Paramacharya pavanagadhalu    Chapters   

93. వరదాచార్యుని వరదుడు

అర్థరాత్రి సమయం. అర్జంటుకేసని డాక్టరు గారినిపిలుచుకొని పోయారు. ఇంకొకరింకొకరయితే డాక్టరు గారు కాస్త బద్దకించే వాడేమో కాని ఆ రోగి సంగతి తెలిసిన వాడు కనుక అశ్రద్ధ చేయలేదు. బంధువులు ఆదుర్దా కొద్దీ పిలిచారు గనుక తన తప్పు లేకుండా వెళ్లేడా కాని ఆయనకూ ఆ రోగి బతుకుతాడన్న ఆశ##లేదు.

ఆ రోగి అసలే ముసలివాడు. పైగా జబ్బుతో తీసికొంటున్నాడు. మాట కూడ పడిపోయంది. డాక్టరు వచ్చే సరికే ఎగ శ్వాస పుట్టింది. డాక్టరు గారు పరీక్ష చేశాడు. కదలిక ఆగిపోగా చివరకు పెదవి విరిచాడు. వెంటనే 'నారాయణ, నారాయణ' అంటే బంధువులు ఆ రోగికి తులసి తీర్థం పోసి మంచం మీద నుండి కిందికి దింపి నేలపై పడుకోబెట్టారు.

అప్పుడొక వింత జరిగింది. కొంచెం సేపు కాగానే నేల మీద పడి వున్న శరీరంలో కొంచెం కదలిక కనిపించింది. మరి కొంత సేపటికి ఆ రోగి లేచి కూచున్నాడు. డాక్టరుకు ఆశ్చర్యం వేసింది. 'గండం గడిచిందంటూ ఆన చికిత్స ప్రారంభించారు. తరువాత నాలుగైదు రోజులకు ఆ రోగికి పూర్తి ఆరోగ్యం కలిగింది.

ఆ రోగి యెవ్వరో కాదు. మచిలీపట్నం దగ్గర చిట్టి గూడూరు కాపురస్తుడు శ్రీమాన్‌ యస్‌.టి.జి. వరదాచారి గారు. ఆయన ప్రఖ్యాత సంస్కృత పండితులు. కవులు, గాంధి గారి పిలుపునందు కొని ప్రభుత్వోద్యోగాన్ని వదిలేసి, తమ సొంత వూళ్లో సంస్కృత పాఠశాల స్థాపించి, కుల మత భేదం లేకుండా అందరికీ సంస్కృతం నేర్పిన వ్యక్తి, భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకు విశేషంగా పాటుబడ్డవాడు.

భద్రాద్రి ఆలయ పునరుద్ధరణ సందర్భంగా గర్భ గుడి నిర్మాణం విషయంలో ఒక వివాదం వచ్చింది. ఒక వర్గం గర్భాలయం కొలతలు మార్చనక్కర లేదంటే రెండో వర్గం మార్చి వెడల్పుగా చేసి పునర్నిర్మాణం చేయాలన్నారు. ఉద్ధరణ సంఘం కూడ గుడిని విశాలంగా చేయాలనే తీర్మానించింది. దానికి వరదాచార్యులు గారు గట్టిగా వత్తాసు పలికారు.

చివరకు ఈ వివాదాన్ని కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య గారికి నివేదించాలని, ఆయన నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని యిరుపక్షాలు వొప్పుదలకు వచ్చాయి. వరదాచారిగారు కంచి వెళ్లి స్వాముల వారికి ఉద్దరణ సంఘం వాదాన్ని వినిపించి గర్భగుడి కొలతలను విస్తరించటానికి అనుమతి యివ్వవలసిందని కోరారు. అయితే ఆచార్య స్వామి మాత్రం వారి వాదనతో ఏకీభవించలేదు. గర్భాలయం కొలతలను మార్చవలసిన అవసరం లేదని, మూడు వందల యేండ్ల కిందట భక్త శిఖామణి రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ఏ ప్రకారం వుందో ఆ ప్రకారమే గుడిని పునర్నిర్మాణం చేయటం తగిన పని అని ఆయన చెప్పారు.

స్వాముల వారి తీర్పు తమకు వ్యతిరేకంగా రావటం శ్రీకల్లూరి చంద్రమౌళి గారికి గాని, ఉద్ధరణ సంఘం వారికి గాని, వరదాచారి గారికి గాని రుచించలేదు. కనుక వారంతా మొదట అనుకున్న వొప్పందానికి భిన్నంగా స్వాముల వారికి ఎదురుతిరిగారు. అంతే కాదు. భద్రాచల రామాలయం వైష్ణవాలయం, దానికి పాంచ రాత్ర ఆగమం వర్తించాలి. అంతేకాని, అద్వైత మత ప్రవర్తకులయిన కంచి వారికి వైష్ణవాలయ నిర్మాణ విషయాలపై జోక్యం కూడదని కొత్త ఆక్షేపణ వొకటి లేవదీశారు. అంతటితో కూడా వారాగలేదు. వ్యవహారాన్ని హైకోర్టుకు లాగారు. కాని హైకోర్టు కూడ వారి వాదాన్ని వొప్పుకోలేదు. చివరకు స్వాముల వారి నిర్ణయం ప్రకారం రామదాసు వారు పాటించిన కొలతల లెక్కనే గర్భగుడి నిర్మాణం జరిగింది.

వరదాచార్యుల గారికి బాగా జబ్బు చేసి డాక్టరు ఆశ##లేదని చెప్పిన తరువాత ఆయనను కింద బెట్టిన రాత్రి తానెలా కోలుకున్నదీ వరదాచార్యుల వారే యిలా వివరించారు:

'అప్పుడు నేలమీద పడుకోబెట్టినపుడు నాకు కంచి కామకోటి శంకరాచార్యులు (పరమాచార్య) కలలో కనుపించారు. ''భయపడకండి! మీకింకా ఆయుష్యం ఉంది!'' అని చేయెత్తి నాకు అభయం యిచ్చారు. గాఢనిద్ర నుంచి లేచినట్లుగా తోచింది నాకు. శరీరం కదిలించానేమో, నావంట్లో కదలిక చూచి మావాళ్లు తిరిగి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. డాక్టరు ఆశ్చర్యపడి 'గండం గడిచింది' అని చెప్పారు. కొద్ది రోజులలో నా ఆరోగ్యం మళ్లా దారికి వచ్చింది.

అప్పుడు కంచి స్వామి బందరులో వున్నారు. నేను వెళ్లి, స్వాముల వారిని దర్శించాను. స్వామి వారిని స్తుతిస్తూ నేను రచించిన శ్లోకాలు వారికి వినిపించి, మా యింటికి రావలసిందని కోరాను. వారు దయతో అంగీకరించి వచ్చారు. ''మాయింటికి వచ్చేటప్పుడు ఆయన యెక్కిన మేనాను నేనూ, నా కుమారుడు కూడ భక్తి ప్రపత్తులతో మోశాము.'' అని ఆయన చెప్పారు.

'వైష్ణవాలయం విషయంలో కల్పించుకోడానికి అద్వైతులయిన కంచివారికి అధికార మెక్కడిది? అని స్వామి గురించి వాదానికి దిగిన వరదాచార్యుల పట్ల అనుగ్రహం చూపి ప్రాణదానం చేసి కాపాడిన వరదుడు కంచి స్వామే!

పదునాలుగు విద్యలలో ముఖ్యమైనది వేదము. మిగిలినవి దాని అంగాలు. ఆ వేదాలలో ముఖ్యమైనవి ఋక్‌, యజుర్‌, సామవేదాలు. అందులో మధ్యది యజుర్వేదము. దానికి ఏడు కాండలు, మధ్యదైన నాల్గవకాండలో శ్రీ రుద్రం ఉంది. శ్రీ రుద్రం మధ్యన పంచాక్షరి వుంది. పంచాక్షరాల మధ్య 'శివ' అనే రెండక్షరాలున్నాయి. ఆలయం మధ్యలో లింగం వున్నట్లు, సకల విద్యలకు 'శివ' అనే రెండక్షరాలు మధ్య గతములై ప్రకాశిస్తున్నాయి.

ఈ విషయాన్నే :

'విద్యాసు శ్రుతి రుత్కృష్టా

రుద్రైకా దశినీ శ్రుతౌ

తత్ర పంచాక్షరీ తస్యాం

శివ ఇత్యక్షర ద్వయమ్‌'

- అన్న శ్లోకం చెబుతోంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters