Paramacharya pavanagadhalu    Chapters   

95. మూకం కరోతి వాచాలం

స్వాముల వారొకసారి చిదంబరం నుంచి వస్తూ, ఆనంద తాండవపురం చేరారు. ఆయనకు స్వాగతం చెప్పటానికి ఆ వూళ్లో పిన్నలూ, పెద్దలూ అంతా వచ్చారు. అక్కడ చేరిన వారిలో పిల్లలే ఎక్కువగా వున్నారు. ఆ పిల్లల్ని చూసి స్వాముల వారికి ఎంతో ముచ్చట వేసింది. ఆయన వారందరికీ తలావొక కలం, కాగితం యిప్పించి, వరుసగా కూర్చోబెట్టారు. 'శ్రీరామాయనమః' అని వొక్కొక్కరూ నూరు సార్లు రాసి నాకు చూపండి!' అని వాళ్ళను ఆదేశించారు.

పిల్లలంతా ఉత్సాహంగా స్వామి చెప్పినది వింటూనే రాసి స్వామి ముందు పెట్టి, నమస్కరించి నిలుచున్నారు. స్వామి ఒక్కొక్క కాగితమే తీసి చూడటం, అది రాసిన పిల్లవానిని పిలచి అతనికి కామాక్షి బంగారు ముద్ర నొకటి బహూకరిస్తూండటం జరుగుతోంది.

అందులో ఒక బాలునికి అలాగే ముద్రను ఇవ్వబోతూ స్వామి అతని ముఖం లోకి పరీక్షగా చూశారు. అరవంలో 'సొల్లు, సొల్లు' (చెప్పు , చెప్పు) నీవు రాసింది నీ నోటితో చెప్పు' అన్నారు. అంతకు ముందు ఆయన అలా ఎవర్నీ అడుగలేదు. ఒక్కసారి స్వామి మాటలు వింటూనే అక్కడ చేరిన జనమంతా అతడు మూగ అని అరిచారు. స్వామి అది వినిపించుకోకుండా ఆ పిల్ల వానితో 'సొల్లు, సొల్లు' అని మళ్లీ అన్నారు.

ఆ బాలుడు ఒకసారి స్వామి ముఖంలోకి చూశాడు. అంతే! 'శ్రీరామాయనమః' అని అంతా వినేట్లు పెద్దగా స్పష్టంగా అన్నాడు. అక్కడ వున్న జనమంతా ఆ మూగ బాలుడు స్వచ్ఛంగా ఆ మాటలు పలకటం విని ఆశ్చర్యపోయారు. స్వామి అతని చేతిలో బంగారు కామాక్షి ముద్ర పడవేశారు ఆనందంతో పొంగిపోతున్న ఆ అమాయక వదనంలోకి నిర్వికారంగా చూస్తూ.

దేవీ సహస్ర నామావళులు ఎన్నో ఉన్నాయి. అన్నటిలోను లలితా సహస్రం దొడ్డది. దీనిని కేవలం పారాయణ చేసినా మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ నామాలలో ఒక మారు వచ్చిన పేరు రెండవ సారి రాదు. భాస్కర రాయలవారు దీనికి భాష్యం వ్రాశారు. దానిని సౌభాగ్యం భాస్కరం అంటారు. శ్రీ విద్య విషయంలో వారు సర్వజ్ఞులు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters