Paramacharya pavanagadhalu    Chapters   

47. కాలి నడకన కాశీకి

స్వాముల వారు 1933లో నవరాత్రులు తంజావూరులో నిర్వహించారు. అప్పుడే వారు ఉత్తర భారతయాత్ర చేయాలని సంకల్పించారు, అదీ పాదచారిగా.

అందుకు ముందుగా పర్యటన చేయదలచిన మార్గం ఎలా వుంది, నడకలో ఏ వూరు ఎంతసేపటికి చేరవచ్చు, దారిలో స్నాన సంధ్యానుష్ఠానాలకు, బసకు వసతులెలా వున్నాయి, క్రూర మృగాదుల సంచారం - యిలాంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొనేవారు.

స్వామి వారు ముందుగా అనంతకృష్ణ శర్మ అనే యువకుని యిందుకోసం కాశీయాత్ర చేసి రమ్మని పంపారు. అతడు యాత్రనంతా కాలినడకనే చేయాలి. దారిలో కాఫీ, టీ త్రాగరాదు. విధిగా స్వయంపాకం చేసుకోవాలి. కట్టుబట్టలు, వంటసామగ్రి తప్ప వేరే యేమి వెంట వుంచుకోరాదు. డబ్బుకోసం ఎవరినీ అడుక్కోరాదు. ఎవరయినా ఇస్తే స్వయం పాకం సామాగ్రి మాత్రం తీసికోవచ్చు. అయితే అందులో మిగిలినవన్నీ ఆ గ్రామంలోనే వదిలేసి పోవాలి. ఏ గ్రామంలో వొక్క రోజుకన్నా నిలువరాదు. ప్రయాణ విశేషాలన్నీ విశదంగా మఠానికి ఎప్పటికప్పుడు తెలుపుతుండాలి.

స్వాములవారి ఆదేశాల ప్రకారం నడుచుకొంటూ శర్మ తన యాత్ర పూర్తి చేశాడు. యాత్రలో ఒకసారి తాను చేరుకోవలసిన వూరు రాకముందే పొద్దుగూకి చీకటి పడింది. అదంతా అడవి, వేరే దారి లేక శర్మ అక్కడే వొక చెట్టెక్కి కూర్చోని, రాత్రి అంతా వొంటరిగా, గడపాల్సి వచ్చింది. 'ఓం నమఃశ్శివాయ' అనీ, 'గురుభ్యోనమః' అనీ రాత్రంతా స్మరిస్తూ కూర్చున్నాడు. భగవంతుని దయవల్ల ఏ అపాయం లేకుండా గడిచింది, మరుసటి రోజు యీ కథంతా పూసగుచ్చినట్లు మఠానికి ఉత్తరం రాశాడు.

కంచి పెద్ద స్వామి కాశీయాత్ర అదే సంవత్సరం సెప్టెంబరు రెండవవారంలో ప్రారంభమయింది. రోజూ దాదాపు యిరవై మైళ్లు నడిచేవారు. దారి కాకపోయినా ఆయన శ్రీశైలం వెళ్లాలనుకున్నారు. శ్రీశైలంలో శివుడు మల్లికార్జునుడు జ్యోతిర్లింగం, ఇక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం. ఈ క్షేత్రానికి మల్లికార్జునమన్న పేరు కూడా వుంది. ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబ. అందువల్ల యీ క్షేత్రం శివుడిని బట్టి ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో వొకటి. అమ్మవారిని బట్టి అష్టాదశ (18) శక్తి పీఠాలలో వొకటి. అర్జున క్షేత్రాలు మూడింటిలో కూడా శ్రీశైలం వొకటి. (మిగతా రెండు తిరువడమరుదూరు (తంజావూరు జిల్లా) లో వున్న మధ్యార్జున క్షేత్రం., తిరుప్పుడై మరుదూరు (తిరునల్వేలి జిల్లా)లో వున్న పుటార్జున క్షేత్రం. శ్రీశైలంలో తీర్థం పాతాళగంగ అంటారు. తిరుమలలో ఆకాశగంగ వుంది. ఆదిశంకరాచార్యుల శివానంద లహరిలో శ్రీగిరి మల్లికార్జున ప్రశస్తి వుంది. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే' - శ్రీశైల శిఖరం చూస్తే యిక జన్మ వుండదు.

ఇప్పటివలె ఆ రోజుల్లో ఘాట్‌రోడ్‌ లేదు. పెద్ద చెరువు దాకా పడవలో వెళ్లి, అక్కడ నుండి అడవిదారిలో 11 మైళ్లు కాలి నడకన కొండ యెక్కి ఆయన శ్రీశైలం చేరారు. దారిలో వున్న చెంచులు యాత్రికులను దోచుకుంటారనే భయం వుండేది. కాని ఆ గిరిజనులు స్వాముల వారికి దారిలో ఎంతో సహకారం అందించారు. 1934 జనవరి 29న స్వాముల వారు శ్రీశైలంలో స్వామిని సేవిస్తూ వున్నారు.

తరువాత స్వామి ఫిబ్రవరి 12 కల్లా హైదరాబాదు చేరారు. జూన్‌కల్లా నాగపూరును, వింధ్య పర్వతాలను దాటి జులై 23కు ప్రయాగ చేరారు. జులై 25న త్రివేణీ సంగమంలో స్నానం చేసి తాము రామేశ్వరం నుంచి తెచ్చిన యిసుకను అక్కడ సంగంలో కలిపారు. ఆ యేడు చాతుర్మాసవ్రతం కూడా ప్రయాగలో జరిపారు.

1934 అక్టోబరు 6న కాశీ చేరుకున్న కంచి స్వామికి కాశీ మహారాజు, పండిత మదన మోహన మాలవ్యా వంటి ప్రముఖులు స్వాగతం చెప్పారు. ఆరోజు స్వాముల వారికి కాశీ వీధులలో జరిగిన ఊరేగింపులో లక్షమందికి పైగా పాల్గొన్నారు. అంతటి ఘనమైన సత్కారం అంతవరకు కాశీనగర చరిత్రలో ఎవ్వరికీ జరుగలేదని పండిత్‌ అనే హిందీ పత్రిక తన అక్టోబరు 8 సంచికలో రాసింది. ఆ యేడు నవరాత్రులు కాశీలోనే జరిగాయి. హిందూ విశ్వవిద్యాలయాన్ని కూడా స్వామి దర్శించారు.

1935 మేలో స్వామి గయకు వెళ్ళారు. తరువాత బుద్దగయ వెళ్లి బోధి వృక్షాన్ని దర్శించారు. బుద్ధుని గుడిలో బుద్ధ విగ్రహం ముందు వొక శివలింగం వుంది. దానిని ఆదిశంకరులు ప్రతిష్ఠించారట. అక్కడనిండి థియోగడ్‌ వెళ్లి స్వయం భూలింగ మూర్తి, గిరిజాదేవుల ముందు చాలా సేపు ధ్యాన నిష్ఠలో వుండిపోయారు.

జూలై కల్లా కలకత్తా చేరారు. చాతుర్మాస దీక్ష, నవరాత్రి ఉత్సవాలను అక్కడే నిర్వహించారు. తరువాత కియోంజరులో ధారిణీదేవిని దర్శించుకున్నారు. ఆ విగ్రహాన్ని కంచినుండి గోవింద భంజదేవులు తీసుకొని వచ్చారట. మయూర్‌ భంజ్‌లో మహాలింగాన్ని సేవించి రాజ్‌ నీలగిరి సంస్థానంలో సుజనాగఢ్‌లో చండీ దేవిని దర్శించారు. ఇచ్చట అమ్మవారు సింహవాహన కాదు. ఆమె వాహనము వరాహము!

1936 ఏప్రిల్‌ 4 కల్లా స్వాముల వారు ఒరిస్సాలోని కటక్‌ జిల్లాలో జాజ్‌ పూరుకు వచ్చారు. ఇక్కడ విరజాదేవి గుడి వుంది. మహాభారతంలో యీ క్షేత్రాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో వొకటిగా పేర్కొన్నారు. ఇచ్చట నది వైతరణి. ఉత్తరముఖంగా ప్రవహిస్తుండటం వల్ల పవిత్ర తీర్థంగా ప్రసిద్ధి కెక్కింది. ఒకప్పుడీ వూళ్లో యజ్ఞాలు చేసిన వాళ్లు (సోమయాజులు) నూరు మంది వుండేవారు. కనుక యాజిపూర్‌ అని పేరొచ్చిందట. అది క్రమంగా జాజ్‌పూర్‌ అయిందని ప్రతీతి. స్వాముల వారు శంకర జయంతిని కటక్‌ వెళ్ళి అక్కడ నిర్వహించారు.

సాక్షిగోపాలుని దర్శించి స్వాముల వారు పూరి జగన్నాథం వెళ్లారు. గోవర్థన మఠం జగద్గురువులను ఆహ్వానించింది. మిగతా అద్వైత మఠాలు స్వాగత సంరంభంలో పాలుపంచుకున్నాయి. 1936 మే 6న పూరీలో సముద్ర స్నానం చేశారు.

ఆపైన బరంపురంలో చాతుర్మాస వ్రతం చేసుకొని, స్వామి శ్రీ కూర్మం, విజయనగరాల మీదుగా సింహాచలం చేరారు. వరాహనృసింహ దర్శనం తరువాత గంగాధర జలపాతం వద్ద ధ్యాననిష్ఠలో కొంత సేపు గడిపారు. విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా పాలకొల్లు చేరి 1937 లో చాతుర్మాస్యం చేశారు. తరువాత కాకినాడ చేరారు. అక్కడ మహోదయ పుణ్యకాలంలో సముద్ర స్నానం చేశారు. తరువాత విజయవాడలో కృష్ణా స్నానం చేసి దుర్గను సేవించుకొని 1938లో ఆచతుర్మాస్యం గుంటూరులో జరిపారు. 1938 నవంబరు నుంచి 1939 జనవరి వరకు నెల్లూరు చూసుకొని వెంకటగిరి కాళహస్తి, తిరుపతి తిరుమల మీదుగా తిరుత్తని చేరారు. తన ఉత్తర భారతయాత్ర విజయవంతంగా ముగించుకొని స్వామి 1939 మే 2న కంచి చేరుకున్నారు.

ప్రయాగలో త్రివేణి సంగమం వద్ద పట్టిన గంగాజలాన్ని తీసుకొని 1934 జూలై 25న రామేశ్వరం చేరారు. 1938 జూన్‌ 10న అగ్ని తీర్థంలో స్నానం చేసి రామనాథునికి తాము ప్రయాగనుండి తెచ్చిన గంగా జలంతో అభిషేకించారు. మర్నాడే స్వామి వారి ఆరుమాసాల మౌన దీక్ష మొదలయింది. అయినా పర్యటనలు యధావిధిగా చేస్తూ 1939 జూన్‌ 29న భక్తుల జయ జయధ్వానాల మధ్య కుంభకోణం చేరుకున్నారు.

Paramacharya pavanagadhalu    Chapters