Paramacharya pavanagadhalu    Chapters   

79. కామాక్షి అనుగ్రహించిన కట్న కాసులు

ఒకసారి వొక పేద గృహస్థు స్వామివారి దగ్గరకు వచ్చారు.

'స్వామి! నా కుమార్తెకు వొక సంబంధం చూశా. కాని, వరుడు తరపు వాళ్లు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు. నాకంతశక్తిలేదు. సంబంధం మంచిది. వదలుకోలేను, మీరే నాకు దారి చూపించాలి' అని వేడుకొన్నాడు.

'నేను సన్యాసిని, నా దగ్గరేముంది, నీకివ్వటానికి? నా ఎదుట ఏడ్చేకన్న ఆ కామాక్షి అమ్మ ముందైనా నిల్చోని నీగోడు చెప్పుకో! ఆమె దయతలిస్తే నీ పని సానుకూలం కావచ్చు' అన్నారు స్వామి.

'సరే! స్వామి ఆజ్ఞ చేస్తా!' అని ఆ పేదవాడు గుళ్లోకి పోయాడు.

కాసేపటికి ఉత్తరాది షాహుకారొకరు స్వామి దర్శనానికి వచ్చారు.

స్వామికి నమస్కారం చేసి పోబోతూ జేబులోంచి ఒక పొట్లం తీశాడు.

దానిని అక్కడవున్న ఒక పళ్లెంలో వుంచి స్వామికి నమస్కరించాడు.

'ఏమిటి అది?' అడిగారు స్వామి.

'అందులో కాస్త బంగారం వుంది. తమకు సమర్పించటానికి వచ్చాను. మీ యిష్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి! నా కెందుకో అది మీకు సమర్పించుకోవాలనిపించింది. యిచ్చా'- అన్నాడాయన.

'సరి! పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, వెళ్లిరా!' అన్నారు స్వామి.

ఇంతలో గుళ్లోకి వెళ్లిన బడుగువాడు తిరిగి వచ్చాడు.

'స్వామి! మీరు చెప్పినట్లు అమ్మకు నాగోడంతా చెప్పా! మీరే ఏదయినా చూడాలి!' అని అక్కడ చతికిలపడ్డాడు.

'ఆ పళ్లెంలో ఒక పొట్లం ఉంది. అది విప్పి ఏముందో చెప్పు', అన్నారు స్వామి.

'ఇందులో బంగారు కాసులున్నాయి. స్వామీ!' అన్నాడతడు ఆశ్చర్య సంభ్రమంతో

'ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టు'

లెక్క వేసి 'పదమూడు' అన్నాడాయన.

'నీ కెన్ని కావాలి?'

'పదమూడే!'

'ఇకనేం, తీసుకుపో! పిల్ల పెండ్లి చేసుకో!'

ఆయన పరమానందంతో కళ్ల వెంట నీరు కారగా స్వామికి సాష్టాంగపడి సెలవు తీసికొన్నాడు.

తొండమండలంలో బంగారు వాన కురిపించిన కామాక్షి దేవికి పేదవాని కూతురు పెండ్లికో పదమూడుకాసులు యివ్వటానికి యిబ్బందా! అందులోనూ ఆచార్య స్వామి సిఫారసు మీద!

ఆలయావరణలో దేవుని పూజకు కావలసిన పూల మొక్కలు పెంచండి! రోజూ నీళ్లు పోసి శ్రద్ధ చూపటం కుదరకపోయినా, పెరిగే మందార, మల్లె, పొన్న, మొదలైనవి పెంచవచ్చు. సగం ఆవరణలో అవిసె చెట్లు పెంచితే ఆవుల మేతకు ఉపయోగిస్తాయి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters