Paramacharya pavanagadhalu    Chapters   

51. మత స్వాతంత్ర్యం కోసం మరువదగని పోరాటం

మన దేశ రాజ్యాంగ రచన ప్రారంభ##మైన తొలినాళ్లనుండి స్వాములవారు మత ప్రయోజనాలకు (ఏ మతమైనా గానీండి!) భంగం లేకుండా చూడాలని ప్రయత్నం చేశారు. మత స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగంలో ప్రాధమిక హక్కుగా గుర్తింపజేసి రక్షణ కల్పించాలన్నది శ్రీవారి లక్ష్యం.

మనకు స్వాతంత్ర్యం రాక ముందు భారతదేశ పర్యటనకు బ్రిటిషు పార్లమెంటరీ డెలిగేషన్‌ వొకటి వచ్చింది. కొంతమంది ప్రముఖులను స్వామి పిలిపించి, వెళ్లి ఆ రాయబారవర్గ సభ్యులను కలిసి మత సంస్థల ప్రతిపత్తిని కాపాడవలసిన ఆవశ్యకత గురించి వారికి నచ్చజెప్పాలని కోరారు.

రాయబార వర్గాన్ని కలుసుకొనేందుకు అనుమతి కోరుతూ వారంతా టెలిగ్రాములు పంపినా ఆ డెలిగేషన్‌ నుండి జవాబు లేదు. ఆ విషయం స్వాములవారికి తెలియజేస్తే ఆయన 'మీకెందుకు, మీ ప్రయత్నం మీరు చేయండి! అంతా సక్రమంగా జరుగుతుంది. అన్నారే కాని నిరాశపడలేదు.

ఇంతలో తలవని తలంపుగా స్వామివారు నియమించిన ప్రముఖులకు తక్షణమే మద్రాసు రమ్మని హిందూ పత్రిక కార్యాలయం నుండి టెలిగ్రాం వచ్చింది. 'బ్రిటీషు పార్లమెంటరీ డెలిగేషన్‌ మద్రాసులో 'హిందూ' పత్రిక కార్యాలయాన్ని దర్శిస్తున్నారు. అక్కడ వారిని మీరు కలవొచ్చు' -- అదీ దాని సారాంశం.

స్వామి వారి ప్రతినిధులు బ్రిటీషు పార్లమెంటరీ రాయబార వర్గం వారిని అలా అనుకోకుండా కలుసుకోగలిగారు. దాని మూలంగా వారికి బ్రిటీషు పార్లమెంటు సభ్యులలో ప్రమఖుడు, అప్పటి రాయబార వర్గ సభ్యుడు అయిన సోరెన్‌సన్‌తో ఇంటర్‌వ్యూ ఢిల్లీలో ఏర్పాటయింది. స్వామి సందేశం వారికి అందింది.

తరువాత కొంతకాలానికి మనదేశానికి క్రిప్స్‌ మిషన్‌ వచ్చింది. సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ దానికి అధ్యక్షులు. స్వామి నియమించిన ప్రముఖులు వారిని కూడ కలిసి యీ విషయమై విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ సందర్భంలోనే వారు సర్దార్‌ పటేల్‌ను కూడ కలిశారు. ఆయన హిందూ మతంలో తలలు కూడకపోవటాన్ని ప్రస్తావించి ఎప్పటికైనా అందర్నీ ఒకతాటి మీథికి తీసుకొని రావలసిన అవసరం గురించి చెప్పారు.

నిజానికి ఆ ప్రయత్నం స్వాములవారు అంతకు ముందే ప్రారంభించారు. ఆయన పనుపుపై అగ్నిహోత్రం రామానుజ తాతాచార్యులుగారు శృంగేరీ శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖర భారతీస్వామిని కలిశారు. 'దేశపరిస్థితులను గ్రహించి కర్తవ్యాన్ని గుర్తించగలిగింది యిప్పుడు కంచిస్వామివొకరే. అంతా ఆయన కృషిపైనే ఆధారపడుతున్నాం. వారికి మా కృతజ్ఞతలు'-- అని చెప్పి శృంగేరి వారు తన మఠాధికారిని పిలిచి కంచి స్వామి ప్రయత్నాలకు సహకరించవలసిందని కోరారు.

మతస్వాతంత్ర్యాన్ని ప్రాథమిక హక్కుగా చేయాలన్న స్వాములవారి సూచనను ఎంత మంది నాయకులకు చెప్పినా ప్రయోజనం కలగలేదు. అయితే బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ వొక్కరే దానికి సరియైన విధంగా ప్రతిస్పందించారు. సాంఘిక సమస్యలపై అంబేద్కర్‌కు ఉన్న తీవ్రభావాలను బట్టి ఆయనను కలిస్తే ప్రయోజనం వుంటుందా అనే అనుమానం తోచింది కొందరికి. స్వామి ఆదేశం మేరకు స్వామి ప్రతినిధులు వెళ్లి వారిని కలిశారే కాని, ఆయన ఇందుకు సుముఖంగా వుంటారని మాత్రం వారెవ్వరూ అనుకోలేదు. కాని వారంతా ఆశ్చర్యపడే విధంగా మతం అన్నా, మత సంస్ధలన్నా తనకూ అభిమానం వుందన్నారు అంబేద్కర్‌. వాటి విషయంలో ప్రభుత్వ జోక్యం కూడదని అవి స్వతంత్రంగా మనవలసినవని ఆయనఅభిప్రాయపడ్డారు. స్వామి ప్రయత్నాలకు అంబేద్కర్‌ బాగా తోడ్పడ్డారు.

'ప్రతి మతమూ యీ హక్కులు కలిగి వుంటుంది'-- అని రాజ్యాంగంలో రాయాలని మొదట కొందరు ప్రతిపాదించారు. స్వాముల వారుతప్ప యీ వాక్యరచనలో వున్న అసమగ్రతను ఎవరూ గుర్తించలేదు. హిందూ మతంలో అనేక శాఖలున్నాయి. వైష్ణవులు, శైవులు, అద్వైతులు-- యిలా అనేకరకాలు. ఇటువంటి శాఖల పేరిట వుండే సంస్థలను మతసంస్ధలుగా ప్రభుత్వం గుర్తించను అంటే చేయగలిగింది లేదు. మతం అంటే ఇతర మతాలతో పాటు హిందూ మతం కూడా. కాని శైవ, వైష్ణవ శాఖలు కావు. శైవ సమాజమనో, వైష్ణవ సమితి అనో అన్నారు గాని మీరు హిందూ సమాజం అనలేదు గదా కనుక యీ రక్షణ ఆ సంస్థలకు వర్తించదు అని లిటిగేషన్‌లో ఆరితేరినవారు అడ్డుపుల్లలు వేస్తే ఏం చేయటానికి వీలుండక పోవచ్చు. అందుకని స్వాములవారు దానికి ఓ సవరణ చెప్పారు. 'అన్ని మతాలూ, ఆయా మతాలకూ చెందిన అన్ని శాఖలూ యీ క్రింది హక్కులను కలిగి వుంటాయి' అని రాయమన్నారు. అలాగే రాశారు. చివరకు, మతస్వాతంత్ర్యాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది.

Paramacharya pavanagadhalu    Chapters