Paramacharya pavanagadhalu    Chapters   

109. ఆంధ్రా యాజిటేషన్‌ ఏమిటి?

ఒకసారి పరమాచార్య మధ్యలో తన ప్రసంగం ఆపి, వింటూ కూర్చున్న సభ్యులలో వొకరిని పిలచి 'ఆంధ్రా యాజిటేషన్‌ అంటున్నారే, ఏమిటి?' - అని అడిగారు. తాము చెబుతున్న ప్రవచనం మధ్యలో ఆపి ఆచార్యులు రాజకీయ విషయాలను గురించి తనను ప్రత్యేకించి అడగటం ఆయనకు వింతగా తోచింది. అయినా ఏదో తోచిన జవాబు చెప్పారాయన.

మరునాడు ఆయన తన స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అప్పుడు తెలిసింది ఆయనకు, ఆంధ్రా ఉద్యమ సందర్భంగా జరిగిన కాల్పులలో తన కుమారుడు గాయపడి ఆసుపత్రిలో వున్న సంగతి. సరిగ్గా ఆచార్యులు తనను పిలిచి ఆంధ్రా ఉద్యమం సంగతి అడిగిన సమయానికే యిక్కడ తమ పిల్లవాడు గాయపడటం ఆయనకు విశేషమనిపించింది....అంతేకాదు, ఒక ముసలాయన వచ్చి రిక్షాలో తనను ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్చి వెళ్లాడని, ఆయన ఎవరో తనకు తెలియదని, ఆయన వచ్చి రక్షించకపోతే తన ప్రాణాలు దక్కేవి కావని ఆయన కుమారుడు ఆయనకు చెప్పాడు. ఆచార్యులే ముసలి వ్యక్తి రూపంలో వచ్చి తన కొడుకును రక్షించారు; ఆ విషయం తనతో ప్రస్తావించటానికే, ఏదో తెలుసుకోగోరిన వారిలా తనను ఆంధ్రాఉద్యమం గురించి ప్రశ్నించి వుంటారు, - అని ఆయన అనుకోడంలో ఆశ్చర్యం ఏముంది?

ఒక ధర్మం యొక్క శక్తి, ఆ ధర్మానికి చెందిన వారి సంఖ్య పై గాక, ఆ ధర్మాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి వుంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవనాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడు హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. మన ధర్మం నేటికీ నిలబడి వుందంటే, ధర్మాచరణలో నిష్ఠగల మహాపురుషులే దానికి కారణం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters