Paramacharya pavanagadhalu    Chapters   

63. నిన్ననే కదా చెప్పాను!

శ్రీ ఉప్పులూరి పున్నయ్య శాస్త్రిగారు వేదాంత శాస్త్ర నిధి. వారిది గుంటూరు. చాలా కాలంగా వారికి కంచి స్వామిని కలిసి తమకు గల కొన్ని సందేహాలను అడిగి సమాధానాలు తెలిసికోవాలని వుండేది. ఎలాగయితేనేం. వీలు చిక్కించుకొని ఒక రోజు కంచికి బయలు దేరారు. రైలులో మంచి నిద్ర పట్టింది. నిద్దట్లో ఆయనకు స్వామి కనిపించి ఆయన సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పారు. అయితే శాస్త్రిగారు ఆ కలను లక్ష్యపెట్టక కంచికి వెళ్లి స్వామి యెదుట తమ సందేహాలను వొక్కొక్కటే ఏకరువు పెట్టసాగారు.

స్వామి ఆయనను వారించి 'నిన్ననే కదా, నేను నీ సందేహాలు తీర్చాను', అన్నారు. శాస్త్రి గారికి ఆశ్చర్యంతో నోటమాటరాలేదు.

వేరు వేరు దోషాలకు వేరు వేరు ప్రాయశ్చిత్తాలు చెప్పబడి వున్నాయి. అవన్నీ ఎందుకు చేయటం, గోవింద, గోవింద అని నామ స్మరణ చేస్తే సర్వపాపాలు పోతాయి గదా అని అనవచ్చు. అది సరికాదు. మనం మంచి యెండలో ఎంతో అలసిపోయి యింటికి వచ్చామనుకోండి! హాయిగా స్నానం చేసి కడుపు నిండా భోంచేసి విశ్రాంతి తీసుకుంటూ, స్నానానికి నీళ్లు పెట్టు - అంటే, యిల్లాలు 'గోవిందేతి సదా స్నానం' అని అన్నారు కదా, గోవిందా అనుకోండి స్నాన ఫలం లభిస్తుంది. అంటే నామ మహిమ తెలుస్తుందా లేక యిల్లాలి మాటలకు వళ్లు మండుతుందా?

దోష పరిహారం కోసం విధించబడ్డ ప్రాయశ్చిత్తం చేసుకునే శక్తి లేనప్పుడు. లేదా ప్రాయశ్చిత్తం చేసుకున్నా పూర్ణఫలం సిద్దించలేదనుకుంటేనూ, పశ్చాత్తాప పడి మనస్సు ద్రవించేలా దేవుని పాదాలపై బడి ఏడ్చి శరణాగతి పొందితే భగవంతుడు నిశ్చయంగా మన పాపాలను కడిగివేస్తాడు. నిజంగా నామమహిమను అర్ధం చేసికొని చిత్తశుద్ధితో భగవన్నామస్మరణ చేస్తే అది సర్వప్రాయశ్చిత్తమే.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters