Paramacharya pavanagadhalu    Chapters   

42. గోపాలకుని ఘనవితరణ

కంచి కామకోటి పీఠాధిపతులకు ఎందరో మహారాజులు, జమిందారులు, సంపన్న గృహస్థులు విలువయిన కానుకలను, ద్రవ్యాన్ని సమర్పించుకొని తరిస్తుంటారు. కన్యాకుమారి నుండి నేపాల్‌ వరకు ఆచార్యుల పర్యటనలలో ఆయనకు సన్మాన సత్కారాలు జరుగుతూ వుండేవి. ఆయన కేదీ అక్కరలేదు. ఎవరేది యిచ్చినా అది మఠానికే.

'బ్రహ్మచారికి తాంబూలం, సన్యాసికి డబ్బులు యిచ్చినంత పాపం లేదు', అని ఆయన తరచు అంటుండేవారు. మరి సన్యాసికి కూడా రైలు టెక్కెట్టుకు, బస్సుకు ఛార్జీలుండాలికదా అంటే సన్యాసి నడచిపోవచ్చు అనేవారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం నడుస్తూనే పర్యటన చేశారు. తొంబయిసంవత్సరాల వయసులో కూడా ఆయన నడిచి వెళ్లేవారు. మండుటెండలో కూడ ఆయన నడిచివెళుతూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఆదిశంకరుల్లా ఆయన కూడా భారతదేశమంతా కాలి నడకనే కలయ తిరిగారు. ఆయనకు కార్లు, ఏనుగులు మొదలైనవి ఎన్ని వున్నా నడకేనడక, కారసలు ఎన్నడూ ఎక్కనే లేదట!

స్వాముల వారికి ధనం కానుకగా సమర్పించుకొనే వారంతా సంపన్నులు కాదు. అందులో పేదవారు కూడా ఎందరో వుండేవారు. ఒక రోజు స్వాముల వారి దగ్గరకు ఒక పల్లెటూరుకు చెందిన ఆసామి వచ్చాడు. అతనిది తండలం గ్రామం. అతనికి వున్నదే కొద్ది పొలం. దాని మీద వచ్చే అయివేజు చాలక అతడు గొడ్లు కాసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. తనికెందుకో తన యావదాస్తి పరమాచార్యులకు సమర్పించాలనిపించింది. అంతే ఉన్నా చెక్క కాస్తా అమ్మేసి పైకం పట్టుకొని స్వామి వారి దగ్గరకు వచ్చి ఆ మూల ఆయన పాదాల వద్ద వుంచాడు. స్వామి వద్దని ఎంత చెప్పినా అతను వినలేదు.

తనకు మాలిన ధర్మం అంటే యిదే, మరి! అసలే అంతంత మాత్రంగా వున్న తన కుటుంబపోషణను అసలే సాగించుకోలేని పరిస్థితిలో పడ్డాడా బీదభక్తుడు, ఈ దానంతో, స్వాముల వారు అతడి వ్యవహారం చూసి జాలి పడ్డారు. అక్కడ తహశీల్దారును పిలిచి అతనికి కొంత పోరంబోకు భూమిని యిప్పించి అతడికి భుక్తి గడిచే ఏర్పాటు చేశారు. దానం ఫలప్రదం కావాలి. అంటే ధనం, దాత యిద్దరు వుంటే సరిపోదు. పాత్రత కలిగిన అర్థి దొరకాలి. కంచి పరమాచార్యులకన్న పాత్రత కలిగిన వ్యక్తి ఆ ఆసామికి ఎక్కడ దొరుకుతాడు?

Paramacharya pavanagadhalu    Chapters