Paramacharya pavanagadhalu    Chapters   

28. బాపూజీతో భేటీ

అది 1927వ సంవత్సరం. భారతస్వాతంత్ర్యసమరానికి సారథ్యం వహిస్తున్న మహాత్మాగాంధి దక్షిణ భారత పర్యటన చేస్తున్నారు. ఆయన పాల్‌ఘాటు చేరుకున్నప్పుడు అక్కడ దగ్గరలో నెల్లిచెరి వద్ద కంచి కామకోటి పీఠాధిపతి మకాం చేసివున్నట్లు తెలిసింది. గాంధీజి వెళ్లి పరమాచార్యుని దర్శించారు.

చారిత్రాత్మకమైన ఆ సమావేశం జరిగినప్పుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి అక్కడి గోశాలలో నేలపై చతికిలపడి కూర్చొని వున్నారు. గాంధీజీకి అది చాలా యిష్టం కదా! ఆయన కూడ వెళ్లి సమీపంలో నేలపైన కూచున్నారు. వారిద్దరు తప్ప ఆ సమావేశంలో వేరే వారెవ్వరూ పాల్గొనలేదు. వెంట వచ్చిన శ్రీమాన్‌ చక్రవర్తుల రాజగోపాలాచార్యుల వారు ( రాజాజీ) కూడా బయటే వుండిపోయారు.

స్వాముల వారు సంస్కృతంలో సంభాషించగా గాంధీజీ హిందీలో బదులిస్తూ వచ్చారు. ఎంతో సుహృద్భావ పూరిత వాతావరణంలో జరిగిన యీ అపూర్వ రహస్య సమావేశం ఎంతసేపో అలా సాగుతూనే వుంది. అపుడు సాయంకాలం 5-30 గంటలయింది. గాంధీజీ ఏ సమయానికి ఆపని చేయాలన్న నియమం కలవాడు. ఒక్కనిముసం తభావతు వచ్చినా సహించడు. అది ఆయన భోజనం తీసుకొనే సమయం. సరిగ్గా వేళ తప్పితే యిక ఆయన ముద్ద ముట్టడు. ఆ సంగతి తెలిసిన రాజాజీ లోపలకు వెళ్లి నెమ్మదిగా గాంధీజీతో 'మీ భోజన సమయం అయింది. ఆరు దాటితే మీరిక ఆహారం తీసుకోరాయె, పోదామా' అన్నారు.

గాంధీజీ వెంటనే 'స్వాముల వారితో నేను చేసిన సంభాషణ ఇవాళ నా భోజనం', అని జవాబు చెప్పారు.

స్వాముల వారితో గాంధీజీ ఆనాడు జరిపిన సమావేశం వివరాలను స్వాములవారు చాలా కాలం నీలంరాజు వెంకటశేషయ్యగారు పదే పదే అడిగినా వెల్లడించలేదు. చివరకు 1985లో ఆ వివరాలను మొదటిసారి పరమాచార్య నీలంరాజు వెంకటశేషయ్య గారిని పిలిపించుకొని వెల్లడించారు. ఆయన ఆ విశేషాలను తన 'నడిచే దేవుడు' పుస్తకంలో వివరంగా యిచ్చారు. కారణం ఆ విషయాన్ని వివరించే గాంధీజీ లేఖలను గురించి వివరిస్తూ ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ రాసిన లేఖ స్టేట్స్‌మన్‌లో ప్రచురించబడటమే. గాంధీజీ కారణంగానే విషయం బయటికి వచ్చినందున, తాము దానిని వెల్లడించటంలో నమ్మకద్రోహం ఉండదని స్వామి తలపోసి వాటిని వెల్లడించడానికి నిశ్చయించుకున్నారు. వాటిని గురించి 1967లో, 1983లో తనను అడిగిన నీలంరాజుశేషయ్యగారికే వాటిని ముందుగా వెల్లడించటం స్వామి నియమబద్ధతను తెలుపుతుంది.

Paramacharya pavanagadhalu    Chapters