Paramacharya pavanagadhalu    Chapters   

87. ఆపరేషన్‌ అక్కరలేదు, ప్రసాదం చాలు

శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకులే గాక నిరంతర ఆధ్యాత్మిక చింతన కలవారు. విశేషించి కంచిస్వామి భక్తులు.

1964లో ఆయనరెండవ కుమారుడు మురళీధర్‌కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కన్పించింది. శస్త్ర చికిత్స అవసరమని విజయవాడలో వైద్యులు సలహా యిచ్చారు. మరొకరి అభిప్రాయం కూడా తీసికుందామని అనుకొని మద్రాసుకు తీసికొని వెళ్లి అక్కడ కూడ వైద్య నిపుణుల సలహా తీసికొన్నారు. వాళ్లు మళ్లీ ఎక్సరే మొ. అన్ని పరీక్షలు చేసి శస్త్ర చికిత్స అవసరమే నని నిర్దారిస్తూ ఆరు నెలల లోపలే చేయించవలసి వుంటుందని కూడా హెచ్చరించారు. ఒకరిద్దరు వైద్యులు మాత్రం శస్త్ర చికిత్సలో రిస్కు లేకపోలేదని సూచించి, వీలయితే శస్త్ర చికిత్స కన్నా వేరే చికిత్స ఏదయినా చేయించటం మేలని చెప్పారు. ఏతావాతా శేషయ్య గారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు.

తరువాత ఆపరేషన్‌ చేయిద్దామని అనుకొని రాయవెల్లూరుకు తీసికొని వెళ్లి అక్కడ శస్త్ర చికిత్సలో నిపుణుడైన గోపీనాథ్‌కు చూపించారు. గోపీనాథ్‌ శస్త్ర చికిత్స మినహా మరోదారి లేదన్నాడు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లిపోతున్నాడు. అందుచేత ఆరునెలలు మించకముందే ఢిల్లీకి తీసికొని వస్తే అక్కడ ఆపరేషన్‌ చేస్తానన్నారాయన.

ఎలాగు కొంత వ్యవధి చిక్కింది గదా, ఆపరేషన్‌ కోసం ఢిల్లీ పోకముందే వొకసారి వెళ్లి కంచి స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందటం మంచిదనుకొని శేషయ్య గారు మురళీధర్‌తో కలిసి కంచికి వెళ్లారు.

వారిని చూసి, స్వామి 'ఏమిటి విశేషం?' అని అడిగారు.

శేషయ్య గారు పరిస్థితి అంతా వివరించారు.

అక్కడ వొక లాంతరు వుంది. దాని వెలుతురులో కొంచెం దూరం నుండి మురళీధర్‌ ఎదురు రొమ్ము వైపు కాసేపు పరిశీలనగా చూశారు స్వామి.

'జబ్బు ప్రమాదకరమైనదే, అయినా భయం లేదు. ఆపరేషన్‌ వద్దు. మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని యింటికి వెళ్లండి!' అని ఆనతిచ్చారు ఆచార్య స్వామి.

తండ్రీ కొడుకులిద్దరూ స్వాముల వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు. స్వామి ఆజ్ఞ ప్రకారం ప్రసాదం తీసుకొని యింటికి వెళ్లారు. అంతే! మురళీధర్‌ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు, ఏ ఆపరేషన్‌ లేకుండానే.

మురళీధర్‌ పత్రికా రచయితగా పని చేసి యిటీవలే రిటైరయ్యారు. అయితే అతని సామర్థ్యాన్ని బట్టి ఒక సుప్రసిద్ధ వార్తాసంస్థ అతనిని సంపాదకుడుగా నియమించుకుంది. అప్పటికీ యిప్పటికీ ఆ జబ్బు మళ్లీ రాలేదు!

ధర్మాచరణ గురించి రామాయణంలో వాల్మీకి రెండు గుణాలు చెప్పాడు ; ఒకటి: ధృతి; రెండు: నిమయం,

శ్రీరాముడు ఆడవులకు వెళ్లే ముందు తల్లి కౌసల్యకు నమస్కరించాడు. ఆమె 'ధర్మ మార్గంలో నడువు' - అని ఉపదేశించలేదు. రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. 'ధర్మంచర' అని ఆయనకొకరు చెప్ప బని లేదని తల్లికి తెలుసు. అందుకని ఆమె యిలా ఆశీర్వదించింది. నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ వున్నావో, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక!'

ప్రతి భారతీయుడు రాముని శీలమే ఆదర్శం. రామనామమే మహామంత్రం. మనలను నేడు పీడిస్తున్న అన్ని జబ్బులకూ అదే మందు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters