Paramacharya pavanagadhalu    Chapters   

40. అనాచారాన్ని అడ్డుకొనే కవచం

తెనాలిలో తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారని వొక గొప్ప పండితుడుండే వాడు. పరమాచార్యులు వలెనే వీరికి కూడ శౌచము, సదాచారాల విషయంలో పట్టుదల జాస్తి. వీరి తండ్రి అప్పయ్య శాస్త్రి గారు శ్రీరామకథామృతాన్ని మొదలుపెట్టి, అది పూర్తి కాకుండానే కాలం చేశారు. వీరు దాన్ని పూర్తిచేసి అచ్చొత్తించారు. మొదట్లో యీయన కటిక దారిద్ర్యం అనుభవించారు. తిండికి లేక పోయినా ఎవరి ముందూ చేయి చాపని అభిమాన ధనుడు. ఆ రోజుల్లో ఆహారం దొరకక, అమ్మ వారికి కేవలం నీళ్లే నైవేద్యం పెడుతూ లలితా సహస్ర నామార్చన చేశారు. నీరసంతో మా గన్ను పడ్డ శాస్త్రి గారికి 27 రోజుల తరువాత అమ్మవారు దర్శనమిచ్చి భిక్షపెట్టారు. శాస్త్రిగారి కోరికపై పరమాచార్య ఒకసారి తెనాలిలో వీరి యింటికి బ్రహ్మరథంపై (వేద పండితులు మోసే పల్లికి) ఎక్కి వచ్చారు. అయితే అంతటి మహనీయుడు ఒక్కోసారి చిత్రంగా ప్రవర్తించేవారు. ఆచారాల పట్టింపు ఎక్కువ కావటంతో ఎక్కడైనా అనాచారం కనిపిస్తే ఆయన సహించలేకపోయేవాడు. కాని యిది కలియుగం కాని కృతయుగం కాదు గదా! రోజు రోజుకూ పెరిగిపోతున్న అనాచారాన్ని చూసి ఆయన నెంత బాధపడేవాడంటే, ఇటువంటి అనాచారుల మధ్య బతికే కన్న ఏ కృష్ణలోనో దూకి చావటం మేలని సీరియస్‌గా అనుకొనేవాడు. అయితే ఆయన కలా చచ్చిపోవాలని అనిపించినపుడల్లా ఆయనకు కంచి స్వాములవారు కనిపించినట్లయేది. దాంతో ఆయన మనసు ఆత్మ హత్యాప్రయత్నం నుండి మరలిపోయి మామూలుగా అయిపోయేది.

తరువాత ఒకసారి శాస్త్రిగారు వెళ్లి జగద్గురువుల దర్శనం చేశారు. ఆయనను చూడగానే స్వాముల వారు 'మీ సమస్య ఎంత వరకు వచ్చింది?' అని అడిగారు.

శాస్త్రిగారికి అర్థం కాక 'ఏ సమస్య' అని అడిగారు. ''అదే! మీ ఆత్మహత్య సమస్య', అని స్వామి నవ్వారు.

శాస్త్రిగారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. తన మనస్సు ఆత్మహత్య గురించి ఆలోచించినపుడల్లా కంచి స్వామి వారు కండ్లలో మెదలటం ఎందువల్ల జరిగిందో ఆయనకు అప్పుడు అర్థమయివుంటుంది.

శాస్త్రిగారు ఎంతో భక్తి భావంతో 'స్వామీ! మీ అనుగ్రహం వల్ల నా సమస్య దానంతటదే పరిష్కారమయిపోయింది', అన్నారు.

స్వామి వారు ఒక శాలువ తెచ్చి శాస్త్రిగారికి కప్పారు. 'శాలువ కప్పానుగా, ఇక మిమ్మల్ని ఏ అనాచారం అంటదు లెండి!' అని నవ్వారు.

శాస్త్రిగారు దేవి ఉపాసకులు. వారు స్వర్గస్థులైనపుడు వారి భౌతిక కాయాన్ని దహనం చేసే దృశ్యాలను పత్రికల వారు ఫోటోలు తీసికోగా ఆ ఫోటోలలో చితి నుండి వస్తున్న పొగలో అమ్మవారి రూపం స్పష్టంగా కన్పించింది.

జీవితంలో దేనినీ సీరియస్‌గా మనసుకు పట్టించుకొని బాధపడటం కూడదని శాస్త్రిగారి ఉదంతంలో స్వామి వారి అభిప్రాయంలా కన్పిస్తుంది. 'అలా, అలా ఈశ్వర ప్రవాహంలో తేలిపో!' అని ఆచార్యులు తరచు చెప్పేవారు.

స్వధర్మాన్ని ఆచరించటమే మన కర్తవ్యం. అయితే ఆ ఆచరణ స్వార్థం కోసం కాక, భగవదర్పితంగా వుండాలి. స్వార్థబుద్ధి లేకుండా మన పనులను మనం చక్కగా చేయటమే నిజమైన భగవదారాధన.

భగవంతుని ధ్యానం వల్ల ఆయన కటాక్షం లభించి మన మనస్సు నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సుతో మనం తెలిసిన వారి దగ్గరకు పోయి వినయపూర్వకంగా భగవత్సబంధమైన విషయాలను తెలుసుకోవాలి. వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్న విషయాలను గ్రహించాలి. సంత్సాంగత్యం చేయాలి. స్వధర్మాన్ని అనుష్ఠించాలి. వైరాగ్య భావాన్ని పెంపొందించుకోవాలి. భోజనం చేయటం కేవలం ఆకలి అన్న జబ్బుకు ఔషధం అన్నభావనతోనే కాని రుచి కోసం కాదు. మనకు లభించిన దానితో తృప్తి పడాలి. సమాధి స్థితిని చేరుకొనేందుకు ఏకాగ్రతతో సాధన చేయాలి. బ్రహ్మ సాక్షాత్కారం పొంది నేనే బ్రహ్మంను అన్న స్థితిని అనుభవపూర్వకంగా సాధించాలి, తరించాలి. - ఇదే ఆదిశంకర భగవత్పాదుల బోధనల సారాంశం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters