Paramacharya pavanagadhalu    Chapters   

25. మామ్మగారి కాలమానం

స్వాముల వారు జగద్గురువులే కాని ఎవరు ఏది చెప్పినా ఓపిగ్గా వింటారు. అందులో ఏమాత్రం మంచివున్నా గ్రహిస్తారే కాని వీళ్లెవరు నాకు చెప్పటానికి? - అన్న అహం ఆయనలో కనిపించదు.

స్వామి వారికి ఒక సారి ఒక మామ్మగారు క్రింది కథ చెప్పింది. దానిని ఆయన తన ప్రసంగాల్లో చెబుతుండేవారు.

అది 1843-44 ప్రాంతం. తిరువానైక్కావల్‌ (జంబుకేశ్వరం)లో అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాలను పునఃప్రతిష్ఠ చేయవలసిన సమయం దగ్గరకు వచ్చింది. ఆ పని కంచి స్వాములే చేస్తూ వస్తున్నారు. ఆ ఆలయ అర్చక బృందం, అధికారులు వచ్చి యీ కార్యక్రమం నిర్వహించవలసిందని కంచి స్వామి వారికి ఆహ్వానం పంపారు. ఏర్పాట్లు మహావైభవంగా చేశారు.

అప్పుడు కంచికామకోటి మఠంలో 64వ పీఠాధిపతిగా వున్న శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి - IV. వారు సపరివారంగా బయలు దేరి తిరువానైక్కవల్‌ చేరే సరికి అక్కడ తిరుచినాంపల్లి కోర్టులో ఒక దావా పడింది, తాటంక ప్రతిష్ఠ చేసే అధికారం కంచి వారికి లేదని, దావా అంటే ఒక పట్టాన తేలదు గదా! అందుకని శ్రీమఠం అక్కడే వుండిపోవలసి వచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కోర్టు శ్రీమఠం పక్షానే - అంటే కంచి స్వామిదే తాటంక ప్రతిష్ఠకు అధికారం - అని తీర్పిచ్చింది. అయితే లిటిగేషన్‌ అన్న తరువాత అది ఒక చోట ఆగదు. అప్పటి లా ప్రకారం ప్రిన్సిపల్‌ సదర్‌ అమీన్‌ కోర్టు, తరువాత సివిల్‌ కోర్టు. ఆపైన హైకోర్టు - ఇలా ఒక్కొక్క కోర్టులో కంచివారు గెలవటం, ప్రత్యర్థి పై కోర్టుకు అప్పీలు చేయడం జరిగింది. చివరకు కంచి స్వాముల అధికారమే ఖాయం అని తేలింది.

ఈ కథ తేలటానికి ఎన్నేళ్లు పట్టిందీ ఆ మామ్మగారొక చిత్రమైన సంగతి ద్వారా లెక్క కట్టింది. మరి ఆమెకు కాలండర్‌ చూడటం, లెక్కలూ అవీ రావుగా! ఆవిడకు తోచిన పద్ధతిలో ఆమె లెక్క తేల్చింది.

తాటంక ప్రతిష్ఠ చేయాలని ఆలయార్చకుల ఆహ్వానంపై శ్రీమఠం కంచి నుండి తిరువానైక్కావల్‌ వచ్చిన మొదటిరోజుల్లో ఓనాడు జగద్గురువులు చంద్రమౌళీశ్వరునికి అభిషేకం చేస్తున్నారట. అప్పుడాయన ఒక నిమ్మపండు పిండి ఆ నిమ్మరసంతో స్వామికి అభిషేకం చేశారు. ఆ నిమ్మకాయ డిప్పలను స్వాముల వారు విసిరివేయగా అవి మండువా యిళ్ల మధ్య పై కప్పు లేకుండా వుండే చోట పడ్డాయి. అక్కడ వున్న మట్టిలో ఆ నిమ్మగింజవొకటి కూరుకొని పోయి మొలకెత్తింది. అది పెరిగి పెద్ద చెట్టయి, పూలు పూసి కాయలు కాసింది. ఆ నిమ్మపండ్లు స్వాముల వారి చేతిలోకి మళ్లీ చంద్రమౌళీశ్వరునికి అభిషేకం నిమిత్తం వచ్చాయి. ఆ నిమ్మపండ్ల రసాన్ని స్వామికి అభిషేకం చేసిం తర్వాతే స్వాముల వారక్కడ నుండి కదిలారు. ఇదంతా జరగటానికి ఆ అయిదేళ్ళన్నా కావాలి. కనీసం నాలుగయిదేళ్ళు ఈ దావా వ్యవహారాలు లాగాయి అని మామ్మగారి భావం.

మన గ్రామంలో తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు మొదలయిన కాలక్షేపాలు ఏర్పాటు చేసికొనే సాంప్రదాయం వుంది. ఇలాంటి వాటిల్లో ఏదో వొక పురాణం లోని కథను ఇతివృత్తంగా తీసికొనటం జరుగుతుంది. ఉదాహరణకు హరిశ్చంద్రుని కథలో హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆడిన మాట తప్పడు. స్త్రీలు, పెద్దలు, పిన్నలు - అంతా యిలాంటి కథలను విని, ఆ ఆటలు చూచి అనేక విషయాలను, ధర్మాలను చక్కగా, సులభంగా తెలుసుకొనేవారు.

ప్రస్తుతం దేశంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. కల్ల, కపటం, కుతంత్రం, విద్వేషం, మోసం, లంచగొండితనం, ఆహార పదార్థాలు మొదలయిన వాటిలో కల్తీ- యిలాంటివి దేశానికే కళంకం ఆపాదించే దౌర్భాగ్య లక్షణాలు. నీతికి, ధర్మానికి ఇదివరకు వలె తగిన ప్రచారం లేక పోవటం దీనికి కారణం అని నాకనిపిస్తోంది. అందుకని ఆ ప్రాచీనకళలను పునరుద్ధరించుకోవటం అవసరం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters