Paramacharya pavanagadhalu    Chapters   

83. భిషగ్రత్న!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సైరాక్యూజ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా వున్న డేనియల్‌ స్మిత్‌ 1962లో భారతదేశం వచ్చారు. అప్పుడు ఆయన ఆగమశాస్త్రాలలో పాంచరాత్రం గురించి పరిశోధన చేస్తున్నారు.

స్మిత్‌ కంచి కామకోటి స్వాములవారిని చూడటానికి వారు బస చేస్తున్న ఇలయాత్తం గ్రామానికి వెళ్లాడు. స్వాములవారిని కలిసినప్పుడు యేం చేయాలి అని ఆయన ముందుగా ఒక పథకం వేసుకున్నారు. కాని శ్రీవారిని కలవటం ఎలా? అందుకు, ఆయన గుడికి వెళ్లే దోవలో నిల్చోవటం మంచిది అని స్మిత్‌కు స్థానికులు సలహా యిచ్చారు. ఆయన అలాగే నిల్చున్నారు.

ఇంతలో స్వాముల వారు ఆ దారినే గుడికి వెళ్తూ స్మిత్‌ను చూశారు. తీరా స్వాముల వారు కనిపించేసరికి స్మిత్‌ తబ్బిబ్బయ్యాడు. అప్పుడు తాను చేయాలనుకున్న వేవీ ఆయనకు గుర్తు రాలేదు. స్వాములవారాయనను చూసి ఏమీ కంగారు పడవద్దని చేతితో సైగ జేశారు.

తరువాత అదే సంవత్సరం సెప్టెంబరులో స్మిత్‌ ఒక విద్వత్‌ సభలో పాల్గొనవలసి వుంది. రేపు ఆ సభ మొదలవుతుందనగా స్మిత్‌కు బంక విరోచనాలు పట్టుకున్నాయి. అసలే అంతమంది పండితులముందు తాను ప్రసంగించగలనా లేనా అని అధైర్య పడుతున్న స్మిత్‌కు మూలిగే నక్క మీద తాటికాయలా గ్రహణి దాపురించటంలో బెంబేలు పడ్డాడు.

అయితే ఆ రాత్రి 11 గంటలకు స్వాముల వారు పంపించారని ఒక శిష్యుడు స్మిత్‌ దగ్గరకు వచ్చాడు. అతడు ఒక నిమ్మకాయ తెచ్చి దానిని స్వాములవారు తినమన్నారని చెప్పాడు. కాని స్మిత్‌కు గ్రహణిలో నిమ్మకాయ తినవచ్చో లేదో తెలియదు. తింటే యింకా ఎక్కువవుతుందేమోనని భయం. దానిని తీసుకొని 'తరువాత తింటాలే' అన్నాడు. అయితే ఆ వచ్చిన శిష్యుడు అక్కడే మఠం వేసి ఆయన దానిని తిన్న తరువాతనే అక్కడ నుండి కదిలాడు. మరుసటి రోజు స్మిత్‌ గారి గ్రహణి విచిత్రంగా మాయమయింది. ఇంతకూ స్వామికి స్మిత్‌ గారి గ్రహణి సంగతి ఎలా తెలిసింది. నిమ్మకాయకు గ్రహణి ఎలా తగ్గింది? ఏదయితేనేం! విద్వత్సభలో ఆయన ప్రసంగం విజయవంతంగా ముగిసింది.

Paramacharya pavanagadhalu    Chapters