Paramacharya pavanagadhalu    Chapters   

91. ఆదివారం ఆటంకమా!

1968లో శ్రీవారు హైదరాబాదులో చాతుర్మాస్యం చేశారు. అప్పుడు కౌతా మనోహర్‌ గారి యింట బసచేసి వున్నారు.

ఒకరోజు స్వాముల వారెందుకో మనోహర్‌గారికై కబురు పెట్టారు. 'ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతూ వుంది. రేపు ముగుస్తుంది. అక్కడ పండితులకు యివ్వటానికి నాకు కాశ్మీర్‌ పండిత శాలువలు ఆరు కావాలి. ఈ రాత్రి విమానంలో అవి ఢిల్లీకి చేరాలి', అన్నారు. మనోహర్‌గారది విని 'స్వామి! ఈ రోజు ఆదివారం. కొట్లుండవు. శాలువలు దొరకటం సాధ్యమా!' అని సందేహం వెలిబుచ్చారు. స్వామి మందహాసం చేస్తూ 'అందుకే నీకు చెబుతున్నా, ప్రయత్నం చెయ్యి' అన్నారు.

మనోహర్‌ ఆదుర్దాగా ఒక దుకాణదారుకు ఫోన్‌ చేశారు. ఆయన ఫోన్‌లో దొరికాడు గాని ఆదివారం వచ్చి కొట్టు తెరవటానికి కొంచెం యిబ్బంది అన్నట్లు మాట్లాడాడు. మొత్తం మీద మనోహర్‌ గారి మాట తీసేయలేకా, స్వామి గారికి కావాలన్న సంగతి తెలిసి అతడు వచ్చి కొట్టు తీశాడు. ఒక బీరువాలో శాలువలున్నాయి. కట్ట తీసి చూస్తే ఆరే వున్నాయి. అవీ స్వామి కోరిన రకానివే. మనోహర్‌ సంబరపడుతూ వాటిని తెచ్చి స్వామికి చూపారు. స్వామి నిర్వికారంగా సరి! కావలసినవి దొరికినవిగదా! అని వూరుకున్నారు. ఆరాత్రి అవి విమానంలో ఢిల్లీకి చేరి, సకాలంలో యాగశాలలో అందాయి. స్వామి సంకల్ప సిద్ధులు.

1988 జనవరిలో మనోహర్‌ గారి తండ్రి రామమోహనశాస్త్రి దివంగతులయ్యారు. శ్రీవారికి కబురు చేయగా, 12వ రోజు ఆశీర్వచన సమయానికి శాలువ, ప్రసాదం పంపారు. తరువాత అదే యేడు మార్చి నెలలో మనోహర్‌ గారు కంచి వెళ్లి స్వామిని చూశారు.

స్వామి ఒక శాలువా తెప్పించి దానిని తాను కప్పుకొని సమాధిలోకి వెళ్లారు తర్వాత మనోహర్‌ గారిని పిలిచి ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మరక్షణ చేస్తూ వున్న ఆదర్శకుటుంబం మీది, మీ తాతగారు వెళ్లిపోయారు. ఇప్పుడు మీ నాన్నగారు దాటిపోయారు. ఆ భారం యిప్పుడు నీ భుజ స్కంధాలపై వుంది. అవిచ్చిన్నంగా ధర్మ ప్రచారం జరగాలని నీ కోరిక, అని ఆ శాలువను మనోహర్‌ గారికి కప్పించారు. అనుగ్రహ పూర్వకంగా.

Paramacharya pavanagadhalu    Chapters    s