Paramacharya pavanagadhalu    Chapters   

19. కాంగ్రెస్‌ వాలంటీర్లతో ఖాదీస్వామి

1921లో స్వామి వారు విజయయాత్ర చేస్తున్నరోజులలో కుంభకోణంలో మహామాఘ స్నానం చేయడానికి వచ్చారు. విజయయాత్రలో ఉన్న స్వాముల వారు యాత్ర ముగిసేదాక మఠానికి తిరిగి వెళ్లటం సాంప్రదాయం కాదు. అందుకని స్వామి వారు కుంభకోణం వెళ్లారు. మహామాఘమహోత్సవంలో పాల్గొన్నారు. కాని, మఠానికి పోకుండా వేరేచోట బస చేశారు.

అప్పుడు ఉత్సవం జయప్రదం కావటానికి కాంగ్రెస్‌ వాలంటీర్లు ఎంతో సాయం చేశారు. అందులో హిందువులే గాక, ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొంటున్న ముస్లిం సోదరులు కూడ ఉన్నారట. ఒకసారి వారంతా కలిసి వెళ్లి స్వామిని చూడాలని కోరారు. కాని, కాంగ్రెస్‌ వాళ్లు అప్పుడు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. వారిని కలుస్తే ప్రభుత్వంవారి ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోననే భయంతో మఠంలోని అధికారులు వారికేం జవాబు ఇవ్వాలో అర్థం కాక తటపటాయిస్తున్నారు. ఇది స్వామి వారికి తెలిసింది. ఆయన వెంటనే కాంగ్రెస్‌ వారందరిని లోనికి రమ్మని దర్శనమిచ్చారు. అందులో శ్రీ సుబ్రహ్మణ్యశివం అనే జాతీయ వాది వున్నారు. ఆయన స్వామి వారితో 'దేశ దాస్య విముక్తికై జరుగుతున్న పోరాటానికి తమ ఆశీస్సుల నందించండి! అని కోరారు. స్వామి వారు, అలాగే! మాకు రాజకీయాలతో ప్రమేయం లేదు. అయినా మీ ఉదాత్తమైన ఆదర్శం సఫలం కావాలని కోరుకోడానికి అభ్యంతరం లేదు, అంటూ ఆశీర్వదించారు.

గాంధీజీ విదేశ వస్తు బహిష్కరణకు ఖాదీ వాడకానికి పిలుపు నిచ్చిన తరువాత స్వామి వారు 1918 నుండే ఖాదీ వస్త్రాలను మాత్రమే వాడుతూ వచ్చారు. అదే నియమాన్ని ఆయన జీవితాంతం పాటించారు కూడా! మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలనేది ఆయన మతం.

ఒకసారి ఆయన యాత్రలో నున్నపుడు దారిలో ఒక వందమంది హరిజనులు ఆయన దర్శనంకై నిరీక్షిస్తున్న సంగతి గమనించారు. వారంతా శుభ్రంగా స్నానం చేసి, చక్కగా విబూది పెట్టుకొని నిలుచొని వున్నారు. స్వామివారు అక్కడ ఆగి వారి యోగక్షేమాలు విచారించారు. వారందరకూ కొత్తబట్టలు యిచ్చిన తరువాతే అక్కడ నుండి కదిలారు.

'పాదయాత్ర చేయడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు, ఇలా ప్రజలను కలుసుకోగలుగుతున్నాను, ఈ పద్ధతి ఎంత మేలో చూడండి!'-అని ఆయన ఎవరో వొకసారి తనను కారెక్కమని కోరితే జవాబు చెప్పారు.

Paramacharya pavanagadhalu    Chapters