింపబడిన మతమును ఆ యా ప్రాంతములకు బోధ పఱచి, తమ తమ సిద్ధాంతముల నెరుకపరచి హిందూమతమును ఆ యా ప్రాంతీయుల కంగీకార యోగ్యము జేసిరి. ఆ విధముగ హిందూమతము కాలక్రమముగా మార్పులు కూర్పులు చేసికొని విస్తృతమయినను తన తొంటి అమూల్య సిద్ధాంతముల మరువలేదు. ఆ సిద్ధాంతముల ప్రాతిపదిగ ఇతర మతసిద్ధాంతముల అనుసరణీయములు, ఆదరణీయములు అయినంతవరకు మలచి; హిందూమతమునందు జేర్చికొనిరి. అటుగాక నవీన మత ప్రచారకులలో కొందరివలె రాజశాసనముల బెదిరించిగాని, కత్తి చేబట్టిగాని, ఐహికములగు భోగములందు ఆశలు ప్రకోపింపజేసిగాని, తమ మతమున జేర్చికొనుటకు ప్రయత్నించలేదు. అందుచే పరిపక్వమై పరిపూర్ణమైన హిందూమతము పరమతప్రచారకుల దుష్ప్రచార గాలి దుమారములను ప్రతిఘటించుటయే గాక ఇతర మతములకు ప్రధాన ప్రాతిపతిక లనదగిన సిద్ధాంతముల నన్నిటిని గలిగియుండి మహాసముద్రము వలె విశాలము గంభీరము అయియున్నది.

హిందూమతమునందు ప్రతిపాదితములైన అహింస శమదమాది ధర్మములన్నియు సనాతన ధర్మములనియు సర్వులకు ఆచరణయోగ్యము లనియు గ్రహించితిమికద. కాని తరువాత ప్రచారములోనికి వచ్చిన జైన బౌద్ధక్రైస్తవ ఇస్లామాది మతములు ఈ వైదికమతమునందలి కొన్ని కొన్ని ధర్మములను దేశకాలపాత్రలబట్టి స్వీకరించి ప్రాధాన్యమిచ్చిరి. జైనులు 'ధర్మంచర' అను సూత్రమునకు కట్టుబడుదురు. అహింసావ్రతము ననుస్టింతురు. బౌద్ధులకు 'అహింసాపరమోధర్మ' అనునదే ప్రధాన సూత్రము. హింసాయుత యాగాదులు పాపహేతువులు. ముక్తిదాయకములు కావని బౌద్ధుల వాదము ఏసుక్రీస్తు ప్రేమమూర్తి; సర్వ మానవులందేకాక సర్వజీవులయందును దయ ప్రేమ కలవాడు. ఇతరుల కష్టముల తన కష్టములుగా భావించి వారికొరకు తాను బాధపడువాడు. ప్రేమ వాత్సల్యముల మూర్తిమంతము; శాంతస్వరూపుడు. మహమ్మదు ప్రవక్త కర్మవీరుడు. ధర్మ కర్మ చరణయందు ఉపవాసాది విధినియమములకు ప్రాధాన్యమిచ్చిన మహనాయుడు. తన సంఘమునుతన జాతిని ఉద్ధరించుటకు నుద్భవించిన అవతారమూర్తి. బ్రహ్మసమాజకులు 'ఏకమేవా అద్వతీయం బ్రహ్మ' అను ఉపనిషద్వాక్యమునక కట్టుబడినవారు; ఏకే శ్వరోపాసనాపరులు. విగ్రహారాధన కంగీకరించరు. ధ్యానము వారి సాధన మార్గము. ఇటుల అన్ని మతముల సిద్ధాంతముల సాధనమార్గముల తరచి చూడ, ఆ యా మతముల మూలసిద్ధాంతములన్నియు వైదికమత (సనాతన) సిద్ధాంతములకు భిన్నములు కావనియు, అన్ని మతములకు అది ఆద్యము మూలాధారము అనియు, సర్వధర్మ సమన్వితమనియు, తే చున్నది ఆ కారణముననే ఎన్నో మతములు వివిధ కాలముల మొలకలెత్తి ప్రచారములోకి వచ్చినను హిందూమతము మీద దాడిజేసి, విషప్రచారముజేసి వైదికమత విధ్వంసమునకు గడంగినను, వైదికమతము చెక్కుచెదరక ఇప్పటికి నిలచియున్నదనిన ఆ మతముయొక్క గొప్ప వేరుగ చెప్పనక్కరలేదు. అది మేరువువలె అచంచలము. సాగరమువలె అతి గంభీరము అఘాతము ఉన్నత శిఖరముల కెగబ్రాకగలవారికి అతిగంభీరలోతు లరయజాలినవారికి గాని దానిశక్తి మహత్యము తెలియరావు అప్పుడప్పుడు వచ్చు అన్యమతస్తుల దుష్ప్రచారములు, చిన్న చిన్న గాలిదుమారములు అవి వైదికమతమును ఏమియు చేయజాలవు ఈ సత్యమును గ్రహించి మత ప్రచారకులందరు సర్వమానవ సౌభ్రాతృత్వమునకు మతసామరస్యతకు మానవాభ్యుదయమునకు కృషిచేయవలయునేగాని మత కలహములకు కులవర్గద్వేషములకు చేయూతనిచ్చు విషప్రచారము చేయుట సర్వలోకపాలకుడగు పరాత్పరుని ఆదేశముల మీరుటయనియు, పాపమునకు బాల్పడుటయనియు గ్రహించవలయును.

మానవునకు హృదయగ్రంధు లనదగినవి ఆజ్ఞానము, కాంక్షలు. అజ్ఞానమనగా మంచి చెడ్డల విచక్షన చేయలేనిస్థితి. అది యొకవిధమగు అంధకారము అట్టి ఆజ్ఞానునకు విపరీతమైన కోరికలు కలుగుటయు సహజమే. అవియన్నియు సక్రమమైనవి కాకపోవచ్చును. అట్టి అక్రమమైన కామితములవలన మానవుడు వక్రమార్గమున గమించి, తనకేకాకా తానుండు సంఘమునకు గూడ నష్టదాయకమగు అధర్మవర్తనుడు కావచ్చును. అందుచే హృదయగ్రంధు లనబడు అజ్ఞానతిమిరమును పటాపంచలు జేసి కోర్కెలను ఆచరణను అదుపులోనుంచి మానవుని జీవితమును క్రమబద్ధము చేయునది మతము. అనగా మానవునియందు ఆత్మ నిగ్రహము వివేచనాశక్తిని పెంపొందించుట మత ప్రయోజన మనవచ్చును.

సిరిసంపదలు కలిగి ఐహికములగు సర్వసౌఖ్యముల ననుభవించు చున్నను మానవుని హృదయమునందు ఒక విధమగు అశాంతి, అసంతృప్తి గలుగుచుండును. అట్టి అశాంతి కలుగుటకు కారణము మానవుడు తానెవరో ఎచటినుండి వచ్చెనో, ఎందులకు వచ్చెనో ఎచటికి పోవుచుండెనో తెలిసికొనలేకపోవుటయే. ఈ షణ్మాత్రమైన జిజ్ఞాసకలవానికి ఇటుల విచారణ చేయుట సహజము. ఏమాత్రమైన ఆలోచించిన ఈ విషయములు నెరుంగ ఆసక్తి గలుగును. అట్టి మానసిక అశాంతిని తొలగించుటకు, మానవునకు మతము అవసరము. మతము మానవుని మేధస్సును, ఉచితానుచిత వివేచనజ్ఞానమును పెంపొందించి, విశాలహృదయుని జేసి, మానవుడు తన వ్యక్తిగత జీవతమును క్రమబద్ధము చేసికొనుటకేకాక సృష్టి రహస్యమును గ్రహించి సర్వమునందు పరమాత్మ విలాసమును గ్రహరించుటకు కావలసిన జ్ఞానసంపత్తిని గలుగజేయును. ఒక్కమాటలో చెప్పవలయునన్న మనము ఇదివరకే గ్రహించినటుల మానవుని ఇహలోకయాత్రను ధర్మబద్ధము, సౌఖ్యప్రదము చేసి పరలోకచింతన బాటలు తీర్చి ముక్తిగాంచుటకు సాధనమార్గముల నిర్ణయించి నడపించునది మతము. అందుచే ఈ ప్రపంచమునం దెన్ని దేశములున్నను, ఎన్ని జాతి భేదములున్నను, అందరికి ఏదో రూపమున మతమనునది యున్నదని చెప్పవచ్చును. ఆ యా మతముల మంచిచెడ్డలు తారతమ్యములు ఎంచి మతావేశపరవశులై కలహములకు దిగక మానవులు వారి వారి మతములు సక్రమరీతిని నిర్ణయించిన పద్ధతుల జీవితయాత్రల సాగించి ముక్తులగుటకు ప్రయత్నించవలయును. ఇదియే మతముయొక్క ముఖ్య ప్రయోజనము మానవతాగుణమును పెంపొందించుటకు సర్వులను ముక్తిగాములను చేయుటకు వివిధ సాధనమార్గముల జూపు హిందూమతము ఒక మహాసముద్రము. సమగ్రమైనది. అధికారతారతమ్యము ననుసరించి వివిధ సాధనప్రక్రియల నేర్పఱచి ముక్తిమార్గము సుగుమము జేసిన హిందూమత సిద్ధాంతములు ఒక గొప్ప తత్త్వశాస్త్రము.

హిందూమతము పరమత దండయాత్రలవలన భిన్నాభిన్నము కాకుండ యుగయుగముల నుండియు నేటికిని నిలచియుండుటకు, దాని విశాల దృక్పధము అందుప్రతిపాదికములైన సర్వకాలిక సనాతన ధర్మములు నిత్యజీవితమునకు దూరముకాక దానితో కలిసిమెలసి తీర్చిదిద్దునవై యుండుటయే కారణము. మానవుని నిత్యజీవితమునకు సంబంధములేని దానిని తీర్చిదిద్దలేని సిద్దాంతముల ప్రబోధించిన మాత్రమున సంఘము బాగుపడుటకాని మానవుడు ఇహపరములు సాదించుటకాని పొసగదు.

ఆత్మానాత్మ విచారణలో, సత్యాన్వేషణలో అనేక సందేహములు, అనుమానములు కలుగుట సహజము. ఆ సందేహముల తీర్చుట ఒక పెద్ద సమస్య. ఆ సమస్యాపరిష్కారమునకు పెద్దలు పండితులు వేదాంతులు, తార్కికులు, మీమాంసికులు, వైయాకరణులు లేవదీయుచున్న వాదములు ప్రతి వాదనలు, ఖండనలు ప్రతిఖండనలు యుక్తులపై యుక్తులు సామాన్యులకు సుబోధకరముగ నుండక గూఢమైన సత్యమును మరింత గూఢము చేయుటయు కద్దు. శరీరమువేరు. జీవుడు వేరు. దేహివేరు. దేహమువేరు. క్షేత్రము క్షేత్రజ్ఞుడువేరు. చేసిన కర్మఫలము దేహికా దేహమునకా అను మీమాంసతో ఎన్నో చిక్కుప్రశ్నల లేవదీయుచు తమ తమ పాండిత్యమును వేదాంత పరిజ్ఞానవాద కౌశలములను చూపుచున్నారు. అట్టివారిలో జిల్పవాదులు, హేతువాదులు, వితండవాదులు, కుతార్కికులు బయలుదేరి జిజ్ఞాసువులను పెడత్రోవను పట్టించుఅపమార్గములు గలుగుటకు అవకాశము కలదు. శరీరమువేరు జీవుడు వేరు అను విషయము కాదనువారుండరు. ఈ వాదములన్నియు సత్యాన్వేషకులగు జిజ్ఞాసనువుల కవసరమే. కాని జీవునకుశరీరమునకు గల సంబంధమేమి? అది మొట్టమొదట ఎటుల కలిగినది? అవి పరస్పరాశ్రయములా? ఆ సంబంధము శాశ్వతమా, లేక విడిపోవునదా? జీవుడు ఈ సంబంధము నుండి శాశ్వతముగా విముక్తిగాంచు మార్గమేది, అనునవి విశదపఱచకున్న, ఆ యా వాదముల సిద్ధాంతముల ప్రయోజనమావంతయు లేదు. ఆత్మానాత్మ విచారణ చేయుటలో జననకారణము మరణకారణము, జీవాత్మ పరమాత్మలో అయిక్యమగుటకు, మనసకాలములో మానవుడు గమనించవలసిన విధులేవి? చేయరానివేవి? మొదలగు విషయముల నిర్ధారణజేసి ప్రబోధించునదే మతము అట్టి మార్గములు జూపిన మహనీయులగు మతాచార్యులు లేకపోలేదు. గ్రంథములు లేకపోలేదు. కాని అలసత్వమువలన లౌకిక పరిస్థితుల వలన ప్రకృతిసిద్ధమగు అజ్ఞానమున వాటియందు ఉత్సాహము చూపువారు, అవగాహన చేసికొనవలయునని ప్రయత్నించువారు పెక్కుమందిలేరు.

మనకు పై నుదాహృతములైన విషయములన్నిటిని కూలంకుషముగా చర్చించి తెలియజెప్పు ప్రామాణిక మతప్రచార గ్రంధములు, వేదములు, ఉపవేదములు, వేదాంగములగు శాస్త్రములు, దర్శనములు ఇతి హాసములు పురాణములు ఈ పరంపరలో బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రధాన స్థాన మాక్రమించినవి. అందలి సూత్రములనాధారముగా జేసికొని పూర్వమీమాంస ఉత్తరమీమాంసలు ప్రభవిల్లి ప్రచారములోనికి వచ్చినవి. కర్మమార్గము జ్ఞానమార్గములతో పాటు భక్తి మార్గముకూడ ముక్తిహేతువని అంగీకరింపబడినది. ఈ మార్గములన్నియు జీవాత్మ పరమాత్మను జేరుటకు వెలుగుబాటలు తీర్చిదిద్దినవే యని విశ్వసించవలయును. ఈ భక్తి కర్మ జ్ఞానమార్గములు మూడును పరస్పర సంబంధము కలవే కాని వేరు వేరు కావనుట శాస్త్రసమ్మతము. ప్రభుసమ్మతములగు వేదముల పరమార్థమును గ్రహింపలేని ప్రజ్ఞాహీనులకు పురాణములు వెలసినవి. వేదముల విభజించిన నారాయణాంశ సంభూతుడగు వ్యాసమనీషియే వేదప్రో క్తములగు ధర్మముల విధినిషేధముల పురాణములలో బోధించెను. బ్రహ్మ సూత్రములందలి అర్థవాదములనే కధలుగా ఇతిహాసములుగా పురాణములందు రూపొందించెను. అందుచే పురాణములన్నియు ధర్మప్రతిపాదన చేయునవే అయినవి. బ్రహ్మణములలో ప్రతిపాదితమై తరువాత కుమారిలభట్టుచే ప్రచారము చేయబడిన పూర్వమీమాంస కర్మమార్గము కాగా ఉపనిషత్తు ప్రతిపాదితమైన జ్ఞానమార్గమునకు శ్రీమదాదిశంకర భగవత్పాదులు ప్రాధాన్యమిచ్చిరి. విధినిషేధములతో గూడినది కర్మయోగము. అడుగడుగునకు నియమములతోను నిష్ఠలతోను మానవజీవితమును నిబందించునది కర్మయోగము. అది ఎక్కువగా బాహ్యసాధనము. కర్మలుకొందరికి అచరణయోగ్యమైనవి. మరి కొందరికి నిషేధములు. పాత్రతాపాత్రల భేదములబట్టి అధికార తారతమ్యమును బట్టి, దేశకాలములబట్టి కర్మలు నిబంధింపబడినవి. అందరికి అన్ని కర్మలు చేయుటకు సమానాధికారములేదు. అటుల కట్టు బాటులతో, విధినిషేధములతో, నియమనిష్టలతో నిబంధింపబడిన కర్మ మార్గమున వర్తించుట యెంతయు కష్టముతో కూడినపని. ఉపనిషత్తులలో ప్రతిపాదితమైన జ్ఞానమార్గము అంతరంగ సాధనము. మధ్యమ మందాధి కారులకేగాదు ఉత్తమాధికారుల కందరకు గ్రాహ్యమగునని గట్టిగ చెప్పలేము. శమదమంబులు, సత్యశౌచములు, అంతర బాహ్యేంద్రియ నిగ్రహము కావలయును. అవి అందరికి సాధ్యమైనవి కావు. అందుచే సామాన్యులకు అందుబాటులో జ్ఞానమార్గము లేదు. ఇటుల కర్మాధికారులు కాని వారికి జ్ఞానమార్గము గ్రహించి అనుష్ఠింపలేని మధ్యమ మదాంధికారులకు తరుణోపాయ మేది? ముక్తుడగుటకు ప్రతిమానవునకు అర్హత యున్నది కదా! వాంఛ కూడ యుండుట సహజము. ఇక గత్యంతరమేమి? అట్టి వారికి భక్తిమార్గము ప్రబోధింపబడినది. ఈ మూడు మార్గములు వేద సమ్మతములే, భగవద్గీతాంతర్భాగములే. ఈ విషయము ముందు ముందు కొంచెము విపులముగా వివరించబడును.

ఉపనిషత్తులలో చెప్పబడిన కర్మజ్ఞాన మార్గములకు భాగవతార్థమగు భక్తిమార్గముతో సంబంధము కల్పించబడి ఆ మూడు మార్గములు అవినాభావ సంబంధము కలవని గీతలో చెప్పబడినది. అట్టి భక్తి మార్గమునకు ప్రప్రధమున ప్రాముఖ్యమిచ్చి, దానిని ప్రబోధించి ప్రచారము లోనికి తెచ్చిన మహనీయుడు. విశిష్టాద్వైత మతాచార్యుడు శ్రీమద్రామానుజులు. వీరి మత సిద్ధాంతములో, పరమాత్మ, ఆత్మ, ప్రకృతి వేఱు. భక్తి ప్రపత్తులకే ప్రాధాన్యమీయబడినది. అందును భక్తి కన్నా ప్రపత్తి విశేషము. భక్తిమార్గము పండితుడు అపండితుడు అనిగాని కులలింగభేదములని గాని లేక సర్వులకు అనుసరణీయయోగ్యమైనది. అందుచే సామాన్యులను ఎక్కువగా నాకర్షించి, వారిని సత్పధమునకు మరలించుట కెంతయు నుపకరించినది. శ్రీమద్రామానుజులువలెనే మధ్యమ మందాధికారుల తరుణోపాయము భక్తి మార్గమేయని ప్రబోధించి అద్వైతాంతర్భాగమగు శివాద్వైతమును ప్రచారముజేసి బౌద్ధ జైన మతముల ప్రతిఘటించి హిందూమతమునకు బలము గూర్చిన మహనీయుడు బసవేశ్వరుడు నిరక్షరాస్యులు విజ్ఞానరహితులు అయినవారికి తరుణోపాయము జూపిన మహనీయులు వీరిరువురు.

శ్రీ శంకర రామానుజుల వలెనే ద్వైతమత స్థాపకులగు శ్రీ మధ్వాచార్యులు వారికిని వేదములే ప్రమాణములు. త్రిమతాచార్యులది వేద విహిత హిందూమతము. అనగా వైదికమతము. హైందవులు ఏ దేశమున నున్నను ఈ త్రిమతాచార్యులలో ఎవరినో ఒకరిని అనుసరించి, వారి సిద్ధాంతములకు కట్టుబడినవారే. అన్ని మార్గములు సముచితములే. వైదిక మతమున మాత్రమే ఈ భేదము లున్నవని భ్రమింపరాదు. అటుల దుష్ప్రదారము చేయువారి మాటలు సత్యదూరములు, ముముక్షువులు కాగోరువారికి గమ్యస్థాన మొక్కటే యనియు, అట్టి మార్గములు అనంతములనియు ఇది వరకే గ్రహించితిమి. వైదికమతస్తులందువలెనే ఇతర మతముల వారిలోను అంతర్శాఖలు కలవు. జైనులలో శ్వేతాంబరులు, దిగంబరులు అనువారు కలరు. బౌద్ధములో మహాయానము హీనయానమను భేదశాఖలు గలవు. ఇక క్రైస్తవులలో నన్నచో క్యాతలిక్కులు, ప్రోటేస్టెంట్లు, ప్యూరిటనులు, క్వాకర్లు మొదలుగా గల అంతర్శాఖ భేదములు కలవు మహమ్మదీయులలో సున్నీలు షీయాలు కలరు. వీరందరికి ఆచారములలోను ఉపాసనా పద్ధతులలోను స్వల్పభేదము లుండును. ఇటుల అన్ని మతములలోను ఎన్నెన్ని భాగములున్నను అవియన్నియు సాధన మార్గములలో భేదములు మాత్రమే యని గ్రహించవలయునను. అన్ని మతములవారును మానవుడు తరించుటకు అనగా జీవాత్మ పరమాత్మ జేరుటకు పునర్జన్మ లేకుండుటకు దైవోపాసన విధి విహిత ధర్మ నిర్మహణలు ప్రధానములని అంగీకరించవలయును. వీటిని రూపొందించి మానవుల ముక్తిగాముల చేయుటయే మతము యొక్క ముఖ్య ప్రయోజనమ. ఉపనిషత్తులలోచక్కగ నిర్వచింపబడిన మతప్రయోజనము ఎల్లరకు శిరోధార్యము.

----------------------------------------------------------------------------------------------------

సారముగల వస్తువు సామాన్యజనులకు కన్పించదు. అసారమైన వస్తువే వారికి కన్పించును. సారాసారవివేకము సాధుపురుషులకే తెలియును.

శ్రీ సమర్ధరామదాసు

Satyanveshana    Chapters