Paramacharya pavanagadhalu    Chapters   

94. మచ్చ మాపిన మౌని

అది పవిత్ర రామేశ్వర క్షేత్రం. దక్షిణ సముద్ర తీరంలో ఒక పూరిపాక వొకటి. ఆ పాకలో శంకరాచార్యుల వారి నిలువెత్తు పాలరాతి విగ్రహం ఉలుల, సుత్తుల చప్పుళ్ల మధ్య రూపుదిద్దుకుంటోంది. ఎంతో శ్రద్ధగా దీక్షతో ఆ విగ్రహాన్ని చెక్కుతున్న స్థపతి పేరు సుబ్బయ్య. ఆయన ఒక రోజు వున్నట్లుండి చెక్కడం ఆపి విగ్రహాన్ని పరిశీలించటం మొదలెట్టారు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఒక గుడ్డ తీసుకొని విగ్రహం ముఖాన్ని బాగా తుడిచాడు. తరువాత మళ్ళీ కాసేపు చెక్కి, పని ఆపి మళ్లీ విగ్రహాన్ని పరిశీలనగా చూశాడు. తరువాత పని ఆపివేసి ఆందోళన నిండిన ముఖంతో ఆలోచనలో పడ్డాడు. తరువాత కంచికి బయలుదేరాడు.

స్వాముల వారతడిని చూడగానే 'ఏం స్థపతీ! పనెలా నడుస్తోంది.' అని అడిగారు.

''పని సాఫీ గానే జరుగుతోంది. పనివాళ్ళ జీతాలు అవీ యిబ్బంది లేకుండా అందుతూనే వున్నాయి. మనం అనుకున్న ముహూర్తం నాటికి అంతా రడీ అవుతుంది. అమ్మవారి దయుంటే, కాని.....''అని ఆగాడు స్థపతి.

స్వామి, 'కానీ....అంటున్నావ్‌, ఏమిటి సంగతి? సంకోచించకు, చెప్పు' అని ధైర్యం చెప్పారు.

సుబ్బయ్య : 'ఆది శంకరుల వారి విగ్రహం స్వయంగా నేనే చెక్కుతున్నా. అంతా బాగానే వస్తోంది. అయితే విగ్రహం నొసట కంటికి దగ్గరగా అంగుళం వెడల్పున వొక నల్లని మచ్చ కనిపించింది. అది అదివరకు లేదు. ఆ మచ్చ రాతిలోనే బయటపడింది. ఎంత లోతుగా వుందో ఏమిటో తెలియదు. కొంచెం చెక్కి చూశా కాని తగ్గటం లేదు. ఏం చెయ్యాలో తోచటం లేదు!'

స్వామి: 'మూలవిగ్రహానికి ముఖంమీద మచ్చ వుండకూడదు. ఇంకో చోట యింకో చోట కాదు, నొసలాయె! సరే కానియ్‌! నీ ప్రయత్నం నువు చెయ్‌. అమ్మ అనుగ్రహిస్తే అంతా అనుకూలంగా జరగొచ్చు!

స్థపతి రామేశ్వరం తిరిగి వెళ్లి పని మొదలుపెట్టాడు. తరువాత కొన్నాళ్లకు కంచికి ఏద పని మీద వెళ్లాడు. స్వామిని కలిసి మండప నిర్మాణం అదీ ఎలా సాగుతున్నదీ చెప్పాడు.

స్వామి, 'అదంతా అలా వుంచు' విగ్రహం నొసట ఏదో మచ్చ కనిపించిందన్నావుగదా, అదెలా వుంది?

సుబ్బయ్య నవ్వు ముఖం పెట్టి, 'కాస్త సైజు తగ్గింది. కాని యింకా కాసంత వుంది సామి' అన్నాడు.

''స్వామి, మంచిది! నీ ప్రయత్నం నువు చేస్తూండు. దాని సంగతి విచారించకు, వెళ్లు'' అన్నారు.

ఇలా మూడు నాలుగుసార్లు స్థపతి కంచి వెళ్లి స్వామిని కలవటం, స్వామి మచ్చ సంగతి అడుగుతుండడం జరిగాయి. ఆ మచ్చ క్రమ క్రమంగా తరిగిపోయి, ఆఖరున సాంతం అంతర్థానం అయింది.

కడపటి సారిగా స్థపతి స్వామిని కలిసినప్పుడు స్వామి 'ఏమైంది మచ్చ?' అని అడిగారు.

స్థపతికి ఆనందంతో కళ్ల వెంట నీరు సుళ్లు తిరిగింది. 'వెంట్రుక వాసి కూడా లేకుండా ఆ మచ్చ అంతా పోయింది సామీ! ఎల్లాం స్వామి అనుగ్రహందా! (అంతా స్వామి దయ!) అని స్వామికి నమస్కరించి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బయ్య.

ఇతిహాస పురాణాల పరిజ్ఞానం లేకుండా ఎవరయినా వేదాలకు అర్థం చెప్పటానికి ప్రయత్నం చేస్తే, వాడిని చూసి వేదాలు భయంతో వణికి పోతాయట. అల్పబుద్ధి అయిన ఆ వాఖ్యాత అనల్పమైన వేదార్థాలను తన అల్పమైన ఎరికలోకి తెచ్చి ముడి పెడతాడని వేదాల భయం!

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters