Paramacharya pavanagadhalu    Chapters   

112. కలయిక - విశ్రాంతి

కనకాభిషేకానికి వచ్చే ముందు స్వాముల వారు కలవై, ఇలయాత్తంలకు వెళ్లి వచ్చారు. కలవైలో స్వాముల వారి కన్న ముందు పీఠాధిపతిగా వున్న 67వ ఆచార్యులు శ్రీ మహాదేవేంద్ర సరస్వతి - (VI) (1907-1907) వారి సమాధి, వారికన్న ముందు పీఠాధిపతులుగా వున్న 66వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి - (VI) (1891-1907) వారి సమాధి వున్నాయి. వారివురు స్వాముల వారి గురువు, పరమగురువులున్నూ, వారికి ముందు పీఠాధిపతిగా వున్న శ్రీ సుదర్శన మహదేవేంద్ర సరస్వతి - (VI) (1851-1891) 65వ గురువు. వారు స్వాముల వారికి పరమేష్ఠి గురువు. వారి సమాధి ఇలాయత్తంలోవుంది. ఆ రెండు చోట్లకు వెళ్లి స్వాముల వారు ముందు వారిపట్ల తనకున్న భక్తిని, గౌరవాన్ని తెలుపుకుంటూ నమస్కారం చేసి వచ్చారు.

ఆ సందర్భంలో స్వాముల వారొక చక్కని వివరణ యిచ్చారు. కలవై అన్న గ్రామం పేరుకు తమిళంలో కలయిక అని అర్థం. స్వాముల వారి గురువు, పరమగురువు కలిసి అక్కడే సిద్ధి పొందారు. అంటే పరమేశ్వరునిలో కలిసి పోయారు. నది సముద్రంలో నామరూపాలను వదలి కలిసి పోయినట్లు జీవాత్మ పరమాత్మ లో కలిసిపోవటమే 'కలవై' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక వారి పరమేష్ఠి గురువు ఇలయాత్తంలో సిద్ధిపొందారు. వారు రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తూ ఇలయాత్తంలో ఒక మారేడు చెట్టు క్రింద విశ్రమించారు. అక్కడ తమ అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని రాత్రి ఒంటి గంట వరకూ సమాధి నిష్ఠలో వుండి, అలాగే సిద్ధి పొందారు. వారిని అక్కడే సమాధి చేసి, పైన శివలింగ ప్రతిష్ఠ చేసి గుడి కట్టారు. సన్యాసులను సమాధి చేసినప్పుడు దానిపైన తులసి మొక్కను నాటితే దానిని బృందావనం అంటారు. పైన లింగ ప్రతిష్ఠ చేస్తే అధిష్ఠానం అంటారు. కలవైలో గురువుకూ, పరమగురువుకూ బృందావనాలున్నాయి. ఇలయాత్తంలో పరమేష్ఠి గురువుకు (గురువుగారి గురువు గారి గురువు) అధిష్ఠానం వుంది.

తమిళంలో 'ఇళ్లెప్పెరువదు' అంటే విశ్రమించటం నిరంతర విశ్రాంతికి పరమేష్టి గురువు ఎన్నుకొన్న స్థలం కనుక ఇలయాత్తం గుడి వారికి 'ఇళ్లెప్పరుంగుడి' (విశ్రాంతి ఆలయం)గా మారినట్లుందని ఆయన అన్నారు.

Paramacharya pavanagadhalu    Chapters