Paramacharya pavanagadhalu    Chapters   

72. చిత్రపటం నుండి చిదానందమూర్తి

ఉయ్యూరులో సావిత్రమ్మ గారని ఒక యిల్లాలుంది. ఆవిడ ఎన్నో ఏళ్లుగా వున్నట్లుండి భయపడుతుండటం, ఏ కారణం లేకుండా జడుసుకోడం చేస్తుండేది. ఒక రోజు కలలో ఆమెకొక యతి కన్పించి, అభయముద్రను చూపి అదృశ్యమయ్యారు. ఆ యతి యెవ్వరో ఆవిడ యెరుగదు. అంతకు ముందాయనను ఆవిడ యెక్కడా చూసిన గుర్తులేదు. ఏదయితేనేం, ఆనాటినుంచి ఆవిడకా భయం, జడుపు, ఉలికిపాటు అన్నీ తగ్గిపోయాయి.

1960లో ఆవిడ తన భర్తతో పాటు కంచికి వెళ్లారు. ఆమె భర్త చల్లా శేషాచల శర్మగారు ఉయ్యూరు పంచదార మిల్లులో పని చేస్తున్నారు. స్వామి వారప్పుడు కంచి సమీపంలోని అంబి గ్రామంలో బస చేస్తున్నారు. శర్మగారి కుటుంబం అంబికి వెళ్లి ఆచార్య స్వామి దర్శనం చేసింది.

సావిత్రమ్మ గారు స్వాముల వారిని చూడటం అదే మొదటి సారి. చూడగానే తనకు కలలో కన్పించిన యతి స్వాములవారే నన్న సంగతి ఆమె గుర్తించింది. తరువాత ఇదంతా ఆమె స్వాముల వారికి నివేదించుకొన్నది.

స్వామి వారు మందహాసం చేసి 'నీవు నన్ను నిజంగా గుర్తించావా?' అని ఆమెను ప్రశ్నించారు.

1970లో శర్మగారికి మసూచికం వచ్చింది. ఒక రోసు బాధ యెక్కువయింది. శ్రీస్వామివారి చిత్రపటాన్ని ముందు పెట్టుకొని శ్రీలలితా సహస్ర నామాలను పారాయణ చేయమని తన భార్యకు చెపుతుండగా శర్మగారికి తెలివితప్పింది. వళ్లు చలవలు కమ్మింది. బంధుమిత్రులంతా ఆందోళన చెందారు.

ఇంతలో ఒక అద్భుతం జరిగింది. చిత్రపటంలో వున్న స్వామి వారు నిజస్వరూపంతో బయటికి వచ్చి ఆ దంపతుల నాశీర్వదించారు!

మరుక్షణం శర్మగారికి స్పృహ వచ్చింది. కొద్ది కాలంలోనే ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైనారు.

Paramacharya pavanagadhalu    Chapters