Paramacharya pavanagadhalu    Chapters   

107. కటాక్ష మాల

శ్రీ శంబరాజు వెంకటేశ్వర రావు గారు షిరిడి సాయి భక్తులు. ఆయన హైదరాబాదులో హిమాయత్‌నగర్‌లో వుంటారు.

ఒకసారి ఆయన కుమారుడు నేపాల్‌ నుంచి ఒక రుద్రాక్షమాల తెప్పించి ఆయనకు పంపారు. అయితే ఆయన దానిని తన మనుమడికి ఇచ్చారు. తరువాత ఆయన బంధువొకరు శబరిమల వెళుతుంటే 108 రుద్రాక్షలుండి, మాలలోని రుద్రాక్షల కన్నా కొంచెం పెద్దది సిగగా వుండే రుద్రాక్ష మాల అక్కడ దొరికితే ఒకటి తన కోసం తెచ్చి పెట్టవలసిందిగా ఆయన వారిని కోరారు.

ఆ బంధువు ఎంత వెదికినా అలాంటి మాల దొరకలేదు. శబరిమల నుండి తిరిగి వస్తూ ఆయన కంచి వెళ్లి అక్కడ పరమాచార్య దర్శనం చేశారు. పరమాచార్య అతడిని పిలిచి అతనికి ఓ రుద్రాక్షమాల యిచ్చారు. సామాన్యంగా అలాంటివి యిస్తే 'దీనిని ధరించు' అని ఆదేశించటం కద్దు. కాని ఆ రోజు స్వాముల వారు 'దీనిని నీవెవరికయినా యిద్దామనుకుంటుంటే అలాగే తీసుకొని వెళ్లి యివ్వు' అంటూ యిచ్చారు. వెంకటేశ్వరరావు గారు ఎలాంటి మాల కోరారో, అది సరిగ్గా అలాగే వుంది!

ఇంతకూ వెంకటేశ్వరరావు గారు అలాంటి మాలకోరిన సంగతీ, అది ఆయన బంధువుకు దొరకలేదన్న సంగతీ పరమాచార్య కెలా తెలిసాయి?

ఆధునిక నాగరికత కారణంగా సౌకర్యాలు పెరిగి భోగభాగ్యాలు ఎక్కువైనందు వల్ల మనస్సుకు చాపల్యం కలిగే అవకాశాలు ఎక్కువ. కనుక ఎంతో గట్టి మనస్సు, త్యాగం వుంటేనే గాని మనస్సును నిగ్రహించుకోవడం కష్టం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters