Paramacharya pavanagadhalu    Chapters   

20. సాధూనాం దర్శనం పుణ్యం......

స్వాముల వారిని చూడటానికి ఎంతోమంది వస్తుంటారు. అందులో పామరులూ, పండితులూ అందరూ వుంటారు.

1925 ప్రాంతంలో వొకసారి కాంగ్రెస్‌ నాయకులు కొందరు స్వాముల వారిని కలుసుకున్నారు. వారిలో దేవబంధు చిత్తరంజన్‌దాస్‌, యస్‌. సత్యమూర్తి, ఎ. రంగస్వామి అయ్యంగార్‌, జమ్నాలాల్‌ బజాజ్‌ వంటి ఉద్దండులు వున్నారు. మాటల సందడిలో సి. రాజగోపాలాచారి కూడా రావలెననుకున్నారని, ఆయన అప్పటికి స్నానం చేయనందున రావటానికి సంకోచించి రాలేదని స్వామివారికెవరో చెప్పారు. అది విని దేశ##సేవకు జీవితం అంకితం చేసిన వారికి స్నానపానాల వంటివి వేళకు చేసే వీలుండదు అన్న సంగతి తనకు తెలుసునన్నారు, ఆచార్యులు. అది గాక భరతమాత విముక్తి కోసం పాటుబడుతున్న దేశభక్తులు తనను ఏ కాలంలోనైనా వచ్చి చూడవచ్చు అని సెలవిచ్చారు. అంతేకాదు అలాంటి వారు స్నానం చేసినా చేయకపోయినా ఫరవాలేదు వెంటనే రావలసిందనీ కబురు చేశారు.

తాను సన్యాసిని కనుక తనకు రాజకీయ ప్రమేయం లేదు; అయినా ప్రజల యోగ క్షేమాలు పెంపొందించేందుకు అంతా పాటుపడాలని చెప్పటానికి తమకు కూడా స్వాతంత్ర్యం ఉందని ఆ నాయకులతో పరమాచార్య చెప్పారు.

'అపవిత్రః పవిత్రోవా

సర్వోవస్థాం గతోపివా

యస్మరేత్‌ పుండరీకాక్షం

సబాహ్యభ్యంతరశ్శుచిః

దైవనామాన్ని స్మరిస్తేనే లోపలా బయటా శుచి అవుతున్నారు. అలాంటిది దైవ సమానులు, జగద్గురువులు, నడిచే దేవుడుగా పేరొందిన స్వామి సన్నిధిలో అపవిత్రులెవరుంటారు? అసలు సాధువుల దర్శనమే పుణ్యం కదా!

Paramacharya pavanagadhalu    Chapters