Paramacharya pavanagadhalu    Chapters   

92. జ్ఞాని అడగాల్సిన ప్రశ్న

ఒకసారి ఆర్థర్‌ ఐసెస్‌బర్గ్‌ స్వాముల వారిని కలుసుకున్నారు. సంభాషణ ప్రారంభిస్తూ ఐసెస్‌ బర్గ్‌ సరియైన ప్రశ్న వేయటం జ్ఞానోదయానికి ప్రాతిపదిక అని అంటారు కదా! నేను జ్ఞానిని అనుకొందాం. అప్పుడు నేను మిమ్ములను అడుగదగిన ప్రశ్న ఏది?' అని ప్రశ్నించారు.

స్వాముల వారు 'మీరు జ్ఞాని అయితే ఏ ప్రశ్నా అడుగరు', అని జవాబిచ్చారు. స్వాముల వారి జవాబు విని అంతా నవ్వారు.

ఆయనతో సంభాషించినపుడు ఐసెస్‌ బర్గ్‌ ఒక విశిష్టమైన గుణం కనుగొన్నారు. ఎవరయినా మాట్లాడుతుంటే స్వామి అడ్డురారు. ఎవరయినా ఏదయినా ప్రశ్న వేస్తే కనీసం ఒక నిముసమన్నా మౌనంగా వుండి తరువాత ఆలోచనా పూర్వకంగా సమాధానం చెబుతారు. జవాబు ప్రశ్నకు పూర్తిగా సంబంధించి వుంటుంది. కాని పక్కదారులు పట్టదు. క్లుప్తంగా సూటిగా వుంటుంది.

'ఆయన ముందు కూచోగానే అనవరతంగా ప్రశాంతతలో ఓలలాడే పరమ ఋషి ఎదుట వున్నామన్న భావన నాలో మెదిలింది', అన్నారు ఐసెస్‌ బర్గ్‌.

మీరు చేసే పని ఏదయినా సరే, దానికి ప్రేమ వొక్కటే ముఖ్య ప్రాతిపదిక కావాలి. కార్యం ఏదయినా దాని ఉద్దేశ్యం, ప్రయోజనం, కారణం, ప్రేమ తప్ప అన్యం కారాదు. ఇష్టానికి, ద్వేషానికీ, క్రోధానికీ, మాత్సర్యానికీ అక్కడ చోటుండకూడదు. మనం చేసే పనులలో ప్రేమ ఓతప్రోతమై ఉంటే ప్రపంచంలోని ఏ గడ్డు సమస్యకైనా పరిష్కారం అవలీలగా సాధించగలం!

-పరమాచార్య

(పాల్‌ డ్యూక్‌ ద్వారా పాశ్చాత్య దేశాలకిచ్చిన సందేశం)

Paramacharya pavanagadhalu    Chapters