Paramacharya pavanagadhalu    Chapters   

39. కనకమ్మ స్వయంపాకం

స్వామి వారిని రోజూ ఎన్నో వందల మంది భక్తులు దర్శిస్తుంటారు. కొందర్ని ఆయన పలకరించి నాలుగు మాటలు మాట్లాడుతుంటారు. అలా ఆయనను దర్శించటానికి వచ్చిన వారిలో ఒక రోజు కనకమ్మ అనే ఆమె ఉంది. ఆమె అదృష్టం ఏమిటో గాని, ఆమె వెళ్లిన సమయంలో స్వామి వారి దగ్గర ఒకరిద్దరు పరిచారకులు తప్ప బయట వారెవరూ లేరు. అలా స్వామి వారిని ప్రశాంతంగా, తీరిగ్గా కలిసే అవకాశం దొరికినందులకు ఆమె ఎంతో ఆనందించింది.

కనకమ్మగారు చాలా రోజులుగా తిరువణ్ణామలై వెళ్లి వుంటున్నది. 1958లో స్వామి వారు పడమట మాంబలం వచ్చినపుడు ఆమె వచ్చి ఆయనను కలుసుకోడం సంభవించింది.

ప్రస్తుతం మద్రాసులో మకామా? అని స్వామి అడిగారు. ఆమె 'ఔ'నంది.

'తిరువాణ్ణామలైలో వుండటం లేదా'? - స్వామి వారి ప్రశ్న

'అక్కడే వుంటున్నా' - అది ఆమె జవాబు.

'ఒక్కదానివే వుంటున్నావా?' - అని స్వామి వారి ప్రశ్న.

'ఔ'నని ఆమె జవాబు.

'స్వయం పాకమా'? - అని స్వామి ప్రశ్న.

'ఔ'నని ఆమె జవాబు.

తరువాత స్వామి చేయెత్తి ఆశీర్వదించారు. అంతే!

ఆమె ఆనందంతో పరవశించిపోయింది. ఆమెకు స్వాముల వారి కుశల ప్రశ్నలు మామూలు ప్రశ్నలుగా తోచలేదు. అవి తనకు ఆయన ఇచ్చిన ఆదేశాలుగా అనిపించాయి.

ఆమె తిరువణ్ణామలైలోనే వుంటోంది. 'అక్కడ వుండటం లేదా?' - అని అడగటంలో అంతరార్థం ఆమె అక్కడ వుండటమే మంచిది అని.

'ఒక్కదానివే వుంటున్నావా?' - అని అడిగారు. ఆమె వొక్కతే వుంటోంది. ఏకాంతవాసమే సాధనకు శ్రేష్ఠం. అదే చేయి - అని రెండవ ఆదేశం. సాధన పంచకం చెప్పిందీ ఏకాంతం సాధనకు ఎంతో అవసరం అనే కదా!

'స్వయంపాకమా?' అంటే ఆశ్రమంలో వేదాంత విశేషాలు విని వచ్చిన తన యింట్లో తన సాధనేదో తనే చేసి కొంటోంది. ఆ మార్గమే మంచిది అని స్వామి సూచన.

తను నడుస్తున్న మార్గం సరయినదేనని, దానినే అనుసరిస్తూ సాధన కొనసాగించి తరించవలసిందనీ స్వామి వారి ఆదేశంగా ఆమె అన్వయించుకొన్నది. అలా మామూలుకుశల ప్రశ్నలుగా భావించే అవకాశం వున్న మాటలడిగి వొక ప్రక్క ఆమె జీవితాన్ని పుస్తకంలా చదవగలిగిన మహిమను చూసి, రెండో పక్క భావి సాధనకు తగిన ఆదేశాలను యిచ్చి ఆమె తరించటానికి దోహదం చేసిన స్వామి వారి అలౌకిక శక్తికి ఆమె ఆనందంతో ప్రణమిల్లింది. 'మీరింతవరకు ఏదారిన పోతున్నారో, అదే దారిని వెళ్లండి. మంచి జరుగుతుంది' - అని స్వాముల వారు తరచు చెబుతుంటారు.

అదీగాక, రమణమహర్షి అంటే స్వామి వారికి ఎంతో గౌరవం. ఒకసారి బ్రంటన్‌ అనే విదేశీయుడు తనకు నిజమైన యోగిని దర్శించాలని వుంది - అని స్వామి వారితో చెప్పారు.

అప్పుడ స్వామి ఆయనను అరుణాచలం వెళ్లి రమణ మహర్షి దర్శనం చేయవలసిందని సూచించారు. పరమాచార్యులను కలిసిన పాశ్చాత్యులలో బ్రంటనే ప్రథముడని అంటారు. ఆయన A Search in secret India అనే పుస్తకం రాశారు. ఇది అంతర్జాతీయంగా బాగా ప్రచారం పొందింది.

ఒకసారి స్వాములవారు అరుణాచలం వెళ్లారు. గిరి ప్రదక్షిణం కూడా చేశారు. అప్పుడు ఒకరు రమణ మహర్షిని 'మీరు, కంచి స్వామి (పరమాచార్య)ని కలుసుకున్నారా?' - అని అడిగితే 'మేము విడిపోతే కదా కలుసుకోడానికి' అని మహర్షి జవాబిచ్చారు.

చావు పుట్టుకలనే విష చక్రం నుండి, లేదా, పాపాల నుండి, కష్ట పరంపరల నుండి మనలను రక్షించేది మతం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters