Paramacharya pavanagadhalu    Chapters   

13. 'ప్రిన్స్‌ ఆర్థర్‌'కు పురస్కారం

స్వామినాథన్‌కు పదేండ్ల వయసులో అతని తండ్రికి తిండివనం బదిలీ అయింది. అందువల్ల అతడు అక్కడి ఆర్కాట్‌ మిషన్‌ స్కూల్లో రెండవఫారంలో చేరాడు. చదువులో చురుకుగా వుండటం మూలంగా అతనికి ఎన్నో బహుమతులు వచ్చాయి. ఉపాథ్యాయులలోను, తోటి విద్యార్థులలోను అతడు చాలా మంచిపేరు సంపాదించుకొని ఆదర్శ విద్యార్థి అనిపించుకొన్నాడు. క్లాసు పుస్తకాలలోనే కాక బైబిల్‌ పాఠాల్లో కూడా అతనిదే పై చేయిగా వుండేది.

ఒకసారి వాళ్ల స్కూల్లో షేక్స్పియర్‌ వ్రాసిన కింగ్‌జాన్‌ నాటకం వేయాలనుకున్నారు. అందులో ప్రిన్స్‌ ఆర్థర్‌ పాత్ర ముఖ్యమైంది. దానికి పై క్లాసుల్లో పిల్లలెవరయినా పని కొస్తారేమోనని చూశారు. అయితే హెడ్‌మాస్టర్‌ గారికి వాళ్లెవరూ సరిపోతారనిపించలేదు. ఇంతలో ఆయనకు స్వామినాథన్‌ గుర్తుకు వచ్చాడు. అయితే అతడు నాలుగవఫారం విద్యార్థి. వయస్సు మరీ పన్నెండేళ్ళే. మెట్రిక్‌ విద్యార్థులు వేయదగిన ఇంత ముఖ్యమైన పాత్రను అతనికి ఇవ్వొచ్చునా అని సందేహం కలిగింది. కాని స్వామినాథన్‌ ప్రతిభ##పై హెడ్‌మాస్టర్‌ గారికి పూర్తి విశ్వాసం వుంది. అందుకని ఆయన ధైర్యం చేసి స్వామినాథన్‌ను పిలిచి ప్రిన్స్‌ ఆర్థర్‌ పోర్షను యిచ్చాడు.

స్వామినాథన్‌ తండ్రి అనుమతి తీసుకొని ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. కేవలం రెండురోజుల్లోనే అతడా పోర్షన్‌ బాగా చదివి అభినయించటం నేర్చుకొని చక్కగ తయారయ్యాడు. నాటకం జరిగినంతసేపు, అందరి దృష్టి ప్రిన్స్‌ ఆర్థర్‌ పాత్రధారి పైనే. అలా స్వామినాథన్‌ నటన అందరి మన్ననలు పొందింది. స్వామినాథన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఎంతో మంది శాస్త్రి గారిని కూడా కలిసి 'మీ అబ్బాయి నటన అద్భుతం' అంటూ అభినందించి వెళ్లారు.

వేదం బోధించేది ధర్మానుగుణమైన నియమబద్ధమైన జీవితం సమాజకళ్యాణం చేకూర్చే విధంగా స్వధర్మాన్ని ఆచరించటం. శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు అనువుగా శీల సంపదను పెంపొందించుకోవటం, ముక్తి మార్గం అనుసరించటానికి ఇష్ట దేవతను ఉపాసన చేయటం, ఆత్మదర్శన జ్ఞానాన్ని సంపాదించుకోవటం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters