Paramacharya pavanagadhalu    Chapters   

113. కన వచ్చిన వారికీ కనకాభిషేకమే!

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (V) (1814-1851) (కంచి కామకోటి పీఠానికి 64వ ఆచార్యులు) జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి తాటంక ప్రతిష్ఠ చేశారు. వారు తిరిగి కుంభకోణంలోని తమ మార్గానికి తిరిగి వస్తుండగా ఒక సంఘటన జరిగింది. (అప్పుడు కంచికామకోటి పీఠం కుంభకోణంలో వుండేది. కర్ణాటక యుద్ధం జరుగుతున్న సమయంలో భద్రతా కారణాల వలన అప్పటి పీఠాధిపతి 62వ ఆచార్య స్వామి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి (IV) (1746-1783) పీఠాన్ని కంచినుండి కుంభకోణానికి తరలించారు. తిరిగి 1918లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (VII) (1907-1994) పీఠాన్ని కంచికి తీసుకుని వచ్చారు.)

అప్పుడు తంజావూరును శివాజీ అన్న ప్రభువు పాలిస్తున్నాడు. ఆయన ఆచార్యుల వారిని తంజావూరుకు రప్పించారు. ఎలా? ఏకంగా శ్రీమఠాన్నే ఆయన ఖైదు చేసి తెప్పించారు. నిజానికి, స్వాముల వారిని తంజావూరుకు ఆహ్వానించదలిస్తే వారు జంబుకేశ్వరం నుండి కుంభకోణం వెళ్లే సమయం అనువుగా వుంటుందన్న సూచన ఆయనకు అందినా అందుకాయన స్పందించలేదు. తీరా స్వాముల వారు జంబుకేశ్వరం (తిరుచినాపల్లి దగ్గర) నుండి కుంభకోణం వెళుతూ వుంటే రాజుగారి సైనికులు వచ్చి వారిని ఆపి దారి మళ్లించారు. గౌరవంగానే జరిపించినా, అది శ్రీమఠం కదలికను నియంత్రించి నట్లే అయింది. తంజావూరు చేరింతర్వాత శ్రీ చరణులు అఖండ స్వాగత సత్కారాలందుకున్నారు. రాజా వారి అసుర భక్తితో ఆచార్యులు సమాధానపడి చివరకు వారిని ఆశీర్వదించక తప్పలేదు.

రాజావారాచార్యులవారికి తంజావూరులో కనకాభిషేకం కూడా చేశారు. అప్పుడు ఆయన మంచి బంగారు జరీతో నేసిన శాలువను స్వామి వారికి కప్పారు. ఆ శాలువను అప్పటి నుండి మఠంలో ఒక పెట్టెలో వుంచి భద్రంగా కాపాడుతున్నారు.

శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి (VII) (పరమాచార్య) గారికి కనకాభిషేకం జరిగిన సందర్భంలో ఆయన ఆ శాలువ బయటికి తీసి దానిని కప్పుకొని కననాభిషేక మహోత్సవానికి హాజరయినారు. తన పరాపరాగురువు (గురువుగారి గురువు గారి గురువు గారి గురువు) వారి అనుగ్రహ వస్త్రాన్ని కప్పుకోడమే తనకు కనకాభిషేకం అని స్వాములవారన్నారు. అంతేకాదు. ఆ శాలువ చాలా పురాతనమైంది దానికి దాదాపు వందేళ్ల వయసేమో, కదిపితే పొడి పొడి అయేట్లుంది. అలా రాలే బంగారు జరీ పొడి గాలిలో తేలి సభ్యులందరిపైనా పడుతోంది. కనుక స్వాములవారికే గాక, ఆ సభకు హాజరయిన అదృష్టవంతులందరికీ ఆ బంగారు జరీశాలువ పొడితో కనకాభిషేకం జరుగుతున్నట్లే అని స్వాముల వారు వివరిస్తూ అది తనకూ, సభకూ కూడ 'గురు ప్రసాదం'అని చెప్పారు.

'నిజానికి యింత ఖర్చు చేసి మీరు నాకు కనకాభిషేకం చేయపని లేదు. మీ అందరి ప్రేమామృత సీకరములే నాకు కనకధారలు' అని స్వామి పేర్కొన్నారు.

రెండు నిమిషాలు నాకు దానమివ్వండి!

మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసికొని వస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరడం లేదు.

దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి! ఆ రెండు నిమిషాలు భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి! అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక.

దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా?

నాకు కావలసినదంతే!

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters