Paramacharya pavanagadhalu    Chapters   

86. రామపాద క్షేత్రం

కృష్ణాజిల్లాలో నాగాయలంక అని ఒక వూరుంది. ఆ వూరి లాంచీల రేవు గుండా వందలాది జనం కృష్ణానది దాటి గుంటూరు జిల్లాకు పోయి వస్తుంటారు. అలాంటి చోట గుడి వుంటే మంచిదని శ్రీ కోదండ రామాలయం, రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం అక్కడ నిర్మించారు. జయపూర్‌ నుంచి చలవరాతి విగ్రహాలు తెప్పించారు. ఇక ప్రతిష్ఠ జరగాల్సి వుంది. 1964 మే 31 నాడు ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టుకొన్నారు.

ఈ కార్యక్రమానికంతా ప్రధాన సారధి కుందుర్తి వెంకటనరసయ్య గారు. ఆయన ఈ ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లలో తల మునకలై వుండగా, కంచి పెద్ద స్వాముల వారి షష్టిపూర్తి మే 25న కంచికి మూడు మైళ్ల లో వున్న అంబి వద్ద జరుగుతుందని తెలిసింది. ఆయన గ్రామస్థులను పిలిచి ప్రతిష్ఠకు కావలసిన పనులు సాగిస్తూ వుండండని పురమాయించి, తాము ప్రతిష్ఠ నాటికి తప్పక రాగలమని చెప్పి అంబికి బయలుదేరారు.

షష్టి పూర్తి రోజున వారికి స్వాముల వారి చేతి తీర్థం దొరకలేదు. అందుకని తీర్థం తీసుకోకుండా వెళ్లటం యిష్టం లేక, వారు ఆరాత్రి అక్కడే ఆగి మర్నాడు (25వ తేది) వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. నరసయ్య గారు స్వామిని అంతకు ముందెన్నడు చూడలేదు. ఆయన తీర్థం కోసం చెయ్యి జాపగానే స్వామి ఆయన చేతిలో తీర్థం వేసి, ఆయనతో 'ప్రతిష్ఠ ఎప్పుడు?' అని అడిగారు.

నరసయ్య గారు నిర్ఘాంతపోయారు. తమ వూళ్లో ఆలయ నిర్మాణం గురించి గాని, ప్రతిష్ఠ గురించి కాని వారితో మనవి చేసుకొనేఅవకాశ##మే రాలేదు. తాము షష్టి పూర్తి వేడుకల కోసం వచ్చారే గారి ప్రతిష్ఠ విషయంలో స్వామిని సంప్రదించాలని కాదు.

'మా యింట్లో మందిరంలో ఇదివరకే అయింది', అన్నారు. నరసయ్య గారు.

'అది కాదు, నది వొడ్డున ఏర్పాటు చేశావే రామపాద క్షేత్రం, అక్కడి ప్రతిష్ఠ' అన్నారు ఆచార్యులు.

ఇంతసేపూ తీర్థం క్యూ ఆగి వుంది.

నరసయ్య గారు, 'మే 31న చేద్దామనుకున్నాము', అన్నారు.

దానిపై స్వామి '31న చేస్తారా?' అన్నారు. ఆయన ఆ మాటలు ప్రశ్నార్థకంగా ఉచ్ఛరించినట్లు నరసయ్య గారికి అనిపించింది. ఆరోజు జరుగుతుందా అని సందేహం వెలిబుచ్చారా, స్వామి? - అని అనుమానం తోచింది.

తరువాత స్వామి అక్షింతలు, కుంకుమ, కిస్‌మిస్‌ పండ్ల ప్రసాదం యిచ్చి వాటిని ప్రతిష్ఠ సమయంలో విగ్రహాల కింద ఉంచమని సెలవిచ్చారు.

మే 27న జవహర్‌లాల్‌ నెహ్రూ పరమపదించారు. దాంతో ఆ రోజే కాక మే 28న కూడా బస్సులు, రైళ్లు ఆగిపోయాయి. నరసయ్య గారు 29న బయలుదేరి 30 సాయంకాలానికి హుటా హుటిన వారి వూరు చేరుకున్నారు.

అయితే వారక్కడ లేనందున, వూళ్లో వాళ్లు 'గురువుగారి లేని ప్రతిష్ఠా' అంటూ పనులు మొదలు పెట్ట లేదు. అందువల్ల ప్రతిష్ఠ ఆగిపోయింది. స్వామి సందేహించినట్లే. జూన్‌ 11న మళ్లీ ముహూర్తం పెట్టుకొని ప్రతిష్ఠ చేశారు.

తరువాత రెండు నెలలకు కృష్ణకు అంతులేని వరద వచ్చింది. ఆ వరద నీరు గుడిలోకి కూడ వచ్చి కోందండరాముని పాదాలు తాకింది. తరువాత నెమ్మదిగా వరద తీసి నది వెనక్కు పోయింది. స్వామి వారు కోదండ రామాలయ ప్రతిష్ఠ అనకుండా 'రామ పాద క్షేత్రం' అని ఎందుకన్నారో అప్పటికిగాని నరసయ్య గారికి బోధపడలేదు.

స్వామి 'రామపాద క్షేత్రం' అని రాముని పాదాల మట్టానికి వరదకు హద్దు పెట్టారా? సరిగ్గా నీరంతవరకే వచ్చి ఆ తరువాత వెనక్కు మళ్లింది. అలా కాక యింకొక అంగుళం పెరిగినా దివి తాలూకాలో కనీసం 70 వూళ్లు వరదలో నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయేవి!

అన్నీ మట్టిలో పుట్టి మట్టిలో కలిసి పోతున్నాయి. ఈ భావనకు గుర్తుగా వైష్ణవులు మట్టిని (తిరునామం) తిలకంగా వుపయోగిస్తారు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters