Paramacharya pavanagadhalu    Chapters   

98. రూపెత్తిన సౌజన్యం

వానమామలై జియ్యర్‌ గారు వైష్ణవులందరకూ గురువు. ఆయన చాలా వృద్ధులైనారు. కంచి కామకోటి పరమాచార్యను గురించి ఆయన ఎందరి నోటనో విన్నారు. వారిని వొకసారి స్వయంగా కలుసుకోవాలని ఆయన కనిపించింది. అయితే యిద్దరూ పీఠాధిపతులే. ఎవరి పీఠ గౌరవం వారిదే మరి! ఎవరు ఎవరి దగ్గరకు రావాలి-యిలాంటి మీమాంసలున్నాయి.

జియ్యర్‌ గారు తనను చూడగోరుతున్న సంగతి మధ్యవర్తుల ద్వరా కంచి స్వాముల వారు తెలుసుకున్నారు. జియ్యర్‌ గారెప్పుడైనా కంచికి రావచ్చని ఎప్పుడు వచ్చినా కంచిలో తాము యిద్దరూ కలవవచ్చునని పరమాచార్య వారికి కబురంపారు.

ఆ తరువాత కొంత కాలానికి జియ్యర్‌ గారు కంచి వెళ్లారు. ఈ సంగతి కామకోటి శంకరాచార్యుల వారికి తెలిసింది. ఆయన వెంటనే ఏ ఆర్భాటం లేకుండా, ఏ లాంఛనాలూ పాటించకుండా తామే ఎకాయెకిని జియ్యర్‌ గారు బస చేస్తున్న యింటికి వెళ్లి జియ్యర్‌ గారిని కలుసుకొన్నారు.

ఎదురుగా సాక్షాత్కరించిన పరమాచార్యులకు ఆశ్చర్య సంభ్రమాలతో జియ్యర్‌ అఖండ స్వాగతం పలికారు. ఉభయులూ తీరిగ్గా కూర్చుని మనసు విప్పి హాయిగా మాట్లాడుకున్నారు.

ఎవరి వద్దకు ఎవరు రావాలి? అన్న సమస్యను ప్రతిష్ఠకు తావు లేకుండ అలా పరిష్కరించిన సౌజన్య మూర్తులు చంద్రశేఖర సరస్వతి.

వేదాంత పరిభాషలో 'త్రిపుటి' అని ఒకటి వుంది. చూచేవాడు, చూడబడేది, చూపు - ఈ మూడు కలిసి త్రిపుటి, ధ్యాత, ధ్యానము, ధ్యేయము - యివి మూడూ త్రిపుటియే. ఇదే అసలైన అద్వైత భావన.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters