Paramacharya pavanagadhalu    Chapters   

73. మారేడు మాల - నవరత్న మాల

భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది. శ్రీ చంద్రశేఖర సరస్వతి భద్రాచలం వచ్చారు. స్వాముల వారు గోదావరి స్నానానికి వెళ్లిన సమయానికే గణపతి స్థపతి కూడా స్నానానికి వెళ్లారు. ఆయన మెడలో వున్న నవరత్నమాల అప్పుడు గోదావరిలో పడిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు. ఈ లోపల స్వామి స్నానం పూర్తి చేసుకొని వెళ్లిపోతున్నారు. స్థపతి అది గమనించి తను కూడా స్నానం ముగించుకొని స్వాముల వారి వెంట పరుగెత్తారు.

తరువాత జగద్గురువులు కళ్యాణమంటపానికి వెళ్లారు. అప్పుడు స్థపతి వారి వెంట నడుస్తూ ఒక్కొక్క శిల్పం గురించి వివరించారు. బ్రహ్మను, సరస్వతీ దేవిని చూసి స్వామి పక్కన యింకెవరని అడిగారు. సావిత్రీ దేవి అని స్థపతి జవాబిచ్చారు. స్వామి చిరునవ్వునవ్వారు. శిల్పాలన్నీ చూసి కళ్యాణ పీఠంపై కాసేపు కూర్చున్నారు. తరువాత తన మెడలో నుండి మారేడు దళాల మాలను తీసి ప్రశంసాపూర్వకంగా దానిని స్థపతి మెడలో వేయమని ఆజ్ఞాపించారు.

ఆ తరువాత యింటికి వచ్చి స్థపతి తన పిల్లవాడిని నవరత్నమాలను వెదకటానికి గోదావరికి పంపారు. ఆశ్చర్యం! అంతకు ముందు ఎంత వెదికినా స్థపతికి దొరకని ఆ మాల ఆ కుర్రవాడికి తొందరలోనే దొరికింది.

&#కుంభాభిషేక సమయంలో శ్రీవారు కళ్యాణమంటపానికి వచ్చారు. పూజ తరువాత శ్రీవారికి పట్టువస్త్రం కప్పారు. స్వాముల వారు స్థపతిని పిలచి తను కప్పిన పట్టుబట్ట తీసి స్థపతికి కప్పమని యిచ్చి, ఆయన చేతిలో ఒక పండు వుంచారు, ఆశీపూర్వకంగా.

ఏదో ఒక పని చేసిన కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పని చేస్తున్నాడు గనుక యింకొకడు అధముడు కాడు. ఆ ఆలోచన తప్పు. ఆలోచించి చూస్తే అందరూ ఒకే కార్యాన్ని (సంఘ శ్రేయస్సు) గురించి సమిష్టిగా పాటుబడుతున్నారు. సంఘ శ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters