Paramacharya pavanagadhalu    Chapters   

26. పశుపతికి పరమాశీస్సు

చిన్న వయసులో ఆచార్య పీఠాన్ని అధిష్ఠించిన చంద్రశేఖర సరస్వతి గారిని చూసుకోవడానికి యిద్దరు వ్యక్తులు వుండేవారు. వారిద్దరు 66వ స్వామి వారి శిష్యులు. ఒకరు తుమ్మలూరు రామకృష్ణయ్య, మరొకరు అడయపాలెం పశుపతి అయ్యర్‌.

పశుపతి గారు దక్షిణ ఆర్కాటు జిల్లా కోర్టులో వుద్యోగి. ఆయనకు యిష్టమైన పనులు రెండే: ఏకాంతంగా ధ్యానం చేసుకోడం, శంకర భగవత్పాదుల రచనల పారాయణం, పరమాచార్య పీఠానికి రాగానే పశుపతి గారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితశేషం స్వాముల వారి సేవలో గడపటానికి నిర్ణయించుకొన్నారు.

ఆయన స్వామి వారేం చేస్తున్నది, ఏం కట్టుకున్నది - యిలా వేష భాషలు, వ్యవహారాలు అన్నిటినీ పరిశీలిస్తుండేవారు. ఏదన్నా తప్పు కనిపిస్తే ఎత్తి చూపేవారు. స్వామి ఎలా నడుచుకోవాలో వివరించే వారు. అవసరమైతే పిన్న వయసులో వున్న స్వాముల వారిని మందలించేవారు. ఒక్కొక్కసారి కఠినంగా మందలించవలసి వచ్చినా సంకోచించే వారు కాదు. మీరు ఉన్నత స్థానంలో వున్నారు. జగద్గురువులు. నేను మీ సేవకుణ్ణి మాత్రమే కనుక మిమ్మల్నిలా మందలించటం దోషమే. అయినా మీరు పెద్దయింతర్వాత మిమ్మల్ని క్షమాపణ వేడుకొంటాను గాని యిప్పుడు మాత్రం ఆచార్యులను శ్రీమఠం శుభం కోరి మందలించక తప్పదు, అనే వారాయన స్వామి వారితో.

స్వామి వారితోపాటు ఆయన 18 ఏండ్లపాటు శంకరభాష్యం అధ్యయనం చేశారు. చివరలో ఆయన జబ్బుపడి స్వగ్రామమైన కడలూరు వెళ్లిపోయారు.

ఒకసారి తమ పర్యటనలో భాగంగా స్వాముల వారు కడలూరు వెళ్లారు. పశుపతి యింటి ముందుగా వెళుతుంటే స్వామి వారి ఏనుగు ఆయన యింటి ముందు ఆగింది. జబ్బుతో తీసుకొంటున్న పశుపతి ఎలాగో ఓపిక చేసుకొని బయటకు వచ్చి, స్వామి వారిని దర్శించి, చాలా సేపు ఆ ఏనుగు తొండం నిమురుతూ నిల్చుండి పోయారు. తర్వాత ఊరేగింపు ముందుకు సాగిపోయింది.

ఆ రాత్రే పశుపతి అయ్యర్‌ ప్రశాంతంగా పరమపదించారు. ఆ సంగతి ముందుగా గ్రహించే ఆచార్య స్వామి కడసారిగా తన దివ్య దర్శన భాగ్యం ఆయనకు కలిగించి తరింపచేయటానికే కడలూరు వచ్చారా?

Paramacharya pavanagadhalu    Chapters