Paramacharya pavanagadhalu    Chapters   

33. మీరు తెలుగు చదవగలరా?

ఆచార్యులవారికి తాడేపల్లి వారు చదివి వినిపిస్తున్న రామాయణాన్ని వారి తండ్రి అప్పయ్య శాస్త్రిగారు రచించారు. అది కొంత అసంపూర్తిగా వుండగా ఆయన మరణించగా, రాఘవనారాయణ శాస్త్రిగారు దానిని పూరించి అచ్చొత్తించారు.

అప్పయ్య శాస్త్రిగారికి ఔచిత్యం పట్టింపు జాస్తి, లంకలో అగ్నిపరీక్ష పెట్టి అందులో పునీత అయిన సీతను అయోధ్యకు తీసికొని వచ్చాడు శ్రీరాముడు. అటువంటి అనుకూల నాయకుడు ఎవరో ఏదో అన్నారని విని ఆమెను అడవులకు పంపించటం ఔచిత్యభంగంగా తోచింది శాస్త్రిగారికి. అందుకని దానిని కొద్దిగా మార్చి రాశారు.

'అందరిని ఎవరి ధర్మంలో వారి నుంచటం కోసమే వైకుంఠం నుంచి అయోధ్యకు వచ్చావు నీవు. కాని భూభర్త (రాజు)వై వుండి, భూసుత(సీత)ను పెండ్లాడటం ఏమి ధర్మం?'---అని రాములవారి మంత్రి రాముడిని అడిగాడు. అది వింటూనే రామునికి గుండె ఝల్లని, ఈ తప్పును ఇతరులు గ్రహించి ఎత్తి చూపకముందే సీతను అడవులకంపి, ఆ తప్పును సర్దుకున్నాడు--అని అప్పయ్యశాస్త్రిగారు రాశారు.

అది విని స్వామి 'శ్రీరాముని భూపతి అనటం, సీతను భూసుత అనటం ఎంతకాలంగానో వింటూనే వున్నాం. కాని ఎక్కడా, ఏ కవి యిలా రాయడం వినలేదే, బాగుంది. సరి! ఆ రామాయణం సెట్టొకటి నాదగ్గర వదిలి వెళ్లు'--- అని అడిగారు.

శాస్త్రిగారు తొందరలో 'స్వామీ! ఈ పుస్తకాలు తెలుగులిపిలో వున్నాయి. మీకు తెలుగు చదవటం వచ్చునా?' అని అడిగారు.

దానికి స్వామి ' నే చదివితే నీకేమి, చదవకపోతే నీకేమి? ఒక సెట్టిక్కడ వదిలిపో! రెండు పుష్పాలు పెట్టి పూజిస్తా'-- అన్నారు.

సరేనని శాస్త్రిగారలాగే ఒక సెట్టు శ్రీ మఠానికి సమర్పించి సెలవుతీసుకున్నారు.

ఆ తరువాత కొంతకాలానికి స్వామివారు హైదరాబాదు వచ్చి కౌతామనోహర్‌గారి యింటిలో బస చేస్తున్నారు. శాస్త్రిగారు వెళ్లి కలిశారు. అప్పుడాయన

కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్‌ ల

జ్జనెట్టగ మున్మున్న మునింగి కొండ చరిబాటం జారె రేరేడటం

చనుమోదించుట బద్మినీపతి నిజాస్యస్మేర దృష్టి ప్రసా

ర నవోల్లా సితహ్రీణయై తెలిపెడిన్‌, రామా! జగన్మోహనా!

అనే పద్యం చదివాను. ఆ పద్యం అప్పయ్య శాస్త్రిగారి రామాయణంలో విశ్వామిత్రుడు రాములవారితో అన్నది.

తరువాత శాస్త్రిగారిని 'మీ నాన్నగారెపుడూ ఈ పద్యాన్ని చదువుతూ వుండేవారు కదా!' అని అడిగారు.

నిజంగా అప్పయ్యశాస్త్రిగారు పడుకున్నా, కూచున్నా, స్నానం చేస్తున్నా, ఖాళీగా వున్నా ఈ పద్యాన్ని ఎంతో ఆర్తితో ఒక ప్రత్యేకమైన స్వరంతో చదువుకునేవారు. అప్పయ్యశాస్త్రిగారిని స్వామివారెరుగరు. శాస్త్రిగారు చనిపోయి చాల కాలమయింది. ఆ పద్యాన్ని ఆయన ఎప్పుడూ ఎంతో ఆర్తిగా చదువుతూ వుండేవారన్న సంగతి ఆచార్యులకెలా తెలిసింది? అదిగాక అప్పయ్యశాస్త్రిగారు ఏ స్వరంతో, ఎలా ఆర్తిగా చదివేవారో సరిగ్గా అదే స్వరంతో అంతే ఆర్తిగా స్వామివారు చదివారు!

అలాటి అతీంద్రియ జ్ఞానిని 'మీకు తెలుగు చదవటం వచ్చా?' అని ప్రశ్నించిన తన అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడ్డానని రాఘవనారాయణ శాస్త్రిగారు రాసుకున్నారు.

లోక కళ్యాణ కార్యాణా

మంగత్వేనైవ నాన్యధా

అద్భుతాని ప్రవర్తంతే

తస్మాత్కీర్తి పరాజ్ముఖాత్‌

లోక కళ్యాణం కోసం స్వామి తన మహిమలను చూపిస్తారు గాని ప్రదర్శన కోసం కాదు.

-జగద్గురు ప్రశస్తి

Paramacharya pavanagadhalu    Chapters