Paramacharya pavanagadhalu    Chapters   

32. నిస్సంగుని నిష్కర్ష

శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు పరమాచార్యులను దర్శించారొకసారి.

మాటల మధ్య శాస్త్రి గారి తండ్రి గారు రచించిన రామాయణం గురించి స్వామివారడిగి, అందునుంచి నాలుగు పద్యాలు చదివి వినిపించండి!' అన్నారు.

స్వామివారి ఆదేశం ప్రకారం ఆయన పద్యాలు చదువుతుంటే స్వామి వింటున్నారు. ఇంతలో మఠం పరిచారకులు వచ్చి బెంగుళూరు నుండి ఎవరో స్వామి దర్శనార్థం వచ్చారని స్వామివారికి మనవి చేశారు. స్వామి అది పట్టించుకోకుండా శాస్త్రిగారిని చదవమన్నారు. 'కాని అవతల పెద్దలెవరో వేచి వున్నట్లున్నారు', అంటూ శాస్త్రిగారు చదవటానికి సంకోచించారు. స్వామి అది గ్రహించి, 'ఫరవాలేదు, మీరు చదవండి!' అని ప్రోత్సహించారు. ఇంతలో ఆ పరిచారకుడు మూడోసారి వచ్చి ఆ బెంగుళూరు వారికి దర్శనం కావాలని తొందర పడుతున్నారని మళ్లీ మనవి చేశాడు. ఆ వచ్చిన ఆసామి ధనవంతుడు. మఠానికి ఉదారంగా విరాళమివ్వడానికి వచ్చినవాడు. అలాటివానికి దర్శనం త్వరగా చేయించాలని ఆ పరిచారకుని తాపత్రయం.

స్వామి అప్పుడు, 'నేను సంస్కృతంలోగాని, యితర భాషల్లోగాని దాదాపు ఎనభై రామాయణాలు చదివాను. ఒక్కొక్కరి కవితావిలాసంలో ఒక రకమైన హృదయం వుంటుంది. ఒక్కొక్క రామాయణం చదువుతుంటే ఒక్కొక్కరకం అనుభూతి, తృప్తి కలుగుతాయి. శాస్త్రిగారి తండ్రిగారు రచించిన రామాయణాన్ని నేనెంతో ఆసక్తిగా వింటుంటే ఎవరో బెంగుళూరు నుంచి వచ్చారని, వారు డబ్బిస్తారని కనుక ముందు వారితో మాట్లాడమని నన్ను తొందరపెడుతున్నావు. కాని నేనిప్పుడు చేయదలుచుకుంది ఆసక్తిగా ఈ రామాయణం వినటం. ఆ బెంగుళూరు వారితో మాట్లాడటం నాకిప్పుడు కుదరదు. వారికి పనుంటే వెళ్ళమను. నాతో పనుంటే మళ్ళీ రమ్మ'ను అని చెప్పారు.

వారు సన్యాసులు. శ్రీ మఠానికి విరాళాలిచ్చే సంపన్నుల పోషణ అవసరం. అయినా వారు అంత నిష్కర్షగా మాట్లాడటం శాస్త్రిగారిని ఆశ్చర్యపరిచింది. 'అలాటిపని ఆచార్యస్వామికే చెల్లు', అనుకున్నారు శాస్త్రిగారు.

Paramacharya pavanagadhalu    Chapters