Paramacharya pavanagadhalu    Chapters   

70. పాద దర్శనం

స్వామి కొన్నాళ్లు కంచిలో శివస్థానం అనే చోట వుండేవారు. అది వొక పెరట్లో వున్న కుటీరం. స్వామి అందులో వుంటూ ఏకాంతంగా, మౌనంగా తపస్సు చేసికొంటూ వుండేవారు. ఆయనను చూడటానికి వచ్చేవారు గోడ యివతల నిలుచొని కుటీరంలో వున్నప్పుడు కిటికీ చువ్వల గుండా గాని, బావి వద్దకు వెళ్లి నపుడు గాని, స్వామిని దర్శించుకొనేవారు. అప్పుడయినా స్వామివారి నడుం పైభాగమే కాని పాదాలు కన్పించేవికావు.

ఒకసారి స్వాముల వారి దర్శనానికి వెళ్తూ డాక్టర్‌ వారణాసి రామమూర్తి గారు (రేణు) 'స్వామి వారి పారదర్శనం చేసి ఎన్నాళ్ళయిందో! ఈ సారైనా నాకు ఆ భాగ్యం కలుగజేస్తారా? నా అదృష్టం ఎలా వుందో', అనుకున్నారు.

శివస్థానం వద్దకు వెళ్లి 'నేను హైదరాబాదు నుంచి రేణును వచ్చాను' అని చెప్పుకొని బయటనే సాష్టాంగ పడ్డారు రామమూర్తిగారు. ఆ మాట వింటూ స్వామి రేఖా మాత్రంగా మందహాసం చేసి అభయ హస్తం చూపారు. స్వామి వారి అనుమతితో ఆయన బావికి యివతల నిల్చొని సదాశివబ్రహ్మేంద్రులపై తాను రచించిన వ్యాసాన్ని చదివి స్వామికి వినిపించారు. బావికి అవతల స్వామి ఒక బల్లపై కూర్చున్నారు.

అప్పటికే సందె చీకటి పడ్డది. స్వామి సైగ చేయగా ఆయన శిష్యులొకరు టార్చిలైటు వేయగా ఆ కాంతిలో రేణుగారు తన వ్యాసం చదివారు. మొదటి ఎత్తుగడలోనే ఆయన భారతదేశం ఎందరో మహితాత్ములకు పుట్టినిల్లంటూ అలాంటి వారి పేర్లు కొన్ని అందులో రాశారు.

అవి వింటున్న వారల్లా స్వామి ఆయనను ఆగమని సైగ చేసి 'ఒక ముఖ్యమైన భక్తుణ్ణి వదిలేశావే' అన్నట్లు చూశారు. ఎవర్ని వదిలేసింది ఆయన సైగచేసి చెప్పారు. కాని రేణు గారికి అర్థం కాలేదు. చివరకాయన ఎనిమిదివేళ్లు చూపారు. 'ఎనిమిది' అన్నారు డాక్టరు గారు. అప్పుడాయన తన ఎడమ కాలెత్తి చూపారు. అలాగా! స్వామి వారి ఆంతర్యం రేణుగారికి అర్థమైంది. అష్ట-పాదం- కలది అష్టపది. అని రాసిన జయదేవుల వారినే మరిచిపోయావే అని స్వామి వారి హెచ్చరిక!

'రేణుగారు ప్రయాణంలో అనుకొన్నది ఏమిటి, స్వామి తన పాదదర్శనం అనుగ్రహిస్తారా యీసారన్నా' అని, జయదేవుని పేరు సూచించే మిషపై స్వామి రేణుగారికి తన పాదం ఎత్తి చూపి, పాద దర్శనం అనుగ్రహించారు!

Paramacharya pavanagadhalu    Chapters