Paramacharya pavanagadhalu    Chapters   

68. మహాలింగేశ్వరుడెక్కడ?

కంభంపాటి నాగేశ్వరరావు గారు కంచిస్వామి భక్తులు. ఆయన కాశీకి వెళ్లి గంగ తీసికొని వచ్చారు. ఎవరో ఆయనతో ఆ గంగను రామేశ్వరంలో కలపాలని చెప్పారు. కాని ఆ సాంప్రదాయం ఏమిటో సరిగా వివరించలేదు. కంచి వెళ్లి స్వామినే అడుగుదాం అనుకొని ఆయన కంచికి వెళ్లి స్వామి దర్శనం చేసికొన్నారు. అప్పుడాయన తనతోపాటు ఆ గంగ చెంబులను కూడా తీసికొని వెళ్లారు.

ఆ కలశాలను స్వామికి చూపి ఆయన తానడుగదలచింది అడిగే లోపలే స్వామి ఆ కలశాలను తీసికొని భక్తి పూర్వకంగా తన గుండెలకు హత్తుకున్నారు. నడయాడే దైవమే జలజలా గలగలా పారే గంగమ్మను స్వయంగా స్వీకరించింది గదా! చేరవలసిన చోటుకే గంగ చేరిందన్న తృప్తితో వున్న రావు గారికి అడుగదలచిన ప్రశ్నను అడిగే పని లేకుండా అయింది.

మరునాడు శ్రీవారు కంచిలో వున్న 9 గుళ్ల పేరు చెప్పి 'కామాక్షి గుడి ఏకామ్రేశ్వరాలయం, వరదరాజస్వామి కోవెల, (బంగారుబల్లి వుండేది యిక్కడే) కచ్ఛపేశ్వరాలయం, కైలాసనాధాలయం, వీరాటనం, మహాలింగేశ్వరాలయం, ఉత్కళంద పెరుమాళ్‌ (అంటే వామనుడి కోవెల), పాండవదూతర్‌ (అంటే కృష్ణుడు) ఆలయం వాటిని దర్శించండి' అన్నారు.

వారా విధంగానే అన్ని గుళ్లూ తిరిగారు కాని మహాలింగేశ్వరాలయం ఎక్కడున్నదో ఎవర్నడిగినా చెప్పలేకపోయారు. తిరిగిరాగానే వాళ్లను చూసి శ్రీవారు నవ్వుతూ 'మహాలింగేశ్వరాలయం మీకు దొరకలేదా' అని అడిగారు. వాళ్లకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ సంగతి స్వామికెలా తెలిసిందా అని.

అప్పుడు స్వామి 'అది మీకే కాదు, ఈ వూళ్లోనే ఎంతో మందికి ఆ గుడి గురించి తెలియదు', అంటూ ఒక శిష్యుణ్ణి పిలిచి వీరికి మహాలింగేశ్వరాలయం చూపించమని చెప్పి తోడు పంపారు. వారా ఆలయం చూసి వచ్చిన తరువాత - ఆ ఆలయాల ప్రాశస్త్యాన్ని ఆయన అందరికీ వివరించి చెప్పారు. ఆశీర్వదించారు.

కంభంపాటి నాగేశ్వరరావు గారు గుంటూరులో శ్రీశంకర సేవాసమితి కార్యదర్శిగా కంచి కామకోటి పీఠానికి తమ సేవలందిస్తూ వున్నారు.

Paramacharya pavanagadhalu    Chapters