Paramacharya pavanagadhalu    Chapters   

50. గోచి పాతరాయునికే కోటి భాగ్యాలు

కంచి కామకోటి పీఠానికి కోట్ల కొలది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. వేలాదిగా పరివారం వున్నారు. లక్షలాదిగా భక్తులున్నారు. అయితే ఆ పీఠాధిపతి తినేది పిడికెడు అటుకులో! పేలాలో! కట్టేది ఖద్దరుకాషాయం! వాడేవి చెక్కతో చేసిన పాత్రలు! పడుకొనేది అంగ వస్త్రం పరచిన కటిక నేల.

కాని భక్తులకు స్వామి నిస్సంగత్వం పట్టదు. వారికి తమ బలహీనతలను స్వామికి ఆరోపించి చూడాలన్న మమకారం జాస్తి. కాని వారెవ్వరూ ఆ సంగతి వొప్పుకోరు. అదంతా తమ భక్తి. గౌరవం, అభిమానం అనుకుంటారు. స్వామికో, వారు తాను చెప్పింది ఆచరించటం ముఖ్యం. కాని వారు చేసే ఆర్భాటాలు, ఆడంబరాలు కాదు. ఆయన బోధనలను ఆచరించటం కష్టం కాని ఆయనను అలంకరించటం తేలిక.

ఒకసారి విజయవాడ పౌరులు స్వామికి వజ్రకిరీటం పెట్టి ముఖమల్‌ పరుపులు పరచిన పూల పల్లకిలో వూరేగించారు. తరువాత స్వామిని చూడటానికి కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ వచ్చారు. స్వామి దర్శనం కోరి కబురు పెట్టారు. రమ్మని అనుజ్ఞ వచ్చింది.

తీరా లోనికి వెళితే స్వామి ఏరి? వజ్రకిరీటం లేదు, పట్టుపరుపులూ లేవు. పెరట్లో కొబ్బరిచెట్టు మొదట్లో దండకమండలాలను చెట్టుకానించి, కటిక నేలను కాషాయవస్త్రం పరచుకొని వొట్టి గోచితో, చేయి తలగడ చేసుకొని పడుకొని వున్నారాయన.

కౌపీనవంతః

ఖలు భాగ్య వంతః

(గోచీ పాతరాయుడే నిజంగా భాగ్యశాలి) - అన్న ఆదిశంకరుల వాక్యానికి అంత కన్న ఋజువేం కావాలి?

మనం ధర్మాన్ని ఆచరించటం మన క్షేమం కోసమే. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters